పద్యం - భావం - సుప్రీత

వేమన పద్యం

తప్పు లెన్ను వారు తండోప తండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు
విశ్వదాభి రామ వినుర వేమ.

తాత్పర్యం
తప్పు పట్టే వారు చాలా మంది లోకం లో , కాని ఈ తప్పు పట్టే వాళ్ళంతా తమ తప్పులని అంత తెలికగా ఒప్పుకోరు.

విశ్లేషణ
అందరు మనుషులు తప్పు చేస్తారు ఎప్పుడో ఒకప్పుడు, కాని ఎక్కువమంది తమ తప్పుల్ని పట్టీంచుకోకుండా ఎదుటివాళ్ళలో తప్పులు ఎంచుతారు ,ఎవరైన తమ తప్పు చూపిస్తే తట్టుకోలేరు. మనం ఒక వ్యక్తి లో తప్పులు ఎంచేటప్పుడు ముందు మన తప్పుల్ని దిద్దుకోవాలి, అంతే కాదు తప్పు చేయటం మానవ సహజం, మళ్ళి తప్పు చేయకుండా ఉండాలి.

దాశరధీ పద్యం

ఎక్కడి తల్లితండ్రి సుతులెక్కడివారు కళత్రబాంధవం
బెక్కడ జీవుడెట్టి తనువెత్తిన బుట్టుచు బోవుచున్న నా
డొక్కడె పాపుణ్య ఫల మొందిన నొక్కడే కాన రాడు నే
ఱొక్కడు వెంటసంటి భవమొల్లనయా కృపజూడవయ్య నీ   
టక్కరి మయలందిడక దశరధీ కరుణాపయోనిధి. 

తాత్పర్యం
తల్లి తండ్రులు , కుమరుడు భార్య ఎక్కడనుంచి వచ్చారు? ఎన్నో జన్మలు ఎత్తుతూ బంధముల తగుల్కొని  జీవించి మరణించునది దేహమె గాని అన్నింటా ప్రకాశించు జీవుడు ఒక్కడే ,అన్ని జన్మల పాప పుణ్యములను జీవుడు తానే అనుభవించవలెను కాని ఎవరు తోడు రారు . నాకు మరు జన్మ మీద ఆశ లేదు , హే రామ నన్ను ఈ సంసార బంధముల నుంచి విముక్తుని చేసి జీవన ముక్తి ని ప్రసాదించుము కరుణసాగరా.

విశ్లేషణ
మన చుట్టూ ఉన్న తల్లితండ్రులు ,బంధువులు ,స్నేహితులు , భార్యా బిడ్డలు ఎక్కడ నుంచి వచ్చారు వీళ్ళంతా మనకి ఎన్నో జన్మల నుంచీ వివిధరూపలలొ మనతో బంధాన్ని కలుపుకుంటూ వచ్చారు. మన ప్రాణం పోయినప్పుడు దేహం మాత్రమే మరణిస్తుంది, ఆత్మ మనం చేసిన పాప పుణ్యాలని బట్టి మరో జన్మ ఎత్తుతుంది. మనిషి చేసిన పాప పుణ్యాలను తను మత్రమే అనుభవించాలి వేరెవరు అనుభవించరు.

సుమతీ శతకం
కూరిమి గల దినములలో
నేరములెన్నడను గలగ నేరవు మఱియా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ

తాత్పర్యం
పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో నేరాలు ఎప్పుడూ కనిపించవు. ఆ స్నేహం చెడగానే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి.

విశ్లేషణ
మనిషి తన స్నేహితుల్లో , ఇష్టమైన వాళ్ళల్లో ఎప్పుడూ మంచి సుగుణాలనే  చుస్తాడు. అదే వ్యక్తి తో స్నేహం చెడిపోతే ఆ వ్యక్తి లో అన్ని తప్పులే కనిపిస్తాయి. అలా కాకుండా ఎప్పుడూ ఎదుటివాళ్ళతో సామరస్యంగా ఉండాలి.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు