సుశాస్త్రీయం : రేఖాచిత్రాల కాపు--బాపు - టీవీయస్. శాస్త్రి

Rekha Chitrala Kaapu - Bapu

అందమయిన అమ్మాయిని బాపు బొమ్మ లాగుందనటం తెలుగువారికి అలవాటైన మాట. అది నిజం కూడా! రేఖాచిత్రాలు ఆయన ప్రత్యేకత. బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులు, పుస్తకాల ముఖచిత్రాలు లెక్క పెట్టడం కష్టం. 'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ది గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హృద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైంది  ఒకటుంది.
 

కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!  

 

ఇలా కూనలమ్మ పదం రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు.బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలు, ప్రచురణ  సంస్థలు  వాడుతుంటాయి. బాపును గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వ్యంగ్యచిత్రాలకు(కార్టూన్స్)కు ఒక కొత్త రూపునిచ్చి, కథలకు, భావానికి తగిన బొమ్మలు వేసి , కథకుడికీ పేరు తెచ్చిన ఘనుడు బాపు. సహజమైన వాతావరణంలో, అతి సహజమైన కథలను తీసుకొని, వాటిని తెరపైకి అద్భుతంగా ఎక్కించిన బాపూని చూస్తే ఎవరికైనా బాపురే!  అనాలనిపిస్తుంది. తెలుగు సినిమా స్థాయిని, ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కమనీయ దృశ్య కావ్య దర్శకుడు శ్రీ బాపు.

సత్తిరాజు లక్ష్మీనారాయణ అంటే ఎవరికీ తెలియదు. బాపు అంటేనే అందరికీ తెలిసేది. బాపు గారి అసలు పేరు శ్రీ సత్తిరాజు లక్ష్మీనారాయణ. వీరు 15 -12 -1933 న, పశ్చిమ గోదావరీ జిల్లాలోని, నరసాపురంలో ధనవంతుల కుటుంబంలో, వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు.1955 లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో పట్టభద్రులు అయ్యారు.1955 లోనే వీరు ఆంధ్రపత్రికలో శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారితో కలసి పనిచేసారు. అంతకు ముందునుంచే వీరికి స్నేహం ఉంది. వారు ఏకోదరులు కాకపోయినా, 'జోకో'దరులు! బాపు గారు 1960 వరకు వ్యాపార ప్రకటన రంగంలోనే ఉన్నారు. కామాక్షులు అంటే, 'కామా'లాంటి కళ్ళు గల అమ్మాయిలను అతి సుందరంగా సృష్టించిన చిత్ర బ్రహ్మఈయన. దేవుడు,దేవతల బొమ్మలు వేస్తే వాటిలో జీవకళ ఉట్టిపడటమే కాకుండా భక్తిభావం కూడా కలుగుతుంది. రవివర్మ బొమ్మలను మరిపించాడు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు.

1959 లో శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆంద్రపత్రికలో 'సాక్షి'కథను వ్రాసారు. ఆ కథకు బాపు గారు బొమ్మలు వేసారు.అదే కథను తీసుకొని మొదటిసారిగా దర్శకుడిగా సినీరంగంలో అడుగు పెట్టారు. అతి తక్కువ ఖర్చుతో, స్టూడియోలకు వెలుపుల, సహజమైన వాతావారణంలో అతి సహజంగా చిత్రీకరించిన గొప్ప చిత్రం అది. ఒక స్థాయి ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఆ సినిమా 1968 లోతాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడ్డది. నాకు ఇంకా గుర్తు, ఆ సినిమాకు  పబ్లిసిటీ కూడా విభిన్నంగా ఇచ్చారు. 'ఇది తెలుగు సినీ జగత్తులో సాక్షి నామ సంవత్సరం' అని! అది అక్షరాలా నిజం. లవకుశ సినిమాను కొద్ది మార్పులతో మరియు ఒక ఆంగ్ల చిత్రమైన 'An Unseen Ghost' ను ఆధారంగా చేసుకొని, పూర్తి తెలుగుతనం ఉట్టిపడేటట్లు తీసిన సినిమా 'ముత్యాలముగ్గు'. ఆ సాంఘీక చిత్రంలో హనుమంతుని పాత్రను చొప్పించి మరీ రసవత్తరం చేసారు! ఆ సినిమా నుండే శ్రీ రావు గోపాలరావు, శ్రీ నూతన్ ప్రసాద్ ల  ప్ర(తి)భ మొదలైంది. ఇషాన్ ఆర్యా కెమెరా పనితనం, ఆఖరి ఘట్టంలో అల్లు రామలింగయ్య గారి అద్భుత నటన, కొద్దిసేపు కనిపించినా చిరకాలం గుర్తుండేటట్లు నటించిన శ్రీ మాడా. ఇలా చెప్పుకుంటూపోతే ఆసినిమా సమీక్షే  ఒక గొప్ప వ్యాసం అవుతుంది.

పండిత, పామరుల ప్రశంసలు పొంది ఆర్ధికంగా కూడా విజయవంతమైన చిత్రమది. ఆ ప్రేరణతోనే పౌరాణిక కథలను నేపధ్యంగా తీసుకొని మరికొన్ని సినిమాలను తీసారు. వాటిల్లో ముఖ్యమైనది,'మనవూరి పాండవులు'. ఈ సినిమాలోనే  చిరంజీవికి ఒక ప్రధానమైన పాత్ర లభించి, ఆయనకొక గుర్తింపు తెచ్చిపెట్టింది. 'రాజాధిరాజు' సినిమాలో ఒక 'నూతన' ప్రసాద్  ను చూపించారు. పెళ్లిపుస్తకంలో, దివ్యవాణిని ఎంతో చక్కగా చూపించారు. మిస్టర్.పెళ్ళాం చిత్రం ద్వారా AVS ను పరిచయం చేయటమే కాకుండా, చిత్రసీమలో ఆయనకొక ప్రత్యేకమైన స్థానం పొందటానికి  తోడ్పాటు చేసారు. ఆయన లోని creativity వల్ల చాలా పాత్రలు సజీవంగా నిలిచిపోయాయి. బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం, సీతాకళ్యాణం, శ్రీ రామాంజనేయ యుద్ధం, శ్రీనాధ కవిసార్వభౌమ లాంటి పెక్కు కళా ఖండాలకు దర్శకత్వం వహించిన విభిన్న దర్శకుడు ఈయన.80 ఏండ్ల వయసులో ఈ మధ్యనే ఆయన దర్శకత్వం వహించిన 'శ్రీ రామ రాజ్యం' ఒక కమనీయ భోజ్యం. ఈ మధ్యనే 'పద్మశ్రీ' కి బాపు సత్కారం లభించింది.

ఈ సినీమాలన్నీఒక ఎత్తు, సీతాకళ్యాణం ఒక్కటి ఒక ఎత్తు. ఎందుకంటే, సినిమా అనేది ఒక దృశ్య కావ్యం (Visual Media). నా ఉద్దేశ్యంలో అతి తక్కువ మాటలతో తీసిన సినిమాలే గొప్ప సినిమాలు. సీతాకల్యాణం రచన మొత్తం పది పుటలు ఉంటుందేమో! దర్శకుడి ప్రతిభ, నటీనటుల చక్కని హావభావాలు చాలు కథ, సన్నివేశాన్ని ప్రేక్షకుడు అర్ధం చేసుకోవటానికి. అసలు మాటలు లేకుండా తీసిన 'పుష్పక విమానం' ఎంత  విజయవంతం కాలేదూ? కొన్ని దృశ్యాలను మనం తెరపై చూడటం సాధ్యమా అనిపిస్తుంది. అటువంటి సన్నివేశం అయిన 'గంగావతరణం' ను అత్యత్భుతంగా రవికాంత్ లాంటి ఛాయాగ్రాహకుడి  సహాయంతో  ఎంతో కమనీయంగా తీసాడు మన బాపు.ఈ సినిమాని లండన్ లోని ఫిలిం విద్యాసంస్థలలోఒక బోధనా అంశంగా ఉంచారు. బాపు  ప్రతిభకు ఇంతకన్నా తార్కాణం ఏమి కావాలి? ఈ మధ్యనే ఆయన మిత్రుడు, హితుడు, బంధువు అయిన శ్రీ ముళ్ళపూడి వారిని పోగొట్టుకొని, వెన్నెలకోసం పరితపిస్తున్న చకోరంలా ఉన్నారు. ఆయన సినిమాలు కొన్ని పరాజయం పాలు కావటంపై, ఆయనే హాస్యంగా ఇలా అన్నారు -- మేము చాలావరకు కామెడీ సినిమాలనే తీసాం, తీసిన తరువాత అవి ట్రాజెడీలు అయ్యాయి.

బాపుని  గురించి కొందరి ప్రముఖుల అభిప్రాయాలు--
బాపు అందమైన మనుష్యులనే - ముఖ్యంగా స్త్రీలను - వేస్తాడేమో అనుకుని కొన్నాళ్ళు నేను కూడా అపోహపడ్డాను.కానీ, బాపు సృష్టించే అందం అతని బొమ్మల్లో ఉంది - మనుష్యుల్లో కాదు- కొడవటిగంటి కుటుంబరావు


బాపూ నీ బొమ్మలు-తల
లూపు గులాబి  కొమ్మలు
బాపూ నీ రేఖలు - ముని
మాపు శకుంతల లేఖలు
బాపూ నీ లేఖిని - దరి
దాపు సుధారస వాహిని
బాపూ నీ భావము - వగ
బాపు కళకు నవ జీవనము  - కరుణశ్రీ


భారత దేశానికి ఒక బాపు అయితే,తెలుగువారికి ఇద్దరు బాపూలు!
ఆ కళా ప్రియునికి కళాభివందనాలు!

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి