మన తెలుగువారందరికీ గర్వకారణమయిన కార్టూనిస్టు కుమారి రాగతి పండరి. రాగతి పండరి గత రెండు నెలలుగా మృత్యువుతో పోరాడుతూ ది. 19-02-2015 న ఉదయం విశాఖ పట్నంలో తుదిశ్వాస విడిచారు. నవ్వించడం ఎంత కష్టమో..కార్టూనిస్టులకు తెలిసినంతగా మరొకరికి తెలియదేమో.! అలాంటి రంగంలో నాలుగు దశాబ్దాలుగా వెలుగొందుతూ తొలి మహిళాకార్టూనిస్టుగా తనకుంచె కొంటెతనాన్ని మనకందించి, తనలోని అవిటితనాన్ని జయించి ' నవ్వుల సామ్రాజ్ఞి ' గా పాఠకుల మనసులో చెరగని ముద్ర వేశారు రాగతి పండరి. 1972లో తన ఎనిమిదేళ్ళవయసులో మొదటి కార్టూన్ ' ఆంధ్రజ్యోతి లో గీశారు. ఇక అక్కడనుండి కార్టూన్ రంగంలో దినదినాభివృద్ధి చెందుతూ వేలాది కార్టూన్లు దాదాపు అన్ని తెలుగు పత్రికలలోనే కాకుండా హిందీ, ఇంగ్లీషు పత్రికలలో కూడా గీసారు. జయదేవ్ గారి ఏకలవ్య శిస్యురాలినని గర్వంగా చెప్పుకొనే రాగతిపండరి గారి అసలు పేరు పండరిబాయి. పుట్టింది 1965 జూలై 22న విశాఖపట్నంలో. చిన్నప్పుడే పోలియోబారిన పడిన వీరు కార్టూన్ కళను తన వ్యాపకంగా చేసుకొని, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కార్టూనిస్టుగా రాణిస్తూ, అవివాహితగానే ఉండిపోయారు. వీరి సోదరి రాగతిరమ మంచి కథారచయిత్రి. 2011 వ సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ' కళారత్న ' అవార్డును అందుకున్న తొలి కార్టూనిస్టు రాగతిపండరి. తన అనుభవాలను పాఠకులతో పంచుకునేందుకు ' నా గురించి నేను ' పేరుతో ఆత్మకథను రాసుకొన్నారు. ఇది 64కళలు.కాం అంతర్జాల పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. వీరి కార్టూన్లతో మూడు కార్టూన్ల పుస్తకాలు కూడా ప్రచురింపబడ్డాయి. ఎప్పటికప్పుడు సమకాలీన సామాజిక అంశాలను ఎంచుకొంటూ తెలుగు పండుగలను సంప్రదాయాలను నిజజీవిత లోటుపాట్లనూ ఆలంబనగా చేసుకొని వైవిధ్యభరితమైన వ్యంగ్య వ్యంగ్య చిత్రాలు గీసి మనదరి మదిలో చిరస్థాయిగా నిలిచి పోయిన కుమారి రాగతి పండరి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.........
-కళాసాగర్