భారతీదేవి కనుపాప బాలమురళి - -సిరాశ్రీ

జీవితంలో కొన్ని మరపురాని సన్నివేశాలు చూడగలగడం కూడా ఒక యోగమే. మిత్రులు డా|| గజల్ శ్రీనివాస్ నాకు ఆ యోగాన్ని కట్టబెట్టారు.

స్థలం: పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా)
సమయం: సాయంత్రం 6 గంటలు- మార్చ్ 7, 2015


ఊరు నడిబొడ్డున జనసందోహం మధ్యన అందంగా అలంకరించిన శ్వేతాశ్వరథం. ఆ రథానికి ముందు 200 మీటర్ల వరకు వివిధ బృందాలుగా బాలబాలికలు సైన్యంలా నిలబడ్డారు. బందోబస్తులో తలమునకలైన పోలీసు అధికారులు ట్రాఫిక్ ను అదుపు చేస్తున్నారు. అక్కడ ఏం జరగబోతోందో అన్న ఆసక్తితో జనంలో కొందరు ఆగి, ఆగి వెళ్తున్నవారు; ఆగిపోయి చూస్తున్నవారు కనిపించారు.అక్కడికి పైలట్ కార్లు, పోలీస్ ఎస్కార్ట్ జీపుల హడావిడితో వరుసగా కొన్ని వాహనాలు దూసుకువచ్చి ఆగాయి.

ఒక కార్లోంచి ముందుగా ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి మాణిక్యాలరావు దిగారు. మరో కార్లోంచి శాస్త్రీయ సంగీత సామ్రాట్ పద్మవిభూషణ డా మంగళంపల్లి బాలమురళీ కృష్ణ దిగారు. వారికి చేతులు జోడించి నమస్కరించి సాదరంగా తీసుకొచ్చి రెండు గుర్రాలు పూంచిన ఆ రథంలోకి ఎక్కించారు మంత్రి మాణిక్యాలరావు.

సారధి స్థానంలో మంత్రి గారిని కూర్చోబెట్టి, తాను వారి పక్కనే కూర్చున్నారు గజల్ శ్రీనివాస్. ముందు ఉన్న బాలలబృందాలు, వెనుకనే రథం, ఆ వెనుక మంత్రి గారి వాహనాలు, పోలీసు బందోబస్తు మధ్య పురవీదుల్లో ఊరేగింపు మొదలైంది. రోడ్డుకి రెండువైపులా ఉన్న ఇళ్లపైనుంచి జనం సంగీత సరస్వతికి దండాలు పెట్టడం, కొందరు పూలు జల్లడం చూస్తుంటే ఏదో 15 వ శతాబ్దం నాటి సన్నివేశంలా అనిపించింది. 2015 లో ఒక వాగ్గేయకారుడికి ఇంతటి గౌరవం లభించడం, ఆ గౌరవానికి ప్రజల నుంచి అంతటి సంస్కారవంతమైన స్పందన లభించడం నిజంగా ఆశ్చర్యకరం, అక్షయానందకరం. ఇంతటి కార్యానికి సూత్రధారి డా గజల్ శ్రీనివాస్.

అందుకే పురజనులు చాలా మంది ఆయనకీ వందనాలు చేసారు. ఇది ఒక ప్రజావాగ్గేయకారుడు పుంభావ సరస్వతిగా భావింపబడుతున్న మరో గొప్ప వాగ్గేయకారుడికి చేసిన సత్కారం. అది నిజంగా మెచ్చుకోదగ్గ సంస్కారం.

అంతటితో అవ్వలేదు. సభాప్రాంగణం వరకు ఊరేగించి, అక్కడ మంగళంపల్లి వారిని దింపి శాసనసభాపతి డా కోడెల శివప్రసాద్ సమక్షంలో ఘనంగా పౌర సన్మానం, స్వర్ణ కంకణ ధారణ. ఆ "స్వర్ణకంకణం" బాలమురళి చేతిని చేరిన వెంటనే "స్వరకంకణం" అయిపోయిందనిపించింది. ఆ సభలో నేను మూడు సీస పద్యాలతో ఆ పద్మవిభూషణడుకి పదార్చన చేస్తే, వాటికి స్వరాలద్ది తన గాత్రంతో స్వరార్చన చేసారు గజల్ శ్రీనివాస్.


ఆ పద్యార్చన ఇది:

సలలిత రాగాల సారాలనే చిల్కి
గళమెత్తి పాడి మంగళము పల్కి
తీపిపాటల మధ్య థిల్లానలను చేర్చి
గాంధర్వ జగతికి గంధమద్ది
శాస్త్రీయ సంగీత సారస్వతమునెల్ల
జీవనాడుల నిల్పి సిధ్ధి పొంది
రాగాలు వినిపించి రోగాలనే బాపు
సంగీత వైద్యాన్ని చాటి చెప్పి

మేటి పటిమతో నీవెగసేటి కడలి
కీర్తనల్ నిను చూచి పొంగెత్తు పొరలి
అంబ వాగ్దేవి చరణాల అందె రవళి
పలుకునమృతంబుగ జేయు బాలమురళి ((1))

---
ఏ నాటి పుణ్యమో ఏ జన్మ యోగమో
ఈనాడు ఫలియించె ఈ విధమ్ము
అన్నమయ్యను తాకు అరుదైన భాగ్యమ్ము
ఈనాడు కలిగింది ఈ విధమ్ము
త్యాగయ్యనే చూచు యోగమేమియొ గాని
ఈనాడు పట్టింది ఈ విధమ్ము
పుంభావ భారతీ పూర్ణావతారమ్ము 
ఈ నేల నిలిచింది ఈ విధమ్ము

స్వర్ణకంకణమను స్వరకంకణమిది 
మీకుతొడుగు భాగ్యమే వరించె
పార్వతీ సమేత ఫాలనేత్రుని సాక్షి 
పాలకొల్లు మురిసె బాల మురళి ((2))

---
పద్మాలు పాదాలు పద్మాలు భూషణాల్
పద్మాలు బిరుదులై పరగె నీకు
ఘనమైన కీర్తులే గౌరవమ్ముగ వంగి 
తలవకున్నను వచ్చె దరికి నీకు
ఆస్థానమేదైన అపురూపమైనట్టి
పదవులెన్నియొ చేరి వచ్చె నీకు
వాగర్థముల్ పాడి వాగ్గేయకారత్వ
చరితనే వ్రాసిన స్వరము నీవు

రయముగా వచ్చు భారత రత్న నీకు 
కలుగు ఖండాంతరము దాటు ఖ్యాతి నీకు
ధాత్రి నిల్చును వెలిగి నీదైన సరళి
భారతీ దేవి కనుపాప బాలమురళి ((3))

డా|| మంగళంపల్లికి భారతరత్న రావాలని అందరూ కోరుకోవడం సరైనదే కానీ, నిజానికి వారు పుటుకతోనే సంగీతభారతీరత్న! అందులో సందేహం లేదు.

సృష్టి జరిగాక నేటి వరకు ఒకే ఒక్క మనిషి నుంచి 125 ప్రపంచభాషల్లో పాటలు పలికాయి. 
అది చెక్కుచెదరని ప్రపంచ రికార్డు. 
దాన్ని ఛేదించే సాహసం ఇప్పట్లో ఎవరికీ లేదు. 
ఆ స్వరశక్తి డా|| గజల్ శ్రీనివాస్.

8 ఏళ్లకే సంగీతాన్ని ఔపోసన పట్టేసి శాస్త్రీయ కచ్చేరీ చేసినవారు ఇంకొకరు.
ప్రపంచ స్థాయి పురస్కారాలు అందుకున్నారు.
85 ఏళ్ల వయసులోనూ కచ్చేరీలు చేస్తున్నారు. 
పద్మవిభూషణ అయ్యారు. 
యావత్ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగారు.
ఆ స్వరయుక్తి డా|| మంగళంపల్లి.

ఇద్దరూ తెలుగు వారు. 
ఒకరు నాకు ఆత్మీయ మిత్రులు, మరొకరు నా పద్యార్చన స్వీకర్తలు. 
వారిద్దరికీ నా అక్షరప్రణతులు.

ముక్తాయింపుగా ఒక్కటి మాత్రం చెప్పాలి. నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) మరియు గజల్ చారిటెబుల్ ట్రస్ట్ సమ్యుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలోని స్మృతులు మృతి వరకు చెక్కుచెదరవు.

-సిరాశ్రీ 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి