శ్రీ వీర మంగళ ఆంజనేయస్వామి ఆలయం - పి.యస్.యమ్. లక్ష్మి

శ్రీ వీర మంగళ ఆంజనేయస్వామి ఆలయం,  నల్లత్తూరు

తమిళనాడులోని తిరుత్తణికి దగ్గరగా వున్నది ఈ ఆలయం.  తిరుత్తణిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం తర్వాత మేము ఒక  కారులో మద్దూరు మహిషాసురమర్దనిని, నల్లత్తూరు ఆంజనేయస్వామిని దర్శించి వచ్చాము.  నల్లత్తూరు ఆంజనేయస్వామి ఆలయం పురాతనమైనది.

ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతూనే పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం, ధ్యాన ముద్రలో వున్నది కనిపించింది.  ఈ ఆలయం 15 వ శతాబ్దం నాటిది.  అంటే అప్పటినుంచీ ఇప్పటిదాకా ఆలయం అలాగే వుందనుకోకండి.  మార్పు ప్రకృతికి సహజంకదా!  ఈ ఆలయం గురించి రకరకాల కధనాలున్నాయి.  అవేమిటంటారా?

ఒక కధనం ప్రకారం 15 వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో రాజ గురువు వ్యాసరాయడు వుండేవారు.  ఆయనకొకసారి ఆరోగ్యం బాగా పాడయింది.  ఎన్ని రకాల వైద్యాలు చేసినా బాగుపడలేదు.   వ్యాసరాయడు వైద్యం మీద ఆశ వదిలేసి, ఆంజనేయస్వామిని ప్రార్ధించాడు.  తనకా జబ్బు తగ్గితే వీలయినన్ని ఆంజనేయస్వామి ఆలయాలు కట్టిస్తానని.  జబ్బు తగ్గింది.  కృతజ్ఞతగా ఆయన బతికున్న సమయంలో 754 ఆంజనేయస్వామి ఆలయాలు కట్టించాడు.  వీటిలో నల్లత్తూరు ఆలయం బాగా ప్రసిధ్ధి చెందిందంటారు.

సరే..మళ్ళీ నల్లత్తూరు వెళ్దాము.  ఇక్కడ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే వ్యాసరాయడి మనుషులు తిరుపతిలో ఒక ఆంజనేయస్వామి ఆలయం నిర్మించి, అందులో ప్రతిష్టించటానికని ఆంజనేయస్వామి విగ్రహంతో సహా బయల్దేరారు.  దోవలో విశ్రాంతి తీసుకోవటానికి వారు నల్లత్తూరులో ఆగి విగ్రహాన్ని కింద పెట్టి విశ్రాంతి తీసుకుని తిరిగి బయల్దేరుతూ, ఆ విగ్రహాన్ని తీసుకోబోతే రాలేదుట.  ఆంజనేయస్వామి వ్యాసరాయడి కలలో కనబడి తను అక్కడే వుంటానని, నల్లత్తూరులోనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చెయ్యమని ఆదేశించాడుట.  అట్లా ఆ విగ్రహాన్ని అక్కడ స్ధాపించిన తర్వాత చుట్టూ ఆలయం కట్టారు.

ఇంకొక కధనం ప్రకారం వ్యాసరాయడు ఒక సారి తన చాతుర్మాస వ్రతం తిరుపతిలో సాగించాలని, బయల్దేరి వెళ్తున్నారు.   దోవలో కుశస్ధలి నది ఉధృతమైన వరదతో వుండటంతో నది దాటలేక నల్లత్తూరులోనే ఆగి, తనతో వున్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించి, తన చాతుర్మాస వ్రతాన్ని అక్కడే  పూర్తి చేసుకున్నారు. తర్వాత ఆ విగ్రహం చుట్టూ ఆలయం వచ్చింది.

ఏది ఏమైతేనేం, ఇక్కడ ఆంజనేయస్వామి ప్రతిష్టకు కారకుడు శ్రీ కృష్ణదేవరాయలకి గురువైన వ్యాసరాయడు..ఆయన అనేక ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మింప చేశారు అనేది సత్యం.

ఈయనచే నిర్మించబడిన ఆలయాలు తెలుగునాట కూడా చాలా వున్నాయి.  అనంతపురం జిల్లాలో నెట్టికంటి ఆంజనేయస్వామి,  కడప జిల్లాలోని గండి ఆంజనేయస్వామి, ఇలా ఎన్నో వున్నాయి.


తర్వాత కాలంలో ఆలయం శిధిలమై, విగ్రహం కూడా ఇసుక, మట్టి కుప్పల కింద కూరుకుపోయింది.  కాలక్రమేణా అక్కడుండేవారుకూడా ఆ ఆలయం సంగతి మర్చిపోయారు.

చక్రవర్తి అనే వ్యాపార వేత్త వ్యాపారం పనిమీద ఢిల్లీ వెళ్ళాడు.  ఆయన భార్య చెన్నైలో వున్నది.  ఆంజనేయస్వామి వారిరువురికీ కలలో కనబడి, ఆ ఆలయాన్ని తిరిగి నిర్మించమని చెప్పారు.  వారు స్వామి చెప్పిన విధంగా స్వామి విగ్రహాన్ని వెలుపలికి తీయించి, ప్రస్తుతం వున్న ఆలయాన్ని నిర్మించారు.

ఆలయం ప్రవేశస్తూనే పొడుగాటి కారిడార్ లోంచి వెళ్తే ఆంజనేయస్వామి గర్భగుడి చేరవచ్చు.  ఉపాలయాల్లో సీతా, లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు , వినాయకుడు, నవగ్రహాలు కొలువుతీరి వున్నారు.  కాంపౌండు లోపల పెద్ద పుట్ట వున్నది.

శ్రీ ఆంజనేయస్వామి

ఇక్కడ శ్రీ ఆంజనేయస్వామి ముఖం చిన్న పిల్లవాడి ముఖంలాగా వుంటుంది.  అందుకే ఈయన్ని బాలాంజనేయస్వామి అని కూడా అంటారు.    తోక వెనకనుంచి తలపైకి వచ్చి వుంటుంది.  తోక చివర చుట్టుకున్నట్లు వుంటుంది.  దానికి చిన్న గంట వుంటుంది.   ఇదివరకు  ఆ తోక చివర అమూల్య రత్నముండేదని అక్కడి పూజారిగారన్నారు.  వ్యాసరాయుడు ప్రతిష్టించిన ఆంజనేయస్వామి విగ్రహాలన్నీ ఇలాగే వుంటాయంటారు.

ఈయన ఉత్తరం దిశగా నడుస్తున్నట్లు వుంటుంది.  అక్కడికి ఉత్తర దిశలో తిరుపతి వున్నది.  వ్యాసరాయుడు తిరుపతి వెళ్తూ ఇక్కడ ఆగాడుగనుక అలా వుండి వుండచ్చు.  స్వామి కుడి చేతిలో తామర రేకులతో అభయ ముద్ర, ఎడమ చేతిలో తామర మొగ్గ హృదయానికి దగ్గరగా పట్టుకున్నట్లుంటుంది.  తామర పువ్వు జ్ఞానానికి, ఐశ్వర్యానికి, విజయాలకు చిహ్నం.  ఈ స్వామిని కొలిస్తే అవ్వన్నీ ప్రసాదిస్తాడు.స్వామి నడుంచుట్టూ బెల్టులాంటిది, నడుముకి వేళ్లాడుతూ ఒక కత్తి వుంటాయి.  చేతులకు కేయూరాలు, కంకణాలు వుంటాయి.  కాళ్ళకి రెండు రకాల ఆభరణాలు ..  ఒకటి పాదం పైన వుండే నూపురం, రెండవది చీలమండమీదకి వుండే తండాయ్, అంటే మన కడియాలు.

ప్రస్తుతం వున్న ఆలయం 15 సంవత్సరాల క్రితం నిర్మింపబడింది.  విగ్రహం మాత్రం పురాతనమైనదే.

ఆలయంలోపల వున్న వివిధ వృక్షాలనుంచి వచ్చే గాలి హాయిగొలుపుతూ వుంటుంది.  ఆలయం ప్రక్కనే కుశస్ధలి అనే నది వున్నదిగానీ, దానిలో నీరు లేదు.

ఊరు చిన్నదవటంతో అక్కడ పూజ సామాగ్రి తప్పితే ఏమీ దొరకవు.

విశేష పూజలు

ప్రతి శుక్ర, శనివారాలతోబాటు శ్రీ రామ నవమి, హనుమజ్జయంతి ఉత్సవాలు బాగా జరుగుతాయి.

దర్శన సమయాలు

ఆలయం మధ్యాహ్నం 12-30 నుంచీ సాయంకాలం 4 గం.ల దాకా మూసివుంటుంది.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి