సాగర ఘోష: పుస్తక సమీక్ష - సిరాశ్రీ

saagara ghosha book review by sirasri
రచన: డా|| గరికిపాటి నరసింహారావు
ప్రతులకు: డా గరికిపాటి నరసింహారావు (కాకినాడ. 0884-2371693)

ఈ "సాగరఘోష" వెనుక ఒక స్వీయానుభవం ఉంది. అది చెప్పి పుస్తకంలో ఎముందో ముక్తాయింపులో చెప్తాను. దాదాపు పదేళ్ళ క్రితం హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో జరగబోతున్న ఒక కార్యక్రమం తాలూకు ఆహ్వాన పత్రికను మా పెదనాన్నగారైన సీ యస్ రావుగారింట్లో చూసాను. "సాగరఘోష కావ్య పఠనం- ఏక ధాటిగా 1116 పద్యాలు అప్పజెప్పబోతున్న మహా సహస్రావధాని డా గరికిపాటి నరసింహారావు". ఇది ఆ ఆహ్వాన పత్రికలోని సారంశం.

కావ్య పఠనం అన్న విషయం కన్నా, ఏకధాటిగా 1116 పద్యాలు అప్పజెప్పడం అనే విశేషం నన్ను ఆకట్టుకుంది. అప్పటికే గరికిపాటి వారి అవధాన ప్రశస్తి గురించి చాలా విన్నాను. అప్పటికి ఐదారేళ్ళ క్రితం కాకినాడలో జరిన "సాగర తీరములో మహాసహస్రావధానం" లో పాల్గొన్న కొందరు ఆ సంగతులు చెప్పారు నాకు.

గరికిపాటి వారి కంఠం విన్నట్టు ఉంటుంది, వారి ధారణా శక్తిని దర్శించినట్టు కూడా ఉంటుంది అనుకుని త్యాగరాయ గాన సభకు వెళ్ళాను. గుమ్మం దగ్గర బల్ల మీద పెట్టి అమ్ముతున్న "సాగరఘోష" కావ్యాన్ని కొన్నాను. ఉపోద్ఘాతం చదివి కాగితాలు తిరగేస్తుంటే అద్భుతమైన పద్యాల పరుగు అనుభవమయ్యింది. ఇక ఆ పద్యాలన్నీ గరికిపాటి వారి ధారణలో ఎలా ధ్వనిస్తాయో అనుకుంటూ లోపలికెళ్ళి కూర్చున్నాను.

ధారణా యజ్ఞం మొదలయ్యింది. ఉదయం సుమారు తొమ్మిదిగంటలకి మొదలుపెట్టి సాయంత్రం వరకు ఏకధాటిగా 1116 పద్యాలు రాగయుక్తంగా, ఒక్క తొట్రుపాటు కూడా లేకుండా, ఎక్కడా మరిచిపోయిన దానిని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నట్టు కనపడకుండా, కర్ణ పేయంగా, వాక్ ప్రవాహంగా, రస ప్రాసారంగా, హృదయ ప్రమోదంగా, శాంతి ప్రబోధంగా ధారణ చేసేసారు. ఆశ్చర్యంతో బిగుసుకుపోవడం మా శ్రోతల వంతయ్యింది. ఒక శాంతి పాఠాన్ని అద్భుత రసంలో కలిపి అందించినట్టయ్యింది.

1116 పద్యాలు గల ఈ "సాగరఘోష" ఒక దీర్ఘ కావ్యం. కావ్య వస్తువు విశ్వం-మనిషి. ఒక కవికి, సముద్ర కెరటానికి జరిగే సంభాషణ సారాంశం ఈ కావ్యం. కాలంతో పాటు నిత్యం అలరారే సముద్రంలోని ఒక కెరటం కవి ఒడిని చేరి విశ్వావిర్భావం నుంచి, తన మీదుగా ఎగురుతూ సీతను ఎత్తుకుపోతున్న రావణుడిని చూసిన ఘట్టం దగ్గరనుండి, అద్వైత శంకరుడి ప్రస్తావన నుంచి, ప్రపంచ యుధ్ధాల నుంచి, మార్క్సిజం నుంచి, చైనా విప్లవం నుంచి, గాంధీ పర్వం వైపు నుంచి, ఇరాక్ లో సద్దాం హుస్సేన్ తనపై చమురు చిమ్మిన సంఘటన వరకు ...ఇలా సమస్త కాలాన్ని గిర్రున మన ముందు తిప్పుతుంది ఈ పద్య కావ్యం.

"దశకంఠొద్వికటాట్టహాసములు సీతంబట్టి గొంపోవు దుర్దశ...." అంటూ సీతాపహరణ సన్నివేశాన్ని...

"ఒక క్రీస్తు రుధిర బిందువు
ఒక బుద్ధుని అభయముద్ర ఒక ఋషి పీఠం
ఒక శాంతి మంత్ర పాఠము
సకలమ్మును కలిసి గాంధి జన్మము నెత్తెన్"
...అంటూ గాంధీ గురించి

"కురంగముల్ తురంగముల్ చకోరముల్ సుపర్ణముల్
ధరాంగముల్ రధాంగముల్ స్వతాపముల్ ప్రతాపముల్
సొరంగముల్ తరంగముల్ రజోంగముల్ రణాంగముల్
స్వరాజ్య సాధనమ్ముకున్ ప్రశస్తముల్ సమస్తముల్"..
..అంటూ రష్యా విప్లవం గురించి...

"ముంచంగల్గిన ముంచబూనినను ఈ మున్నీటినే మించువా
రంచుల్ తాకిన గానరారకట! బ్రహ్మాండంబులౌ నౌకలున్
మంచుంబెల్లలు తాకి బాటలయి బొమ్మల్వోల్లికన్ బ్రద్దలౌ
టంచే గాధలెరుంగకుంటిరొకొ! టైటానిక్ ప్రమాదంబులన్".
...అంటూ టైటానిక్ నౌక మునిగిన ఘట్టాన్ని స్ఫురింపజేస్తూ

ఇలా ఎన్నెన్నో పద్య కుసుమాలతో కాలాన్ని దర్శింపజేసే ఈ "సాగరఘోష" పద్య పిపాసులను ఎంతగానో రంజింపజేస్తుంది...ఆపకుండా చదివితే పద్యాలు వ్రాసే ఊపును కూడా ఇస్తుంది.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి