సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

ఆముక్తమాల్యద  (గతసంచిక తరువాయి)

పాండ్యరాజు సభాస్థలికి చేరుకున్న యామునాచార్యుడు ఆ సభాప్రాంగణంలో ఉన్న రావిచెట్టుకు  ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించి చుట్టూ కలయజూశాడు.

పసిఁడిగ చ్చమర సోపానముల్ మూఁటఁ దుం / గితవిశాలితయుఁ జిత్రితయు నైన
సభ మహాకుథముపై శార్దూల చర్మ కం / థావృతుల్ జటిలులు నైన జరఠ
మాహేశ్వరులు చుట్టి  రా హారసంధి రు / ద్రాక్షా యుతముఁ దాల్చి యళికభూతి
సురఁటిగాడ్పుల రాల నరుణాయతాక్షుఁడై / కుఱుగద్దె బిల్లఁ బ్రకోష్ఠ మునిచి

నంది ముద్రితపాణియందుఁ జెక్కూఁది యా / గమములు వినుచు హేమము పొదివిన 

యలఁతి రుదురాకగమి కుట్టులందు మెఱయ
వెలితపారంబు మించ దువ్వలువగప్పి
యడపమును వాఁడివా లొక్క యతివ తాల్ప
భార్య వింజామ రిడ నొప్పు పాండ్యుఁ గనియె

బంగారపు పూతతో మూడు అంతస్తులుగా మిక్కిలి పొడవూ వెడల్పూకలిగి, వివిధ చిత్తరువులతో  అలంకరించబడియున్న దీర్ఘమైన సభామంటపంలో పులితోళ్ళు, కంబళ్ళు కప్పుకున్న వృద్ధులైన  లింగధారులు తనను పరివేష్టించియుండగా, రత్నహారముల నడుమ నడుమ రుద్రాక్షలను ధరించి, వింజామరల చిరుగాలులకు తను ధరించిన విభూతికణాలు రాలుతుండగా యెర్రని కన్నులతో చిన్న గద్దెమీద చిన్నదిండు మీద మోచేయి ఆన్చి, నంది రూపు చెక్కిన ఉంగరాలు కలిగిన చేతిని చెంపకు ఆనించి ఆ శైవులు చదువుతున్న ఆగమాలను వింటూ, బంగారపు కుట్టుపోగుతో రుద్రాక్షలు పొదిగిన తెల్లని తలపాగానుధరించి, వాడియైన ఖడ్గమును, తాంబూలపు పేటికను ఒక వనిత ధరించి చెంత నిలువగా, తన భార్య వింజామర వీస్తుండగా దర్పంగా, ఠీవిగా, రాజసంగా వెలిగిపోతున్న పాండ్యచక్రవర్తిని చూశాడు. ఒక చిత్తరువు గీసినట్టుగా చేసిన అద్భుత వర్ణన! అలా దర్పంగా కూర్చున్న రాజును చూసి వినయముగా సమీపించి, ఒక యజ్ఞోపవీతమును కానుకగా సమర్పించి కూర్చున్నాడు యామునాచార్యుడు. ఆ అతిథిని గౌరవంగా సంభావించడం అటుంచి, నేరుగా అహంకారంతో ప్రశ్నించాడు పాండ్యరాజు.

సంగతియె యోయి యిసుమంత ఠింగణావు
తత్త్వనిర్ణయవాదంబు తరమె నీకు?
నోడితేనియుఁ బట్టి మొఱ్ఱో యనంగ
లింగమును గట్ట కుడుగ, మెఱింగి నొడువు!

పద్ధతేనా? ఏంటి సంగతి? ఇసుమంత వాడివి, భూమికి జానెడు లేవు, తత్త్వనిర్ణయవాదము నీతరమవుతుందా? ఓడిపోయావో, నిన్ను పట్టుకుని, మొఱ్ఱో అన్నా శివలింగమును నీ మెళ్ళో కట్టకుండా వదలము, అది తెలుసుకుని మాట్లాడు అని హేళన, ధిక్కారము, చులకన వ్యక్తం చేస్తూ పలికాడు పాండ్య ప్రభువు. అంతటితో ఆగకుండా చులకనగా యిలా మాట్లాడడం మొదలెట్టాడు.

వాదుల మటంచుఁ జెప్పించి వత్తు రోట
మైన దయ నీరె యేమైన నని విలజ్జ
జూటుఁదనమున సభ లెక్కు చొరవకాండ్రు
పారువారలసుద్ది సెప్పంగ నేల 

మేము వాదులము, వాదించి తత్త్వ నిర్ణయం చేస్తాము అని చెప్పించి ( నీలాగే రాణి తోనో  ఎవరితోనో పైరవీ చేయించి) వస్తారు, ఓటమి చెందుతారు, ఆ తర్వాత సిగ్గు లేకుండా దయతో ఏమైనా యిప్పించండి అని ప్రాథేయపడతారు, మోసపు మాటలతో (జూటుఁదనమునన్) చొరవ కలిగిన చోరులు, ఇక ఓడిపోయి పారిపోయేవాళ్ళ సంగతి చెప్పడం ఎందుకు! అని పలికి, దరహాసంతో వ్యంగ్యంగా రాణిని చూస్తూ యిలా అన్నాడు.

అస్మన్మతస్థుఁ డోడిన
భస్మము రుద్రాక్షములును  బాసి యితనిచే
విస్మయముగఁ దప్తపుముర
ఘస్మరచక్రాంకితుండఁ గాఁగలవాఁడన్  

రాణివైపు చూస్తూ పరిహాసంగా, పందెంగా , ‘నా మతస్థుడు ఓడిపోతే ఈ భస్మమూ రుద్రాక్షలూ వదిలేసి ఈ కుర్రకుంక చేతులమీదుగా మురాసురుడిని తినేసిన(సంహరించిన అని) సుదర్శన చక్రమును బాగా కాల్చి దానితో గుర్తులువేయించుకుంటాను, విష్ణు చక్ర శంఖములను బాగా వేడి చేసి వాటి ముద్రలు వేయించుకోవడం ‘సమాశ్రయణం’, అంటే మేము విష్ణుదాసులము అని అంగీకరించి ప్రకటించుకోవడం అనబడుతుంది, కనుక నేను వైష్ణవుడిని అవుతాను.

ఉవిద! యీ నీదువిద్వాంసుఁ డోడెనేని
నీకు నితని కే నన్నపూనికయ యన్న
‘నొప్పితిమి దేవ రానతి దప్పకున్నఁ
జాలు మఱి పంచభూతముల్సాక్షి కాఁగ’

దేవీ! యీనీ విద్వాంసుడు ఓడిపోతే నీకు ఇతడికి కూడా నేను అన్నట్లే జరుగుతుంది, అంటే బలవంతంగా మెళ్ళో శివలింగాన్ని కట్టి శైవాన్ని అంటగడతాను! అని అనగానే,  రాణి ‘ మీ పలుకులకు పందానికి ఒప్పుకున్నాము(మేమిద్దరమూ) దేవరవారు తమరు చేసిన వాగ్దానాన్ని తప్పకుంటే అంతే చాలు!  పంచభూతాలు మీ మాటలకు సాక్షులుగా ఉన్నాయి సుమా! అన్నది. రాజు రాణి యిద్దరూ చేసిన ప్రతిజ్ఞలను, వారి పందాలను వింటున్న బాలకుడు యామునాచార్యుడు ప్రభూ! యిలా మీరు ఆనతి చేయదగదు, నేను కడుపుకూటి  నిమిత్తము యాచించుటకు వాదపు మిషతో వచ్చినవాడను గాను. నేను ఎవరికోసం సంపాదించాల్సిన అవసరం ఉన్నది, ఇల్లూ వాకిలీ భార్యా పిల్లలూ ఏమీ ఎవరూ లేని సన్యాసిని, అందునా యాచించడం నా హక్కు, యాచించడం నాకు (సన్యాసికి) విధిగా ‘విధి’ సృష్టించియే ఉన్నాడు కదా. ఏ సర్వాంతర్యామి ఐన పరాత్పరుడు తన ఆజ్ఞచే ప్రేరేపించాడో, ఆయన ఆజ్ఞయే నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. తెలిసిన నాలుగు విషయాలు చెప్తాను, ఒకవేళ తప్పులుంటే ఆయనవే, ఒప్పులున్నా ఆయనవే, నేను భగవదాజ్ఞానువర్తినై వచ్చినవాడిని కేవలం. ఒకవేళ తమరు అన్నట్లే ప్రతివాదులచేతిలో నేను ఓడిపోయిననూ పోనివ్వండి మహారాజా! మహారాణి తీసుకువచ్చిన విద్వాంసుడు అని అమ్మను (రాణిని) నిందింపనవసరము లేదు, మహారాణి తరపువాడిని అని కనికరము చూపించాల్సిన అవసరమూ లేదు, మీకు ఎలా సమ్మతమైతే అలా చేయండి, పర్లేదు! అలా పలికి రాజు ఆజ్ఞ తీసుకుని, వాదము మొదలెట్టి ఒక్కరిని సమీపించి వారు పలికిన వాటిని తాను పలికి విశదీకరించి, అప్పుడు వాటిని ఖండిస్తూ తన ఉపమానాలను సోదాహరణముగా శ్రుతులనుండి, స్మ్రుతులనుండి, బ్రహ్మసూత్రములనుండీ ఉటంకిస్తూ, ఒకరితో మాట్లాడేప్పుడు ఇతరులవైపు దృష్టి, ధ్యాస పోకుండా నిగ్రహించుకుంటూ, ఒక్కొక్కరినే ‘ నీవేమన్నావు? రా! వినిపించు నీ సిద్ధాంతాన్ని’ అని ఒక్కొక్కడినే పిలిచి, ఆ తర్వాత వేరే వారిని కూడా ఆహ్వానించి, వారి వారి సిద్ధాంతాలను ఖండించి ఓడిస్తూ, తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఒప్పిస్తూ, ఆ బ్రాహ్మణబాలకుడు అందరినీ గెలిచాడు.

ఆయెడను నొక్కపలు కెదు
రై యుండెడు పిప్పలమున నాయెను విన ‘నో
హో యిది నిక్కము నృప! నా
రాయణుఁడె పరంబు కొల్వుమతని’ నటంచున్

ఆ సమయంలో పరమాద్భుతంగా ఆ సభాస్థలిలో ఉన్న రావిచెట్టు మ్రాను నుండి ‘ఓ రాజా! యిది సత్యము! ఈతని పలుకులప్రకారమే, నారాయణుడే పరదైవము, ఆతనిని సేవింపు’మని ఒక పలుకు వినిపించింది. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. శైవ పాషండులు తలలు వంచుకున్నారు. మహారాజు పట్టరాని ఆనందంతో ఆ బ్రాహ్మణబాలకునికి సాష్టాంగవందనం చేసి, వైష్ణవమతమును స్వీకరించి, ఆ బ్రహ్మచారికి తన అర్ధరాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేశాడు, పాండ్యరాజ్యంలో ఇంటి అల్లునికే రాజ్యాన్ని పొందే హక్కు ఉంటుంది కనుక తన చెల్లెలిని ఆ బ్రహ్మచారికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా ఆ యామునాచార్యుని బ్రహ్మచర్యము, సన్యాసము రెండూ కావేరిలో కలిసి పోయ్యాయి! సామ్రాజ్యం, మదనసామ్రాజ్యం రెండూ కలిసి వచ్చిపడ్డాయి. అనంతరం ఆ యామునాచార్యుడు సకల ధనుర్వేదవిద్యా పారంగతుడు కనుక, తన శత్రువులను జయించి, సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయమని ప్రార్థించి యామునాచార్యుడిని దండయాత్రకు బయల్దేరదీశాడు, కానీ ‘యిది వర్షాకాలం, యుద్ధయాత్రలకు అనువైన సమయము కాదు’ అని మంత్రులు, పురోహితులు చెప్పడంతో మహారాజుకు ఆ విషయాన్ని తెలిపి, తన దండయాత్రను వాయిదావేసుకుని అనువైన సమయం కోసం నిరీక్షించడం మొదలెట్టాడు యామునాచార్యుడు! ఈ సందర్భంలో వర్ష రుతువును, శరదృతువును అనేక పద్యాలను, ఆంధ్రసాహిత్యంలోని అద్భుతమైన ఋతువర్ణనలలో పేర్కొనదగ్గ వర్ణనలు అని ప్రతీతిపొందిన పద్యాలను అందించాడు రాయలు. మచ్చుకు కొన్నిటినిమాత్రం రుచిచూసి ముందుకు సాగుదాం.    

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు  

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి