జ్యోతి పథం - పులివర్తి కృష్ణ మూర్తి

 

వేదాంతం- శుష్క వేదాంతం

వేదాంతమంటే ఏమిటి? వేదాలకు చెందిన చివరి భాగాన్ని వేదాంతం అంటారు. కర్మ ఉపాసన, జ్ఞానం అనే మూడు కాండలుగా విభజించబడిన వేదాలలో చివరది జ్ఞానకాండ అని చెబుతారు. జ్ఞానమే ప్రధానంగా వివరింపబడివుంది. కావున ' వేదాంత ' శబ్దానికి ' ఉపనిషత్తు ' అన్న అర్థం కూడా వుంది. అంతం అంటే సిద్ధాంతం కాగా మరోవిధంగా నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చును. ఇక వేదాంతమంటే వేదాల సిద్ధాంతం. లేదంటే వేదాల నిర్ణయం అని కూడా అనుకోవచ్చును. ఇదిలా వుంచి మరో దృష్టితో చూస్తే మాటలకే పరిమితమైనది వేదాంతమనీ, ఆచరణతో కూడినది అనీ రెండు భాగాలుగా విభజించవచ్చునంటున్నారు. వేదాంతాన్ని ఆచరణలో పెడితే దాన్ని అనుష్టాన వేదాంతం అంటారు. ఎందరో మహాత్ములు ఈ వేదాంతాన్ని సమస్యలన్నింటినీ పరిష్కరించేదని ప్రభోదించారు. ఇక మరో వేదాంతం, శుష్క వేదాంతం. దీనినే వాచా వేదాంతం అంటారు. దేన్ని మనం శుస్కం అంటాం? ఎండిపోయినదాన్నీ, నీరసమైనదాన్నీ, సారహీనమైనదాన్నీ అంటాము. వేదాంతంలో ఈ శుష్కత్వం ఉందా అంటే, అందులో లేదనే చెప్పాలి. ఈ వేదాంతాన్ని ప్రచారం చేసేవారిలోనే వుందని తెల్సిపోతుంది. ఈ శుష్కం అసలైన వేదాంతంలో లేదని మనం గ్రహించాలేమో. ఎంతోమంది ప్రవాచకులూ,ఉపన్యాసకులూ ఎన్నో సభల్లో మధురాతిమధురంగా ఉపన్యసిస్తారు. ప్రజల మెప్పు పొందుతారు. ఎంతో బాగా వేదాంతం చెప్పారనీ, బిరుదులూ సన్మానాలూ పొందుతూ వుంటారు. ధారణా శక్తి వున్నందువలన అనర్ఘళంగా సంస్కృత శ్లోకాలనూ, పద్యాలనూ,

కానీ ఆచరణ విషయంలో వారిమాటలకూ చేతలకూ పొంతన ఏమాత్రమూ ఉండదు. కానీ వేదాంతం ఏమని చెబుతున్నదో దానికి భిన్నంగా వుంటారు. ' పండ్తా సమదర్శిన: ' అని గీతలో చెప్పబడినది. పదపితామహుడు అన్నమాచార్యులవారు సైతం ' సమబుద్ధే ఇందరికీ సర్వవేదసారము ' అన్నారు. కానీ శుష్క వేదాంతులు సమత్వాన్ని ఉపన్యాసాలకే పరిమితం గావిస్తారు.అంతెందుకు, వారి ప్రతిపనీ స్వార్థం తోనే ఉంటుంది. నిజ జీవితంలో అంతటా వ్యత్యాసం కనబరుస్తూనే వుంటారు. అన్నీ బేదాలే మరి. కులం, వర్ణం, ప్రాంతం అంటూ రకరకాలుగా భేదభావాలను అడుగడుగునా తప్పకుండా పాటిస్తారు. వీరి ప్రతి కదలికలోనూ విషత్వమే. ఈ విధంగా మరికొందరు తమతమ రచనల్లో ఆదర్శాలు వల్లిస్తారు.  ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వుంటారు. శుష్క వేదాంతులు కులభేదాలను అడుగడుగునా పాటించి సంఘంలో మనుష్యులను విడదీస్తున్నారు. విషయ సుఖాలకు దాసులౌతున్నారు.  వీరు మనో నిగ్రహాన్ని పాటించరు. సదాచారాన్ని దూరీకరిస్తారు. తాము చెడినదే గాక తమ వెంట వున్నవారిని కూడా చెడగొడతారు. ఇక వేషభాషలకొస్తే ఎంత డాంభికం ప్రదర్శిస్తే అంత గొప్ప అన్నట్టుంటారు. ధనార్జనే ధ్యేయంగా కపటోపాయాలు ప్రదర్శిస్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే ' ఏమి చేసినా ఆత్మకు అంటదు కదా ' అంటారు. మానవులైనవారు తమ బుద్ధిని సక్రమంగా వినియోగించుకుంటూ ఈ విషయంలో జాగరూకులై మసలుకోవాల్సి వుంటుంది.

ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా భగవంతుని పేరిట అర్థాపేక్షతో మానవ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించేవారి విషయంలో జాగరూకులై ఉండాలి. స్వార్థపూరితమైన కొందరి అభిమతాలకు విలువనివ్వకుండా దైవ మతాన్ని కరుణతో శాంతిమార్గంలో ధర్మంగానూ జ్ఞానసముపార్జనతోనూ స్థిరమైన ఆలోచనలతో అనుసరించాలి. ఈ జాతిని అగ్రజాతులూ, నిమ్నజాతులంటూ వేదాధికారం కొందరికే వుందనే స్వార్థ జీవులకు దూరంగా భావదాస్యానికి స్వస్తి చెప్పి సర్వేశ్వరుని చేరుకోవడానికి జాతి లింగాదులు అడ్డురావన్న సత్యాన్ని అందరికీ విశదపర్చాలి.ఈవిధమైన ధోరణిలోనే షిర్డీసాయిబాబా, మెహర్ బాబా, భగవాన్ రమణమహర్షి, రామకృష్ణపరమహంస, చిన్మయానందులవారు, అన్నమాచార్యులవారు, శ్రీనారాయణగురువు, శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీమళయాళస్వాములవారూ లోకానికి తెలియజేసే ప్రయత్నంగావించారు. మనవంతు మనమూ సర్వేజనాస్సుఖినోభవంతు: అంటూ కృషి ప్రారంభిద్దాం.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి