అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

సాధారణంగా ఈ రోజుల్లో ,చాలామందికి ఒకరో, మహాయితే ఇద్దరో పిల్లలతో సరిపెట్టేసికుంటున్నారు. ఇదివరకటి రోజుల్లో, సంసారాలు “హరా భరా” గా ఉండేవి కాబట్టి, ఎప్పుడైనా తల్లితండ్రులు బయటికెళ్ళాల్సొచ్చినప్పుడు, పిల్లలు తల్లితండ్రులతో వెళ్ళడం అరుదుగా ఉండేది, ఏ శుభకార్యాలకో తప్ప. ఓ నలుగైదుగురు పిల్లలుండేవారు కాబట్టి, ఒకరితో ఒకరు ఆడుకుంటూనో, కొట్టుకుంటూనో కాలక్షేపం చేసేవారు.

కానీ ఈరోజుల్లో “ న్యూక్లియర్ ఫామిలీ “ లలో ఇలాటి సదుపాయాలు తక్కువే. కారణం ఇంట్లో ఏ పెద్దవారైనా ఉంటే, వారిదగ్గర వదిలేసి వెళ్ళొచ్చు, కానీ ఇంట్లో పెద్దవారిని ఉంచుకునే సాంప్రదాయం, కనుమరుగైన కారణాన, నచ్చినా, నచ్చకపోయినా, ఎవరి పిల్లల్ని వారే తమతో తీసికెళ్ళాల్సిన పరిస్థితి. దానికి సాయం, తల్లితండ్రులు తమతమ పిల్లల్ని, ఎంతో క్రమశిక్షణతో పెంచేస్తున్నామనే భ్రమలో ఉంటారు.  పిల్లలు ఏదో తల్లి ఒడిలో ఉన్నంతకాలమూ, ఫరవాలేదు కానీ, నడకొచ్చి, మాటామంతీ వచ్చిందా, అసలు పట్టుకోలేము.

ఇంక “క్రమశిక్షణ” విషయానికొస్తే,  ప్రతీదానికీ  excuse me, thank you, sorry, welcome  చెప్పడం ముందుగా నేర్పడం. అవి నేర్చుకుంటే చాలు, మన పిల్లలు   “ రాముడు మంచి బాలుడు” గా మారిపోయినట్టే అనుకోడం చూస్తూంటాము.   ఆ తల్లితండ్రులే తమ చిన్నప్పుడు, ఇలాటివి నేర్చుకోకుండా కూడా, క్రమశిక్షణతోనే పెరిగి పెద్దయిన విషయం మర్చిపోతూంటారు. అందుకే ఈరోజుల్లో, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, ఏ చాక్లెట్టో చేతిలో పెట్టినప్పుడు, ఆ పిల్లాడో/పిల్లో   thank you  చెప్పడం, ఏ కారణంతోనైనా, మర్చిపోయారా, ఇంక ఆ తల్లితండ్రులు వారికి ఓ క్లాసు తీసికుంటారు. ఎందుకొచ్చిన గొడవా అని, అయినదానికీ, కానిదానికీ కూడా,  ఆ పిల్లలు, తమ తల్లితండ్రులు నేర్పిన నాలుగు “మంత్రాలూ” ఎడా పెడా వాడేస్తూంటారు.

ప్రతీదానికీ ఏవో రూల్స్. ఆ పిల్లకో, పిల్లాడికో నచ్చిన దాన్ని తిననివ్వరు. తాగాలనున్నదాన్ని తాగనీయరు, చూడాలనున్నదాన్ని చూడనీయరు. ఇదంతా “క్రమ శిక్షణా అభియాన్ “ లోని భాగమే. బయటి వారు ఎప్పుడైనా, వారింటికి వచ్చినప్పుడు, ఆ వచ్చిన వారి పిల్లలకి ఏదైనా ఆటవస్తువు కావాలంటే, ఒద్దనకుండా ఇచ్చేయాలి. అలాగే, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, అది కావాలీ, ఇది కావాలీ అని లేకిగా ప్రవర్తించకూడదు. అందరూ అనుకోవాలన్నమాట—“ అబ్బ వాళ్ళ పిల్లాడు ఎంత disciplined గా ఉంటాడో కదా “ అని.  బయటివారందరూ, తమనీ, తమ పిల్లల్నీ role models గా ఎలా చూస్తున్నారో అని తమకు తామే భుజాలు తట్టుకోవడం.

ఇవన్నీ, వినడానికీ, చూడ్డానికీ భేషుగ్గానే ఉంటాయి, కానీ ఎంతకాలం, ఆ పిల్లలు మాత్రం ఉగ్గపెట్టుకునుంటారూ అనేదే అసలు ప్రశ్న. ఏదైనా సరే, వద్దన్నది చేయడం, ప్రతీవారికీ అలవాటు, దానికి వయసుతో సంబంధంలేదు. ఫలానాది అంతర్జాలంలో చూడొద్దురా, అంటే, దానికోసమే వెదుకుతాడు. ఇంట్లో సిస్టానికి password  పెడితే, ఇంకో ఫ్రెండు ఇంటికెళ్ళి చూస్తాడు. ఇవన్నీ ఓ వయసొచ్చిన పిల్లలతో వచ్చే కష్టాలు. ఇంక అటూ ఇటూ కాని వయసుపిల్లలతో ఇంకోరకం కష్టాలు—ఇంట్లో ఏది పడితే అది తినడానికి ఆంక్షలు  ఉండే పిల్లలతో  చాలామందికి అనుభవంలోకి వచ్చే ఉంటాయి. ఎవరింటికైనా పిల్లలతో వెళ్ళినప్పుడు, చూస్తూంటాం, ఆ ఇంటివారు, ఓ ప్లేటు నిండా, ఏవో పళ్ళముక్కలూ, బిస్కెట్లూ, ఇంకో తినుబండారాలూ పెడుతూంటారు. అవేవో ఇరానీ హొటళ్ళల్లో, రకరకాల కేక్కులు పెట్టేవారు , ఇదివరకటి రోజుల్లో, మొదట్లో అనుకునేవాడిని, అన్నీ తినేశాయాలేమో అని. ఓసారి అనుభవం అయిన తరువాత తెలిసింది, ఎన్ని తింటే అన్నింటికి బిల్లేస్తారని ! తినగా మిగిలినవి, ఇంకోడి ప్లేటులో పెడతారు, అది వేరే విషయం. ప్రస్తుతానికొస్తే, ఈ వెళ్ళినవారు, తమ పిల్లాడి గురించి ముందుగానే చెప్తారు—“ మా వాడికి ఇలాటివి అలవాటు లేవండీ.. అసలు ముట్టుకోడండీ..” – అని వీరి అభిప్రాయం. కానీ ఆ పిల్లాడికేమో ఆ ప్లేటులో పెట్టినవన్నీ కూడా చాలా ఇష్టమైన కారణాన,  కావాల్సినవేవో లాగించేస్తాడు. ఇప్పుడు “ వీధిన పడింది “ ఎవరూ ? పైగా ఎన్నో రోజులనుండి తిండి మొహమే చూడనట్టు “ఆబ” గా తినేస్తాడు. ఆ తల్లితండ్రులకి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు..

అలాగే తమ పిల్లలు ఎంతో బుధ్ధిమంతులూ అనుకుని, ఫరవాలేదూ, చిన్నవాడే కదా అని, వాడెదురుగానే మాట్టాడేసుకుంటూంటారు. ఏ శలవురోజో, ఏ సినిమాకో, పార్కుకో బయలుదేరుతారు.. సరీగ్గా అప్పుడే,  ఎప్పటినుండో తమ ఇంటికి రాని స్నేహితుడెవరో, వీళ్ళింటికి రావడానికి ముహూర్తం పెట్టుకుంటాడు..మామూలు కబుర్లు అవగానే  “ అరే సరీగ్గా ఇవాళే మీ ఇంటికనే బయలుదేరామురా, అదేవిటో నువ్వూ ఇవాళే వచ్చావూ..” అని ఏదో మొహమ్మాటానికి, తనుకూడా ఈ పునస్సంగామానికోసమే ఎదురుచూస్తున్నంత build up  ఇచ్చేస్తాడు. కానీ, అక్కడే ఉన్న వారి పిల్లాడికి, మింగుడుపడదు. అసలే వీళ్ళెవరో వచ్చి, మన ప్రోగ్రాం మీద,, నీళ్ళుపోశారూ అనే “కచ్చ” తో ఉంటాడు. ఇంతకంటే  మంచి ఛాన్సుండదూ అనుకుని, “ అదేమిటి డాడీ.. మనం సినిమా/పార్క్/సర్కస్ కి గదా బయలుదేరామూ, ఈ అంకుల్ తో అలా చెప్తున్నావేమిటీ..” అని వీధిన పెట్టేస్తాడు. ఇంక తను చెప్పినదాన్ని సమర్ధించుకోడానికి ఆ డాడీ నానా తిప్పలూ పడతాడు... “ అవుననుకో.. కానీ తిరిగొచ్చేటప్పుడు, వీళ్ళింటికి వెళ్దామనుకున్నామురా..” . అది పచ్చి అబధ్ధమని ఇతనికీ, అవతలి వాడికీ కూడా తెలుసును.. అయినా “తేలు కుట్టిన దొంగ” లాగ  ఇద్దరూ నోరుమూసుక్కూర్చుంటారు.  దీనంతటికీ మూలం ఎక్కడా, చిన్న పిల్లాడెదురుగా అబధ్ధం చెప్పడానికి చేసిన వ్యర్ధ ప్రయత్నం.

చెప్పొచ్చేదేమిటంటే పిల్లలకి ఏదో నాలుగు ఇంగ్లీషు పదజాలాలు నేర్పగానే క్రమశిక్షణ అనిపించుకోదు. మిగిలిన విషయాలు కూడా చాలా ఉన్నాయని గుర్తిస్తే చాలు.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి