అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

నాకు ఒక్కొక్కప్పుడు అనిపిస్తూంటుంది, అసలు ఈ రోజుల్లో ఇళ్ళల్లో చిన్న పిల్లలకి , జీవితంలో అన్నీ సుఖాలే కాదూ, కష్టాలు కూడా ఉంటూంటాయి అని నేర్పే తల్లితండ్రులు ఉంటారా అని. అలా అంటే, “ మీవి అన్నీ నిరాశాభావాలే కానీ, ఎప్పుడైనా  optimistic  గా అసలంటూ ఆలోచించారా..” అని అభిప్రాయ పడేవారూ ఉంటారు. కానీ, ఉన్న మాటేదో చెప్పుకోవాలిగా, నచ్చినా, నచ్చకపోయినా. అసలు ఈరోజుల్లో చిన్న పిల్లలకి అన్నేసి విలాస వస్తువులు అవసరమంటారా? మళ్ళీ అలా అంటే..” మీ చిన్నతనంలో అలాటివి దొరకలేదని, కుళ్ళూ, అసూయానూ, చెప్పకండి ఊరికే..” అన్నా అనొచ్చు. ఐశ్వర్యవంతుల పిల్లలకి, వారి తల్లితండ్రులు, ఒళ్ళంతా డబ్బుతో మునిగి తేలుతూంటారు కాబట్టి, వాళ్ళేం చేసినా చెల్లుతుంది. కానీ దేశంలో అందరూ కోటేశ్వరులు కాదు కదా, చాలామంది, మధ్యతరగతి, ఇంకా చెప్తే దిగువతరగతి లోకే వస్తారు. మనం చెప్పుకునేది అలాటి వారి గురించి.


అసలు వారి పిల్ల్లలకి ఏ విషయంలోనైనా   “No” అని చెప్ప గలిగే  ధైర్యం ఉందా అని. ఏం చెప్తే. ఏం కొంపముంచుతాడో అని భయం. అలాగని అందరు తల్లితండ్రులూ అదే కోవలోకి వస్తారని కాదు. చెప్పేవారూ ఉన్నారు, కానీ బహు తక్కువ. ఇదివరకటి రోజుల్లో వారు, చిన్న చిన్న ఇళ్ళల్లో ఉండి , మధ్యతరగతి వాతావరణం లోంచి వచ్చినవారే. అదృష్టం బాగుండి, ఆర్ధిక పరిస్థితి బాగు పడి, ఇప్పటికి పెద్ద పెద్ద ఇళ్ళల్లోకి మారారు. కానీ, ఈరోజుల్లో పిల్లలు  పుట్టడమే, కార్పొరేట్ ఆసుపత్రులలోనూ, అసలు వాళ్ళకి జీవితానికి  ఓ  flip side  కూడా ఉంటుందని తెలియకుండా పెరుగుతారు. ఏ విషయం తీసికోండి,తిండి అలవాట్లనండి, బట్టలనండి, ఆటవస్తువులు అనండి, విలాస వస్తువులనండి, వాళ్ళు అడగడం తరవాయి, ప్రత్యక్షం అయిపోతాయి. ఆడిందే ఆట, పాడిందే పాట గా జరుగుతుంది. అకస్మాత్తుగా ఏదైనా జరిగితే ఎదుర్కునే ధైర్యం కూడా నేర్పాలి. వాళ్ళకీ  “కష్టం”  అంటే నేర్పాలి. భవిష్యత్తు లో ఏ కష్టమూ రాకూడదనే అందరూ భావిస్తారు. కానీ కష్టాలనేవి చెప్పి రావుగా.

ఉదాహరణకి  ఎక్కడికైనా  వెళ్ళాల్సొచ్చినప్పుడు, ప్రతీసారీ ఇంట్లో ఉండే కార్లలోనే అవసరం లేదు, నాలుగడుగులు వేసి, బస్సుల్లో వెళ్ళే అలవాటు చేయడంలో తప్పేమీ లేదు. వ్యాయామానికి వ్యాయామం గానూ ఉంటుంది. చదువులూ, మిగిలిన వ్యాపకాలతో , అసలు  నడక అనేదే మర్చిపోయారు ఈరోజుల్లో. నడిస్తే ఏదో మిడిల్ క్లాసనుకుంటారేమో అని భయం.  ఏదో సమస్య వచ్చి, ఏ డాక్టరుదగ్గరకో వెళ్ళడం, ఆయనేమో  వందల్లో ఫీజు తీసికుని, ప్రతీ రోజూ ఓ నాలూగైదు కిలోమీటర్లు కనీసం, అదేదో జాగింగో, సింగినాదమో చేయాలండీ, అని చెప్పడం తరవాయి,  భార్యాభర్తలిద్దరూ, వీకెండ్ కి ఏ మాల్ కో వెళ్ళి, రకరకాల చెడ్డీలూ, నిక్కర్లూ వాటికి మ్యాచింగు బూట్లూ తెచ్చేసికోడం, ఓ ముహూర్తం చూసుకుని, రోడ్లమీద పడ్డం. ఇంత హడావిడి అవసరమంటారా?  ఈరోజుల్లో ఏ సొసైటీలు చూసినా, కావాల్సినంత జాగా ఉంటోంది.వాటికి సాయం, ఓ టెర్రేసు కూడా ఉంటోంది. హాయిగా, అందులోనే ప్రతీరోజూ , ఓ గంట సేపు నడిచి, ఒంటి కొవ్వు తగ్గించుకోవచ్చుగా. అబ్బే, మనం కొత్తగా కొనుక్కునవన్నీ, ఊళ్ళోవాళ్ళకి చూపించుకోవద్దూ మరి?  ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఒకే రంధి-- అందరూ చూడాలి, అందరికీ చూపించుకోవాలి. ఉండడం మంచిదే, కానీ దానివల్లే ఆరోగ్యాలు బాగుపడవు గా. కాళ్ళకి చెప్పుల్లేకుండా నడవడం పాపం కింద భావిస్తారు. చిన్నప్పుడు కాలేజీకి వచ్చేదాకా చెప్పుల్లేకుండా స్కూళ్ళకి వెళ్ళినవారే ఈ తల్లితండ్రులందరూనూ, అయినా సరే ఇంట్లో కూడా చెప్పుల్లేకుండా నడవరు. పైగా ఏమైనా అంటే, “ఆరోగ్య సూత్రాలు” వల్లెవేస్తారు. మరి బయట దొరికే జంక్ ఫుడ్ తినేటప్పుడు, ఈ “ so called  ఆరోగ్య సూత్రాలు” గుర్తుకు రావా?

కొన్ని సందర్భాలలో ఇంకొన్ని చిత్రాలు చూస్తూంటాము, పిల్లల బట్టల విషయంలో,  ఏ బంధువల ఇళ్ళల్లోనైనా, శుభకార్యానికి వెళ్ళాల్సొస్తే, వీళ్ళకే, డిజైనర్ బట్టలమీద శ్రధ్ధ  ఎక్కువవుతూంటుంది.  వెంటనే వెళ్ళి లేటెస్ట్ డిజైను కొనేదాకా నిద్ర పట్టదు. ఫఁఅన్ జరుగుతున్నవారికంటే, వీళ్ళ హడావిడే ఎక్కువగా కనిపిస్తూంటుంది. పోనీ వాటినైనా కొద్ది కాలం, ఇంకో రెండు మూడు సందర్భాలకి వాడుతారా అంటే అదీ లేదూ. కిందటిసారి వేసుకుందికదండీ, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారూ, అని ఇంకో డ్రెస్స్ తీసికోడం. వీరికి సాయం, మార్కెట్ లో కూడా కొత్తకొత్త డిజైన్లు వస్తూనేఉంటాయి. ఇదివరకటి రోజుల్లో, ఏ పుట్టినరోజుకో, ఏ ఇంటర్వ్యూకో తప్ప కొత్తబట్టలుండేవి కావు. పైగా ఇంట్లో పిల్లలు ఏ ఇద్దరో ముగ్గురో ఉన్నారంటే, ఓ పెద్ద తాను తీసికుని కుట్టించేసేవారు.  వార్డ్ రోబ్ నిండా ఎన్ని బట్టలుంటే అంత గొప్ప ఈరోజుల్లో. వాటిని ఉపయోగించేది మహ అయితే, ఓ రెండుసార్లు. తరువాత out of fashion  అయిపోయాయని, ఏ NGO  నో పిలిచి దానం చేయడం ఇంకో స్టేటస్ సింబలూ.

ఇలా చెప్పుకుంటూ పోతే, ఏ కోణం నుండి చూసినా , కొత్త… కొత్త..కొత్త… అదే జీవితం అనుకునే పధ్ధతిలోనే పెంచుతున్నారు చాలా మంది. కొద్దిగా కష్టం, సుఖం కూడా సమపాళ్ళలో రుచి చూపిస్తే మంచిదేమో.. ఒకసారి ఆలోచించండి… సుఖాలనేవి డబ్బుతోనే ముడిపడి ఉంటాయనే భ్రమలోంచి బయట పడాలి. పూరిపాకల్లో ఉండేవారు కూడా “సుఖం” గానే ఉంటున్నారు. మనం ఆలోచించే పధ్ధతిలో ఉంటుంది…

సర్వేజనా సుఖినోభవంతు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు