యువ - డా. ఎ. రవీంద్ర

 

ఒక పొగడ్త ... కొన్ని నిజాలు

ఓ అమ్మాయిని ప్రేమించాలంటే మొదట అబ్బాయి చెప్పే మాట 'మీరు చాలా అందంగా ఉన్నారు'. భార్యతో చక్కగా పనిచేయించుకోవాలంటే భర్త చెప్పే మాట 'ఈ రోజు వంట చాలా బాగుంది'. గురువుగారిని ఇంప్రెస్ చేయడానికి శిష్యుడు చెప్పే మాట 'మీరు లెసన్ బాగా చెప్తారు'. ఆఫీసులో కొలీగ్ తో పని చేయించుకోవాలంటే వాడే ఆయుధం 'మీరు వర్క్ చాలా ఫర్ ఫెక్టుగా చేస్తారు'. ఇక యూత్ మధ్య అయితే...లవ్ లో, స్నేహంలో... ఇలాంటి పొగడ్తలకు కొదవే ఉండదు.  'మీ నవ్వు బాగుంది', 'ఈ డ్రెస్ మీకు చాలా బాగా సూటైంది'. 'నువ్వు బైక్ నడిపే స్టైల్ నచ్చింది'. 'మీ సిన్సియారిటీ నచ్చి లవ్ లో పడిపోయా'. 'మీతో మాట్లాడుతుంటే టయమే తెలియదు'. అబ్బా... 'ఇంత అందంగా ఎలా రాశావు'... ఇలాంటి మాటలన్నీ పొగడ్తలనే అంటారు. కానీ సమయాన్ని, ఇలా సందర్భాన్ని బట్టి వాడే వాటిలో నిజాలు కూడా ఉండొచ్చు. ఒక్కోసారి పొగడ్త కూడా హృదయంలోంచి స్వచ్ఛంగా బైటకు వచ్చేయొచ్చు. కానీ పొగడ్తకు పడని మనిషంటూ లేడంటారు మనో విశ్లేషకులు.

పొగడ్తను అంచనా వేయొచ్చా!

ఈ మధ్య యవతలో పొగడ్తకు సమానార్థంకగా ఓ ఊతపదం వచ్చేసింది. అదే... 'బిస్కెట్ వేస్తున్నారు'. కానీ ఒక పొగడ్త వెనుక కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. కొన్ని అవసరాలు ఉంటాయి. కొన్ని అనుభూతులు ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. కొన్ని స్వచ్ఛమైన హృదయ స్పందలు ఉంటాయి. మరి... ఇన్ని ఉన్నప్పుడు, పొగడ్తలను అర్థం చేసుకోవడం, పొగిడిన వ్యక్తి హృదయాన్ని అంచనా వేయడం చాలా క్లిష్టం, కష్టం కూడా. అసలు పొగడ్తను అర్థం చేసుకునే ముందు మీ...మీ... టాలెంట్ ను మీరు మర్చిపోకూడదు. మీ శక్తి సామార్థ్యాలు, మీ ప్రతిభ, మీ టేస్టులు అన్నింటి మీద మీకు కమాండ్ ఉండాలి. ఎవరైనా అమ్మాయి మీ దగ్గరకు వచ్చి 'ఈ రోజు కొత్తగా కనిపిస్తున్నావ్, ఎనీ స్పెషల్' అందనుకోండి. అసలు ఆ రోజు మీరు స్పెషల్ గా ఉంది, లేందీ మీకు తెలిసే ఉంటుంది. అంటే అది బిస్కెట్టా... లేక నిజమా... అన్నది ఇట్టే తెలిసి పోతుందన్నమాట. ఫ్రెండ్స్ మధ్య క్లోజ్ వల్ల, ఇష్టాల వల్ల ఇలాంటి మాటలు తరచు వచ్చేస్తుంటాయి. కానీ- కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తే ఆ పొగడ్తల వెనకున్న వారి మనసు ఇట్టే తెలిసిపోతుంది.

నిజమైన పొగడ్తలు

ఒక్కోసారి ఎదుటి మనిషి మీద మీకున్న అభిమానం, ప్రేమ ఉంటే.. నిజంగా వారిలో మంచి స్వభావం ఉంటే... అభినందించడానికి పొగడ్త అవసరమే. కానీ అది మీరు సహజంగా చెప్పాలి. అందంగా ఉన్న అమ్మాయిని... 'అందంగా ఉన్నావ్' అని చెప్పడం తప్పులేదు. బాగా చదివే ప్రెండ్ ను కాలేజ్ ఫస్టు వచ్చేలా ఎంకరేజ్ చేయడం తప్పుకాదు. మల్లెపూలు ఇష్టపడే భార్యకు అవి కొనిచ్చి, టేస్ట్ ను అభినందించడం మంచిదే. మీ మనసులో వాడికి ఫస్ట్ వచ్చిందే... అని  కుల్లు పెట్టుకొని పొగడడం, మల్లెపూలకు ఖర్చు పెట్టానని మనసులో తిట్టుకుంటూ భార్య టేస్టును పొగడడం, మీకు నచ్చని అమ్మాయి దగ్గరకెళ్లి బాగున్నావని చెప్పడం... ఇవన్నీ అవసరాలకోసం వాడే అబద్దాల లాంటివే. నిజాయితీ లేని పొగడ్త... ఇద్దరికీ మధ్య విషం లాంటిది.కొంతమందికి ఓ అలవాటు ఉంటుంది. తన వాళ్లు తప్పుచేస్తున్నా, నిజాయితీ పరులు కాకపోయినా, అన్నింటిలో వెనకబడి ఉన్నా, పదిమందిలో 'వారికేం... కొండను బద్దలు కొడతాడు' అని గాలిమేడలు కట్టేస్తుంటారు. చివరకు ఆ గాలిమేడలే వారి ఎదుగుదలకు అడ్డంకుగా మారతాయి. ఓ తండ్రి తన కొడుకు ప్రయోజకుడు కాకపోయినా,  చదువులో అంతగా రాణించకపోయినా, పుత్రోత్సాహం వల్ల అందరి ముందు ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. కానీ మనసులో తండ్రికి తెలుసు... కొడుకు ప్రతిభ ఎంతో. ఇలాంటి పొగడ్తల వల్ల కొడుకు ప్రయోజకుడు కాకపోగా, తండ్రి మాటల వల్ల మరింత దిగజారుతాడు అన్నది వాస్తవం. అందుకే అర్హూలకే, అర్హతను బట్టే పొగడ్త అవసరం. అతిగా పొగడడం ఎంత మంచిది కాదో, ఏదన్నా సాధించినప్పడు మన తోటివారిని అభినందించకుండా ఉండడం కూడా అంతే తప్పు.

ఎంతవారలైనా పొగడ్త దాసులే...

నిజం చెప్పాలంటే... చిన్నపొగడ్తతో ఎంత పెద్ద పనైనా ఇట్టే చేయించుకోవచ్చు. పెళ్లయిన కొత్తలో వంటసాయం చేయమని భర్తను అడగాలంటే... 'మీ చేతి వంట తినాలని ఉంది. చాలా రుచిగా చేస్తావట గదా...' అని నవ్వుతూ  నీ శ్రీవారిని అడగండి. మీ స్నేహితురాలు... కొత్త డ్రెస్ వేసుకొచ్చిందనుకోండి, 'డ్రెస్ కన్నా నీవే బాగున్నావని' అనండి. ఎంత పొంగిపోతుందో... ఎవరైనా మీ సర్కిల్లో జోకులు చెప్పే వాళ్లున్నారుకోండి. 'రాత్రంతా.. నీ జోకులు చెప్తుంటే మా ఇంట్లో వాళ్లు తెగ నవ్వారు' అని ఉదయం వారికి చెప్పండి. మీలో ఎవరైనా సింగర్ ఉందనుకోండి... ఓ చాక్ లెట్ కొనిచ్చి, 'నీ స్వీట్ వాయిస్ కు, నా స్వీట్ గిఫ్ట్' అనండి... సంతోషిస్తారు. కానీ మీరు నిజంగా పొగుడ్తున్నారా, మీ మాటలు మీ గుండెలోతుల్లోనుంచి వస్తున్నాయా అన్నది మీ మనసు మీకు చెప్తూనే ఉంటుంది. ఎదుటి వ్యక్తి కొద్దిగా తెలివైన వారైతే ఇట్టే పసిగట్టేస్తారు సూమా... అందుకే హృదయంలోంచి వచ్చే పొగడ్త... మీ రిలేషన్ ను మరో మెట్టు ఎక్కిస్తుంది. ఎదుటి వారిలో మీ స్థానాన్ని పదిలం చేస్తుంది.

పొగడ్త అవసరమే

పొగడ్త నిజంగా అవసరమే. పొగడ్త కూడా ఓ మందు లాంటిదే. పొగడ్త ఓ మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. విజయం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు మంచి పనిచేసినప్పుడు అబినందించే వాళ్లు, చెడ్డపని చేసినప్పుడు తప్పని చెప్పే వాళ్లు అవసరం. అలాగని ఎప్పుడూ మీ వెంటే ఉండి- మీరు ఏది చేసినా, గ్రేట్ అనే వాళ్లని ఓ కంట కనిపెడ్తూ ఉండాలి. కొడుకు ఫస్టు మార్కులతో పాసైతే తల్లిదండ్రులు ఓ గిఫ్టు ఇవ్వాలి. అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. మరసటి ఏడాది ఇంకా కష్టపడతాడు. మీ గాళ్ ఫ్రెండ్ ఏదైనా సాధిస్తే  ఓ పార్టీ ఇవ్వండి.  పదిమందితో ఆనందాన్ని పంచుకోండి. మీపై ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతుంది. అలాగని ఎప్పుడూ పొగడ్తలో ముంచెత్తకూడదు. మీ మాటలకు విలువ పోతుంది. మీ నిజమైన పొగడ్త కూడా సాధారణమై పోతుంది. సో దేనికైనా బ్యాలెన్స్ అవసరన్న మాట...   ఒక స్నేహాన్ని పెంచేది, ఒక స్నేహాన్ని తుంచేది మీ మాట తీరే. అందుకే నవ్వుతూ... నవ్విస్తూ... అవసరమైనప్పుడు నాలుగు పొగడ్తలతో ఎదుటివారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మంచివారిగా జీవించడం ఓ ఆర్ట్... ఓ కళ... 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు