స్నేహలహరి
తలుచుకుంటే నిజంగా చిత్రంగానే వుంటుంది. ' స్నేహం ' అనేది సమ వయస్కుల మధ్యనే అని కొందరు అనుకుంటారేమో గానీ, నిజానికి అది కూడా అనేక అవధులను అధిగమించి ఏర్పడుతుండేదే. కులం, గోత్రం, మతం, ప్రాంతం అనేవేవీ స్నేహానికి అవరోధం కాదు. తమ పుట్టుక కులం స్నేహితుల కంటే,ఇతర స్నేహితులే ఎక్కువ వున్న వారు , అన్య మతస్తులే ఆత్మీయ స్నేహబృందంలోవున్నవారూ, చాలా మందే వుంటారు. అలాంటి వారి జాబితాలో నేనూ వుంటాను.
అయితే ఒకే స్కూల్లో, ఓ తరగతిలో చదువుకోవడం వల్లా, కాలేజీలో కలసి విద్యాభ్యాసం చేయడం వల్లా సమ వయస్కులు స్నేహితులవుతుంటారు. అలానే సహోద్యోగుల్లో కొందరూ మంచి స్నేహితులు అవుతూంటారు. అయితే వయసులో తారతమ్యం వున్నా, మంచి స్నేహితులుగా మారటం క్వాచిత్కంగా జరిగేదేనేమో...!
సైన్సు, లెక్కలు లేని విద్యను అభ్యసిస్తానని పంతం పట్టి, పి.యు.సి. వివేక వర్ధనీ కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల విద్యార్థిని అయ్యానని, మీకు మునుపోసారి చెప్పాను గుర్తుంది కదా ! హైదరాబాద్ తిలక్ రోడ్ లోని- ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో ' డిప్లొమో ఇన్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ' నుండి 'మాస్టర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ 'వరకూ కోర్సులుండేవి. 1967 లో నేను ప్రాచ్యకళాశాలలో డిప్. ఓ.యల్ .లోనే చేరాను.
ప్రాచ్య కళాశాల రెగ్యులర్ కాలేజీ వంటిది కాదు. అది కేవలం సాయం కళాశాల. సాయంకాలం ఆరు గంటల నుంచే తరగతులు మొదలయ్యేవి. అందువల్ల ప్రాచ్య కళాశాల కోర్సుల్లో రెగ్యులర్ విద్యార్థులే కాక, ఉద్యోగాలు చేసుకుంటూ, పై చదువులు చదవాలనుకునే ఉద్యోగులు కూడా, విద్యార్థులుగా చేరుతూ వుండేవారు. సాయం కాలం అయిదింటికి ఆఫీసు వదిలాక, ఈ ప్రాచ్య కళాశాలలో చదువుకుంటూ ఉండే వారుండేవారు. కళాశాల చదువు విషయంలో నేను ప్రధానంగా సాయం కళాశాల విద్యార్థిననే చెప్పుకోవాలి. డిప్. ఓ.ఎల్ లో చేరాక..ఎం. ఓ. ఎల్ వరకూ ఆ ప్రాచ్య కళాశాలలోనే విద్యార్థి జీవితం గడిచింది. ఆ తర్వాత ఎం. ఏ చేయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో చేరేంత వరకూ, పి.యు.సి. తర్వాత, నేను కళాశాల విద్యార్థి జీవితం గడిపిందంతా సాయం కళాశాలలోనే. సాయం కళాశాలలో నా ఈడు విద్యార్థులున్నా, గాఢమైన స్నేహం ఏర్పడిన మరపురాని ఇద్దరి గూర్చి మాత్రం చెప్పుకోవాలి. వారే బాలాంత్రపు వేంకట లక్ష్మీ జగన్నాథరావు గారు, మాడభూషి రంగాచార్యగారు.
బి.వి. ఎల్. జగన్నాథరావు గారు అప్పట్లో ఖాదీ గ్రామోద్యోగ సంస్థ దేంట్లోనో పని చేస్తుండే వారు. మాడభూషి రంగాచారి దక్షిణ మధ్య రైల్వేలో, సికింద్రాబాద్ లో, క్యాషియర్ గా పని చేస్తుండేవారు. బి.వి.ఎల్. జగన్నాథ రావు గారు కాచిగూడా నింబోలి అడ్డలోను, రంగాచారి విఠల్ వాడి లోనూ నివసించేవారు. నేను సరే, మలక్ పేట వాస్తవ్యుడిని.
ముగ్గురం పరిషత్ ప్రాచ్య కళాశాల విద్యార్థులుగా స్నేహితులమయ్యాం. ఆ స్నేహం ఎంత గాఢమైందంటే, ముగ్గురం కలసి పరీక్షలకు ' కంబైండ్ స్టడీ ' అంటే కలిసి చదువుకోవడం చేసే వారం. వారిద్దరూ మా ఇంటికి రావడమో, నేను, బి.వి.ఎల్ కలసి రంగాచారి గారింటికి వెళ్ళడమో ఎక్కువగా జరిగేదీ. ముగ్గురికీ సాహిత్యాభిలాష వుంది. ముగ్గురం కూడా యువ భారతి సభ్యులం అయ్యాం. ముందు నేను అయ్యాక, నా తర్వాతే, నా ద్వారా వారిద్దరూ అయ్యారని గుర్తు నాకు. యువ భారతి కావ్య లహరి ప్రచురణ పూర్వ విరాళాల సేకరణలో, వారి దక్షిణ మధ్య రైల్వే లో, సాహిత్యాభిమానుల నుండి విరాళాలు సేకరించడానికి, రంగాచార్య చేసిన కృషి నాకు గుర్తుంది. రంగాచార్య కథలు రాసే వాడు. ' అమ్మ వెళ్ళిపోయింది ' అనే తన కథ, బాపు గారి బొమ్మతో ఆంధ్రప్రభలో అచ్చయినది, మా పరిచయం అయ్యాక తను చూపించడంతో నాకు తన పట్ల రచయితగా గౌరవాన్ని ఇనుమడింప జేసింది. మరీ ముఖ్యంగా వాళ్ళ రైల్వే శాఖ నేపథ్యంలో ట్రాలీ మెన్, కీ మన్ కూతురు మొదలైన, రైల్వే సామాన్యుల బ్రతుకులను అతను కథలుగా మలచి రాశాడు. నేను నడిపిన ' యువమిత్ర ' లిఖిత మాస పత్రికకు వారిద్దరూ రచనలు ఇస్తూండేవారు. బి.వి.ఎల్. జగన్నాథ రావు గారు నిజంగానే మంచి పండితులు. పద్యం మీద ఆయనకు మంచి పట్టు ఉండేది. ఆయన పద్యాలు నాకు కరుణశ్రీ పద్యాలంత ఇష్టంగా తోచేవి. 'పోతన ' గురించి ఆయన రాసిన తేనెలూరు పద్యాలు నాకు బాగా గుర్తు.
ఇంతకీ మాముగ్గురి మధ్య స్నేహంలోని విశేషం- మేమేమీ సమ వయస్కులం మాత్రం కాదు. నా కంటే రంగాచారి పదేళ్ళు పెద్దయితే, రంగాచారి కంటే బి.వి.ఎల్. జగన్నాథరావు గారు పదేళ్ళు పెద్ద. అంటే నాకంటే జగన్నాథ రావు గారు ఇరవై ఏళ్ళు పెద్ద. వారిద్దరికీ పెళ్ళిళ్ళు అయి పిల్లలు కూడా వున్నారు. జగన్నాథ రావు గారి పెద్దబ్బాయి కంటే నేను కొంచెం పెద్దనేమో.! కానీ మాముగ్గురి స్నేహం కళాశాలలో కూడా బాగా విరివిగా గుర్తింపు పొందింది. ప్రాచ్య కళాశాలలో మేము ముగ్గురం కలసి ' లహరి ' అనే ఒక సాహిత్య సంస్థను స్థాపించాము. దాని తరపున సాహిత్య సమావేశాలు కాలేజీ లోనే నిర్వహిస్తూండే వారం. అప్పటి మా ప్రిన్సిపాల్ గారైన శ్రీ కె.కె. రంగనాథాచార్య గారు ఎంతో ప్రోత్సహించేవారు మమ్మల్ని. అప్పట్లో బంగ్లాదేశ్ ఆవిర్భావం సందర్భంగా లహరి పక్షాన ఓ కవి సమ్మేళనం కూడా చేశాం. అలాగే దేశికా చార్యులు అనే కెనడాలో నివసిస్తూ వుండే మిత్రులు రాసిన ' అశ్రుమాల ' అనే పద్య కావ్యం,' లహరి ' తరపున ప్రచురించాం కూడాను.
జగన్నాథరావు గారిది అక్కౌంట్స్ ఉద్యోగం. తర్వాతి రోజుల్లో ఆయన తాను పూర్తిగా అక్షరాలు వదిలేసి అంకెల మనిషి అయిపోయానని అంటుండేవారు కూడాను. జగన్నాథ రావు గారు, రంగాచారీ ప్రాచ్య విద్యనెందుకు చదివారంటే-సాహిత్యాభిమానం తప్ప, వేరే ఉద్యోగాల కోసం అని మాత్రం చెప్ప లేను. రంగాచార్యకు మాత్రం- తాను తమ దక్షిణ మధ్య రైల్వేలోని ఏ డిగ్రీకళాశాల లెక్చరర్ గా నైనా ఈ చదువు వల్ల కావాలనీ, కాగలననీ ఆశ వుండేదేమో గానీ, జగన్నాథ రావు గారు మాత్రం ఏం ఆశించి చదివారో నాకు ఇప్పటికీ తెలియదు. ఆయన బి.ఓ.ఎల్. అయ్యాక, జంట సినిమా థియేటర్లున్న ఒక యాజమాన్యం దగ్గర విశ్వసనీయమైన అక్కౌంటెంట్ గా పని చేశారు. వారి అబ్బాయినీ ఆ సంస్థల్లోనే కుదిర్చినా, ఎనభై ఏళ్ళు వచ్చినా ఆయన వారికి అక్కౌంట్స్ చూస్తూనే వుండేవారు.
రంగాచార్యకు అప్పట్లో ఓ మోటార్ సైకిల్ వుండేది. లహరి సమావేశాల రిపోర్ట్స్ ను పత్రికల వారికి ఇవ్వడానికి అతని వెనుక ఆ మోటార్ సైకిల్ మీద కూచుని వెళ్ళడం ఒక గొప్ప జ్ఞాపకం. అలాగే రంగాచార్య కుటుంబంతో మా కుటుంబానికీ గొప్ప స్నేహం ఏర్పడింది. రంగాచార్య శ్రీమతి లలితా దేవి కూడా, వారి వివాహం అయ్యాక, భర్త ప్రోత్సాహంతోనే, తానూ అదే ప్రాచ్య విద్యలో ఎం.ఓ. ఎల్ వరకూ చదివిందంటే..రంగాచార్య ఆధునిక దృక్పథం ఆదర్శనీయమని వేరే చెప్పాలా? జగన్నాథ రావు గారు తరువాతి కాలంలోతరచుగా కలవ లేకపోయినా, రంగాచారిదీ, నాదీ స్నేహం మేం కలిసి ఎం. ఫిల్ చేసేంత వరకూ చదువు రీత్యా సాగింది. ' బుచ్చి బాబు కథానికలు ' మీద రంగాచార్య , 'అభ్యుదయ కవిత్వంలో భావ చిత్రాలు ' మీద నేనూ , ఎం.ఫిల్ పరిశోధనలు చేశాం. ఇద్దరి
సిద్ధాంత గ్రంధాలలో నా చేతి రాతనే వుంది. రంగాచారి 'తెలుగు నవల–ఆధునిక స్త్రీ అని, ఆ తర్వాత పి.హెచ్.డి. చేసి డాక్టరేట్ కూడా పొందాడు. నేను రేడియో ఉద్యోగంలో చేరి..పి.హెచ్.డి. రిజిష్టర్ చేసినా, యూనివర్శిటీ డాక్టరేట్ పొందడానికి సిద్ధాంత గ్రంధం రాయనే లేదు. రంగాచార్య ప్రెంచి చేశాడు. అలాగే ఎం.ఇ.డి. చేశాడు. రైల్వేలోనే సీనియర్ హోదాకి ఎదిగాడు.కానీ తన బోధనాభిరుచిని మాత్రం బి.ఇ.డి. స్టూడెంట్స్ కు పాఠాలుగా చెప్పుకుని సంతృప్తి పడ్డాడు. తన ముగ్గురమ్మాయిలులో ఇద్దరు కులాంతర వివాహాలు చేసుకున్నారు. అబ్బాయి పెళ్ళి మాత్రం తానే చేశాడు. కౌటింబికంగా ఆయనకు భార్య లలితయే పెద్ద ఆసరా. నా వివాహానికి తను కుటుంబ సమేతంగా వచ్చాడు కూడానూ. జగన్నాథ రావు గారికే కుదర లేదు.
రైల్వే ఉద్యోగిగా రిటైరైన ఏడాది తిరగకుండానే…రిటైరయ్యే ముందు జరిగిన ఉద్యోగ పరమైన ఇబ్బంది వల్లనో, కుటుంబ పరమైన అమ్మాయిల ప్రవర్తనల అసంతృప్త తాకిడుల వల్లనో…ఏమైందో తెలియదు కానీ, ఎంతో సాహిత్యాభిరుచితో ముందుకెడదామనే అభిరుచి గల తాను, తన 61 వ ఏట హఠాత్తుగా గుండె పోటుతో మరణించాడు. రంగాచార్య మరణం కలిగించిన స్నేహపు లోటును నేను చెప్పలేను.
జ్వాలాముఖి గారి ప్రోత్సాహంతో..రంగాచార్య శ్రీమతి లలితాదేవి గారు మాడభూషి రంగాచార్య స్మారక సంఘాన్ని స్థాపించి, 2004 నుండి ప్రతి ఏటా ఒక ఉత్తమ కథానికా రచయితకు అయిదు వేల రూపాయల పురస్కారాన్ని ఇస్తున్నారు. శీలా వీర్రాజు, డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, రామడుగు రాధాకృష్ణమూర్తి, నాళేశ్వరం శంకరం, నేను, లలితాదేవి
ఆ స్మారక కమిటీలో సభ్యులుగా ఉన్నాం. 2012 నుండి ఆ పురస్కారాన్ని పది వేల రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే మాడభూషి రంగాచార్య స్మారక కమిటీ.. ఏటా జంట నగరాల పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు కథల పోటీ నిర్వహించి, నగదు బహుమతులిస్తోంది. రంగాచార్య స్మారక ప్రసంగాలు..ఏటా తెలుగు కథ ప్రారంభం నుండీ నేటి వరకు దశల వారీగా వివిధ ప్రముఖులచే ఇప్పించి, గ్రంధ రూపంలో సంతరించడం జరుగుతోంది. రంగాచార్య జన్మదినమైన ఫిబ్రవరి 25న ఈ ఏటి సభ నగర కేంద్ర గ్రంధాలయంలోజరుగ బోతోంది.
బి.వి.ఎల్. జగన్నాథ రావు గారు రంగాచార్య మరణించినప్పుడు ' నా కంటే పదేళ్ళు చిన్న వాడు ముందే పోయాడని ఎంతో బాధపడ్డారు. తాను అక్షరాలకు దూరమైపోయానని ఆవేదన చెందేవారు. బి. ఓ.ఎల్. పరీక్ష పాసయ్యాక
డిగ్రీ పట్టాలు తీసుకుని, మేం ముగ్గురం కాన్వొకేషన్ దుస్తులతో, ఫోటో స్టుడియోలో ఒక ఫోటో తీసుకున్నాం. ఫ్రేములు కట్టించుకుని ఇళ్ళల్లో పెట్టుకున్నాం. నా ఇంట్లో అది చెదలు పట్టి పోయింది కానీ, వారిళ్ళల్లో గోడలకు భద్రంగా నేటికీ ఉంది. గత సంవత్సరం 2014 ఆగస్టులో బి.వి.ఎల్ జగన్నాథరావు గారు తన 83వ ఏట దివంగతులయ్యారు. వారి భౌతిక కాయాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు..ఆయన పార్థివ శరీరం పెట్టిన గది గోడకు మా ముగ్గురి డిగ్రీ ఫోటో ప్రముఖంగా వ్రేలాడుతూ కనబడింది. ఇప్పుడా ఫోటో లోని ముగ్గురిలో ఇద్దరూ మటు మాయమయ్యారే అనిపించింది. మా లహరి స్నేహ త్రయంలో నేను మాత్రం మిగిలాను ఇలా.