యువ - - రవీంద్ర

ప్రేమలో ఓటమి కూడా గెలుపే

ఒక్కోసారి చూసే చూపును బట్టి విషయం కొత్త కోణంలో అర్థమవుతుంది. మనకు బాగా తెలుసు అనుకున్న మనిషిలో కూడా మనకు తెలియని అనేక అంశాలు దాగి ఉంటాయి. అందుకే మనో విశ్లేషకులు అంటారు. ఎవరి గురించి, ఎవరికీ పూర్తిగా తెలియదు అని. ఒకవేళ ఎవరన్నా అలా తెలుుసు అని అన్నా అది పూర్తిగా నిజంకాదు. యూత్ లో హాట్ టాపిక్ ప్రేమ, ఒక్క యువతలో ఏంటి... మనిషి మస్తిష్కం లోనే ప్రేమ అనే మాధుర్యం తాలూకు జీవకణాలు ఉన్నాయి. అయితే తిప్పలు అంతా ఎక్కడంటే... ప్రేమను గుర్తించడంలోనే. యూత్ ఎక్కువగా ప్రేమలో పడటాలు, లేవటాలు, మళ్లీ ప్రేమలోకి దూకటాలు చేస్తూ ఉంటారు. కొంతమందైతే అదే ప్రేమలో ఉండిపోతారు. మానసిక సమస్యలతో బాధపడ్తారు, మితిమీరితే ఆత్మహత్యలకు పూనుకుంటారు. ఒకర్ని ప్రేమించి మరొకర్ని పెళ్లి చేసుకొని మానసిక వ్యథ చెందుతుంటారు. అసలు ప్రేమలో ఒడిపోవడం ఉందా అనేది నా ప్రశ్న. అవును ప్రేమించి, ఎక్సప్రెష్ చేసి, కాదంటే ఓడిపోయినట్లే కదా అని అనుకోవచ్చు. కానీ కాదు. మూలూలు తొవ్వితే...

ఇష్టపడే వాళ్లు నో అంటే...

ప్రేమలో విఫలం అయితే మనసు మాట వినదు అనేది నిజం కావచ్చు. రాత్రి తొమ్మిది గంటల నుండి వినోద్ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ కనుకుపట్టడం లేదు. రమ్యా గురించిన ఆలోచనలే. మనసంతా దెయ్యం పట్టినట్లు ఉంది. తుఫానులా వచ్చి పడుతున్నాయి ఆలోచనలు. గుండెలపై కుంపటిలా అనిపిస్తుంది. అతని బాధంతా ఒక్కటే. రమ్యా, వినోద్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు. వినోద్ మూడు సంవత్సరాల నుంచి రమ్యతో కలిసి తిరిగాడు. సినిమాలు, షికార్లు, కంబైన్డ్ స్టడీస్... ఇలా.  కానీ తీరా ప్రేమిస్తున్నాను అని చెప్తే. వెంటనే నో అని చెప్పేసింది. దాంతో వినోద్ కు వారం రోజుల నుంచి కంటిమీద కునుకు లేదు. ఫ్రెండ్స్ తో చెప్పుకుంటే ఎగతాళి. ఇంతకుముందే వాళ్లందరికీ చెప్పుకున్నాడు మా ఇద్దరి మధ్యా లవ్ ఉందని. వాళ్లందరూ చిన్నచూపు చూస్తారు. అది తట్టుకో లేడు.       రెండు రోజుల నుంచి సిగరెట్లు కూడా కాల్చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా తాగే మందు వారం రోజుల నుంచి రోజూ తాగుతున్నాడు. ఒక్కోసారి బతుకెందుకు అనుకుంటున్నాడు. ఫ్యానును చూస్తుంటే... శూన్యం నుంచి వ్రేళాడే తాడులా కనిపిస్తుంది. చిరాకు, కోపం, అసూయ, జెలసీ, బాధ... తన మీద తనకే అలహ్యం... తననెందుకు కాదంది అనే ఆలోచన. కానీ వినోద్ కు తెలియాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. వినోద్ తో స్నేహంగా ఉన్నంత మాత్రాన ప్రేమను అంగీకరించాలని ఉందా...

ప్రేమ ఓ సామాజిక బంధిఖానా...

ప్రతి మనిషి చుట్టూ పుట్టినప్పటి నుండి ఓ సామాజిక వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు, పరిసరాల ప్రభావం ఉంటుంది. పెరిగి పెద్దయ్యే కొలది వాటి నుంచి వారివారి మానసిక స్థాయి రూపుదిద్దుకుంటుంది. ఆలోచనలూ వాటి పరిధిలోనే సాగుతాయి. ఇక నేడు సినిమాలు, టీవీలు, పుస్తకాలు, సామాజిక వైబ్ సైట్స్ ప్రభావంతో ఓ అమ్మాయికానీ, అబ్బాయి కానీ పెరుగుతారు. అలా పెరిగిన ఏ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండవు. వారి ఊహలు, భావాలు, లక్ష్యాలు, కోర్కెలు అన్నీ వేరుగానే ఉంటాయి. అయితే ప్రేమ వీటన్నిటికి అతీతమైంది అన్నా... మనిషిని ఇవే బంధిస్తున్నప్పుడు, వీళ్ల మనసుల్లో ఉద్భవించే ప్రేమ కూడా వీటి పరిధిలోనే సంచరిస్తుంది అన్నది వాస్తవం.

ప్రతి అమ్మాయి, అబ్బాయి తను అనుభవించిన తాలూకూ జీవితం నుంచే కాబోయే జీవిత భాగస్వామి ఇలా ఉండాలి, అని నిర్ధారించుకుంటారు.  భావిష్యత్ జీవితాన్నికూడా ఊఙించుకుంటారు. అలానే కాబోయే అమ్మాయి లేదా అబ్బాయి ఇలా ఉండాలి అని కోరుకుంటారు. అందుకే ప్రేమ సమకాలీన సామాజిక అంశాలలో బంధి. ఇలాంటి వాస్తవాల నుంచే ప్రేమను అర్థం చేసుకోవాలి. వినోద లాంటి వాళ్లు... రమ్యా లాంటి నో చెప్పిన వాళ్లని చూడాలి.

ప్రేమ జీవితంలో ఓ పూలవాన చినుకే...

 ప్రేమ అనేది జీవితంలో ఓ చిన్న చినుకు లాంటిదే. అదే పూర్తి జీవితం కాదు. పెద్ద సముద్రం లాంటి జీవితంలో ఓ అల మాత్రమే. జీవితమనే చెట్టులో చిరుగాలిలో ఊగే ఓ చిగురుటాకు మాత్రమే. యుక్త వయసులో విరిసే ఓ సుమధుర పుష్పం మాత్రమే. రెండు విరుధ్ద భౌతిక, భావనా ప్రపంచాల నుంచి వచ్చిన వారి కోరికలు, ఆశలు ఒకేలా ఉండాలను కోవడం తప్పు. అలాంటప్పుడు మీకు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయికి మీరు నచ్చాలని ఎలా చెప్పగలం. నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మీ మీద మీ జీవితం మీద మీకు ఎలాంటి ఆశలు ఉంటాయో, అలానే ఎదుటి వాళ్లకు, వారి జీవితం మీద అలానే ఉంటాయి. వాటికి మీరు అందకపోవచ్చు. అందుకే ప్రేమ ఎప్పుడూ కురిసి వెళ్లే పూలవానలో చినుకు మాత్రమే.

ప్రేమలో విఫలమైతే, ఓడిపోతే జీవితం మొత్తం పోయినట్లు కాదు. మీరు ఐ లవ్ యు చెప్పడానికి ముందు, వాళ్లు నో చెప్పిన తర్వాత మీకు కావాల్సినంత జీవితం ఉంది. మీరు నిర్మించుకోవాల్సిన జీవనం ఉంది. వారితోనే కాకుండా మీకూ సొంతగా కొన్ని అనుభూతులు ఉన్నాయి. అనుభవాలు ఉన్నాయి. సంతోషపు ఘడియలున్నాయి. ఇది దేవదాసుల కాలం కాదు. ఒకరైలు మిస్ అయితే మరో రైలు ఎక్కొచ్చు. ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ప్రతి మనిషి జీవితంలోనూ ఒకే ప్రేమ ఉండదు. కొన్ని ప్రేమలు ఉంటాయి. ఇదే నేటి సమాజానికి అనువైన ప్రేమ సూత్రం. అందుకే కాదన్న వాళ్ల గురించి వీలైనంత త్వరగా మర్చిపోవాలి.

ఓటమిని సెలబ్రేట్ చేసుకోవాలి

ప్రేమలో ఓడిపోతే... మీరు ప్రేమించే వాళ్లు కరాఖండిగా నో చెప్తే... మీరు వెంటనే సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకని అనుమానం కలగొచ్చు. మీ బాధను మీకు నచ్చిన వాళ్లతో పంచుకోవడం వల్ల కొంత ఊరట కలుగుతుంది. ఓదార్పు దొరుకుతుంది. వాళ్లు ప్రేమలో విఫలమైన విషయాలను మీతో పంచుకుంటారు. దాంతో మీలాంటి వాళ్లు కొందరున్నారన్న విషయం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. వారికు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. మీకిష్టమైన అభిరుచులను గుర్తు చేసుకొని వాటికి సమయాన్ని కేటాయించండి. మీ మనసుకు ఉత్సాహాన్ని, ఉల్లసాన్ని ఇచ్చే పనులు చేయండి. మీరు భవిష్యత్ లో ఎదిగి మీరేంటో వాళ్ల ముందు నిరూపించుకోవాలన్న కోర్కెను బలంగా ఏర్పరుచుకోండి. దానికోసం శ్రమించడం మొదలుపెట్టండి. పుస్తకాలు చదవడం, మీ మనసుకు దగ్గరైన పాత స్నేహితుల్ని కలవడం లాంటివి చేయండి. అన్నిటికంటే మించి మీకు అంతకంటే గొప్ప వాళ్లు లైఫ్ పార్ట్నర్ గా దొరుకుతారని నమ్మండి. చరిత్రలో మీకో పేజీ లిఖించుకోండి. ఆత్మవిశ్వాసాన్ని మించిన మందులేదు. ప్రతి దానికీ అల్టర్ నేటివ్ ఉంటుంది. లైఫ్ లో కూడా... అందుకే ఓ అమ్మాయి కాదంటే అంతకన్నా మీకు నచ్చే మరో అమ్మాయి, ఒక అబ్బాయి కాదంటే అంతకన్నా మిమ్మల్ని బాగా చూసుకునే మరో అబ్బాయి దొరుకుతారు. కాబట్టే ప్రేమలో ఓటమి కూడా గెలుపే ఆలోచించి చూస్తే...

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి