సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

saahiteevanam
ఆముక్తమాల్యద
(గత సంచిక తరువాయి)

శ్రీమందిర భుజమధ్యమ!
గోమండలకర్షి వేణుగుంఫన! దృప్య
ద్భౌమాహృతసురజనయి
త్రీ మణితాటంక! వృషగిరిస్థ! ఖగాంకా!

'శ్రీ'కి, అంటే లక్ష్మీదేవికి మందిరమైన భుజమధ్యము, అంటే రెండుభుజములమధ్య నున్న వక్షస్థలము కలిగినవాడా, లక్ష్మీదేవిని హృదయములో నిలుపుకున్నవాడా! గోమండలాన్ని అంటే గోవుల మందలను ఆకర్షించే వేణు నాదమును పలికించేవాడా! దేవమాత ఐన దితి కుండలాలను లాక్కొని దర్పించేవాడు,భూదేవి పుత్రుడు ఐన నరకాసురుడినుండి తిరిగి స్వాధీనం చేసుకున్న దితి కుండలములను కలిగినవాడా! వృషభాచలవాసా! గరుడుడిని ధ్వజచిహ్నంగా కలిగినవాడా, శ్రీవేంకటాచలపతీ! వినుమయ్యా! అని ఆముక్తమాల్యదలోని నాలుగవ ఆశ్వాసాన్ని ప్రారంభించాడు శ్రీకృష్ణదేవరాయలు. నూతన ప్రయోగాలకు రాయలు పెట్టింది పేరు అనడానికి ' శ్రీమందిర భుజమధ్యమ' అనే ప్రయోగం చక్కని దృష్టాంతం, ఆధునిక కవిత్వ ధోరణిలా ఉంటుంది ఒకోసారి రాయల దృష్టి, రాయలు తప్ప ఇలా ఆలోచించిన వాళ్ళు, ఇలా విశృంఖలంగా నిర్మొహమాటంగా కొత్త కొత్త ప్రయోగాలు చేసినవాళ్ళు బహుతక్కువ, ప్రబంధకవులలో కానీ, ఇతర పద్యకవుల్లో కానీ అంటే అతిశయోక్తి కాదు.

'గోమండల కర్షి' అనడంలో కూడా శ్లేష ఉన్నది, గోమండలం అంటే గోవుల మంద అని మాత్రమే కాక, 'గోలోక బృందావనం' అని సూచన. గోలోక బృందావనం అనేది వేరొకటి ఉన్నది, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల లోకములకన్నా ఆవల, ఎత్తున ఉన్న లోకం, ఆ లోక పాలకుడే త్రిమూర్తులను, ,మిగిలిన సకల లోకాలను పాలించే ప్రభువు, మిగిలిన దేవీ దేవతలందరూ ఆయనచేత సృష్టింపబడి, శాసింపబడే వారే అని భారతీయ ఆధ్యాత్మికశాస్త్ర సంప్రదాయం.

ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుడు ఈ గోలోక బృందావన శ్రీకృష్ణుడు ఒకరు కారు, ఈయన కూడా ఆయన అవతారమే. ఆ గోలోక బృందావన శ్రీకృష్ణుడు నాలుగు వ్యూహాలతో సృష్టిని పాలిస్తాడు అని వైష్ణవసంప్రదాయం.'సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ' వ్యూహాలు అనేవి ఆ నాలుగు వ్యూహాలు,అందులో సంకర్షణ అంటే ఆకర్షణ అనే అర్ధము. సంకర్షణుడు అంటే బలరాముడు. దేవకీదేవి గర్భములో ఉన్నఏడవసంతానం మగశిశువు.ఆ శిశువును యోగమాయ సంకర్షించి అంటే ఆకర్షించి తెచ్చి నందుడి పెద్దభార్య ఐన రోహిణి గర్భంలో ప్రవేశపెట్టి, తను వెళ్లి దేవకీదేవి పొత్తిళ్ళలో పడుకుంది. మరునాడు దేవకీదేవి పొత్తిళ్ళలో ఉన్న ఆమెనుకూడా చంపడానికి కంసుడు నేలకేసి కొడితేనే ఆకాశానికి ఎగిరింది, అలా సంకర్షణ పదానికి బలరాముడిని, అంటే పరమాత్ముడిని సూచించడం కోసం 'గోమండల కర్షి' అనే ఈ  రెండు పదాలను ఒకేచోట వేసి గోలోకబృందావన శ్రీకృష్ణ పరమాత్మను సూచిస్తూ, ఆయనే ఈ కలియుగ వేంకటాచలపతి అని చెప్తున్నాడు రాయలు. యిది రాయల ఆధ్యాత్మిక పరిజ్ఞానానికి సూచన. మొదలెట్టిన కథను ప్రారంభానికి అనుకూలంగానే నడిపించడం అనే నిర్మాణ  చాతుర్యానికి ఉదాహరణ, ఎందుకంటే ప్రారంభంలోనే '..ఒక్కొక సంకేతముగాక అతడరసన్ నే గానే?' అని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అన్నాడు, ఒక్కొక అవతారం ఒక్కొక సంకేతమే గానీ, నిజానికి అన్ని అవతారాలూ నావే, నేనే అన్నీ, అందరిలోనూ నేనే అన్న సంగతి ఇక్కడ మరలా ధ్వనిస్తున్నాడు, అదీ రాయలచమత్కృతి. ఇక నరకాసురుడు దేవతలను ఓడించి, వారిని అవమానించడానికి వారి తల్లి ఐన  దితిచెవికున్న కుండలాలను లాక్కోడం, శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి, ఆ కుండలాలను తీసుకుని, మరలా దేవమాతకు  అప్పగించడం కూడా పురాణగాథయే. ఇంతటి బహుముఖప్రజ్ఞ రాయలది!

ఎప్పుడైతే విష్ణుచిత్తుడు శ్రీమహావిష్ణువుకు సముడు గానీ ఆయనకన్నా అధికుడు గానీ లేరు అని వేదములనుండి, స్మ్రుతులనుండి ఉపమానాలతో పలికాడో, అప్పుడు

బలిమిం ద్రెంపఁగఁ  బోలెఁ  బాయపడుచుం బర్యాయ భంగంబునన్ 
గలనూలెల్లను నంచు మోపఁ దెగి రాగాఁ గొంతసేపుండి  తాఁ 
బెలుచ న్గంటు పుటుక్కునం దునిసి వే ప్రుధ్విం బడె న్జాలె మి
న్నుల మ్రోసెన్సుర దున్దుభుల్గురిసెఁ బెన్సోనై విరుల్బోరనన్

బలవంతముగా ఎవరో తెంపడానికి ప్రయత్నించినట్లుగా పాయలు పాయలుగా క్రమంగా విడిపోతూ,దారాలు అన్నీ చివరిదాకా తెగిరాగా, అలా కొంతసేపు వ్రేలాడుతూ, గట్టిగా ముడేసిన తాడు తెగి, నేలమీదపడిపోయింది,బంగారు నాణాలు ఉంచి వ్రేలాడ దీసిన జాలె, సంచీ. సుర దుందుభులు మ్రోగాయి, పూల వర్షం కురిసింది ఆకాశం నుండి. దాటేసి పోవడం రాయలు అసలు చేయడు. గట్టిగా ముడి వేసి వ్రేలాడ దీసిన సంచీ ఒక్కొక్క పురి క్రమక్రమంగా తెగుతూ, చివరి దారం కూడా తెగి, త్రాడు పూర్తిగా విడిపోయిన తర్వాత ఒక్కసారిగా సంచీ నేల మీద పడి పోయింది అని చెప్పడం అందు కోసమే కాక, కనుల ముందు దృశ్యాన్నికట్టినట్లు చూపించడం!

వేద వేద్యమైన విష్ణుతత్త్వంబిట్లు
వాదు గెలిచి తెలిపి వసుమతీశు  
భక్తి నోలలార్చి  భగవత్ప్రపన్నుఁగాఁ 
జేసి లోకహితము సేయుటయును

వేదములలో చెప్పబడిన విష్ణుతత్త్వమును ఇలా తేటతెల్లముగా బోధించి, నిరూపించి వాదమును గెలిచి, రాజునూ భక్తి ప్రపన్నునిగా చేసి లోక హితం చేయగా ఆకాశంలో గుమికూడిన దేవతలు 'నిజం నిజం' అన్నారు,పితృదేవతలు 'అహో!అద్భుతం!' అన్నారు, సిద్ధులు ' ఆహా ' అన్నారు, ' కలియుగం కృతయుగం ఐపోయింది,ఎంత వింత!' అని విద్యాధరులు అన్నారు, 'దుర్జనుల బింకం అణిగిపోయింది' అని కిన్నరులు పలికారు, ఇలా దేవజాతివారందరూ మెచ్చుకున్నారు, ఓడిపోయిన పండితులు నొచ్చుకున్నారు.ఓడిపోయి, భంగపడిన ఇతర పండితులు అసూయతో, అవమానంతో, యిక అక్కడ ఉండలేక చెప్పులెక్కడ? అంటూ తమ చెప్పులను వెదికే మిషతో కొందరు బయట పడ్డారు సభనుండి. తాము వచ్చిన పల్లకీలను గమనించకుండా 'పల్లకీలెక్కడ' అని పెద్దగా బోయీలను పిలిచారు కొందరు, నగరం దాటి కొంతదూరం వెళ్లి ఒకరినొకరు కలుసుకొనడం కోసం ఆగిపోయారు మరికొందరు. తమకు ఎదురైన పరిచితులను తమ ఇళ్ళు, వాకిళ్ళ సమాచారం అడిగిన కొందరు, ఎదుటివాళ్ళు ఇచ్చే జవాబులను అన్యమనస్కంగానే వింటూ ధ్యాసఅంతా సభలో జరిగిన వాదం మీదనే పెట్టారు. వాదం ఏమైంది అని అడిగిన ప్రశ్నలకు, ఏమౌతుంది? రాజు పక్షపాతం చేశాడు, ఆ విష్ణు చిత్తుడు రాజు దయ వలన గెలిచాడు అని తమ అసూయను వెళ్లగక్కారు కొందరు.     విష్ణు చిత్తుల వారిని ఘనంగా సత్కరించి, ఈ మహానుభావుని ఏనుగు మీద ఊరేగించి ఇంటికి చేర్చండి అని రాజులను, రాజ కుమారులను తోడిచ్చి పంపాడు మత్స్యధ్వజుడు. వారు ఏనుగు అంబారీ మీద ఘనంగా పుర వీధులలో ఊరేగించి తీసుకెళ్తుండగా

ఇంగిలికంబునం దడిపి యెత్తు కసీసపు రెంటెమో యన
న్నింగి గరుత్పరంపరల నిగ్గున లేఁదొగ రెక్కె నంత వీ
చెం గలశాబ్ధిమీఁగడల జిడ్డెఱిఁగించెడు కమ్మగాడ్పు నిం
డెం గడు మ్రోత పెన్దిరువడిం గని రా ఖగరాజు మూపునన్

ఇంగిలీకపురంగులో, ముదురు ఎరుపురంగుద్రవంలో ముంచి తీసిన నీలిరంగు వస్త్రమో అన్నట్లు ఆకాశం ఎరుపు,నీలము కలిసిన వంగపండు రంగులోకి మారిపోగా, గరుత్మంతుని రెక్కల తాకిడికి అప్పటిదాకా ఆయన పాలసముద్రంలో ఉన్న కారణంచేత పాలమీగడ జిడ్డు గాలి సోకుతుండగా, అంతలోనే పెద్ద మ్రోతతో 'పెరియ తిరువడి' (పెన్దిరువడి)( పెరియ= పెద్ద, ఉత్తమమైన; తిరు= పవిత్రమైన; అడి= పదములు గల) గరుత్మంతుడు కనిపించాడు ఆకాశంలో, తర్వాత ఆయన మూపుమీద శ్రీమహావిష్ణువు కనిపించాడు. కాంతి ధ్వనికన్న వేగమైనది, కనుక ముందు గరుడుని రెక్కల ఎర్రరంగుతో కలిసి వంగపండు రంగులోకి మారిన ఆకాశం కనిపించింది, ఆ తర్వాత ఆ రెక్కల గాలి సోకింది, ఆ తర్వాత రెక్కల చప్పుడు వినిపించింది, అప్పుడు క్రింద వీధులలో ఊరేగుతున్న విష్ణుచిత్తులవారికి గరుడుడు కనిపించాడు, ఆయన వీపుమీది శ్రీమహావిష్ణువు కనిపించాడు ఆకాశవీధిలో.రాయల ఊహాశక్తికి, పరిశీలనాశక్తికి, వర్ణనావైదుష్యానికి అద్భుతమైన ఉదాహరణ ఈ పద్యం.

చిగురుఁ బొట్లపుదోయి జెందమ్ములనఁ దార్క్ష్యు / హస్తోదరముల దివ్యాంఘ్రులమర
నునుఁ గప్పుమేనఁ దోఁచిన తదర్వఛ్ఛాయ / లీలఁ దాల్చుపసిండి చేల మెరయ 
వ్రాలిన యోగివర్గమునిర్మలాంతఃక / రణములువోలె హారములు తనర 
సిరికిఁ బుట్టింటి నెచ్చెలు లౌఁట మనవికి / డాసెనా మకరకుండలము లమర

శ్రిత సిత మరాళ వాత్యాభిహత పరాగ 
వలయమండిత కల్పశాఖలొ యనంగ 
శంఖచక్రాంచితోరు హస్తములు దనరఁ 
దోఁచెఁ గమలేక్షణుండు చతుర్భుజుండు

చివురుటాకు పొట్లాలలో ఉన్న ఎర్రతామరలా అన్నట్లు గరుత్మంతుని అరచేతులలో ఎర్రని పాదములనుంచి, (ఫుట్ బోర్డు మీద కాళ్ళు పెట్టినట్లు!) నీలిమేఘమువంటి శరీరానికి ధరించిన వస్త్రము మీద తను కూర్చున్న గరుడుని పసిడి రంగు ప్రతిఫలించిందా అన్నట్టున్న పట్ట్టువస్త్రాలను ధరించి, భక్త్ఘితో వ్రాలిన యోగిగణముల అంతఃకరణములు అన్నట్లు ప్రకాశిస్తున్న, స్వచ్చమైన హారములు కలిగి, (మొసళ్ళు నీటిలో పుట్టినవే, శ్రీలక్ష్మి నీటిలోనే పుట్టింది, కనుక ) శ్రీలక్ష్మికి పుట్టింటి వైపునుండి స్నేహితురాళ్ళు కావొచ్చు అన్నట్లు ఏదో మనవి చేయడానికి చెవిదగ్గరికి వచ్చాయేమో అన్నట్లున్న మకరకుండలములను ధరించినవాడు, కల్పవృక్షము యొక్క శాఖలో అన్నట్లు విశాలముగానున్న, భక్తులను రక్షించడానికి సమర్ధములైన బాహువులకున్న తెల్లని హంసవంటి శంఖమును, గాలికి ఎగురుతున్న పుప్పొడిని కలిగిన ఎర్రనిపూవేమో అన్నట్లు గిర్రున తిరుగుతూ మెరుపులు ఎగిసిపడుతున్న చక్రమును కలిగినవాడు, తామరపూవులవంటి విశాలమైన, అందమైన కనులు కలిగినవాడు, చతుర్భుజుడు ఐన శ్రీ మహావిష్ణువు కనిపించాడు, విష్ణుచిత్తులవారి కళ్ళకు.
(కొనసాగింపు వచ్చే వారం)
వనం వేంకట వరప్రసాదరావు*** 

   

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి