ది టన్నెల్
విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రైలుమార్గాన్ని డి.బి.కే (దండకారణ్య, బాలంగీర్, కిరుఖురి) రైల్వే లైన్ అంటారు. కొండల్ని తొలచి టన్నెల్స్ గా చేసి రైలు పట్టాలను వాటిగుండా వేశారు. ఈ మార్గంలో ఒకే ఒక పాసింజర్ రైలు తిరుగుతుంది. 44 టన్నెల్స్ ద్వారా గమ్యం వైపు మెల్లగా సాగే ప్రయాణం ఎంతో బాగుంటుంది. చుట్టూ పచ్చని ప్రకృతి, లోయలు, జలపాతాలు, అక్కడక్కడా కాలంతో పరుగులు తియ్యకుండా నెత్తి మీద చల్దికూడు పెట్టుకొని నడచిపోతుండే ట్రైబల్స్.. మధ్యలో ఒక్కో స్టేషన్ దగ్గరా ఎప్పుడన్నా వచ్చే రైలుకి పచ్చ జెండా ఊపే ఒక్కో రైల్వే ఉద్యోగి. `మిగిలిన సమయం అంతా ఈ ఉద్యోగులు ఏమిచేస్తుంటారు?` అని ఆశ్చర్యపోతాం. `తమ బాధ్యత నిర్వర్తించిన తరువాత ఊరిలోకి వెళ్ళిపోతారా?` అనుకొంటే, ఆ చుట్టుపట్ల కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ ఒక్క ఇల్లూ కనిపించదు - దట్టంగా పెరిగిన అడవి తప్ప. స్టేషన్‌కి ఆనుకొని ఉన్న చిన్న గదిలో వంట వండుకొంటూ, రోజువారీ పనులు చేసుకొంటూ, తరువాత వచ్చే రైలు టైం వరకూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. రోజులపాటు మార్పులేని ఒకే రకమైన దినచర్య. ప్రపంచంతో సంబధం లేని మారుమూల బాధ్యతల నిర్వాహణ!
పైన చెప్పిన నేపద్యం లాంటిదే ఎంచుకొని రస్కిన్ బాండ్ రాసిన ది టన్నెల్ అనే చిన్న కథని చదివాను. డెహ్రాడూన్‌కి సమీపంలో అడవి మధ్యలో ఉన్న ఒక టన్నెల్‌కి కాపలాదారు సుందర్‌సింగ్ కథ అది. నడచి వెళ్ళి టన్నెల్‌లో పట్టాలమీద ఏవైనా అడ్డంకులు ఉన్నాయా అని చూసుకొని పగలు ఒకసారీ, రాత్రి ఒకసారీ వచ్చే రైలుకి సిగ్నల్ ఇవ్వడమే సుందర్ సింగ్ పని. ఒక రోజు సూరజ్ అనే కుర్రవాడు టన్నెల్ గుండా వెళ్ళే రైలుని చూడడానికి అక్కడికి వస్తాడు. వాచ్‌మేన్‌ని కలుస్తాడు. అతను చేసే ఉద్యోగం గురించి వివరాలు అడిగి తెలుసుకొంటాడు. అవకాశం ఉంటే సాయంత్రం ట్రైన్ సమయానికి రమ్మని సూరజ్‌ని వాచ్‌మేన్ ఆహ్వానిస్తాడు. తరువాత తానే ఆ కుర్రాడిని ఊరివరకూ దిగబెడతానని మాట ఇస్తాడు. తండ్రి అనుమతి తీసుకొని వస్తానని చెప్పి, అన్నట్టుగానే ఆ మరునాటి సాయంత్రం సూరజ్ వాచ్‌మేన్‌ని కలుస్తాడు. ఇద్దరూ కూర్చొని టీ తాగుతూ రాబోయే రైలు బండి కోసం ఎదురు చూస్తుండగా ఎవరో చెట్టుకొమ్మని రంపంతో కోస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. అది చిరుతపులి అని చెపుతాడు సుందర్ సింగ్. రైలు రావడానికి ముందే పట్టాలపైనుంచి చిరుత పులిని అదిలించాలి. లేకపోతే అది చక్రాలక్రింద పడి చనిపోతుంది . అలా జరగడం సుందర్‌సింగ్‌కి ఏమాత్రం ఇష్టం లేదు.
ఆ చిరుతని సుందర్‌సింగ్ అంతకు ముందు అప్పుడప్పుడూ చూసి ఉన్నాడు. దానికి మేకల్నీ, ఊరకుక్కల్నీ తినే అలవాటు ఉంది. కానీ వాచ్‌మేన్‌కి తెలిసినంతవరకూ మనుష్యులకి హాని చెయ్యదు. చమురు దీపం చేతిలోనికి తీసుకొన్నాడు, వత్తిని పెద్దది చేశాడు. మరొక చేతిలో గొడ్డలిని పట్టుకొని టన్నెల్‌వైపు వెళ్ళాడు. సూరజ్ కూడా వాచ్‌మేన్‌ని అనుసరించాడు. వాళ్ళిద్దరూ పెద్దగా అరుస్తూ లోనికి ప్రవేశించారు. కొంతదూరం నడిచే సరికి పట్టాల మధ్యలో పడుకొని ఉన్న చిరుత వాళ్ళకి కనిపించింది. అది చాలా పెద్దది కాదు కానీ, దాని చర్మం దీపపు కాంతిలో నిగనిగ మని మెరుస్తూ కనిపించింది. తోకని అటూఇటూ కదిలిస్తుంది. వాళ్ళకి కేవలం పదిహేను అడుగుల దూరంలో ఉంది. చిరుతని భయపెట్టడానికి సుందర్‌సింగ్, సూరజ్‌లు బిగ్గరగా అరచిన అరుపులు టన్నెల్ గోడలకు తగిలి ప్రతిధ్వనించాయి. చిరుతకి సుందర్‌సింగ్ వెనుక ఎంతమంది జనాలు ఉన్నారో తెలియలేదు. పట్టాల మధ్యనుంచి చప్పున లేచి, వెనుకకు తిరిగి, చీకట్లోకి గెంతి మాయం అయిపోయింది. పూర్తిగా బయటకు వెళ్ళిపోయిందని నిర్ణయించుకోవడానికి వాళ్ళిద్దరూ టన్నెల్‌కి ఆ చివరి వరకూ నడచి వెళ్ళి వచ్చారు. తరువాత కొంతసేపటికి ట్రైన్ సూరజ్ కలల్లో కనిపించే డ్రాగన్‌లాగా మెలికలు తిరుగుతూ, నిప్పురవ్వలు చిమ్ముతూ టన్నెల్‌ద్వారా వెళ్ళిపోయింది.
వారంరోజుల తరువాత అదే రైలులో తండ్రితో కలిసి సూరజ్ రాత్రిపూట ప్రయాణిస్తున్నాడు. కిటికీలోనుంచి బయటకు చూస్తుంటే అక్కడక్కడా మినుకు మినుకు మంటూ దీపాల వెలుగులు కనిపిస్తున్నాయి. రైలు పెద్ద శబ్దం చేస్తూ బ్రిడ్జ్‌ని దాటింది. టన్నెల్‌వైపు ప్రయాణిస్తుంది. సూరజ్ తాను కొన్నిరోజుల క్రితం కలసిన సుందర్‌సింగ్ కోసం కిటికీలోనుంచి చికట్లోకి కళ్ళు చికిలించుకొని చూస్తున్నాడు. టన్నెల్‌లోనికి ప్రవేశించడానికి ముందు చిన్న చమురు దీపం వెలుతురు కనిపించింది. దానికి పట్టుకొన్న సుందర్‌సింగ్ ఆనవాలు తెలియలేదు. రైలు ప్రయాణీకులకు ఆ వెలుగు దీపానిదో, మిణుగురు పురుగులదో తెలియనే తెలియదు. కానీ ప్రతీ రోజూ వెళ్ళే రైలుబండికోసం, చిరుతపులులకోసం ముసలి వాచ్‌మ్యాన్ దానిని వెలిగిస్తూనే ఉండాలి.
ఈ కథని చదివాకా ఏవో జ్ఞాపకాల దారులు తెరుచుకొన్నాయి. కొంతకాలం క్రితం కాకినాడకి సమీపంలో ఉన్న వాకలపూడి లైట్‌హౌస్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ నావిగేషనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒకాయన వివిధ లైట్‌హౌసుల్లో తాను పనిచేసినప్పటి జ్ఞాపకాలని నాతో షేర్ చేసుకొన్నారు. నాగాయలంక దగ్గర ఒకలైట్‌హౌస్ తీరంనుంచి 22 కిలోమీటర్లదూరంలో ఉన్న ఒక చిన్న దీవిలో కట్టారట. సముద్రతీర ప్రాంతంలో చిత్తడి నేలల్లో పెరిగే మడ అడవుల లాంటి ప్రదేశం అది. ఒక్కొక్క ఉద్యోగీ 15 రోజుల చొప్పున రొటేషన్ పద్దతిలో అక్కడ పనిచెయ్యాలి. ఉద్యోగిని స్టీమర్‌మీద తీసుకొనివెళ్ళి ద్వీపంలో దింపుతారు. సరిపడా మంచినీళ్ళు, ఆహారపదార్థాలు, మందులు తీసుకొనివెళ్ళి క్వార్టర్స్‌లో ఉండి, వొండుకొని తింటూ ఉద్యోగం చెయ్యాలి. తాను తప్ప మరొక్క మనిషిమాత్రుడు ఎవ్వడూ కనిపించడు. టెలీఫోన్ సౌకర్యం ఉండదు. జ్వరం వచ్చినా, జలుబు చేసినా వైద్యం కూడా అందుబాటులో ఉండదు. తిరిగి వెళ్ళాలంటే ఇంకొక ఉద్యోగి రిలీవ్ చెయ్యవలసిందే! ఏడుపు వచ్చేదని, భయం వేసేదని, ఇంటి మీద బెంగతో అన్నం సహించేది కాదని.. ఆయన చెపితే అయ్యో అనిపించింది. ప్రపంచానికి అక్కర్లేనట్టు ఏదో మూలన విధులు నిర్వహించే వాళ్ళకు కూడా కథలు ఉంటాయి - వాటిని మనసుకి హత్తుకొనేలా చెప్పగలిగే రస్కిన్‌బాండ్లు ఉంటే.
రస్కిన్‌బాండ్ చిన్నప్పటినుంచీ హిమాలయాల ప్రాంతంలో పెరిగిన కారణంగా అతని రచనలు చాలా వాటిల్లో అక్కడి గ్రామాల్లో కనిపించే ప్రాకృతిక సౌందర్యం ఉంటుంది; అతని చిన్నప్పటి జ్ఞాపకాలు తొణికిసలాడుతూ ఉంటాయి; హిల్‌స్టేషన్‌లు, రైల్వే లైన్లు, జంతువులు, పక్షులు, మొక్కలు, అన్నింటికన్న ముఖ్యంగా తాను చూసిన మనుష్యులు అణువణువునా నిండి ఉంటారు. వందల సంఖ్యలో కథలు, పదుల సంఖ్యలో కథాసంకలనాలు, నవలలు, వ్యాసాలు, బాలసాహిత్యం ఏ బుక్‌షెల్ఫ్‌లో చూసినా కనిపిస్తాయి. బాండ్ రాసిన రచనలు చదివితే మంత్రముగ్ధులమైపోయినట్టు మళ్ళీ, మళ్ళీ మరిన్ని రచనలు చదవాలనిపించే స్థితిలోనికి వెళ్ళిపోతాం. ప్రపంచ వ్యాప్తంగా రస్కిన్‌బాండ్‌కి లక్షల్లో అభిమానులున్నారు. కానీ ఆయన మాత్రం హడావుడికి దూరంగా ఓ చిన్న ఊరిలో నిడారంబరంగా బ్రతికేస్తూ ఉంటాడు. బ్రిటిష్ సంతతికి చెందిన రస్కిన్‌బాండ్ 1934లో భారతదేశంలో జన్మించాడు. బాల్యం అంతా సిమ్లాలో, గుజరాత్‌లో గడిచింది. రస్కిన్‌బాండ్ చిన్నప్పుడే అతని తల్లి భర్త నుంచి విడిపోయి మరో వివాహం చేసుకొంది. ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసే తండ్రి కూడా కొన్ని రోజులకి మరణించాడు. రస్కిన్‌బాండ్ నానమ్మ, అత్తల దగ్గర పెరిగాడు. చిన్నప్పటి నుంచీ కథలు రాసేవాడు. పాఠశాల స్థాయిలోనే ఎన్నో బహుమతుల్ని గెలుచుకొన్నాడు. భారతదేశం అంటే ఎంతో ఇష్టం రస్కిన్‌బాండ్‌కి. ఆ ఇష్టాన్ని తన రాతల్లో చక్కగా వ్యక్తీకరిస్తాడు. పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాసిన `ద రూం ఆన్ ద రూఫ్` అనే నవలకి బ్రిటన్‌లోని ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డ్ వచ్చింది. చాలా కథలు, నవలలు రాశాడు. చిన్నపిల్లల కోసం రాసిన కథలు కూడా బాండ్‌కి మంచి పేరు తీసుకొని వచ్చాయి. సాహిత్య అకాడమీ అవార్డ్, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులని గెలుచుకొన్నాడు. ప్రస్తుతం ముస్సూరీలో ఉంటున్నాడు.
తోటివాళ్ళ ఇబ్బందులు చూసి ఆయ్యో అనుకొనేలా చెయ్యగల దృక్పదాన్ని ఒక్కో కథ కలిగిస్తుంది. అటువంటి కథే రస్కిన్‌బాండ్ రాసిన `ది టన్నెల్`. బాండ్ రాసిన ఎన్నో మంచి కథలు, నవలలు ఉన్నాయి. అవకాశం ఉంటే తప్పని సరిగా చదవండి.