ఈ తూరుపు - ఆ పశ్చిమం - దంతులూరి కిషోర్ వర్మ

విధి చేయు వింతలన్నీ..

సాకీ గా సుప్రసిద్దుడైన హెచ్.హెచ్.మన్రో(1870-1916) ఆంగ్లసాహిత్యపు గొప్ప కథారచయితల్లో ఒకడు.  సాకీ రాసిన `ది హౌండ్స్ ఆఫ్ ఫేట్` అనే కథని ఈ రోజు చెపుతున్నాను. `విధి ఆడే చదరంగంలో మనమందరం పావులం,` అని సామెత. అటువంటి ఒక పావే ది హౌండ్స్ ఆఫ్ ఫేట్ కథలో నాయకుడు మార్టిన్ స్టోనర్. విచిత్రంగా ఈ కథను రాసిన సాకీ జీవితంలో కూడా విధి వింత నాటకం ఆడింది! తను సృష్టించిన పాత్ర లాగే మన్రో కూడా ఊహించని తుపాకీ గుండెకి బలైపోవడం విధి కాక మరేమిటి!?

`ది హౌండ్స్ ఆఫ్ ఫేట్` కథలోకి వస్తే -

కథానాయకుడు మార్టిన్ స్టోనర్ బురద నిండిన దారిలో ఎక్కడికో నడుచుకొని పోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని అయోమయం. ఆకలితో, అలసటతో మెదడు మొద్దుబారిపోతుంది. జీవితంలో అప్పటి వరకూ నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి రకరకాల పనులు చేశాడు. ఏదీ కలిసి రాలేదు. ఇంకొక ప్రయత్నం చెయ్యడానికి కూడా ఓపిక లేదు. నిస్పృహ నిలువెల్లా ఆవరించింది. చిన్నగా చినుకులు మొదలయ్యాయి. తల దాచుకొందామంటే ఒక్క స్నేహితుడి ఇల్లు కూడా లేదు. భోజనం పెట్టే బందువు లేడు. ఎక్కడికని పోతాడు? చొక్కా జేబులో ఉన్న చివరి అరపెన్నీని తడిమి చూసుకొన్నాడు.  తాను నడిచి పోతున్న రోడ్డు వారగా సంరక్షణ లేనట్టున్న విశాలమైన తోట, దానికి ఆ చివర ఫాంహౌస్ కనిపించాయి. వర్షపు చినుకుల ఉదృతి పెరిగింది. స్టోనర్ ఫాంహౌస్ కేసి నడవడం మొదలు పెట్టాడు. అక్కడ ఆతిద్యం దొరుకుతుందన్న నమ్మకం లేదు. కానీ జేబులో ఉన్న అరపెన్నీతో ఓ టీ కొనుక్కొని తాగుతూ కొంతసేపైనా సేదతీరే అవకాశం ఉండక పోతుందా అని ఆశపడుతున్నాడు.

స్టోనర్ తలుపు తట్టడానికి ముందే అది తెరుచుకొంది. `టాం బాబూ, మీరు ఎప్పటికైనా తిరిగి వస్తారని నాకు తెలుసు,` అంటూ ఒక ముసలి వ్యక్తి స్టోనర్‌ని సాధరంగా లోనికి ఆహ్వానించాడు. భోజనం సిద్దం చేస్తూ `మీరు వెళ్ళిన నాలుగు సంవత్సరాలలో ఆన్నీ మారిపోయాయి. మీలో మాత్రం పెద్ద మార్పేమీ లేదు,` అని చెప్పాడు. `మీ ఆంట్ తో మీరొచ్చారన్న సంగతి చెపుతాను. ఆమె మీ ముఖం చూడడానికి ఇష్టపడక పోవచ్చు, కానీ మీరు ఇక్కడ ఉండడానికి అడ్డు చెప్పరు, ఎంత కాదన్నా ఆవిడ పోయిన తరువాత ఫాం వ్యవహారాలు చూసుకోవలసిన వారసుడు మీరే కదా?` అని కూడా అంటాడు. టాం అనే ఆ ఇంటి వారసుడు నాలుగు సంవత్సరాల క్రితం ఏదో నేరం చేసి పారిపోయినట్టున్నాడు. టాం పోలికలతో ఉన్న స్టోనర్‌ని చూసి టామే తిరిగి వచ్చాడని ఆ ఇంటి వాళ్ళు పొరబడుతున్నారు.   ఆ ముసలి వ్యక్తి ఇంటిలో సేవకుడని అర్థమౌతుంది స్టోనర్‌కి.  అతని పేరు జార్జ్

టాం బెడ్‌రూంలో నాలుగు సంవత్సరాల పూర్వపు కేలెండర్ వేలాడుతుంది. అది తప్ప గోడలమీద మరే అలంకరణలూ లేవు. జార్జ్ ఫైర్‌ ప్లేస్‌లో మంట వేసి, మంచం మీద పక్క బట్టలు మార్పించి స్టోనర్‌ని విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. వేట కుక్కలా వెంట తరుముతూ స్టోనర్‌కి దురదృష్టాన్ని కలుగజేస్తున్న విధి ఈ సారి కొంత సేద తీరినట్టుంది! మరునాడు ఉదయం అల్పాహారం చేసి ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోదామను కొన్నాడు స్టోనర్.

టాం ఏ నిమిషాన్నయినా తిరిగి రావచ్చు లేదా ఉత్తరం రాయవచ్చు. ఎవరైనా బందువులు వస్తే స్టోనర్‌ని దగ్గర నుంచి గమనించి అతను టాం కాదన్న నిజాన్ని గ్రహించవచ్చు. టాం స్థానంలో ఆస్తికి వారసుడి పాత్రని పోషిస్తున్నాడు కనుక ఏవైవా పత్రాల మీద సంతకాలు చేయవలసి వచ్చినా పట్టుబడే ప్రమాదం ఉంది. అలా జరిగితే చాలా అవమానంగా ఉంటుంది. కానీ, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ బికారి జీవితమే గతి. స్టోనర్ ఉండడానికే నిశ్చయించుకొన్నాడు.  గతంలో వ్యవసాయం చేసిన అనుభవం ఉంది కనుక ఫాంలో పనిచెయ్యవచ్చు. తనకు దొరికిన ఆతిధ్యానికి ఆవిధంగా ఋణం తీర్చుకోవచ్చు అని సర్దిచెప్పుకొన్నాడు.

ఊరిలో వాళ్ళు ఎవరూ టాం చేసిన పనిని మరచి పోయినట్టు లేదు. స్టోనర్ గుర్రం మీద అలా స్వారీకి వెళ్ళినప్పుడు ఎదురుపడిన జనాలు కోపంగా అతనివైపు చూడడం, తమలో తాము తిట్టుకోవడం చూస్తే టాంని వాళ్ళు క్షమించ లేదని అర్థమౌతుంది. ఏ విషయం గురించయినా లొడలొడా మాట్లాడే జార్జ్ దగ్గరనుంచి టాం చేసిన నేరం ఏమిటో తెలుసు కోవడానికి ప్రయత్నించాడు. కానీ అతను ఆ విషయం గురించి ఏమీ చెప్పడం లేదు.

సాధ్యమైనంతవరకూ అంట్ దృష్టిలో పడకుండా ఉండేలా తనకు కేటాయించిన గదుల్లోనే స్టోనర్ మసలుతున్నాడు. ఫాంలో అప్పుడప్పుడూ పనిచేస్తున్నాడు. ఆంట్ చర్చ్‌కి వెళ్ళినరోజు ఇల్లంతా తిరిగి చూశాడు. టాంవి చిన్నప్పటి నుంచి, యువకుడిగా ఎదిగినంత వరకూ తీసిన ఎన్నో ఫోటోలు ఫ్రేములు కట్టించి గోడలకి వేలాడదీసి ఉన్నాయి. యువకుడిగా ఉన్న టాం ఫోటోలో స్టోనర్ పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

రోజులు గడిచిపోతున్నాయి. క్రిస్‌మస్ దగ్గర పడుతుంది. ఓ రోజు సాయంత్రం స్టోనర్ తోటలో నుంచొని ఊరివైపు చూస్తూ, ఇళ్ళల్లో వెలిగించుకొన్న దీపాల కాంతులు గమనిస్తూ ఉండగా జార్జ్  హడావుడిగా ఇంటిలోనుంచి బయటకు వచ్చాడు. అతని ముఖంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. `మైఖేల్‌లే ఊరిలోకి వచ్చాడు. నువ్వు కనిపిస్తే చంపుతానని గన్ పట్టుకొని తిరుగుతున్నాడు. వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు కొన్నిరోజులు అజ్ఞాతంలో ఉంటే, మైఖేల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత నేను సమాచారం అందిస్తాను. నువ్వు తిరిగి రావచ్చు,` అని చెప్పాడు.

ముసలావిడ దగ్గరనుంచి జార్జ్ తెచ్చిన మూడు సావరీన్లని(బంగారు నాణాలు) జేబులో వేసుకొని రాత్రికిరాత్రి గుర్రం మీద మైఖేల్‌లే అనే ప్రమాదం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఫాంకి తిరిగి వెళ్ళడన్న సంగతి అతనికి తెలుసు. మరొకరి నీడగా అక్కడ ఉండడం కంటే  కొత్త జీవితం మొదలు పెట్టుకోవడం బాగుంటుంది. జీవితంలో సంపాదనగా పెన్నీలు తప్ప సావరీన్లని ఎరుగని స్టోనర్‌కి చేతికందిన డబ్బు కొత్తగా ఏదైనా వ్యాపకం ఏర్పాటు చేసుకోవడానికి సరిపోతుంది. వెన్నెల్లో ఇరుకు దారిగుండా భవిష్యత్తు మీద ఆశతో సాగిపోతూ మైఖేల్ గురించి మరచిపోయాడు. టాం అనే ముసుగు తొలగిపోయింది. సొంత వ్యక్తిత్వం తిరిగి వచ్చినట్టు ఉంది. ఆనందంగా విజిల్ వేసుకొంటూ ప్రయాణిస్తూ ఉండగా ఓ చెట్టు వెనుక నుంచి తుపాకీ పట్టుకొన్న వ్యక్తి బయటకు వచ్చాడు. అతను ఎవరో స్టోనర్‌కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  దారి ప్రక్కన  ఉన్న పొదల్లోకి దూకి తప్పించుకొందామని చూశాడు. కానీ, ఈసారి విధి అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు.

కథ చివరికి వచ్చే సరికి అనుకోని మలుపు తిప్పి పాఠకుల మదిలో చెరగని ముద్ర వేస్తాడు రచయిత.

*     *     *

పై కథకి రచయిత జీవితంతో పోలికలు ఉన్నాయి. రచయితలు తమ జీవితంలోని సంఘటనలని కథల్లో రాస్తే వాటిని సెమీ ఆటోబయోగ్రఫికల్ తరహా కథలు అంటారు. కానీ ఇక్కడ పరిస్థితి తారుమారు అయ్యింది. జరిగిన కథ రాయడం కాదు... రాసిన కథ జరిగింది!

కథా రచయిత మన్రో తండ్రి ఇండియన్ ఇంపెరియల్ పోలీస్ శాఖలో ఇన్స్‌పెక్టర్ జనరల్‌గా ఉండేవాడు. ప్రస్థుతం మయన్మార్‌గా పిలవబడుతున్న బర్మా  ఒకప్పుడు బ్రిటీష్‌వాళ్ళ ఆధీనంలో ఉండేది. ఆయన బర్మాలో బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే హెచ్.హెచ్.మన్రో జన్మించాడు. మన్రోకి రెండు సంవత్సరాల వయసున్నప్పుడు తల్లి మేరీతో కలిసి ఇంగ్లాండ్ వెళ్ళాడు. విధి మన్రో జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది ఇక్కడే.  ఒక ఆవు మేరీ మీద దాడి చెయ్యడంతో మేరీ మరణిస్తుంది. అందువల్ల మన్రో ఇంగ్లండ్‌లో తన నానమ్మ, అత్తల దగ్గర పెరుగుతాడు. చదువు పూర్తయిన తరువాత తండ్రికి లాగానే పోలీస్‌ ఉద్యోగంలో చేరాడు. కానీ మలేరియా సోకడంతో ఉద్యోగ విరమణ చేసి, బర్మా నుంచి ఇంగ్లండ్‌కి వెళ్ళిపోయి వివిధ పత్రికలకి జర్నలిస్ట్‌గా పనిచెయ్యడం ప్రారంభించాడు. ఈ సమయంలోనే చాలా కథలు కూడా రాశాడు.  అప్పుడే మొదటి ప్రపంచ యుద్దం వచ్చింది. నలభై మూడేళ్ళ మన్రో బ్రిటిష్ సైన్యంలో సాధారణ సైనికుడిగా చేరాడు. శత్రువులకి కనిపించకుండా ట్రెంచ్‌ల్లో (గుంటలు) ఉండి సరిహద్దుల్ని కాపలా కాసే పని. చాలా కష్టతరమైనది. ట్రెంచుల్లో ఉండే వాళ్ళు పొగతాగకూడదు. అలా చేస్తే స్నైపర్స్ అనబడే జర్మన్ సైనికులకి ఆనవాలు తెలిసిపోయి దాడి చేస్తారు. మన్రోని 1916లో ఒక జర్మన్ స్నైపర్ కాల్చి చంపుతాడు. చనిపోవడానికి ముందు తన చివరి మాటలుగా `పుట్ దట్ బ్లడీ సిగరెట్ ఔట్ (ఆ దరిద్రపు సిగరెట్‌ని ఆర్పెసెయ్!)` అన్నాడని అంటారు. బహుశా పొగ తాగుతున్న తన సహచర సైనికుడితో ఆ మాటలు అని ఉంటాడు. కేవలం సిగరెట్ పొగ  మన్రో చావుకి కారణం అవడం విధికాక మరేమిటి?

తమకోసం ఉద్దేశింపబడని బుల్లెట్‌లకి కథలో స్టోనర్, కథని రాసిన మన్రో బలయిపోయారు.

హెచ్.హెచ్.మన్రో వందలకొద్దీ కథల్ని రాసాడు. వాటిలో చాలా వరకూ అంతర్జాలంలో ఉచితంగా లభిస్తున్నాయి. ఆసక్తి ఉంటే చదవండి.  ఇప్పటికే కొన్ని కథలు చదివారా? అయితే వాటిలో మీకు నచ్చిన కథలు ఏమిటి?

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి