సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam
'ఆముక్తమాల్యద'

నిర్విఘ్నముగా యాగమును పూర్తి చేసుకుని, యాగానంతరం చేసే అవబృధస్నానం చేసి, రుత్విక్కులకు  పండితులకు ఇతరులందరికీ అనేక కానుకలిచ్చి, సంతృప్తి పరచి, అయ్యో! ఈ యాగమును నేను పూర్తి  చేయగలిగానంటే ఆ ఖాండిక్యుని ఉపదేశముచేతనే కదా! ఆయనకు గురుదక్షిను ఇవ్వలేదు కదా, గురుదక్షిణ లేని యాగం ఎలా పరిసమాప్తం ఐనట్లు? అని ఆలోచించుకుని, మరలా అడవి బాటను పట్టాడు. మరలా వచ్చిన ఇతనిని చూసి నివ్వెరపోయిన ఖాండిక్యుని 'కంగారుపడకు మహానుభావా! నువ్వు గురువువై నాకు ఉపదేశం చేయడం వలననే నా యాగం నిర్విఘ్నముగా పరిసమాప్తం ఐంది, కనుక గురుదక్షిణ ఇవ్వడానికి వచ్చాను, నీకు ఏది కావలెనో అడగవయ్యా, ఇచ్చి ధన్యుడిని అవుతాను' అన్నాడు. ఖాండిక్యుడు మరలా తన వారిని సంప్రదించాడు. వారు సంతోషంతో ఎగిరి గంతులేసి, ఇన్నాళ్ళకు మనకు అదృష్టం కలిసివచ్చింది!ఇక ఆలోచించక నాలుగు సముద్రముల మధ్యనున్న భూమండలమునంతా గురుదక్షిణగా అడుగవయ్యా,మన దరిద్రం తీరిపోతుంది, సందేహించకు, బంధు మిత్ర జన రక్షణం కన్నా మిన్న ఐన ధర్మం ఏముంది?

ఎన్నఁడు లావు గూడు మన? కెన్నఁడగున్దరి? యయ్యె నేని పో
రెన్నిక యౌనె? పోరిన జయింప నశక్యము  నీదు భాగ్యసం
పన్నతఁ జేరెఁ గార్య మిటు బంధు సుహ్రుత్తతి కొక్క కీడు రా
కున్నటులుండఁ నె సిరులూరక చావక నోవ కబ్బునే?  

మనకెన్నడు బలము, బలగము సమకూరుతుంది, మనకెన్నడు సరి ఐన సమయం వస్తుంది పోరాటం చేసి ఈ కేశిధ్వజుని ఓడించడానికి! ఒకవేళ సమయము, బలగము సమకూరినా యుద్ధము చేయడానికే  ఎంచుకోవడం వివేకమైన పని కాదు కదా, ఇంతకుముందు అన్నీ సమకూర్చుకునే వీడితో యుద్ధం చేసి కూడా పరాజయం పాలై అడవులవెంటబడి తిరుగుతూనే ఉన్నాము కదా! నీ అదృష్టంకొద్దీ, మా అదృష్టంకొద్దీయిలా కార్యము సానుకూలమయ్యే సమయము కలసివచ్చింది. బంధుమిత్రులకు ఏ కీడు వాటిల్లకుండా,ఎవరూ చావకుండా, నొవ్వకుండా రాజుకు సిరులు కలిసి రావడం అంటే ఎంత అదృష్టం! కనుక రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవయ్యా, రాజ్యాన్ని కోరుకోవయ్యా అన్నారు వారు. ఖాండిక్య కేశిధ్వజ కథలోని పద్యాలను చదువుతున్నప్పుడు పోతన మహానుభావుని భాగవతంలోని వామనావతార ఘట్టంలో బలి, శుక్రాచార్యుల సంవాదం గుర్తుకొస్తుంది, ఖాండిక్యుని ఆప్తుల సలహాలు శుక్రాచార్యుని పలుకులను గుర్తుకు తెస్తే, ఈ పై పద్యం అచ్చు 'ఎన్నడు మాకు దిక్కుగలదెన్నడు దైత్యుని బాధ మాను, మేమెన్నడు వృద్ది బొందగల మెవ్వరు రక్షకులంచు దేవతా కిన్నర సిద్ధ సాధ్య ముని ఖేచర నాయకులాశ్రయించి రాపన్నగతల్పు భూరి భవబంధ విమోచను పద్మలోచనున్' అనే పోతనగారి ఆంధ్ర మహా భాగవతంలో, సప్తమ స్కంధంలో హిరణ్యకశిపుని దుర్మార్గాలకు తల్లడిల్లే దేవతలు మొదలైనవారు వాపోయే సందర్భంలో చెప్పిన పద్యానికి కవలసోదరుడిలా ఉండడం గమనింపవచ్చు. యిది రాయలవారు ఉద్దేశపూర్వకంగా చేసిందే, పోతనమహానుభావునిమీది ప్రేమ గౌరవముల కారణంగా, రాయలు ఆంధ్ర మహాభాగవత ప్రేమికుడు ఐన కారణంగా. 

తన సన్నిహితుల మాటలను విని అమాయకులారా అన్నట్లు నవ్వి, మీరు అర్ధసాధన విషయంలో నేర్పరులు కానీ, మహా శాశ్వత సుఖదాయిని ఐన మోక్ష విద్యా మార్గ కుశలురు కారు, ఆ మహానుభావుడిని పరమార్ధ సంబంధమైన విషయాన్ని కోరుకోకుండా రాజ్యమును కోరుకొమ్మంటూన్నారా! నిమిచక్రవర్తి వారసులము, మాకు రాజ్య సుఖం లక్ష్యమా? ఆ కేశిధ్వజుడు ఉత్తమోత్తమ యోగసాధకుడు! ఆతనిని మోక్షవిద్యాసామ్రాజ్యమును దక్షిణ అడగాలి, సామాన్య రాజ్యమును కాదు అని బయటకు వచ్చి, కేశిధ్వజుని సమీపించి,నిజముగా నాకు దక్షిణ ఇవ్వడానికే వచ్చినవాడవైతే 'నాకు సమస్త ప్రాపంచిక దుఃఖములను నివారించే ఆ మహావిద్యను, ఆ యోగవిద్యను, ఆ ఆధ్యాత్మిక విద్యనూ దక్షిణగా ఇవ్వవయ్యా' అని అడిగాడు.ఆశ్చర్యమును, ఆనందమును పొందిన కేశిధ్వజుడు ఆధ్యాత్మిక విద్యను, ఆత్మానాత్మవివేక జ్ఞానవిద్యనుబోధించడం ప్రారంభించాడు.శ్రీకృష్ణదేవరాయల ఆధ్యాత్మిక, లౌకిక జ్ఞానానికి ఈ ఖాండిక్య కేశిధ్వజ ఘట్టం అత్యద్భుత ఉదాహరణ.యుద్ధము చేయని మాసమంటూ లేనివాడు, రాజ్యము చేసిన ఇరవై సంవత్సరాలలో (1509-1529) చేసిన ప్రతి యుద్ధములోగెలిచిన అపరాజితుడైన యోధుడు ఎంత జ్ఞానీ, రాజనీతివేత్త, తత్త్వవేత్త, సాహితీవేత్త అనేది తెలుసుకుంటే, తలచుకుంటే, విస్మయం కలుగుతుంది, వినమ్రులమై పాదాభివందనం చేయాలని కోరిక కలుగుతుంది. ఖాండిక్య కేశిధ్వజుల కథను విష్ణు పురాణంలోనుండి గ్రహించి, మూల కథకు తన రాజనీతి కుశలతతో, ఆధ్యాత్మిక జ్ఞానరహస్య విజ్ఞానంతో వన్నె తెచ్చాడు. రాయలగురించి ఎంత వ్రాసినా, ఎంత పొగిడినా తక్కువే, దైవాంశ సంభూతుడు, ఆధునిక ప్రపంచ మేటి చక్రవర్తులలో అగ్రగణ్యుడు రాయలు.ఒకప్రక్కన ఈ వ్యాసము మరీ దీర్ఘమైపోతున్నది అనే భావము, మరొక ప్రక్కన విడిచిపెట్టడానికి వీలు లేని ప్రతి పద్యము, ప్రతి ఘట్టమూ కావడంతో క్లిష్టమైన స్థితిలో అత్యంత ముఖ్యమైన పలుకులనే మనం విమర్శ చేసుకుంటున్నాము.కేశిధ్వజుడు ఉపదేశం ప్రారంభించాడు.

ఆత్మ కాని మేన నాత్మ బుద్ధియును న
స్వంబునందు మిగుల స్వత్వమతియు 
నవనివర! యవిద్య యను మహాతరువును 
త్పత్తి కీ ద్వయంబు విత్తు మొదలు

ఆత్మ వేరు, శరీరము వేరు. శరీరము నశించేది. ఆత్మ నిత్యమై రహించేది. నాది అంటూ ఏదీ లేదు, ఏదీ కాదు,నా శరీరముతో సహా, ఇల్లూ, వాకిలీ, దారా పుత్రాదులు అందరూ, అన్నీ కొద్దికాలపు చక్కిలిగింతలే, వీటినే అంటిపెట్టుకోవడం వల్ల వంతలే! మహా రాజా! శరీరమే ఆత్మ అనుకోవడం - స్వంతం కాని వాటిని స్వంతం అనుకోవడం ఈ రెండూ అవిద్య అనే మహా వృక్షమునకు బీజము వంటివి అని చెప్పడం మొదలుబెట్టాడు కేశిధ్వజుడు. '' అనాత్మన్యాత్మ బుద్ది ర్యా అ స్వే స్వమితి యా మతిః అవిద్యా తరునం భూతి బీజమేతత్విధా స్థితం '' అనే విష్ణుపురాణం లోని శ్లోకాన్ని ఎంత యథాతథంగా, అలవోకగా, ఒక్క పదం ఎక్కువా తక్కువా లేకుండా సరళంగా అనువదించాడో గమనిస్తే రాయలకు జేజేలు పలుకకుండా ఉండలేము కదా! పురాణశ్లోకానికి పై పద్యం అనువాదం అయితే 'ఉపనిషత్ శ్లోకాలు రెండింటికి ఈ క్రింది రెండు పద్యములు

అనువాదాలు!

నరనాథ! పాంచభౌతిక
శరీరమున దేహి మోహసాంద్రతమతమః
పరివృతుఁడై 'యే నిది నా 
పరికర' మని యవధి లేని భ్రమఁపడి తిరుగున్ 

ఓ రాజా! పంచ(మహా)భూతములతో తయారైన ఈ దేహములో మానవుడు  దట్టమైన (సాంద్ర తమ)మోహమనేఅంధకారంలో చిక్కుపడి(మోహ తమః పరివృతుడై) ' ఇది నేను, ఇది నాది ' అనే అంతం లేనిభ్రమలో పడి పరిభ్రమిస్తాడు.

ప్రాణికోటికెల్ల బంధంబు మోక్షంబు 
చేరుటకును మనసు కారణంబు 
విషయసంగియైన విను బంధకారి; ని
ర్విషయమైన ముక్తి విభవ కారి  

ప్రాణులకు బంధనాలకైనా, మోక్షానికైనా మనసే కారణమూ అవుతుంది. మనసు విషయ(ఐహిక)సుఖాలవ్యసనములో తగులుకుంటే బంధకారి అవుతుంది, విషయ సుఖాలనుండి బయటపడగలిగితే ముక్తి వైభవానికికారణం ఔతుంది.కనుక మనసును పట్టుకోవడంలోను, తుఛ్ఛమైన విషయాలవైపు వెళ్ళకుండాఉగ్గబట్టుకోవడంలోనూ ముక్తికి మూలం ఉంది. 'సా విద్యా యా విముక్తయే' ఏది విముక్తి కలిగిస్తుందో అదే విద్య.ఏది బంధనాలలో కట్టి పడేస్తుందోఅదే అవిద్య. కనుకనే శరీరమే ఆత్మ అనుకోవడం, శాశ్వతాలు కానివాటినిశాశ్వతాలు అనుకోవడం అవిద్య, అంటే బంధనం. మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః అన్నదిఉపనిషత్తు. కనుక మనసే అన్నిటికీ, బంధనాలకూమోక్షానికీ కారణం. అందలాలెక్కించినా, అధఃపాతాళాలకుతొక్కేసినా మనసే కారణం. 'ద్వే శబ్దే బంధ మోక్షాయ మమేతి న మమేతిచ, మమేతి బధ్యతే జంతుర్నమమేతివిముచ్యతే', 'నాది-నాదికాదు' అనే రెండు పదాలే బంధనాలకైనా విముక్తికైనా కారణాలు. 'నాది' అనుకోవడంబంధనానికి కారణం అవుతుంది, నాది కాదు అనుకోవడం విముక్తికి కారణం అవుతుంది, కనుక ఈ జ్ఞానముతోఅవిద్యను దూరం చేసుకుని, విద్యను పొందాలి, అజ్ఞాన బంధాలను జ్ఞానమనే ఖడ్గముతో ఛేదించి విముక్తినిపొందాలి అని ఉపదేశించాడు కేశిధ్వజుడు. యమ, నియమాది అష్టాంగయోగ మార్గమును, నిరాకార - సాకారసాధనా విధానమును, మహావిష్ణు ప్రాశస్త్యాన్ని వివరముగా విశదీకరించి తనకు ఆత్మజ్ఞానబోధచేసిన కేశిధ్వజుడిని సాష్టాంగ దండప్రణామాలతో పూజించి, సత్కరించాడు ఖాండిక్యచక్రవర్తి.నీవు చేసిన ఆధ్యాత్మికజ్ఞానదానము చాలు, అదే నేను కోరుకున్న దక్షిణ, నాకు ఇంకా ఏమీ అవసరము లేదు అని ఎంత వారించినా వినకుండా ఖాండిక్యునికి అంతకుముందు అతనినుండి తాను గెలుచుకున్న రాజ్యాన్ని దక్షిణగా సమర్పించాడు కేశిధ్వజుడు. ఇక్కడ ఒక ధార్మిక మర్మం ఉంది. తాను ఆధ్యాత్మిక జ్ఞానమునుఇచ్చాడు నిజమే కానీ, అది తన స్వార్జితము కాదు, ఆధ్యాత్మిక, వేదాంత జ్ఞాన సముపార్జన చేయడం, దానినిమరలా తరవాతి తరాలకు అందించడం ఒక బాధ్యత, హక్కు కాదు. ఆ ఆధ్యాత్మిక జ్ఞానము గురువులనుండిశిష్యులకు జీవనదిలా నిరంతరమూ ప్రవహించవలసిందే. అయితే ఇక్కడ ఒక అనుమానం రావాలి, ఖాండిక్యుడుచేసినదీ జ్ఞాన వితరణయేఅయినా యాగకార్యానికి గురువైనాడు, ఆ యాగం నిర్విఘ్నముగా జరుగ గలిగే సూచనను చేసి, యాగము పూర్తి ఐన తర్వాత దక్షిణ ఇవ్వకుండా యాగ ఫలితము ప్రాప్తించదు కనుక దక్షిణఇవ్వడం. వేదవిజ్ఞానమంతా రెండు భాగాలు, కర్మ కాండ, జ్ఞాన కాండ. ఖాండిక్యుడు కర్మకాండకు ప్రతినిధి,కేశిధ్వజుడు జ్ఞానకాండకు ప్రతినిధి. కర్మకాండ అంటే వ్రతాలు, నియమాలు, యజ్ఞ యాగాదులు, పూజలు ఇత్యాదులు కోరుకున్న ఫలములను పొందడం కోసం చేయడం, అంటే ఐహిక ఫలములను కోరుకొనడం(కూడా)ప్రధానమన్నమాట. జ్ఞానకాండ ఏ ఐహిక ఫలితములను కోరుకొనకుండా కేవలం ముక్తిని ఆశించి చేసేసాధనాపరమైనది, ఇదే ఉపనిషత్తులు బోధించే మార్గము. అందుకనే ఈ ఇద్దరి పలుకులలో వారి వారివిధానాలకు సంబంధించిన వర్ణనయే చేశాడు రాయలు. ఖాండిక్యుడు పలికినవి కర్మకాండకు సంబంధించినమెళకువలు, కేశిధ్వజుడు పలికినవి ఉపనిషత్తుల రహస్యాలు, రమణీయమైన రాయల మార్గంలో.

కర్మకాండా రహస్యాలను తెలిసినవాడు కావడం వలన, కేశిధ్వజునికి యాగ ఫలం దక్కడం కోసం, చేసేది లేక,తన రాజ్యాన్ని స్వీకరించిన ఖాండిక్యుడు వెంటనే దానికి తన పుత్రుడిని రాజుగా అభిషేకించి తాను మరలాఅరణ్యమునకు వెళ్లి యోగ మార్గములో నిరంతర మహావిష్ణు ధ్యానంలో పరమపదమును పొందాడు. కేశిధ్వజుడుతన రాజ్యమునకు వెళ్లి నిరంతర పుణ్య కర్మలతో పాపక్షయము చేసుకుని, ప్రజా రంజకంగా పరిపాలించి పరమాత్ముని చేరుకున్నాడు.

' కనుక మహారాజా! మత్స్యధ్వజా! మహావిష్ణు భక్తిని మించిన మార్గం మరేదీ లేదు. భక్తి మార్గంలో ఆ స్వామిని అర్చించి తరించవచ్చు. కానీ ఇందులో ఒక ఇబ్బంది ఉన్నది. భక్తిమార్గ ప్రాప్తమైన పుణ్యము అనుభవించడానికి ఆ పుణ్యం కరిగిపోయేవరకూ జన్మనెత్తవలసినదే, 'అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం' అన్నారు కదా,చేసిన కర్మలు మంచివైనా, చెడ్డవైనా వాటి ఫలితాలను ఇష్టం ఉన్నా లేకున్నా అనుభవించవలసిందే. భక్తితో స్వామిని సత్ఫలితాలను కోరుకొనడం వలన, భక్తి ప్రపత్తులను చూపుతున్నాను అనుకోవడంవలన, నేనుచేస్తున్నాను అనే కర్తృత్వ బాధ్యతను స్వీకరించడం వలన ఆ పుణ్యమును అనుభవించడం కోసం జన్మించడంతప్పదు.కనుక అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన విధానంలో, శరణాగతి మార్గంలో, మంచీ చెడూ అన్నీనీవే స్వామీ, ఆ కర్మములూ నావి కావు, ఆ ఫలితములూ నాకు వద్దు, చేసేదీ నేను కాదు, అనుభవించేదీ నేనుకాదు అని 'కర్తృత్వ భావము'లేకుండా పాలముంచినా నీటముంచినా భారము నీదే అని సేవించి పునరావృత్తిరహితమైన పరమాత్ముని పదమును చేరుకోవచ్చు. కనుక మనసును మణులనుండి, రమణీమణులనుండిమాధవుని పాదములకు మరలించి తరింతువు గాక ' అని విష్ణుచిత్తుడు మత్స్యధ్వజ మహారాజుకు ఖాండిక్యకేశిధ్వజుల కథను వివరించి, మంత్రోపదేశం చేశాడు. ఒక చిన్ని వచనంలో అతి లోతైన ఆధ్యాత్మిక రహస్యాన్నిరమ్యంగా వివరించాడు రాయలు.  

ఊరీకృతపాండవరథ
సారథ్య సయూథ్యగోపశాబకసహకే
లీరత భక్త ప్రహ్లా
దారచితస్తోత్ర పులకితాంచిత గాత్రా!       

అంగీకరింపబడిన అర్జునుని రథ సారథ్యము గలవాడా! చెలికాళ్ళు ఐన గోపబాలకులతో క్రీడించడంలో ఆసక్తి కలిగినవాడా! ప్రహ్లాదునిచేత చేయబడిన ( ప్రహ్లాద ఆరచిత) స్తోత్రముచేత పులకించిన శరీరముగలవాడా!యిది ప్రహరేశ్వరపాత్రుడు మొదలగు అనేక యోధులచే, ఆకాశమును అంటే భారీ ప్రమాణము గల యుద్ధయంత్రములచేసంరక్షింపబడుచున్న 'కొండపల్లి' దుర్గాన్ని కొల్లగొట్టే కాలసర్పమువంటి ఖడ్గకాంతులచేవెలుగొందే మహోద్యమభుజముగలవాడిని, కృష్ణదేవరాయలు అనే పేరును కలిగిన నాచే హృద్యమైనపద్యములచే రచింపబడిన 'ఆముక్తమాల్యద' అనే గ్రంథములోని మూడవ ఆశ్వాసము, వినుమయ్యా! అనిశ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలోని మూడవ ఆశ్వాసాన్ని ముగించాడు.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి