అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

ఈ రోజుల్లో ప్రతీదానికీ కంగారే.  ఇదివరకటి రోజుల్లో, అమ్మ కడుపులోనుండి, వచ్చే బిడ్డలు , తొమ్మిది మాసాలూ పూర్తయినతరువాతే భూమ్మీదకు వచ్చేవారు. కానీ ఈరోజుల్లో గమనించే ఉంటారు, ఏదో ప్రత్యేక సందర్భానికి, అదేదో కొత్త శతాబ్దం మొదటి రోజుననో, లేదా  ఏదో ఫలానా తేదీన పుట్టడం అరుదనో, ఎక్కడో చదివుంటారు, అంతే, ఆరోజుకి, సూర్యుడు అటు ఉదయించనీ, ఇటు ఉదయించనీ, కడుపులో బిడ్డ బయటకి రావాల్సిందే. నగరాల్లో ఉండే ప్రతీ ఆసుపత్రిలోనూ హడావిడే. అదేదో సిజేరియన్ చేసేసి, కడుపులో ఉన్న బిడ్డని, గడియారం అర్ధరాత్రి పన్నెండు కొట్టిందీ అనగానే, ఠంచనుగా బయటకు రావాల్సిందే, తొమ్మిది మాసాలూ, పూర్తయాయా లేదా అన్నది  immaterial,.. ఆ మర్నాడు పేపర్లలో, అంతర్జాలంలో, టీవీల్లో, తల్లీ బిడ్డల ఫొటోలూ, పక్కనే గోడకి గడియారం ముల్లులు పన్నెండు మీద చూపిస్తూ ఫొటోలూ , అభినందనలూ అంతా హడావిడే.  తొందర తొందరగా బయటకు వచ్చి, మరి ఏం ఉధ్ధరిస్తారో ఆ భగవంతుడికే తెలియాలి. అయినా ఎవరి ఆనందం వారిదీ..  ఇదో రకం కంగారు.

కొంతమందికైతే ప్రతీ దాంట్లోనూ కంగారే. ఉదాహరణకి, ఏ ఆధార్ కార్డుకైనా పక్కింటివారితో కలిసి, ఎక్కడికో వెళ్ళి, ఒకేసారి apply  చేశారనుకుందాం. అదృష్టం బాగుండి, ఆ అవతలివారికి ఆధార్ కార్డు వచ్చేసిందని తెలిసి, తనకు ఇంకా రాలేదేమిటీ అని కంగారు. అలాగే ప్రతీ విషయంలోనూ, మనకి రాలేదనే కంటే, అవతలివాడికి ముందుగా వచ్చేసిందనే దుగ్ధ, ఈ కంగారుకి కారణమౌతూంటుంది. గ్యాసు సీలిందరు పక్కింటివాడికి ముందరే వచ్చిందని కంగారు. దానిదారిన టైమొచ్చినప్పుడు తనకీ వస్తుందని అనుకుంటే అసలు ఆ కంగారు కే ఆస్కారం ఉండదు. కానీ, ఎంత చెప్పినా మానవమాత్రులం కదండీ, ఈ కంగారనేది స్వతసిధ్ధంగా ఉంటూనే ఉంటుంది. అన్నీ “ఆ పైవాడే చూసుకుంటాడులే” అని సావకాశంగా ఉండడం కూడా, ఒక్కోప్పుడు ప్రమాదకరమే. మన ప్రయత్నం మనం చేయాలి. అలాగని కంగారు పడకుండా  ఉండి, ఉచితానుచితాలు ఆలోచిస్తూండాలి..

రోడ్లమీద వాహనాలు నడపడం చూస్తూంటాం. ఎవడికి వాడే ఎంత వేగంగా బండి నడుపుదామనే కంగారు. సిగ్నల్స్ పాటించకుండా, వాహనాలు నడపడం, ఏదో ప్రమాదంలో పడ్డం. ఒక్కోప్పుడు అవతలివారిని కూడా చిక్కుల్లో పెట్టడం.ఇదివరకటి రోజుల్లో ప్రతీదీ, నిదానంగా ఆలోచించి చేసేవారు.  ఓ ఇల్లు కట్టుకోడమైనా, పిల్లకి పెళ్ళిచేయడమైనా , నాలుగు చోట్ల విచారించి కానీ చేసేవారు కాదు.. మన బాధ్యత పూర్తవుతుంది కదా అని, ఏ మాట్రిమోనియల్లోనో ఏదో ప్రకటన చూడ్డం, అఘమేఘాలమీద పెళ్ళిళ్ళు చేసేయడం. అలాగే విదేశాల్లో ఉండే మనవారు, ఓ పది పదిహేను రోజులు శలవు పెట్టి రావడం, ఆ పదిరోజుల్లోనే పెళ్ళిళ్ళు నిశ్చయించుకోడం.

ఈ కంగారు లన్నీ ఓ ఎత్తైతే, కొంతమందికి  రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోదామని , నానా గడ్డి తినడం ఇంకో ఎత్తు. అదేమిటో కానీ, వారికి దొరికే “ బక్రాలు “ కూడా దొరుకుతారు. అందుకేనేమో, రోజూ టీవీల్లో కనిపిస్తూంటారు చూడండి, ఫలానా వాడు కోట్లు వసూలు చేసి, రాత్రికి రాత్రి బోర్డు తిప్పేశాడూ అంటూ ధర్నాలూ, సింగినాదాలూనూ. వాడెవడో చెప్పాడే అనుకోండి, వాణ్ణి నమ్మి వేలూ, లక్షలూ వాడికి ధారపోయమని చెప్పిందెవడుట? ఎవరికి వారు కోటీశ్వరులుగా, అదీ ఏ కష్టమూ, శ్రమా పడకుండా, ఎదిగిపోతే ఇంక ఈ ఆర్ధిక వ్యవస్థలూ అవీ ఎందుకూ? దురాశ అన్నది ఈ రకం కంగారు కి కారణం.

అలాగే ప్రయాణాల్లో చూస్తూంటాము, ప్లాట్ఫారం మీదకి ట్రైను రావడం తరవాయి, ఒకళ్ళనొకరు తోసుకుంటూ, కొట్టుకుంటూ ఎగబడడమే. రిజర్వేషన్ ఉన్నా సరే అదే పరిస్థితి. పైగా ఏమైనా అంటే, మన బెర్తుకింద ఇంకోడెవడో సామాన్లు కుక్కేస్తాడేమో అని భయం. చిత్రం ఏమిటంటే, అంతదాకా కొట్టుకుంటున్నవాళ్ళు కూడా, రైలు బయలుదేరిన కొంతసేపటికి, ఎన్నో జన్మలనుండీ స్నేహితులైపోయినంతగా కలిసిపోవడం..

ఈమధ్యబ ఇంకో రకం కంగార్లను చూస్తున్నాం. అదేమిటో, ఎక్కడ చూసినా ప్రతీవాడూ, అదేదో డ్రింకో, టానిక్కో త్రాగితే, ఊహించలేనంత పొడుగ్గా తయారవడమో, లేదా ప్రపంచంలోకెల్లా అతి తెలివైన కుర్రాడిగా మారిఫొవడమో . దానితో ప్రతీ తల్లీ తండ్రీ, మార్కెట్ లోకొచ్చిన ప్రతీ కొత్త డ్రింకునీ, తమ పిల్లలకి పట్టించేయడం. హాయిగా, వాళ్ళ దారిన వాళ్ళని పెరగనిస్తే వీళ్ళ సొమ్మేం పోయిందో? ప్రతీ దానికీ కంగారే...

అన్నిటిలోనూ ముఖ్యమైన కంగారు తిండి విషయంలో. హాయిగా తాపీగా భోజనాలు చేయడమనే అలవాటు, ఎప్పుడో అటకెక్కేసింది. ఎక్కడ చూసినా, అవతలేదో కొంపమునిగిపోతున్నట్టు, కంగారుగా, కోడి కెక్కరించినట్టు, నాలుగు మెతుకులు తినడం. ఆరోగ్యాలు తిన్నగా ఉండమంటే ఎలా ఉంటాయి?

పైగా ఏమైనా అంటే, సమర్ధింపోటీ, “ మీకేమండీ.. మీరోజుల్లోలాగా ఏమిటీ... మాకు ఎంత పని ఒత్తిడీ, ..” అంటూ. అక్కడికేదో ఆరోజుల్లో ఒత్తిళ్ళే లేనట్టూ, నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నట్టూ మాట్టాడడం. అప్పుడూ ఉండేవి ఈ ఒత్తిళ్ళు, కానీ వాటిని ఎదుర్కునే పధ్ధతులు వేరుగా ఉండేవి. ఆరోజుల్లో ఇంటి పెద్ద ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే, ఎవరికీ తెలియనిచ్చేవారు కాదు, ఆఖరికి కట్టుకున్న భార్యకి కూడా. కానీ ఈరోజుల్లోనో, ఒత్తిడి అనేది , పడుతున్నవాడి సంగతి సరే, చుట్టూ ఉన్నవారిమీద కూడా ప్రభావం చూపిస్తోంది.  ఈ ఒత్తిడి తరువాయి పరిణామం, అర్ధం పర్ధం లేని కంగారు....

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి