అమరావతి (పర్యాటకం) - లాస్య రామకృష్ణ

Paryatakam - Amaravathi by Lasya Ramakrishna
ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరు జిల్లాలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న చిన్న పట్టణం అమరావతి.  ఈ ప్రాంతాన్నిఇదివరకు ధరణికోట లేదా ధాన్య కటకం గా పిలిచేవారు. గుంటూరు నుండి 16 కిలోమీటర్ల దూరం లో ఉంది. స్వయంభు లింగం కలిగిన అమరేశ్వర స్వామి ఆలయం పేరు వల్ల అమరావతి గా ప్రసిద్ది చెందింది. స్కంద పురాణం లో ఈ ప్రాంతం గురించి ప్రస్తావించబడినది. ఈ ప్రాంతం శాతవాహన రాజులకు క్రీ.పూ. 1 నుండి 3 వ శతాబ్దం వరకు రాజధానిగా వ్యవహరించింది.   వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యంగా ఈ ప్రాంతం నిలుస్తుంది. ఈ ప్రాంతం లో అమరేశ్వర ఆలయం పంచరామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఉన్న కృష్ణా నది ఈ ప్రాంతానికి మరింత పవిత్రత చేకూర్చింది.

అమరావతి, బౌద్ధుల మరియు హిందువుల ఆధ్యాత్మిక కట్టడాలకు ప్రాముఖ్యత చెందినది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన బౌద్ధుల పుణ్యక్షేత్రం ఇది. క్రీ.పూ. 2 వ శతాబ్దం లో నిర్మించబడిన మహాచైత్య స్తూపాన్ని అమరావతి లో గమనించవచ్చు. బుద్దుని యొక్క ప్రవచనాలు ఈ స్థూపంపై ప్రదర్శింపబడతాయి. ప్రాచీన స్మారక చిహ్నాలు, టెర్రకోట ప్రాచీనతలు ఇంకా బుద్దుని యొక్క జీవితానికి సంబంధించిన చిత్రకళ వర్ణనలు కలిగిన మ్యూజియంని ఇక్కడ గమనించవచ్చు.

ఈ ప్రాంతంలో తవ్వకాలలో అనేకమైన ద్రవిడియన్ శైలి శిల్పాలు బయటపడ్డాయి. కొన్ని రోమన్ నాణాలు కూడా బయటపడ్డాయి.

అమరేశ్వర టెంపుల్
మహాశివుడికి అంకితమివ్వబడిన ఆలయం అమరేశ్వర టెంపుల్. ఇక్కడ 15 అడుగుల ఎత్తున్న పాలరాతి శివలింగం ఉంది. ప్రాణేశ్వర, అగస్తేశ్వర, కోసలేస్వర, సోమేశ్వర ఇంకా పార్థివేశ్వరలనబడే అయిదు లింగాల రూపం లో మహాశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడని నమ్ముతారు. ద్రవిడియన్ నిర్మాణ శైలిలో నిర్మించబడిన అమరావతి ఆలయానికి సంబంధించి ఎన్నో గాధలు ఉన్నాయి. ఈ ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి.

పరమేశ్వరుని ఆదేశానుసారం తారకుని కంఠాన ఉన్న అమృత లింగం ను కుమారస్వామి కొట్టగా అది  అయిదు ముక్కలయింది. ఆ ముక్కలన్నీ ఆశ్వీయుజ శుద్ధ దశమి అంటే విజయదశమి నాడు కింద పడ్డాయి. ఆ రోజున శకలాలు పడిన ప్రతి చోటా దేవతలు చేరుకొని ఒక్కో ముక్కను ఒక చోట ప్రతిష్టించారు. అలా ఒక ముక్కను అమరావతిలో దేవేంద్రుడు ప్రతిష్ట చేసినందున ఈ లింగానికి అమరేశ్వర స్వామి గా పేరువచ్చింది.

ఈ ఆలయ ప్రాంత పునాది లో కనబడిన కొన్ని బౌద్ధుల శాసనాల వల్ల ఈ ప్రాంతం ఇదివరకు బౌద్ధుల ఆలయం అయి ఉండవచ్చని అంటారు.బౌద్ధమతం ప్రభావం తగ్గుతున్నప్పుడు ఈ ఆలయ నిర్మాణం జరిగిందని అంటారు.

ఈ ఆలయానికి సంబంధించిన మరొక ఆసక్తికరమైన అంశం, ఇక్కడ నుండే కృష్ణానది వేరొక మార్గం పడుతుంది. 'మహా శివరాత్రి'ని ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆలయానికి ప్రతి రోజు అనేక మంది భక్తులు తరలి వస్తారు.

ఇక్కడి శ్రీ బాల చాముండేశ్వరి సమేత అమరేశ్వర స్వామి ఆలయం మూడు ప్రాకారాలతో నాలుగు ధ్వజస్తంభాలు కలిగి ఉంది.   శ్రీబాల చాముండేశ్వరి పీఠం అష్టాదశ శక్తి పీఠములలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ప్రాంగణములో దేవతా విగ్రహాలతో పాటు శంకరాచార్యులు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, దత్తాత్రేయుడు, రుద్రపాదములు, జ్వాలా ముఖీదేవి కౌశలేస్వరుడులు కూడా కొలువై ఉన్నారు.

అమరావతి స్తూపం
బౌద్ధ కళలకు  మరియు ప్రాచీన భారత నిర్మాణ శైలి కి నిదర్శనం ఈ అమరావతి స్తూపం. ఆంధ్రప్రదేశ్ లో ని అమరావతిలో విజయవాడ నగరం నుండి 65  కిలోమీటర్ల దూరంలో ఈ స్తూపం ఉంది. వందలాది మంది పర్యాటకులు అలాగే భక్తులు ఈ స్థూపాన్ని సందర్శించడానికి వస్తారు. అందుచేత ఈ ప్రాంతం ప్రముఖమైన పర్యాటక ఆకర్షణ గా మారింది. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ అమరావతి స్తూపం వైభవోపేతమైన బౌద్ధ నిర్మాణ శైలికి నిదర్శనం.

దాదాపు 2000 సంవత్సరాల క్రితానికి చెందిన ఈ స్తూపం సంచి స్తూపం అంత పొడుగు కలిగి ఉంటుంది. మహాస్తూపంగా కూడా ప్రసిద్ది చెందింది. అమరావతి స్తూపం పైన బుద్దుని యొక్క శిలలు గమనించవచ్చు. బుద్దుని జీవితాన్ని వివరించే అనేకమైన చెక్కడాలు ఇంకా శిల్పాలు ఈ స్తూపం పై ఉన్నాయి.

అమరావతికి విజయవాడ నుండి చాలా సులభంగా చేరుకోవచ్చు.  ఆంధ్రప్రదేశ్ లో ని మిగతా ప్రాంతాల నుండి కూడా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం విజయవాడలో ఉండగా సమీప రైల్వే స్టేషన్ గుంటూరులో ఉంది. చక్కగా అభివృద్ధి చెయ్యబడిన రోడ్డు మార్గం ద్వారా అమరావతి నగరం దేశం లో ని వివిధ ప్రాంతాలకు చక్కగా అనుసంధానమై ఉంది. 

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao