వంద వందే మాతరం!
'వందేమాతరం' అంటే వంద వరకూ మాత్రమే మా శక్తి సామర్ధ్యాలు అనీ, ఆ తరువాత మా వల్ల గాదనీ, ఒకాయన అర్ధం చెప్పాడు. 'వంద అనేది ఓ గొప్ప సంఖ్య కాకపోవచ్చుగానీ, కచ్చితం గా మంచి సంఖ్య. మానవజీవన ప్రమాణ విషయం లో మాత్రం 'వందా ఓ పూర్ణాయుష్షుగా జమ ! ఆసలు మనిషి ఆయు: ప్రమాణం 120 ఏండ్లుట. అందులో సగం జీవితం గడిస్తే చేసుకునేదే షష్టిపూర్తి. ' శతమానం భవతి ' అని మనవాళ్ళు నిండా నూరేళ్ళు బ్రతకమని ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మన 'గో తెలుగూ విషయమూ అంతే ! ఇది వార పత్రిక. వంద సంచికలు పూర్తవడం అంటే, ఇంకో నాలుగు వారాల్లో రెండేళ్ళు వస్తాయన్నమాట! గో తెలుగు నూరేళ్ళు నిలవాలని మన శుభాశంస!
నిజంగానే వంద అనే మాటలో అందమైన ఓ నిండుదనం వుంది. నేను కార్టూన్లు గీయడం మొదలెట్టినపుడు వందో కార్టూన్ అచ్చయినపుడు ఎంత సంతోషించానో గుర్తుంది. ఇప్పుడంటే మనకు తెలియడం లేదు గానీ ఒకప్పుడు ' వంద రూపాయల నోటు ' కు ఎంత విలువో! ఆ రోజుల్లో ఆ నోటు చూడడం కూడా ఓ గొప్పే! ' నా దగ్గర వందలు, వందలు ఏం లేవూ అనేది అప్పటి డైలాగు. ఇప్పుడు వంద నోటుకు అంత విలువ వున్నట్లు కనిపించడంలేదు.ATM ల్లోఅయితే వెయ్యి రూపాయల నోటు లేదా అయిదువందల నోట్లే ఎక్కువ వుంటున్నాయి. వంద రూపాయలు వస్తాయి గానీ పదిహేను వందలు డ్రా చేస్తే రెండు ' అయిదువందల ' నోట్లు, అయిదు ' వంద ' నోట్లు వస్తాయి. గుమ్మం దాటితే చాలు ఈ రోజుల్లో వంద ఇట్టే ఖర్చయిపోతోంది.
'వందా అంటే నీ 'బొందా అని తేలిగ్గా చూసేవాళ్ళూ వున్నారు. నూరు, వంద, శతం, పదిపదులు ఎలా అన్నా ఈ సంఖ్య నిండుదనమే వేరు. మునుపు చలచిత్రాలు అనగా సినిమాలు ' వంద ' రోజులు ఆడితే బోలెడు గొప్ప! శతదినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగేవి! ఇప్పటి సినిమాలు కొన్ని జత దినోత్సవాలే చేసుకున్నా ఆడియో రిలీజ్ దగ్గర్నుండీ హంగూ, ఆర్భాటం మాత్రం బోలెడు చేస్తుంటారు. అప్పట్లో నటీనటులు, సాంకేతిక వర్గం వారు సినిమా శతదినోత్సవం షీల్డు అందుకోవడం అంటే గర్వం గా పొంగిపోయేవారు. ఆ సినిమా అఖండ విజయం లో తమ పాత్ర వుందని మురిసిపోయేవారు. ఇప్పుడు వంద రోజులు సినిమా ఆడడం అనేది గగనమైపోతోంది. అందుకే ఇప్పుడు ఎన్ని రోజులు ఆడిందని కాదు, ఆడినన్ని రోజుల్లో ఎన్ని షోలతో ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించింది? అన్నది క్రెడిటీరియా అయింది. విడుదలైన వారం రోజుల్లోనే ఎన్ని వందల కోట్లు ఆర్జించింది అని లెక్కిస్తున్నారు. వంద కోట్లు పెట్టి తీసే హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి. వాటితో నిర్మాణం లో పోటీపడాలనుకునే బాలీవుడ్, టాలీవుడ్ జనాలూ వున్నారు. సాహిత్యం లోనూ ' వంద 'వైశిష్ట్య' వుంది. వంద పద్యాలు మకుటం ఒకటి వుంచి రాసినవి ' శతకం ' గా ప్రసిద్ధాలు. పద్య సాహిత్యం లో శతక వైశిష్ట్యం గొప్పది. సుమతీ శతకం, వేమన శతకం, దాశరదీ శతకం ఇలా శతకాల్లోంచి పద్యాలు కొన్నయినా కంఠతా వచ్చివుండేవి. నీతీ నీ జీవన రీతినీ ప్రభోధించి వ్యక్తిత్వాలను తీర్చిదిద్దిన శతకాలున్నాయి. భక్తిని ప్రభోధించినవి ఎన్నో శతకాలున్నాయి, రక్తిని చెప్పిన కవి చౌడప్ప శతకం వంటివీ వున్నాయి.శతకం అనేపేరు వంద పద్యాల కనీస సంఖ్య వల్ల వచ్చినదే. అలాగని శతకం లో కేవలం నూరే కాదు నూటేనిమిది పద్యాలయినా కనీసం వుండడం కద్దు. కవి అయినవాడు ' శతకం ' రాయాలన్నది గొప్పదనానికి ఓ ప్రమాణం. ప్రబంధాలు రాయకపోయినా శతకం రాసి పేరొందిన శతక కవులు బోలెడు మందున్నారు. పాఠ్య పుస్తకాల్లో శతక పద్యాలు వుండడం అనివార్యం గా వుండేది ఆ రోజుల్లో. ఇప్పుడేం చేస్తున్నారో తెలియదు. తెలుగుతనానికి, తెలుగు సంస్కృతికి కొన్నయినా శతకపద్యాలు నోటికి వచ్చివుండాలనేది ప్రమాణం. వంద అంటే ఒకటి పక్కన రెండు సున్నాలు సున్నాకు తనకు తానుగా విలువలేదు. ఒకటికి కుడి పక్కన ఎన్ని సున్నాలు చేరుతూ వెడితే అంత విలువ పెరుగుతూపోతుంది.మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే కోటి సంఖ్యకు ఒకటి పక్కన అసలు ముందు ఎన్ని సున్నాలుంటాయో కచ్చితం గా చెప్పగలగాలి మరి! వందలే వేలు, వేలు, లక్షలు, లక్షలు కోట్లు అవుతాయి. అంచేత ' వంద ' అనేది ప్రగతికి, అబివృద్ధికి స్టెప్పింగ్ స్టోన్! ఒకటి నుంచి తొంభై తొమ్మిది వరకూ అంకెలు లెక్కబెట్టి ' వంద ' అనగానే గొప్ప రిలీఫ్! బోలెడు ఆనందం ఏదో సాధించిన, జయించిన తృప్తి.
అందుకే నూరవ సంచిక అంటే ఆనంద విపంచికే! కొందరు అయితే వందనం అని ఉప్పొంగిపోయి మరీ అంటారు. ' నూరు ' అంటే రాచు, నలుచు అనే అర్ధం కూడా వుంది. వాడితనానికై ఒరిపిడి పెట్టడాన్ని కూడా ' నూరు ' అంటారు. నూరు సంచికలు అంటే మంచి ఒరిపిడి వచ్చినట్ట్లే. కొందరికి ' నూరు ' అన్న పదం కన్నా ' వంద ' అన్నదే అందంగా తోస్తుంది ' నూరేళ్ళు నిండాయి ' అన్నదానికి వంద సంఖ్య రాకుండానే ముగింపు వచ్చిందనే అర్ధమూ వాడుకలో వుంది. కౌరవులు నూరూ మంది. వజ్రాయుధానికి ' నూరంచులకైదువు ' అనే పేరుంది. 'ఆరునూరయినా నూరు ఆరయినా ' అనేది పట్టుదలకు సూచికగా ప్రయోగించేమాట... 'నీ గురించే అనుకుంటున్నమోయ్! నీకు నిండా నూరేళ్ళు ' అని తలుచుకోగానే తారసపడిన వారి గురించే అంటూంటాం. నూరు అన్న, వంద అన్నా, శతం అన్నా ఒకటే విలువ. ఇంతకీ ఆ విలువ గొప్పది గుర్తించదగింది. గుర్తింపుకు నోచుకునేది. ' నత్తి వానికి నా వందనాలు ' అని పఠాభి ' పన్ చాంగం ' లో చమత్కరించాడు గానీ ' వంద ' లో బోలెడు మప్పిదాలు వున్నాయి. వంద ఏళ్ళు గడిస్తేనే ఒక శతాబ్దం. రాబోయే శతాబ్దం మీదే అన్నది గొప్ప ఆశావహ దృక్పథం. ఎన్ని వందల ఏండ్లు గడిచినా తెలుగు వెలుగు దీధితులు విస్తరించుతూనే వుంటాయి. అలా వుండాలని ' గో తెలుగు ' కు శతాయుష్మాన్ భవ!