సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam
'ఆముక్తమాల్యద'

విష్ణుచిత్తులవారు ఆకాశ వీథిలో తనకు దర్శనమిచ్చిన శ్రీమహావిష్ణువు దశావతార ప్రస్తుతి చేస్తున్నాడు. ఈ పద్యం కల్క్యావతార వర్ణన. రాయల పాషాణ సదృశమైన పదబంధానికి, విచిత్రమైన కల్పనకు, మధ్య మధ్య ఇమిడ్చే ధార్మిక రహస్యాలకు చక్కని ఉదాహరణ ఈ పద్యం.


ఘోరాపారమహాఘపంచకముఁ జక్కు ల్సేయఁగా నేర్పనా
ధారా పంచక ధావనం జెలఁగు గంధర్వంబుఁ ద్రొక్కించు బ
ల్బీరంపున్నెఱరౌతుఁ గీకట శరాళీవారవాణీ భవ
ద్దోరుద్భ్రాంతక్రుపాణికాద్వితయ విద్యుద్గ్రంధి నిం గొల్చెదన్

ఘోరమైన, అపారమైన మహా అఘ పంచకం అంటే ఘోరమైన నీచమైన ఫలితాన్ని దాటడానికి శక్యం కానీ  పంచమహా పాపాలు. 'బ్రహ్మహా హేమహారీచ సురాపో గురుతల్పగః మహా పాతకినోహ్యేతే తత్సంసర్గీచ పంచమః'అని వేదవ్యాసులవారు కూడా దేవీభాగవతంలో చెప్పారు. ఇతరత్రా కూడా పంచ మహాపాతకాలు అని పిలువబడే ఐదు మహా పాపాల జాబితా ఉంది. బ్రహ్మహత్య, బంగారాన్ని దొంగిలించడం, సురాపానం చేయడం, గురుతల్పాన్నిపంచుకోవడం అంటే గురుపత్నితో కామసుఖాన్ని పొందడం యివి నాలుగుమహా పాపాలు. ఈ పాపాలలో దేన్నైనా చేసినవాడితో కలిసి తిరగడం, స్నేహం చేయడం ఐదవ మహాపాపం! గురుపత్ని అంటే కేవలం విద్య నేర్పినగురువుగారి భార్య అని మాత్రమే అర్థం కాదు. జన్మనిచ్చినవాడు, పిల్లనిచ్చినవాడు, అన్నం పెట్టినవాడు, ప్రాణరక్షణ చేసినవాడు, విద్యనేర్పినవాడు ఈ ఐదుగురూ గురుస్థానీయులు, మహా గురువులు అని ధర్మశాస్త్ర నిర్దేశం. వీరి స్త్రీలను అంటే కుమార్తెలనుకానీ, భార్యలనుకానీ కామించడం మహాపాపం, కనుకనే కచుడు తనను బ్రతిమిలాడిన దేవయానిని తిరస్కరించాడు.

ఈ ఐదు రకాలైన మహా పాపాలను చెక్కులు చెక్కులుగా ఖండించడం నేర్పడానికి అన్నట్లు ఐదురకాలుగా తనఅశ్వాన్ని గంధర్వంబు త్రొక్కించే భలే బీరపు నెరరౌతు(అశ్వికుడు)అంటే కల్కి. గంధర్వము అంటే గుర్రం. ధార అంటే గుర్రపు పరుగు అని ఒక అర్థం. గుర్రపు పరుగు ఐదు రకాలు అని పెద్దల వివరణ. అస్కందితము,  ధౌరితకము, రేచితము, వల్లితము, ప్లుతము అనే ఐదురకాల పరుగులు తీస్తుంది అశ్వము. ఐదురకాల మహా  పాపాలను తుత్తునియలుగా ఖండించడం నేర్పడానికా అన్నట్టు ఐదురకాల పరుగులు తీస్తున్న గుర్రమునెక్కి కీకటులు అంటే మ్లేచ్చుల శరపరంపరను అడ్డుకుంటున్న కవచము(వారవాణి)లాగా ఉన్న భుజములయందు  రెండు విచ్చుకత్తులను తిప్పుతూ మెరుపులమాలికముడిలా ఉన్నవాడవైన నిన్ను కొలిచెదను స్వామీ! 

తనమీదికి వస్తున్న శరపరంపరను అడ్డుకోడానికి రెండుచేతులలో విచ్చుకత్తులను ధరించి వాటిని గుండ్రంగా  తిప్పుతుంటే, ఆ ఖడ్గచాలనమే ఒక కవచంలా ఉండి బాణాలు తగులకుండా, గాయపడకుండా కాపాడుతున్నాయి  ఆ అశ్వికుడిని, కల్కిని. గుండ్రంగా విద్యుల్లతలలా మెరుపులు మెరుస్తూ ఆ విచ్చుకత్తులు తిరుగుతున్నాయి  ఒక మాలలా. ఆ మాలమధ్యనుండి కనిపిస్తున్న శిరసు ముడిలా ఉంది కనుక విద్యుద్గ్రంధి అంటే విద్యుత్తు  ముడిలా ఉన్నాడు కల్కి. పంచమహాపాపాచరణము జీవనవిధానమైనప్పుడు, ఆ పాపులను సంహరించడానికి అవతరించే కల్కిని ఈ రకంగా భక్తుడు స్తుతి చేస్తే, భగవంతుడు ఇలా అంటున్నాడు.

అని నుతియింపఁగా హరి సుథాశనవర్ధకిఁ జూచి 'పాండ్యుఁ డి
చ్చినధన మిమ్మునీశ్వరుఁ డశేషము భాగవతాస్మదీయ గే
హనివహసాత్కరించి యకటా! కడు రిక్తత నొందు నే తదీ
యనిలయ మప్పురిన్మణిమయంబును సార్థము జేయు నావుడున్

ఆ విధముగా కల్క్యావతారములో దర్శనమిచ్చే తనను నుతి చేయగా, హరి 'సుథాశనవర్ధకి'ని అంటే అమృతమును ఆహారముగా కలిగిన దేవతల వర్ధకి అంటే వడ్రంగి, అంటే విశ్వకర్మను చూసి, పాండ్యరాజు యిచ్చిన ధనమును యితడు భాగవతులకు, అస్మదీయ గేహమునివహములకు అంటే దేవాలయాలకు సాత్కరించి అంటే ఖర్చు జేసి,ఏమీ మిగలకుండా చేస్తాడు, నువ్వెళ్ళి అతని నిలయాన్ని, ఆ పురాన్ని మణిమయంగా, ధనసహితమైనదానిగా చేయవయ్యా అని ఆజ్ఞాపించాడు.

విశ్వకర్మయునట్ల కావించె నంత 
నంబుజాక్షుఁడు నమ్ముని నాదరించి
యీక్షణాగోచరుండయ్యె ఋషియు నేఁగి
పౌరులు భజింప విల్లిపుత్తూరి కరిగె 

శ్రీహరి ఆజ్ఞ ప్రకారము అలాగే చేశాడు విశ్వకర్మ. కమలలోచనుడైన కమలాకాంతుడు ఆ మునిని(విష్ణుచిత్తుడిని) ఆదరించి, ఆశీస్సులందించి అంతర్ధానం చెందాడు. విష్ణుచిత్తుడు తనను పౌరులు సేవిస్తుండగా విల్లిపుత్తూరుకు  చేరుకున్నాడు.

(కొనసాగింపు వచ్చే వారం)

**వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి