సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

'ఆముక్తమాల్యద'
యామునాచార్యుని రాజనీతి

శ్రీరంగని పదసన్నిధి అనే పెన్నిధిని పొందిన యామునాచార్యుడు ఇహలోకపు నిధులమీద, భోగభాగ్యాలపట్ల 
విరక్తి పొందాడు. శ్రీరామ మిశ్రునికి వందనము చేసి రాజ్యానికి తిరిగివెళ్ళి కుమారునికి పట్టాభిషేకము చేసి
ఆతనికి 'రాజనీతి'ని ఇలా బోధించాడు.

ఏపట్టున విసువక ర
క్షాపరుఁడవు గమ్ము ప్రజల చక్కి విపన్ను
ల్గూపెట్టిన విని తీర్పుము
కాపురుషులమీఁద నిడకు కార్యభరంబుల్

ఏ సమయములోనూ విసుగు అనేది రానీయక ప్రజలను రక్షించుము, ఆపన్నులు మొరపెడితే వారి గోడును విని, వారి ఆపదలను తీర్చుము, దుర్జనులకు, కుత్సితులకు గొప్పవైన కార్యాలను అప్పజెప్పకు.రాజ్యపాలన అనేది హక్కు కాదు, బాధ్యత, నిరంతరమూ నెరవేర్చాల్సిన బాధ్యత. కార్యసాధనకోసం ఉత్తములైన, నిజాయితీపరులైన కార్యకర్తలను ఎంచుకో!

మొదలఁ బెనిచి పిదపఁ గుదియింప నెవ్వాఁడుఁ
దనదు తొంటిహీన దశఁ దలంపఁ
డలుగుఁ గాన శీల మరయుచుఁ గ్రమవృద్ధిఁ
బెనిచి వేళవేళఁ బనులు గొనుము

ఎవడినైనా సరే, వాడి స్థితిని మొదలు పెంచి, తర్వాత తగ్గిస్తే తన మొదటి తక్కువ స్థితిని గుర్తుంచుకోడు, తగ్గించబడిన తన ఉన్నత స్థితినే గుర్తుంచుకుంటాడు, ఆ స్థితిని తగ్గిస్తే అలుగుతాడు. ఎవడైనా తనకొచ్చిన ప్రమోషన్లను గుర్తుంచుకోడు, రానివాటినే గుర్తుంచుకుని అలుగుతాడు, కనుక వారి వారి శీలాన్నిబట్టి నెమ్మది నెమ్మదిగా ఉన్నతిని పెంచుతూ, ఇవ్వబోయే మరిన్ని ఉన్నతులను చూపిస్తూ, ఊరిస్తూ వారితో పనులు చేయించుకోవాలి, ఒకేసారి ఎక్కువగా ఇవ్వకూడదు, కొద్ది కొద్దిగా, క్రమక్రమంగా లబ్ధిని ఇస్తూ, తన చెప్పుచేతల్లోఉంచుకోవాలి. ఎంత తెలివైన నీతి, ఆచరణ సాధ్యమైన నీతి, అద్భుతమైన ఫలితాలను ఇచ్చే నీతి!

చదివి యధర్మ భీరు నృపశాస్త్ర విధిజ్ఞతల న్వయస్సు డె
బ్బదిటికి లోను నేఁబదికి బాహ్యమునై యరుజస్స్వపూర్వులై 
మద మఱి రాజుప్రార్థన నమాత్యతఁ గైకొని తీర్చుపాఱువా
రొదవిన నంగముల్మిగుల నూర్జితమౌటకుఁ బూఁట సాలదే

 శాస్త్రములను బాగా చదువుకున్నవాడు, అధర్మము అంటే భయమును కలిగినవాడు, రాజనీతిశాస్త్ర విధులను తెలిసినవాడు, వయసులో  డెబ్భైకి లోపు, యాభైకి పైన ఉన్నవాడు, అనారోగ్యము, రోగాలు లేనివాడు, తమ పూర్వీకుల కాలము నుండీ తెలిసినవాడు, విధేయుడైనవాడు, రాజు ప్రార్ధనను మన్నించి అమాత్య పదవిని  అంగీకరించి పనులను చక్కబెట్టేవాడు ఐన విప్రుడు, బ్రాహ్మణుడు, విద్వాంసుడు మంత్రిగా లభిస్తే రాజ్యాంగములు అనబడే స్వామి, అమాత్య, సుహ్రుత్తు, కోశ, రాష్ట్ర, దుర్గ, బలములనేవి వృద్ధి పొందడానికి ఒక పూట చాలదూ, కనుక ఈ లక్షణాలను కలిగిఉన్నవాడినే మంత్రిగా నియమించుకోవాలి!

కార్య మొక్కఁడు కనిన మాత్సర్యమున నొ
కండు గా దని ఖండించుఁ గ న్నెఱింగి
యిరువురను గా దనక కొల్వు విరిసి మీఁద
నల్ల వాఁ డెన్నినది సేయ నగు శుభంబు

ఒకపని గురించి తెలిసినవాడు ఒకడు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తే, ఈర్ష్యతో ఇంకొకడు అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అని ఖండిస్తాడు. ఇద్దరి తీరునూ కనిపెట్టి, ఎవరినీ ఖండించకుండ అప్పటికి కొలువును చాలించి, ఆ చర్చను ముగించి, ఆ తర్వాత మొదట అన్నవాడి, ఈర్ష్యలేని వాడి సూచనను పాటించడం వలన శుభము కలుగుతుంది. అంటే అందరు చెప్పేదీ వినాలి, తన ఆలోచనతో ఆచరించాలి, ఎవరినీ వెనకేసుకుని రాకూడదు, ఎవరినీ నొప్పించకూడదు!

పగ వెలిఁ గని లోదస్యులఁ
జిగురింపఁగఁ జేసి నృపతి చిక్కువడఁ బను
ల్దెగి సేయక తారే ది
క్కుగ నడతు రశంక నల్లికొని దుస్సచివుల్

రాజుకు శతృవులైన వారి అండను పొంది, వారిని వృద్ధిజేసి, రాజుకు శత్రువులను పెంచి, రాజు చిక్కులోపడి, ఏ పనినీ తనంత తానుగా స్వంత నిర్ణయాలతో చేయలేని స్థితిలో చిక్కుకునేట్లు చేసి, తామే రాజుకు దిక్కై, కొంతమందిని తమతో కూడగట్టుకుని నడుస్తుంటారు దుష్టులైన మంత్రులు, కనుక వారిపట్ల రాజు జాగరూకుడై ఉండాలి, రాజే కాదు, ఏ నాయకుడైనా సరే!

భండారముతో హయమద
శుండాలఘటాళి దనదు సొమ్మై పాగా
నుండిన నంతటఁ బాయదె
పండితుఁడును బిరుదునైన పతికిని బయలై

బొక్కసం బలంగా ఉండి, గుఱ్ఱాల, ఏనుగుల సంపత్తి బలంగా ఉండి, పాండిత్యము అంటే తెలివి తేటలు, విచక్షణ, శౌర్యము కలిగిన రాజుకు దుష్టులైన మంత్రులు చేసే చెడు ప్రయత్నాలు విఫలములై దూరంగా ఉంటాయి, అతడిని ఏమీ చేయలేవు. కనుక అంగబలము, అర్థ బలము, మేథో బలము అన్నీ ఉన్న రాజునూ ఏ దుష్టులూ ఏమీ చేయలేరు.

క న్నొకటి నిద్రవోఁ బెఱకంట జాగ
రంబు గావించు భూరుహాగ్రంబుమీఁది
యచ్ఛభల్లంబు గతి భోగమనుభవించు
నెడను బహిరంతరరులపై దృష్టివలయు

చెట్టునెక్కి కూర్చున్న ఎలుగుబంటి ఒకకన్నుతో నిద్రబోతూ, మరొక కన్నుతో మేల్కొని ఏ చిరుతపులో దాడిచేసి తనను చంపితినకుండా జాగ్రత్తపడినట్లు రాజు భోగభాగ్యాలను అనుభవిస్తూనే తన ఆంతరంగిక శత్రువులను(కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను) బహిరంగ శత్రువులను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఆంతరంగిక శత్రువులు అంటే తన పక్షములోనే ఉన్నట్లు నటిస్తూ తన శత్రువులకుసహకరించే యింటి దొంగలు అని కూడా శ్లేష. ఈ విధముగా రాజు తన రాజ్యాన్ని జీవితాన్ని అనుభవించాలి.

హదను వచ్చుదాఁక నపరాధిపై  రోష
మాఁగి చెరుపవలయు హదను వేచి
లక్ష్యసిద్ధిదాఁక లావున శర మాఁగి
కాఁడ విడుచు వింటివాఁడు వోలె  

ధనుస్సును ఎక్కుపెట్టి, బాణమును చెవిదాకా లాగిపట్టి, తన గురి కుదిరేదాకా, తన లక్ష్యము ఐన శత్రువో జంతువో చిక్కేదాకా ఓపికపట్టి, అదనువచ్చినప్పుడు బాణాన్ని వదిలిపెట్టే విలుకాడిలాగా రాజు కూడా తనకు అపరాధము చేసినవాడిని అదనువచ్చేదాకా ఓపికపట్టి ఆ అదనువచ్చినప్పుడు వాడిని శిక్షించాలి, నాశనము చేయాలి!

(కొనసాగింపు తరువాయి సంచికలో)
***వనం వేంకట వరప్రసాదరావు  

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు