శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, తిరుత్తణి - పి యస్.యమ్. లక్ష్మి.

తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన ఎక్కువ.  ఈ స్వామిని వారు మురుగా అని ముద్దుగా పిలుచుకుంటారు.  ఆ రాష్ట్రంలో స్వామికి ఆలయాలు అనేకం వున్నా, వాటిలో సుప్రసిధ్ధమైన ఆలయాలు ఆరు వున్నాయి.  వాటిని ఆరు పడై వీడు అంటారు.  వీటిలో ఒకటి తిరుత్తణి.  మిగతా ఐదు స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పురకుండ్రం, తిరుచెందూరు.  ప్రస్తుతం మనం తిరుత్తణి గురించి తెలుసుకుందాము.

క్షేత్ర మహాత్యం
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవతలను, మునులను బాధపెడుతున్న శూరపద్ముడనే రాక్షసుని సంహారం చేశాడు.   తర్వాత వల్లీదేవిని వివాహం చేసుకోవటానికి బోయకుల రాజులతో చేసిన చిన్న పోరుకూడా ముగిసిన తర్వాత  ఇక్కడకొచ్చి పూర్తి ప్రశాంతత పొంది ఇక్కడ కొలువైనారని క్షేత్ర పురాణం వల్ల తెలుస్తోంది.  స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడుగనుక ఈ క్షేత్రానికి తణిగై అనే పేరొచ్చింది.  తణిగ అంటే మన్నించుట, ఓదార్చుట.  స్వామి, భక్తుల పాపాలను క్షమించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తనికాచలం, తిరుత్తణి అంటారు.  ఇక్కడ స్వామిని తనికేశన్ అని పిలుస్తారు.  ఇక్కడ నిశ్చల మనస్కులై, అత్యంత భక్తి శ్రధ్ధలతో స్వామిని ప్రార్ధిస్తే, వారి కోరికలు క్షణాల్లో తీరుతాయని భక్తుల నమ్మకం.  అందుకే ఈ కొండని క్షణికాచలం అంటారు.  తమిళంలో తనికాచలం.  స్వామిని ఈ క్షేత్రములో వీరమూర్తి, జ్ఞాన మూర్తి, ఆచార్య మూర్తిగా కొలుస్తారు.  ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆరాధిస్తే మనశ్శాంతి, సుఖం కలుగుతాయని ప్రసిధ్ధి.  స్వామి చాలా శక్తి కలవాడని, ఒకసారి స్వామిని దర్శించిన భక్తులకు ఇంక ఎలాంటి కష్టాలు వుండవని భక్తుల నమ్మకం.

ఇంక ఈ క్షేత్రానికి సంబంధించిన కధల వివరాలు తెలుసుకుందామా?
ఇంద్రుడు తన కూతురు దేవసేనను సుబ్రహ్మణ్యస్వామికిచ్చి వివాహం చేసినప్పుడు అల్లుడికి కానుకగా ఐరావతాన్ని కూడా ఇచ్చాడు.  ఐరావతం ఇంద్రలోకంనుంచి వెళ్ళిపోయినదగ్గరనుంచీ, ఇంద్రుని సంపదలు తరిగిపోసాగాయి.  అది గమనించిన కుమారస్వామి ఇంద్రునికి ఐరావతాన్ని తిరిగి ఇచ్చెయ్యబోతాడు.  కానీ ఇంద్రుడు అల్లుడుకిచ్చిన కానుకను తిరిగి తీసుకోవటానికి అంగీకరించక ఐరావతాన్ని ఇంద్రలోకం వైపు తిరిగి వుండేటట్లు వుంచమని మాత్రం కోరతాడు.  దానితో ఇంద్రలోకం తిరిగి కళకళలాడుతుంది.  దీనికి ప్రతీకగా ఇక్కడవున్న ఏనుగు తూర్పు దిక్కుకి తిరిగి వుంటుంది.

ఇంద్రుడు తన కూతురు వివాహ సమయంలో ఒక గంధం తీసే రాయినికూడా ఇస్తాడు.  దీనిమీద తీసిన గంధాన్ని స్వామికి పూస్తారు.  ఈ గంధం చాలా ఔషధ గుణాలు కలిగివుంటుందంటారు.

ఇక్కడికి దగ్గరలోనే వల్లిమలై వున్నది.  వల్లీదేవితో స్వామి వివాహం జరగటంలో  సుబ్రహ్మణ్యస్వామి అగ్రజుడైన వినాయకుడు  సహాయపడ్డాడుట.  అందుకే ఇక్కడి వినాయకుణ్ణి ఆపత్ సహాయ వినాయగర్ అంటారు.

కుమారస్వామి ఇక్కడ తన తండ్రిని పూజించాలని,  తన స్ధానానికి ఈశాన్య భాగాన శివ లింగం ప్రతిష్టించి సేవించాడు.  తనయుడి పితృ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు కుమారస్వామికి జ్ఞాన శక్తి అనే ఈటెను అనుగ్రహించాడు.  ఆ కారణంగా స్వామికి జ్ఞానశక్తి ధరుడు అనే పేరొచ్చింది.  కుమారస్వామి స్ధాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది.  కుమారస్వామి శివుణ్ణి అర్చించటానికి సృష్టించిన తీర్ధానికి కుమార తీర్ధమని, శరవణ తటాకమని పేరు పొందింది.  ఇది కొండ కింద వున్నది.

త్రేతా యుగంలో శ్రీ రామచంద్రుడు రావణ సంహారానంతరం రామేశ్వరంలో ఈశ్వరుడిని ఆరాధించాడు.  ఈశ్వరుని సూచన ప్రకారం ఇక్కడికి వచ్చి, ఈ స్వామిని సేవించి మనశ్శాంతిని పొందాడు.

ద్వాపర యుగంలో అర్జనుడు దక్షిణ దేశ యాత్ర చేస్తూ, ఈ స్వామిని సేవించాడు.   తారకాసురుడితో యుధ్ధం సమయంలో తారకాసురుడు సుదర్శన చక్రాన్ని సుబ్రహ్మణ్యస్వామి మీదకి విసురుతాడు.  ఆ చక్రం స్వామి ఛాతీ భాగానికి తగిలి కొద్దిగా నొక్కుకు పోయినట్లు అవుతుంది.  ఇక్కడ స్వామి విగ్రహంలో ఛాతీ దగ్గర కొంచెం అణిగినట్లు కనబడుతుంది.   తర్వాత తారకాసురుడి దగ్గరనుంచి గెలుచుకున్న శంఖ చక్రాలను శ్రీ మహావిష్ణువుకి ఇస్తాడు స్కందుడు.

మరి మన బ్రహ్మగారేమో మురుగన్ అడిగిన ప్రణవార్ధం వివరించలేక ఆయన చేతిలో బందీ అయి, సృష్టి చేసే సామర్ధ్యం కోల్పోతాడు.  ఇక్కడ బ్రహ్మ తీర్ధంలో ఈ స్వామిని సేవించి బంధ విముక్తుడవుతాడు.

దేవేంద్రుడు ఇక్కడ ఇంద్ర తీర్ధములో  కరున్ కువలై  అనే అరుదైన పూలమొక్కను నాటాడు.  ప్రతి రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పూవులతో ఈ స్వామిని పూజించి తారకాసురుడు మొదలైన రాక్షసులవల్ల పోగొట్టుకున్న ఇంద్రలోక ఐశ్వర్యాలను తిరిగి పొందగలిగాడు.

నాగరాజు వాసుకి సముద్ర మధనంలో తనకైన గాయాలనుంచీ  ఈ స్వామిని సేవించటంవల్ల ఉపశమనం పొంది ఆరోగ్యవంతుడయ్యాడు.  అగస్త్యుడు ఈ స్వామిని ప్రార్ధించి తమిళ భాషా పాండిత్యం వరంగా పొందాడు.

పూర్వం సుప్రసిధ్ధ కవి అరుణగిరినాధార్ ఈస్వామిని, ఈ క్షేత్రాన్ని పొగుడుతూ అనేక కవితలు రాశారు.  200 సంవత్సరాల క్రితం ముత్తుస్వామి దీక్షితార్ కి స్వామి ఇక్కడు ఒక వృధ్ధుని రూపంలో కనబడి  ప్రసాదం తినిపించారు.  అప్పటినుంచీ ఆయన అనేక పాటలు వ్రాశారు.

ఆలయ విశేషాలు
ఈ ఆలయం 1600 సంవత్సరాలకన్నా పురాతనమైనదంటారు.  క్రీ.శ. 875-893లో అపరాజిత వర్మ అనే రాజు శాసనంలోను, క్రీ.శ. 907-953లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడింది.

ఇక్కడ వున్న ఉత్సవ విగ్రహాలపైన వుండే విమానము (స్వామి గర్భగుడి పక్కనే పెద్ద పూజా మందిరంలా వుంటుంది) రుద్రాక్షలతో చేసింది.  స్వామి ధరించిన ఆకుపచ్చరంగు షట్కోణ పతకం దేదీప్యమాన కాంతులలో స్వామి మెరిసిపోతుంటాడు.  ఇక్కడ స్వామిని బంగారు బిల్వ పత్రాలమాలతో అలంకరిస్తారు.

పండుగలు
ప్రతి నెలా కృత్తికా నక్షత్రం రోజున జరిగే ఉత్సవాలేకాక, తమిళ మాసం ఆడిలో (జులై – ఆగస్టు)  3 రోజులు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.  ఈ సందర్భంలో దాదాపు 2 లక్షలమంది పూలతో అలంకరించిన కావిళ్ళు తీసుకొచ్చి స్వామికి సమర్పిస్తారు.  ఈ దృశ్యం చూడటానికి చాలా మనోహరంగా వుంటుంది.

ప్రతి ఏడాదీ డిసెంబరు 31వ తారీకు అర్ధరాత్రి 12 గం. లకు లక్షలాది భక్తులు నూతన సంవత్సరంలో స్వామిని సేవించి, స్వామి ఆశీస్సులు పొందటానికి వస్తారు.  బ్రిటిష్ పరిపాలన సమయంలో వల్లిమలై స్వామివారి చేత ఈ ఆచారం ప్రారంభించబడింది.  నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా అధికారులకు శుభాకాంక్షలు చెప్పే  ముందు మనకి సర్వం ప్రసాదించే తనికేశుణ్ణి ప్రార్ధించి, సేవించి తర్వాత అధికారులను కలిసే పధ్ధతి అప్పుడు ప్రారంభమయి, ఇప్పటికీ సాగుతోంది.  ఈనాటికీ లక్షలమంది భక్తులు నూతన సంవత్సరం సందర్భంగా స్వామిని సేవించి పాటలు పాడతారు.  స్వామి ఆలయానికి చేరే ప్రతి మెట్టుమీదా కర్పూరం వెలిగిస్తారు.

మార్గము   
తమిళనాడులో తిరువళ్ళూరు జిల్లాలో అరక్కోణానికి 13 కి.మీ.ల దూరంలోను, చెన్నై నుంచి 84 కి.మీ. ల దూరంలోను, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నుంచి 68 కి.మీ. ల దూరంలోనూ వున్నది ఈ క్షేత్రం.  ఈ క్షేత్రానికి రైలు రోడ్డు రవాణా సౌకర్యం వున్నది.  
తిరుత్తణి రైలు స్టేషన్ లో దిగాక బయట కనిపించే రోడ్డుకి ఎడమవైపు వెళ్తే బస్ స్టాండు  చేరుకుంటాము.  అక్కడనుంచి సుబ్రహ్మణ్యస్వామి కొలువైన కొండమీదకి వెళ్ళటానికి బస్సులు, ఆటోలు లభ్యమవుతాయి.  ఆలయం చేరుకోవటానికి మెట్ల మార్గం, రోడ్డు రెండూ వున్నాయి.  మెట్ల మార్గమయితే 365 మెట్లు వుంటాయి.  ఇవి సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా భావిస్తారు.  భక్తులు ఈ మెట్లకి మెట్ల పూజ చేస్తారు.  అంటే వీటికిపసుపు రాసి, బొట్టి పెట్టి హారతి ఇస్తారు.

వసతి
ఆలయంవారు నిర్వహించే కాటేజ్ లు వివిధ ధరలలో వున్నాయి.  
ఆలయం వెబ్ సైట్
WWW.TIRUTANIGAIMURUGAN.ORG
Hill temple Phone No.  044 27885243
TEMPLE OFFICE PHONE NO.  044  27885247

సమీప ఆలయాలు
మహిషాసుర మర్దని ఆలయం, మద్దూరు, శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, నల్లత్తూరు.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి