రంగుల పండుగ హోళీ - కర్ర నాగలక్ష్మి

colorful festival holi
 ఫాల్గుణ పూర్ణిమని హోళిపుర్ణిమ గా జరుపుకోవడం హిందువులకు అనాదిగా వస్తున్న ఆచారం. ఈ సంవత్సరం ఆంగ్ల కేలండర్ ప్రకారం మార్చ్ నెల ఆరో తేదిన హోళిపూర్ణిమ గా దేశమంతటా  హోళీపండగ జరుపుకుంటున్నారు. ఈ పండుగని సత్యయుగం నుంచి జరుపుకుంట్టున్నట్టుగా హిందూ పురాణాలలో వివరించ బడింది. హోళీ అంటే అగ్ని, అగ్నిచే పునీతమైనది అనే అర్ధాలు చెప్పబడ్డాయి. హోళీని మదన పూర్ణి మ, హోళికా పుర్ణిమగా కుడా వ్యవహరిస్తూవుంటారు. ముందుగా మనం మదన పూర్ణిమ అనే పేరు యెలా వచ్చిందో తెలుసుకుందాం. సతీదేవి దక్షయజ్ఞ సమయంలో తనతండ్రి యైన దక్షుని చే అవమానింబడి ప్రాణత్యాగం చెయ్యగా ఆమె పార్ధివ శరీరాన్ని తన త్రిశూలంపై మోస్తూ స్థితిలయలని మఱచి ఋద్రతాండవమాడుతున్న శివుని సతీదేవి వియోగదుఃఖమ్ నుండి బయటకు తెచ్చి క్ర్యోన్ముఖుడిని కావించేందుకు విష్ణుమూర్తి తనచక్రంతో సతీదేవి శరీరాన్ని నూటెనిమిది ఖండాలు కావించి చెల్లాచెదురు కావిస్తాడు. పర్వత రాజపుత్రి యైన పార్వతి పరమేశ్వరుని వివాహమాడే వుద్దేశ్యంతో తపస్సునాచరిస్తుంది. సతీదేవి వియోగదుఃఖమ్ నుంచి బయట పడక తిరుగుతున్న శివుని మనస్సు మార్చి పార్వతిని వివాహమాడేటట్లు చెయ్యాలని చేసిన ప్రయత్నాలు వమ్ముకాగా దేవీదేవతలు చెరకును విల్లుగా,పూమాల వింటినారిగా, తుమ్మెదలు బాణంగా గల కామదేవుని వద్దకు వెళ్లి అతని బాణాలను శివునిపై ప్రయోగించి పార్వతి పై మొహం కలుగునట్లు చెయ్యమని ప్రార్ధింపగా మదనుడు దేవతల కోరికపై తుమ్మెదల బాణం శివునిపై ప్రయోగిస్తాడు. శివుడు తనలో కలిగిన మార్పునకు గల కారణం తెలుసుకున్న వాడై అందుకు కారణమైన కామదేవుని తన మూడోకన్నుతెరచి భస్మం కావిస్తాడు. విషయం తెలుసుకున్న మదనుడి పత్ని రతీదేవి శివునకు జరిగిన దాంట్లో మదనుని తప్పేమీ లేదని ,దెవీదేవతల కోరిక మేరకు మదనుడు అతనిపై తుమ్మెదల బాణం ప్రయగించెనని విన్నవించుకొని మదనుని తిరిగి పునఃర్జీవితుని  కావింపమని కోరుతుంది. ఆమె కోరికని మన్నించిన పరమశివుడు మదనుని తిరిగి పునఃర్జీవితుని కావిస్తాడు .

హోళీపూర్ణిమ కి ముందు రోజు కామదేవుని దహనం చెయ్యడం ,మరునాడు కామదేవుడు పునఃర్జీవితుడు అయినందున రంగులు చల్లుకొని తమ హర్షాన్ని తెలియజేసుకోవడం ఆనవాయితీగా మారింది . ఇప్పుడు హోళికాపూర్ణిమ వెనుక నున్న కధ తెలుసుకుందాం. సత్యయుగంలో హిరణ్యకశిపుని సోదరి హోళిక, హరి వైరి యైన హిరణ్యకశిపుని తనయుడు ప్రహ్లాదుడు హరి భక్తుడు.తన వైరి యైన హరి భక్తి నుండి తనయుని మనస్సు తప్పించేందుకు చేసిన ప్రయత్నములు వమ్ము కాగా దిక్కుతోచని హిరణ్యకశిపుని వద్దకు వచ్చిన హోళిక  తాను  ప్రహ్లాదుని వడిలో పెట్టుకొని అగ్నికి ఆహుతిగా ప్రహ్లాదుని సమర్పించి శాశ్వతంగా హిరణ్యకశిపునకు హరి బాధనుంచి తప్పించుతానని వాగ్దానం చేసి ఫాల్గుణ శుద్ధ చతుర్దశి సాయంసమయమునందు అగ్ని ప్రవేశం కావిస్తుంది. కాని హోళిక విష్ణు మాయవలన అగ్నికి ప్ల్ఆహుతి ఔతుంది. ఆనాటి నుంచి గెలిచిన హరి భక్తికి ఓడిన రాక్షస శక్తికి గుర్తుగా ప్రతీ ఫాల్గుణ శుద్ధ చతుర్దశి సాయంసమయములొ హోళికా దహనం కావించడం ,మరునాడు విజయోత్సాహంతో రంగులు జల్లుకోవడం  హిందువులకు ఆచారంగా వస్తోంది. బీహారు,మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో ప్రచారంలో వున్నా మరో కధ ఢుంఢి పిశాచి కధ , ఢుంఢి అనే పిశాచి పిల్లలు,ఆడవారిని, ముసలివారి నుండి చావులేని వరం పొందిన ఢుంఢి పిశాచి వూరి వారిని బాధిస్తూ వుండగా ఆమె యువకులచే మాత్రమే మరణించ గలదని తెలుసుకున్న యువకులు వూరి బయట అగ్నికుండం యేర్పరచి ఢుంఢి పిశాచిని కర్రలతోను ,డప్పుల శబ్దాలతోను బెదరగొట్టి పిశాచిని అగ్నికుండం వైపు తరిమి పిశాచి అగ్నిప్రవేశం చేయునట్లు చేసి పిశాచిని అంతమొందిస్తారు.ఇది "లాఠి హోళీ" గా ఇప్పటికి నెత్తురోడేటట్లు ఒకకరినొకరు కట్టుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ ఆచారాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయా గ్రామా ప్రజలు అడ్డుకుంటూ ఈ కుప్రధని ఆచారమనే రంగుటద్దాలతో చూస్తున్నారు.

ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవంలో రంగుల ప్రయోగం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రాధ మొదలగు గోపికలతో రాసలీలలు ఆడేవాడు. గోపాలుని రాసలీలలో వివాహిత గోపికలు కుడా పాల్గొనేవారు. గోపికలను అపనిందలనుంచి కాపాడేటందుకు కృష్ణుడు గోపికల మోములకు రకరకాల రంగులద్దేవాడుట. అలా రాసలీలలో రంగుల వాడకం మొదలయ్యింది. హోళీ ముందురోజు రాత్రంతా రాసలీల చేయించడం (డాన్స్ డ్రామా) గుజరాత్,ఉత్తరప్రదేశ్,మధ్య ప్రదేశ్, భీహారులలో ఇప్పటికి ఆనవాయితీ గా వస్తోంది . పూరి జగన్నాథ్ ,మధుర, బృందావనం , ద్వారకలలో గల మందిరాలలో పూర్ణిమనాడు రంగులు ఆడుతారు, మరునాడు ఆయా చుట్టుప్రక్కల ప్రాంతాలలో రంగులు జల్లుకుంటారు.  జైమిని చే రచింపబడ్డ పుర్వమీమాంస సూత్రం మరియు కాథక గ్రాహ్య సూత్రం ప్రకారంగా హోళీ  ని  హోళిక అనివ్యవహరించి నట్లుగా తెలుస్తుంది. నారద పురాణం, భవిష్య పురాణం లోను ఈ హోళి పూర్ణిమ గురించిన వివరణ మనకు కనిపిస్తుంది.

ఈ పండుగకు పౌరాణిక ప్రమాణాలే కాకుండా చారిత్రాత్మక ప్రమాణాలు కుడా ఎన్నో లభించేయి. వింధ్య ప్రాంతంలో గల రాయగఢ్  దగ్గర జరిగిన త్రవ్వకాలలో లభించిన శిలావ్రాతలు హోళీ పండగ గురించి తెలియ జేస్తున్నాయి . ఇవి 300B.C కాలం నాటివి గా చరిత్రకారులు గుర్తించేరు . 7వ శతాబ్దంలో హర్షవర్ధనునిచే రచింపబడ్డ 'రాత్నావళి'లో కుడా హోళీ పండగ గురించి చెప్పబడింది.       వసంత రుతువును వసంతాలు (నీళ్ళలొ పసుపు, కుంకుమ కలిపిన వాటిని వసంతాలు అని అంటారు.) జల్లుకొని ఆహ్వానించడం , శీతాకాలానికి వీడ్కోలు చెప్తూ వసంత రుతువుకు ఆహ్వానం పలకడం ఈ పండుగ జరుపుకోవడంలో ఉద్దేశ్యంగా కనిపిస్తుంది .

ఈ రంగుల పండగ ముస్లింలు కుడా జరుపుకొనే వారని 'ఉల్బరూని'  అనే ప్రఖ్యాత ముస్లిం ప్రయాణికుడు తన పుస్తకాలలో రాసుకున్నాడు.  ఈ హోలీ పండుగ లో రంగుల ప్రాముఖ్యమే కాకుండా పిండివంటలకు,పానీయాలకు కుడా ప్రాముఖ్యం వుంది. ఇందులో ముఖ్యంగా గుజరాతీలు చేసే కోవా గుజియా (కజ్జికాయ) , రకరకాల తీపిపదార్ధాలు చోటు చేసుకున్నాయి. పానీయాలలొ భంగు కలిపిన "ఠండాయి" ముఖ్యమైనది . హోళీ పండుగలో ఈ భంగు తాగే అనవాయితీని సమర్ధించే పౌరాణిక,చారిత్రత్మక మైన ఆధారాలు లేవు కాబట్టి ఇది మనిషి వికృతికి తార్కాణం అని అనుక్కోవచ్చు.

మన పొరుగు దేశమైన నేపాల్ లో ఇది ఒక వారం రోజుల పండగ . ఒకపోడుగాటి వెదురుకు రంగు రంగుల గుడ్డలు కట్టి వూరి మధ్య వారం రోజుల ముందు నిలబెడతారు, హోళీ ముందురోజు రాత్రి మంట వేసి అందులో ఆరంగుల గుడ్డల్ని కాల్చేస్తారు.దీనిని ఛీర్ (వెదురుకి కట్టిన గుడ్డలని ఛీర్ అని అంటారు) హరణ్ అని హోళికా దహన్ అని అంటారు. మరునాడు రంగు ఒకరిపై ఒకరు జల్లుకొని తమ సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటారు. కాలక్రమంలో ఈ పండుగ రెండురోజులకు కుదించుకు పోయింది.  కాల క్రమంలో రసాయన రంగుల వాడకం వచ్చి ప్రాకృతిక రంగుల వాడకం పూర్తిగా తగ్గి పోయిందనే చెప్పాలి. ప్రాకృతిక రంగులకు రసాయనిక రంగులకు వెలలో చాలా వ్యత్యాసం వుండటంతో అందరూ రసాయన రంగులవాడకం మొదలుపెట్టేరు. ఈ మధ్య కాలంలో ప్రజలలో రసాయనాల వాడకంవలన కలిగే చేడుప్రభావాలను గురించి సరియైన అవగాహన కలిగించిన జన చైతన్య సమితి వారి కృషి ఫలితంగా ప్రజలు ప్రాకృతిక రంగులవైపు మొగ్గు చూపుతున్నారు.       హోళీ అన్ని వయసులవారికి యిష్ఠమైన పండుగ దీన్ని మనవంతు భాద్యతగా కల్తీలేని రంగులు,మిఠాయిలతో జరుపుకుందాం. ఆఖరుగా హోళీ ఆడేవారికి చిన్న సలహా , రంగులు ఆడడానికి వెళ్ళేముందర తలకి నూనే,ఒంటికి క్రీము రాసుకొని వెళితే రంగుల వల్ల కలిగే చర్మానికి సంబంధించిన ఎలర్జీ నుంచి తప్పించుకోవచ్చు.తరువాత స్నానం చేసేటప్పుడు రంగులు వదల్చుకోవడం కుడా సులువౌతుంది.చిన్నచిన్న జాగ్రత్తలు పాఠిస్తూ ఈ రంగుల పండుగని అందరం ఆనందంగా జరుపుకుందామా?.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి