'సుధామ ' ధురం - సుధామ

 

 

ఆ(పాత)ఉగాదుల్లో.....

నా జ్ఞాపకాల తోటలో ' ఉగాది ' తొందరపడి ఓ కోయిల ముందే కూసిన చందం కానే కాదు. అచ్చులో నా మొదటి రచన 1965 డిసెంబర్ 1 ' బాలబంధు '  పక్షపత్రిక లోని చిన్న కథ కాగా, నా మొదటి కార్టూన్ 1968 జనవరి ' లత ' మాస పత్రిక లోది అని చెప్పాను కదా! సాధారణం గా ఉగాది అనగానే కొత్త కవులు మొదటగా తమ కలాలు సంధించేది దానిమీదేననీ, ఉగాది పచ్చడి గురించి కార్టూన్ గీయని వారు ఎవరూ వుండరనీ అందరూ అనుకునేమాటే! పాత ఉగాది నాటిదే కార్టూన్ నో తెలుగు సంవత్సరాది పేరు మార్చేసి కవితనో చెలామణీ చేసేసుకుంటారు అన్న అపవాదూ చాలా మందికి వుంటుంది.

కానీ నేను నా కవిత్వం ఆరంభించిన (  1967అక్టోబర్ 17 న నవ్య సాహితీసమితి హైద్రాబాద్ వై. యం. సిఏ నారాయణగూడా హాలులో జరిగిన రచయితల సమావేశం లో చదివిన నా మొదటి కవిత ' నేరాస్తా ' నవ్య వాణి మాస పత్రిక ఫిబ్రవరి ' 68 వ సంచికలో అచ్చయింది. ) ఓ మూడేళ్ళకి గానీ ఉగాది మీద కవిత రాసిన పాపాన పోలేదు. విజయ వాడలో అప్పట్లో వచ్చిన ప్రగతి సచిత్ర వార పత్రికలో నా అనేక కవితలు అచ్చయిన మూడేళ్ళకు 1970 లో వారి ఉగాది ప్రత్యేక సంచిక కోసం ' ఇప్పుడుదయిస్తోంది ఉగాది ' అంటూ 17.4.70 సాధారణ నామ సంవత్సర తెలుగు ఉగాదికి కవిత రాయగా అచ్చయింది. పండుగనయినా సామాజిక సమస్యల చిత్రణకు వాహిక చేసుకోవచ్చనీ కేవలం కోకిలలు , మామిళ్ళు, ప్రకృతి శోభలు అంటూ వర్ణనామయమే చేసి రాయనక్కర్లేదనీ కాలం కొంత రాటుదేలాకే  అవగాహనలోకి వచ్చింది. రేడియోలో ఉగాది కవి సమ్మేళనాలు వింటున్నప్పుడు శ్రీ శ్రీ, ఆరుద్ర, కుందుర్తి, వేగుంట మోహనప్రసాద్ వంటి కవులు ఉగాది అనేది కేవలం ఒక మిషగా అద్భుత సామాజిక కవిత్వాన్ని వినిపించడం గ్రహించాక కవికి ఏదీ నిషిద్ధ వస్తువు కాదనీ, ప్రతిభావంతుడు తన భావాభి వ్యక్తికి ఆ ఇతివృత్తాన్నయినా బలీయమైన ఉపకరణంగా మార్చుకోగలడనీ అర్ధమైంది.

స్రుక్కిపోతూ వెక్కి ఏడుస్తున్న
సుఖాలసూర్యుడు చూపుడు వేలును
శూన్యం వైపుకు త్రిప్పుతున్నాడు
ఇప్పుడుదయిస్తోంది ఉగాది
ఇది జగతికో
మానవతను తనలో కలుపుకుంటున్న మృత్తికకో
తెలియరావడం లేని పునాది

అని 1970 ప్రగతి వార పత్రిక ఉగాది. సంచిక లోని నా కవిత మొదలౌతుంది. అయితే ప్రాచ్య కళాశాల విధ్యార్ధిగా, యువ భారతి సాహితీ సాంస్కృతిక సంస్థలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నందువల్ల ఒక సమ్యక దృష్టి ఏర్పడింది. 1971 ఆంధ్రప్రభ వారపత్రిక ఉగాది సంచికలో ప్రత్యేకం గా నేను రాసిన కవిత ఒక పూర్తి పుటలో అలంకరింపబడి ప్రచురింపబడటం మరుపురాని తీపి జ్ఞాపకం. ' ఉగాది సుందరీ! ' అని రాసిన ఆ కవిత ప్రాచ్య భాషనభ్యసిస్తున్న విధ్యార్ధి అభివ్యక్తీకరణ కౌతుకానికి నిదర్శనం! ఆ రోజుల్లోనే అంటే 1971 లోనే తారకా ఆర్గనైజర్స్ అనే సంస్థ మొదటిసారిగా ' ఉగాది ' అనే వస్తువు మీద కవులు రాసిన కవిత్వం తో వెండిపూలు ' అనే కవితాసంకలనం వెలయించడం నాకు తెలిసి అదే మొదలు. డాక్టర్ అరిపిరాల విశ్వం గారు దానికి పీఠిక సంతరించారు. మఖమల్ అట్ట మీద వెండిపూలు అనే అక్షరాలంకరణ  తారకి ఆర్గనైజర్స్ లోగో తో ఆ సంకలనానికి ముఖ చిత్రం సంతరించింది కూడా నేనే. అందులో ' ఉగాది  సుందరి ' కవిత కూడా చోటు చేసుకుంది.

ముప్ఫై ఏళ్ళు ఆకాశవాణిలో పనిచేసి ఉగాది కవి సమ్మేళనాలు స్వయంగా నేను కార్యక్రమ నిర్వహణాధికారిగా కొన్ని నిర్వహించాను కూడా. అయితే చిత్రంగా ఏనాడూ ఇంతవరకూ రేడియోలోఉగాది కవి సమ్మేళనం లో పండుగ కవిత్వం తో నేను పాల్గొనలేదంటే చిత్రంగానే వుంటుంది. పలు వేదికల మీద ఉగాది కవిసమ్మేళనాల్లో మాత్రం పాల్గొన్నాను. అకాల మృత్యువాత పడిన ప్రముఖ సాహితీవేత్త రాళ్ళబండి కవితా ప్రసాద్ సాంస్కృతిక శాఖ సంచాలకులుగా వుండి, అటు ఆంధ్రప్రదేశ్ గా, తెలంగాణాగా ఇంకా విడివడక ముఖ్యమంత్రి ఎవరూ లేక కేవలం గవర్నర్ అధీనంలో వున్న గత ఏడాది జయ ఉగాది నాడు మాత్రమే మొదటిసారి ప్రభుత్వ(?) వేదికపై జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్నాను. ఏ ఉగాదికీ ప్రభుత్వ కవి సమ్మేళనం లో పాల్గొని ముఖ్యమంత్రి సత్కారం పొందగలిగే స్థితి నాకు కలగలేదు. ఇదీ ఓ విశేషమే మరి!

1972 లోనే నేను విద్యార్థిగా వున్నప్పుడే ఉగాది సందర్భంగా ఆంధ్ర విశ్వ సాహితి సంస్థ పక్షాన 27 వ మార్చి తేదీ సాయంత్రం 7.15 కు శ్రీ పోతుకూచి సాంబశివరావు గారు రచించిన ' తీపి - చేదు ' అనే నాటికలో ఆకాశవాణి హైద్రబాద్ కేంద్రం ' తరుణ భారతి ' కార్యక్రమం లో ఆయన సారధ్యంలోనే పాల్గొనడం గుర్తుంది. విరోధికృత్ ఉగాది అది. ఇంక నా జీవితంలో మరుపురాని ఒక మధుర ఘట్టం నేను ఆకాశవాణి హైద్రబాద్ కేంద్రం వివిధ భారతిలో ట్రాన్స్మిషన్ ఎగ్కిక్యూటివ్ గా చేరాక నాలుగేళ్ళకు దుందుభి ఉగాది సందర్భం గా 1982 లో ' జనరంజని ' ప్రత్యేక కార్యక్రమాన్ని మహా కవి శ్రీశ్రీ ని స్వయం గా నేను ఇంటర్వ్యూ చేస్తూ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేయడం. ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠం  అనంతర కాలం లో వి.ర.సం. ప్రచురించిన శ్రీశ్రీ ప్ర.జ లో కూడా చోటు చేసుకుంది. శ్రీశ్రీ గారితో రికార్డింగ్ సందర్భం గా గడిపిన ఆ ఉగాది ముందు రోజుల అమూల్య క్షణాలు అవిస్మరణీయాలు.

అలాగే కార్టూనిస్టుగా మొట్టమొదటిసారి నా ఫుల్పేజ్ కార్టూన్ అచ్చయింది ఉగాదికే. 1969 ఆంధ్రప్రభ ఉగాది ప్రత్యేక సంచిక లో ' ఉగాది సరదాలు ' పేరిట 2.4.69 సౌమ్య ఉగాదికి అచ్చయిన ఆ కార్టూన్లకే తొలిసారి చెక్ రూపం లో25 రూపాయల పారితోషికం అందుకున్నాను. ఆ చెక్ కూడా శ్రీమతి సుధామ అని వచ్చింది. నాకు బ్యాంకు అకౌంట్ కూడా లేదు. 17 ఏళ్ళ కుర్రాడికి ఆ రోజుల్లో బ్యాంకు అకౌంట్ ఏం తెలుస్తుంది? మా నాన్నగారు నన్ను కోఠీ సుల్తాన్ బజార్ ఆంధ్రా బ్యాంకు కు తీసుకు వెళ్ళి మేనేజర్ తో మాట్లాడి ఎ. వెంకట రావ్ అలియాస్ సుధామ అని నాకు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించి ఆ చెక్కు అందులో జమ చేయించడం సౌమ్య ఉగాది కలిగించిన మధురానుభూతియే మరి. ఆంధ్రా బ్యాంక్ లో ఇప్పటికీ నా అకౌంట్ వున్నది ఆ మధుర క్షణాల శాశ్వత రికార్డు కోసమే మరి!

ఉగాదికి కొత్త బట్టల మాట ఎలా వున్నా మాకు తలంట్లు, ఉగాది పచ్చడి బాగాగుర్తే! మలకపేట కాలనీ లో యం.సి.270   ఇంట్లో మా బాల్కనీ గోడ మీద మా అన్నయ్య ' రాధాయి ' ఉగాది పచ్చడి నాకుతుంటే ఎండకు పడిన  ఆ నీడను బొమ్మగా అలానే గోడ మీద గీయడం ఒక బాల్య స్మృతియే! పరగడుపునే ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి తినాలన్నది నా అభిమతం. కాఫీ త్రాగాక ఓపిక వచ్చి ఉగాది పచ్చడి చేస్తాలెండి అనడం నాకు నచ్చదు. కాల ప్రవాహం లో పండుగల విశిష్తత, ప్రాధాన్యత పలుచబడుతున్నా యనిపిస్తుంది. ఉగాదిని ఉ (ట్టి అడ్డ ) గా (డి ) ది అని నేను బాల్యం లో నే పరిహసించిన వ్యంగ్య ధోరణి వాస్తవమైపోతోదేమోనన్న భయమూ నాకు లేకపోలేదు. ఖర నామ సంవత్సర ఉగాదిని 2011 లో దర్శించాను. షష్టిపూర్తి ఒక అదృష్టం! అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు....

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి