భక్త సులభుడైన శ్రీమహావిష్ణువు శ్రీమహాలక్ష్మికి యామునాచార్య చరిత్రను వివరిస్తున్నాడు. ఆ పద్మాలయ తన ముఖపద్మము వికసించగా, నయనపద్మములను విప్పార్చుకుని ఆసక్తిగా వింటున్నది. వీరశైవుడైన పాండ్యచక్రవర్తికి భార్యయైన వీరవైష్ణవురాలైన ఆ పట్టపురాణి వింగడం బైనట్టి ముంగిట నెలకొన్న / బృందావనికి మ్రుగ్గు వెట్టుఁదానదశమినాఁ డేకభుక్తముఁ జేసి యవలినాఁ / డోర్చి జాగరముతో నుండు
నిట్రు బారసి పోనీదు పై నిద్రఁ బాఱుట / క్కలుపాడు మత్పుణ్య కథలఁ ద్రోయు
నేమంపుమూన్నాళ్ళు కామింప దధినాథు / మఱునాఁడు కన్నును మనసు దనియ
నారజపువన్నెఁ బతిసెజ్జ కరుగుఁ గూర్మి
నరుగుచో నాభిఁ దుడిచి కప్పురపునాభిఁ
బెట్టు నిట్టులు మద్భక్తి పుట్టియును ని
జేశు నెడ భక్తి చెడదు మదిష్ట మగుట
చక్కగా తీర్చి విభజించి ఉన్న ముంగిట్లో ఉన్న బృందావనములో, మహారాణి ఐనప్పటికీ తానే ముగ్గులు పెట్టేది. బృందావనము అంటే తులసితోట. దశమితిథినాడు ఒంటిపూట భోజనముచేసి, ఆవలినాడు అంటే ఏకాదశినాడు ‘నిట్టుపవాసము’ ఉండి జాగారముచేసేది. ఈ విధముగా ద్వాదశివ్రతమును(బారసి)పడనిచ్చే
వనజజరుద్రాదులు మ
త్తనువుల తత్పూజనంబు తథ్యము మత్పూ
జనమ తదీప్సితఫలదా
తను నేన యటైన గలవు తరతమవృత్తుల్
వనజము(కమలము)న జన్మించిన బ్రహ్మ, రుద్రుడు మొదలైనవారు నా శరీరులే, వారూ నా అంతర్భాగములే,వారిని పూజించడం కూడా నన్ను పూజించడమే, వారిని పూజించినా ‘ఫలమును’ ఇచ్చేది నేనే, ఐనప్పటికీ బ్రహ్మ రుద్రాదులకు, నాకు తరతమ స్థాయీ భేదాలున్నాయి, వారికి, బ్రహ్మరుద్రాదులకు కూడా ఫలమును ఇచ్చేది నేనే, అని తనతత్వాన్ని శ్రీమహాలక్ష్మితో చెప్తున్నాడు శ్రీమహావిష్ణువు, ఆ నెపముతో మహావిష్ణుతత్వాన్ని వీరవైష్ణవుడైన శ్రీకృష్ణదేవరాయలు మనకు చెప్తున్నాడు. ‘సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి’ సర్వదేవతలకు చేసే నమస్సులు అన్నీ సుమనస్సుల మనస్సులలో కొలువై నమస్సులు అందుకునే నారాయణమూర్తికే చెందుతాయి అనే వేదాంతవాక్యాన్ని ఇక్కడ ప్రతిధ్వనించాడు జ్ఞానిఐన రాయలు. (సుమనస్సులు అంటే దేవతలు) కేవలశరీరదృష్టినదేవతలన్వేఱ కలుగఁ దెలిసినజడులన్ నావాసుదేవతాస్థితి భావింపనిపూజ సాంతఫలమైత్రిప్పున్ కేవలము శరీర దృష్టితో యితరదేవతలకు నాకు భేదమున్నదని అనుకునే మూర్ఖజనులుచేసే పూజ, నా వాసుదేవతత్వాన్ని తెలుసుకోకుండాచేసే పూజ అంతమయ్యే ఫలితాన్ని ఇస్తుంది. అనంతమైన ఫలితాన్ని, అంటే ముక్తిని ఇవ్వదు, అంటే పరిమితమైన పుణ్యఫలితాన్నే ఇచ్చి, వ్యాధి, జరాపీడితమైన జనన మరణ రూపక సంసారచక్రములో త్రిప్పుతునే ఉంటుంది, ఒక దరి, అంతము అనేది లేకుండా అని చెప్తున్నాడు శ్రీమహావిష్ణువు. ‘సర్వత్రాసౌ సమస్తం చ వసత్యత్రేతివై యతః అతోస్య వాసుదేవేతి విద్వద్భిః పరి పఠ్యతే’ అని విష్ణుమహాపురాణము ఒక శ్లోకములో తెలియజేస్తుంది. అన్నిచోట్ల, అన్నిటిలో వసించియున్న కారణముగా వాసుదేవుడు అని పిలువబడుతున్నాడు. ఇదే భావాన్ని ‘వాసనాద్వాసుదేవస్య వాసితంభువనత్రయమ్ సర్వభూతనివాసోఽసి వాసుదేవ నమోఽస్తు తే ’ అని విష్ణు సహస్రనామస్తోత్రము చెప్తుంది. ఈ భావాన్ని ఇక్కడ పలికిస్తున్నాడు, వేదాంత రహస్యసుధను ఒలికిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. రాయల ఆధ్యాత్మికజ్ఞానసాగర గంభీరతకు ఇలాంటి పద్యాలూ, సందర్భాలు ఉదాహరణలు. ఇక్కడ మనోహరమైన ఒక చిన్నివచనములో మహావిష్ణువు తనమతమును స్థాపించుటకు యామునాచార్యులవారిని రాజాస్థానమునకు పంపడానికి నిర్ణయించుకున్న విషయాన్ని వర్ణించాడు రాయలు. రాయల కవనప్రతిభను, వర్ణనావైచిత్రిని ఇలాంటి వచనములు విభిన్న కోణములలో ఆవిష్కరిస్తాయి కనుక ఆ వచన తాత్పర్యాన్ని తెలుసుకుందాము. శ్రీమహావిష్ణువు యామునాచార్యుడు పండితవాదము చేసిన సందర్భాన్ని శ్రీమహాలక్ష్మికి వివరిస్తూ “ నా వాసుదేవతత్త్వ రహస్యాన్ని తెలుసుకొనలేని ఆ చక్రవర్తి తామసుడై, నా విధేయులగు భక్తులను సామాన్యబుద్ధితో చూస్తూ, వారికి జరిగే ఉపద్రవాలను ఉపేక్షచేస్తూ వారి రక్షణకు విముఖుడై ఉండడాన్ని చూసి, కలియుగములో కృతమాల - తామ్రపర్ణి నదీ తీరములలో నా భక్తులు తగ్గిపోవడము వలన, ఆ దేశానికి ప్రభువు అతను అవడం వలన, రక్షణ అయినా శిక్షణ అయినా రాజముఖం ద్వారా తప్ప నేను ప్రత్యక్షముగా చేయను కనుక, ఆ రక్షణ చేయాలనే సంకల్పము నాయందు భక్తిచేతనే కలుగుతుంది కనుక, నాయందు భక్తి వాదము జరిగి, నా ఔన్నత్యము ప్రతిపాదింపబడడం వలననే జరుగుతుంది కనుక, నేను ఆలోచించి, చక్రవర్తి ఆస్థానమును చేరి వాదము చేయాలనే కోరికను ఆ విప్రకుమారుడు ఐన యామునాచార్యునకు పుట్టించగా, ఆతను వెళ్లి, నానా దేశాలకు చెందిన దీనులకు, అనాథలకు, వృద్ధులకు, బ్రాహ్మణ కుటుంబములకు ధాన్యము, జింక చర్మములు, వస్త్రములు, బ్రహ్మచారుల పెళ్లిళ్లకు, ఉపనయనములు కానివారికి ఉపనయనములకు, కుంటి, గ్రుడ్డి, చెవిటివారికి ఎడ్లు మొదలైన వాహనములను, అంతేగాక, చెరువు ఎండిపోయింది అనే వారికీ, జీర్ణ దేవాలయాలలో పూజలు జరగడంలేదు అనే వారికీ, ఎండలకు దారులలో చలువపందిళ్ళు, చలివేంద్రాలు స్థాపిస్తాము అనే వారికీ,పితృదేవతల తిథులకోసం అనేవారికి, తీర్థయాత్రలకు వెళ్తాము అనేవారికి, ఉద్యాపనలు చేసి వ్రతములను పూర్తిచేసుకుంటాము అనేవారికి, వ్యాధులను నయము చేయించుకుంటాము అనేవారికి, ఆ రాణివాసమునుండి కొన్నిటికి రహస్యముగా, కొన్నిటికి బహిరంగముగా ధనమును తెచ్చి ఇచ్చే వృద్ధపాషండులచేతులకు ముసురుకుని, తోరణములవలె సాచినసందిళ్ళతో నిండిన ఏకదండి, త్రిదండి బ్రహ్మచారుల, యతుల దండములకు ఎగురుతున్న కాషాయ వస్త్రముల, కౌపీనముల పరంపరలతో నిండినది, కావలివారి స్తంభములకున్న జెండాల నీడలకు మరిగి, కేవలము దీనత్వముతో యాచించడమే విద్య, మిగిలినది ఏదీ విద్య కాదు అన్నట్లు వేడుకునే ఇలాంటి అనేకులకు ఆధారమైనది ఐన ఆ అంతఃపుర పడమటిద్వారాన్ని చేరుకొని, ప్రతిదినమూ నా పాదభజనకథాశ్రవణము చేసే ఆ మహారాణికి ద్వారపు కావలివాని ద్వారా ఆశీః పూర్వకమైన అక్షతలను పంపి, ‘నేను విదేశీయుడనైన వైష్ణవుడను, వాదించేవారు ఎవరైనా ఉంటే శ్రీమహావిష్ణువే పరదైవము అని వాదించి గెలువగలవాడను, మహారాజు విష్ణుద్వేషి కనుక, ఈ వైష్ణవుని విన్నపాన్ని ఆయనకు వినిపించడానికి అందరూ భయపడుతారు కనుక, మీరు విష్ణుభక్తి కలిగిన సాధ్వీమణులు, పతికి హితముగా నడుచుకునేవారు కనుక, మీకు విన్నవించుకుంటున్నాను, ఈ వర్తమానమును పంపించుకుంటున్నాను, మీ భర్త మీకు విధేయుడు కనుక నా కోరికను ఆయనకు విన్నవించి, నన్ను రప్పించి, వాదము చేయించగలరేని, వాదము చేసి, గెలిచి, మీ భర్తకు భగవద్భక్తి పుట్టించి కృతార్థుడిని చేస్తాను’ అని విన్నవించి, వర్తమానమును పంపించాడు ద్వారపు కావలి భటునిద్వారా” అని తెలియజేశాడు. ఈ చిన్ని వచనములో కూడా చివరన ఒక చమత్కారపు చురక వేశాడు శ్రీకృష్ణదేవరాయలు. ‘ మీ భర్తకు భగవద్భక్తిని పుట్టించి కృతార్థుడిని చేస్తాను’ అని యామునాచార్యుల నోటితో పలికించి, ‘భగవంతుడు’ అంటే శ్రీమహావిష్ణువే అని అన్యాపదేశముగా తెలియజేశాడు, శ్రీహరి అనో విష్ణువు అనో ప్రత్యేకముగా చెప్పించకుండా
!గ్రీష్మసమయనిరుత్సాహ కేకి
రమణినవఘనధ్వని కలరుచందమున నలరి
యేకతపు నర్మగోష్ఠిఁ బ్రాణేశుతోడ
నతని విధ మెఱిఁగింప నిట్టట్టు వడుచు
గ్రీష్మ సమయములో నిరుత్సాహముగా ఉన్న ఆడునెమలి కొత్త మేఘములు చేసే ధ్వనులకు ఉరుములకు ఆనందపడినట్లు ఆనందంగా, ఏకాంతంలో గుసగుసలతో తన ప్రాణేశ్వరునితో ఆ యామునాచార్యునిసంగతి చెప్పింది మహారాణి. ఆకాశం మేఘావ్రుతము ఐనప్పుడు నెమళ్ళు ఆనందిస్తాయి, మగ నెమళ్ళు అయితే ఆనందంగా పురివిప్పి నాట్యంకూడా చేస్తాయి. అంటే అప్పుడు వాటి ‘మూడ్’ బాగుంటుంది కనుక, దగ్గరికి చేరడానికి ఆడ నెమళ్ళకు సంకోచము, భయము ఉండదు, మగనెమళ్ళకు అభ్యంతరము ఉండదు, పైపెచ్చు ఆనందం కలుగుతుంది. కనుక అలా సంతోషంగా ఏకాంతంలో యామునాచార్యుని గురించి ప్రస్తావించగా ‘ఆశ్చర్యపడుతూ’ (ఇట్టట్టు పడుచున్) భూవల్లభుఁ ‘డెట్టెట్టూ తా వాదముఁ జేసి శివమతంబు జయింపం గా వచ్చెనొ? చూతముగా,రావింపు’మటన్న నాఁటి రాత్రి చనంగన్ మహారాజు ఆశ్చర్యపడుతూ ఎట్లెట్లా! తాను వాదము చేసి శివమతమును జయించడానికి వచ్చాడా? చూద్దాము కదా, తాను జయిస్తాడో, నా శైవాచార్యులు జయిస్తారో, రప్పించు! అన్నాడు. ఆ రాత్రి గడిచిపోయి, తెల్లారినతర్వాత, ముఖ్యులైన కొందరితో పరిమితముగానున్న సభలో కొలువైన భర్త అనుమతితో, ప్రతీహారిని పంపించి ఆ భూసుర కుమారుడిని సభకు పిలిపించింది మహారాణి.ద్వారంబు సొచ్చి
కీలితగారుడమహి వజ్ర వేదికం జివురులఁ గెం
పారు నొక పిప్పలముఁ గని
యా రావి న్వాదసాక్షికై వలగొనుచున్
యామునాచార్యుడు సభామంటప ద్వారాన్ని ప్రవేశించి, గరుడపచ్చలతో తాపడంచేసిన భూమధ్యభాగములో వజ్రాలతో తాపడం చేసిన వేదికను, ఆ వేదిక మధ్యన కెంపులలాగా ఎర్రని చిగుళ్ళున్న ఒక రావిచెట్టును చూసి, రావిచెట్టు మహావిష్ణుస్వరూపము కనుక(వేపచెట్టు లక్ష్మీస్వరూపము, కనుక ఈ రెండువృక్షాలూ కలిసిఉన్నదగ్గర రెండిటికీ కళ్యాణం చేయించడం భారతీయుల సంప్రదాయం, ప్రజల కళ్యాణంకోసం) ఆ రావిచెట్టును తన వాదానికి తీర్పును చెప్పడానికి, సాక్షిగా భావించి ప్రదక్షిణాలు చేసి, నమస్కరించి చుట్టూ కలయజూశాడు.
(కొనసాగింపు తరువాయిసంచికలో)
***వనం వేంకట వరప్రసాదరావు.