తుంగనాథ్ మహదేవ్ - కరా నాగలక్ష్మి

tunganath mahadev

 ఉత్తరాఖంఢ్ రాష్ట్రం లో వున్న పుణ్య క్షేత్రాలలో యీ తుంగనాథ్ వొకటి . ముఖ్యంగా ఉత్తరాఖంఢ్ లో వున్న బదరీనాథ్ , కేదారనాథ్ , గంగోత్రి , యమునోత్రి యాత్రలు టూర్ ఆపరేటర్ల పుణ్యమా అని యీ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందేయి.  వుత్తరాఖంఢ్ ని దేవభూమి అని అంటారు కారణం యేమిటంటే యిక్కడ అడుగడుగునా పురాతనమైన మందిరాలు , అడవులు , పచ్చని మైదానాలు , వుష్ణ కుండాలు , మంచుతో కప్పబడ్డ యత్తై న పర్వతాలు చల్లని వాతావరణం మనస్సుని ఆహ్లాద పరుస్తూ దేవలోకం యిలా వుంటుందేమో అన్నట్టుగా వుంటుంది .   యమునోత్రి , గంగోత్రి , కేదారనాథ్ , బదరీనాథ్ లను  చార్ధామ్ యాత్ర అని కూడా అంటారు.

ఉత్తరాంచల్  లో చార్ధామ్ యాత్ర కాక పంచ కేదారాలు , పంచ బదరీలు , పంచధారలు , పంచ ప్రయాగాలు , పంచ శిలలు చూడవలసినవి . మహాభారతంలో  పంచ కేదారాల గురించి చెప్పబడింది .

మహా భారతం ప్రకారం వ్యాసమహర్షి మహాభారత యుద్ధానంతరము పాండవులకు జ్ఞాతులను చంపిన పాపము పోగొట్టు కొనడానికి పరమశివుని ఆరాధించమని సలహా యిస్తాడు . పాండవులు కుంతీదేవి , ద్రౌపతి లతో బదరీనాథ్ లోని సరస్వతి నదిని దాటుకొని (సరస్వతి నది పైన పడవేసివున్న పెద్దరాయిని ' భీమ పూల్ ' అని అంటారు ) నడక దారిన బయలు దేరుతారు . యిక్కడ నుండి పంచధారలలో వొకటైన  ' వసుధార ' కనిపిస్తూ వుంటుంది . సరస్వతి నదికి మూడు కిలొమీటర్ల దూరంలో ద్రౌపతి తనువు చాలిస్తుంది . తరవాత మరో నాలుగు కిలొమీటర్లు ప్రయాణించిన తరువాత కుంతీదేవి తనువు చాలిస్తుంది . యీ ప్రదేశాలలో వున్న ద్రౌపతి , కుంతీదేవిల సమాధులను చూడొచ్చు . పాండవులు హిమాలయాలలో శివుని వెతుకుతూ తిరుగుతూ వుంటారు . పరమశివుడు ఎద్దు రూపంలో వారి నుంచి తప్పించుకొని తిరుగుతూ వుంటాడు.

భీముడు ఎద్దు రూపంలో వున్న శివుని గుర్తించి దానిని బంధించాలని ఎద్దుని వెంటాడు తాడు . ఎద్దు రూపంలో వున్న శివుడు భీమునికి చిక్కక గుప్త కాశిలో మందాకినీ నదీ తీరాన పాతాళ లోకంలో దాగుంటాడు , భీముడు కుడా శివుని వెనుకే పాతాళానికి వచ్చి పారిపోతున్న ఎద్దు వెనుక కాళ్లని పట్టుకొని భూమి పైకి లాగుతాడు . భీముడు బలంగా లాగుట వలన ఆ ఎద్దు అయిదు భాగాలుగా తెగి , ఆ అయిదు భాగాలు అయిదు ప్రదేశాలలో పడ్డాయని , ఆ భాగాలు పడ్డ ప్రదేశాలలో శివుడు స్వయంభూగా వుద్భవించెనని ఆది శంకరులు గుర్తించి ఆ ప్రదేశాలలో మందిర నిర్మాణం చేసి శివుని అరాధించెననేది పురాణ కధ.

1) రుద్రనాథ్ --ముఖం  , 2) తుంగనాధ్  -- ముందుకాళ్ళు , 3) కేదార్నాథ్ --మూపురం  , 4) మథ్ మహేశ్వర్ -- నాభి , వెనుకభాగం 5) కపాలేశ్వర్ -- జట.

యీ పంచకేదారాలలో ఈశ్వరుడు స్వయంగా  పాండవుల పూజలందుకొని వారిని  పాపవిముక్తుల్ని గావించి కాలాంతరమున తనలో ఐఖ్యం చేసుకున్నాడని వ్యాసమహర్షి మహాభారతంలో చెప్పేరు . యిప్పటికి కుడా ప్రొద్దున్న సాయంత్రం జరిగే హారతికి స్వయంగా పరమశివుడు వచ్చి పూజలందుకొని భక్తులను అనుగ్రహిస్తాడని స్తానికుల నమ్మిక.

పంచ కేదారాలలో వొకటిగా చెప్పబడే తుంగనాథ్ గురించి చెప్పుకుందాం . వీలుని బట్టి మిగిలిన నాలుగు కేదారాలగురించి చెప్పుకుందాం . ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లా లో సుమారు ముప్పై ముప్పైయైదు కిమీ ల దూరంలో రుద్రప్రయాగ నుంచి అగస్త్యముని వెళ్ళేదారిలో  ఓఖిమఠ్ కి సుమారు అయిదు కిమీ దూరంలో చోప్త అనే వూరు నుంచి కొండ యెక్క వలసి వుంటుంది . అతి యత్తైన పర్వతం పైన వున్న శివకోవెలగా ప్రపంచ ప్రఖ్యాతి పొందినది యీ తుంగనాధ్  . సముద్ర మట్టానికి సుమారు 3,680 మీటర్ల ఎత్తులో వున్న చంద్రశిల అనే పర్వతం మీద వున్న కోవెల యిది . యీకోవెల గోపురం కనీసం వెయ్యి సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిందని పురావస్తు పరిశోధకులు నిర్దారించేరు.

చోప్త దగ్గరనుంచి కాలి నడక మొదలౌతుంది . ఉత్తరాఖంఢ్ లో వున్న అనేకములైన యాత్రా స్థలాలు కాలినడకనే వెళ్ళవలసి వుంటుంది . శారిరిక అలసట తెలియకుండా ఉండేందుకా అన్నట్లు అక్కడి వాతావరణం ఆహ్లాద కరంగా వుంటుంది . యిక్కడ సంవత్సరానికి రెండే కాలాలు . వొకటి శీతాకాలం , రెండు మంచు కురిసే శీతాకాలం గా చెప్పుకోవచ్చు . బదరీనాథ్ , కేదార్ నాధ్ మందిరాలు ప్రతి సంవత్సరం వైశాఖ శద్ద తృతీయ నాడు తెరువబడతాయి , కాని మిగతా మందిరాలు అక్కడి వాతావరణ పరిస్తుతుల బట్టి మందిర ట్రస్టు యెప్పుడు తెరవాలి అనేది నిర్ణయిస్తుంది .  సుమారుగా అయిదు కిమీ నడకన వెళ్ళవలసి వస్తుంది . నడవలేని వారికోసం గుఱ్ఱాలు , డోలీలు దొరుకుతాయి . 3,680 మీటర్లు ఎత్తు అయిదు కిమీ లలో ఎక్కవలసి రావడంతో చాలా చోట్ల చాలా ఎత్తు (స్టీప్) ఎక్కవలసి రావడం తో కాస్త ఆయాసం ఎక్కువగా అనిపిస్తుంది . యీ ప్రదేశానికి పర్వతారోకకులు తప్ప మామూలు యాత్రికులు చాలా తక్కువ సంఖ్యలో వస్తువుంటారు . అందు కనేనేమో యీదారి కాస్త నిర్మానుష్యంగా వుంటుంది . కాలి నడక మొదలయ్యే ప్రాంతంలో మాత్రమే చల్ల , వేడి పానీయాలు తినుబండారాలు దొరకుతాయి . మళ్లా కోవెల ప్రాంతంలో అన్నీ  దొరుకుతాయి . తుంగనాథ్ నుంచి చంద్రశిల శిఖరం రెండు కిమీ ల పైన వుంది . త్రేతాయుగం లో శ్రీరాముడు యీ చంద్రశిల శిఖరం పైన తపస్సు చేసినట్లుగా రామాయణంలో చెప్పబడింది . యీ ప్రదేశం మూడు ప్రాకృతిక పుణ్యజలలతో యేర్పడ్డ 'ఆకాశకామిని ' నదీ తీరాన వుంది వొకటి రెండు రోజులు వుండడానికి వీలుగా చిన్న చిన్న రూములు కామన్ టాయిలెట్ లతో వున్న సామాన్య గదులు తక్కువ వెలలో లభిస్తాయి . ప్రొద్దున్న పది గంటలకు నడక ప్రారంభిస్తే తుంగనాధుని దర్శించుకొని భోజనం చేసుకొని సాయంత్రం నాలుగు అయిదు గంటలకి చోప్తా చేరుకోవచ్చు.

యాత్రికులకు వో చిన్న సూచన హిమాలయాలలో ప్రొద్దున్నే వీలైతే సూర్యోదయానికి పూర్వం యాత్ర మొదలుపెట్టి సూర్యాస్తమయానికి ముందు లేక వెంటనే ప్రయాణం నిలిపివేస్తే మనం చాలా ఆపదల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా యిక్కడి వాతావరణం నమ్మలేని విధంగా మారుతూ వుంటుంది . అంతలోనే వాన అంతలోనే యెండ . నడక దారి రెండువైపులా కనుచూపు మేర రంగురంగుల పేరు తెలియని అడవి పువ్వులు చిరు చలిగాలికి వణుకుతున్నాయా అన్నట్లుగా కదులుతూ యాత్రికులను స్వాగతిస్తూ వుంటాయి . అంత యెత్తున వున్న పచ్చిక మైదానాలు మనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి . తుంగనాధ్ మందిరం కేదార్నాద్ మందిరాన్ని పోలివుంటుంది . లోపల శివ లింగం , శివ కుటుంబంతో పాటు పాండవుల విగ్రహాలను కుడా చూడొచ్చు . కాశి నగరానికి చెందిన బ్రాహ్మణులు యిక్కడ నిత్య పుజాదులు నిర్వహిస్తున్నారు . ఆరునెలలనుంచి ఎనిమిది నెలలవరకు యీ కోవెల మూసివేస్తారు . ఆ సమయంలో మోకుమఠ్ లో తుంగనాథునికి నిత్య పూజానైవేద్యాలు జరుపుతారు.

దేశరాజధాని  ఢిల్లి నుంచి ఋషికేశ్ వరకు రైల్ ద్వారా ప్రయాణం చెయ్యవచ్చు .అక్కడనుంచి ఓఖిమఠ్  సుమారు 200 కిమీ .  ప్రొద్దున్న ఋషికేశ్ లో బయలు దేరితే వాతావరణం అనుకూలంగా వుంటే సాయంత్రానికి ఓఖిమఠ్  చేరుకోవచ్చు . ఓఖిమఠ్ లో కనీసఅవసరాలు కలిగిన సామాన్యమైన గదులు అద్దెకు దొరకుతాయి . కేదార్ నాథ్ కోవెలకి హెలికాఫ్టర్ లో వెళ్ళేవాళ్ళకి అగస్త్యముని మీదుగానే వెళ్ళవలసి వుంటుంది వీలున్న వారు తుంగనాథుని దర్శించుకొని పరమశివుని కృపను పొందండి .

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు