మనిషి @ సంతోషం
'వాడెప్పుడూ అంతేరా...! ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటాడు'. ఆ అమ్మాయి ముఖంలో ఎప్పుడూ నవ్వు కనపడదు'. 'వాడి కెవరు పడ్తార్రా అమ్మాయిలు...? ట్రాజెడీ ఫేసు వాడూను.' 'చిన్న విషయాన్ని కూడా బూతద్దంలో చూసి, తెగ ఫీలై పోతుంటాడు'. 'వాడితో తిరిగితే మనమూ అలానే తయారవుతాం.' 'లైఫ్ ను హాపీగా గడపడం నా వల్ల కాదు...' ఇలాంటి మాటలు యూత్ మధ్యే కాదు, పెద్దవాళ్ల మధ్యా వినిపిస్తుంటాయి. నా జీవితంలో సంతోషం పోగొట్టుకున్నాను. ఇక ఈ జీవితం ఇంతే... అని పాతికేళ్ల వయసులో నిరాశతో చెప్తుంటారు. 'సంతోషం ఎక్కడ దొరుకుతుంది...?' అని వెర్రిగా అడుగుతుంటారు. అంతేకాదు ఈ మధ్య సంతోషం గురించి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అధ్యయనంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. 117వ స్థానంలో నిలిచింది భారతదేశం. సంతోషాల హరివిల్లుల్లా, లక్ష్యాల రేసుగుర్రాల్లా, విరగగాసిన ఆపిల్ పళ్ల తోటలా, నిండుపున్నమినాటి వెన్నెల చిదుగుల్లా.. నువ్వుతూ, తుల్లుతూ, కేరంతలు కొడుతూ జీవించాల్సిన యూత్ నిర్లక్ష్యపు నీడల్లో, నీరసపు దారుల్లో, మౌనాల చీకట్లలో జీవిస్తున్నారు. ఆత్రేయ అన్నట్లు 'ఒక పొరపాటుకు యుగములు బాధపడుతున్నారు'. ఉన్నదానిని వదులుకొని లేని దానిని కోరుకుని ఆనందాన్ని జీవితపు పొలిమేర నుంచి తరిమేస్తున్నారు.
సంతోషమా... నీ చిరునామా ఎక్కడ?
ఆనందం ఎక్కడ దొరుకుతుంది...? ఎక్కడ అమ్ముతారు...? ఎవరు మనకు ఇస్తారు...? దాన్ని పొందడం ఎలా...? అసలు సంతోషం ఎలా ఉంటుంది...? ఇవన్నీ పిచ్చి ప్రశ్నల్లా కనిపించొచ్చు. కానీ నేటి యువతకు ఇవి చాలా అవసరం. మూడో ఏడు వచ్చింది మొదలు చదువుల ఖార్కానాల్లో, మార్కుల గ్రాఫుల్లో, జీవించడం అంటే లక్షలు సంపాదించడం, ఖరీదైన కార్లలో తిరగడం అన్న అభిప్రాయాలున్న నేటి పోటీ ప్రపంచంలో.. వాళ్లకు సంతోషం అంటే తెలియకపోవడం తప్పులేదు. చదువంటే యంత్రాల గురించి, యానిమేషన్ల గురించి చదువుకనే నేటి యువతకు మనుషుల్లో, మనుషుల్తో, మనుషుల మధ్య సంతోషం ఉంటుందని తెలియకపోవచ్చు.
ఆనందం అంటే కొత్తగా ఇంట్లో కొనుక్కున్న సామాను వల్ల, తండ్రి కొనిచ్చిన బైక్ వల్ల, భాయ్ ఫ్రెండ్ ప్రెజెంట్ చేసిన సరికొత్త బ్రాండ్ సెల్ల్ వల్ల కలుగుంది అనుకుంటున్నారు. వాటిలో ఆనందాన్ని వెతుక్కోవడం నేటి యువతకు అలవాటైందని అనిపిస్తుంది. సంతోషాన్ని వస్తువుల్లో వెతుక్కోవడం నేటి సమాజంలో మామూలైంది. వేలు ఖర్చుపెట్టి బెడ్ కొనుక్కోవచ్చు. కానీ నిద్రను ఎలా కొనగలం... అని పెద్దలు అనుభవంతో చెప్పిన మాట.
ఒక వస్తువును మరొకరు మీకు కొనివ్వడం వెనక మీ మీద వాళ్లకున్న ప్రేమను, వాళ్ల హృదయంలో మీకున్న స్థానాన్ని తెలుసుకుంటే ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. సంపదకన్నా సంతోషం సాటి మనిషికి చేసే సాయంలో చూడంలాంటారు తత్త్వవేత్తలు, మేధావులు. సంతోషం సమష్టి తత్వంలో, మన ప్రవర్తనలో, భావోద్యేగాలలో మాత్రమే ఉంటుంది. ఆనందానికి కొలమానం మీ మీ భావోద్వేగాలే అంటారు మానసిక నిపుణులు.
ఆనందం అర్ణవమైతే...!
ఆనందం అనేది ఒక హృదయం నుంచి మరో హృదానికి నేరుగా వెళ్లే ఓ స్పార్క్. మనుషులు మాత్రమే మాట్లాడుకునే రాతలోకి కుదించలేని భాష. ఓ గిలిగింతల ఉద్వేగం. వారంలో ఐదు రోజులు కంప్యూటర్ తో కుస్తీ పట్టి వారంతంలో పబ్ కు వెళ్లి వెస్ట్రన్ మ్యూజిక్ కు, కిక్కుతో చేసే డాన్స్ కాదు. అది హృదయగతం. శరీరానికి అవతల స్పందించే ఓ మనో భావనా ప్రపంచం. ఆనందాన్ని కేవలం శరీర కదలికల్లో, మత్తుల జిమ్ముక్కుల్లో వెతుక్కుంటున్నారు నేటి యువత. అదే నిజమైన సంతోషం అని భ్రమ పడుతున్నారు.
వాస్తవానికి సంతోషం మనిషికి, మరో మనిషి వల్లే వస్తుంది. హృదయానికి దగ్గరైన మరో వ్యక్తి వల్లే వస్తుంది. కొనుక్కుంటే రాదు. అంగడి సరుకుల్లో దొరకదు. మత్తుల నోట్లల్లో దొరకదు. మీ లక్ష్యాల సాధనలో దాగి ఉంటుంది. మీ మనసు మూలన మూర్ఛనలు పోతూ ఉంటుంది. ఏ అర్థరాత్రో మీ కలల్లో బయటపడి పోతుంది. మీకు తెలియకుండానే మిమ్మల్ని మరొకరికి దగ్గర చేస్తుంది. అసలు మీ లోనే నిరంతరం ఏ మూలో దాగి ఉంటుంది. మిమ్మల్ని మీరు గుర్తిస్తే... మీ మనసు చెప్పినట్లు నడుచుకుంటే... అదే సంతోషం. మీ మనసుకు, మీరు అభిమానించే వాళ్లకు ఏది కావాలో అది ఇవ్వడం సంతోషం. మీరు ఒంటరిగా మీ మనసుతో మాట్లాడండి... దానికి ఏది కావాలో అడగంటి, దాన్ని ఇచ్చేయండి. అప్పుడు మనసు చేసే అల్లరిని అనుభవించండి, అనుభూతి చెందండి. ఆ అర్ణవంలో పడి కొట్టుకుపోండి.
సంతోషాల జలపాతాలై సాగండి
చాలమంది సంతోషం కోసం ఏమి చేయాలి.. అని అడుగుతుంటారు. నేనైతే ఏమీ చేయొద్దు. మీ ఇష్టమొచ్చినట్లు సమాజ పరిధుల్లో ప్రవర్తించండి అని సలహా ఇస్తుంటాను. నిత్యం నవ్వుతూ ఉండండి. నవ్వును కూడా నటించకండి. మనస్ఫూర్తిగా నవ్విండి. మీ చుట్టూ ఉన్న వాళ్లని నవ్వించండి. ఒంటరిగా ఉండకండి. సెల్లులతో, ఛాటింగ్ లతో, ఇంటర్నెట్ తో కాకుండా, దగ్గరున్న మనుషులతో, మనసులతో మమేకంకండి. ఒక పొరపాటుకు యుగాలు బాధపడకంటి. గ్రీష్మం తర్వాత వసంతం కూడా వస్తుంది. గుణపాఠాలు నేర్చుకొని, పాజిటివ్ దృక్పథాన్ని అలవరచుకోండి. మీ భావోద్వేగాలను అడ్డంకులు లేకుండా ఉతిచానుచితాన్ని గ్రహించి వ్యక్తం చేయండి. మనసులో పెట్టుకొని దీర్ఘకాలం వ్యధ చెందకండి. తప్పు చేస్తే చిన్న వాళ్లనైనా మన్నించమని అడగండి. మీకు హాని చేసిన పెద్ద వాళ్లనైనా సులభంగా క్షమించేయండి. అసలు క్షమించినప్పుడు ఉండే ఆనందం మరెక్కడా దొరకదు.
మీ స్నేహితులు, మీ పరిచయస్థులు ఏదైనా సాధిస్తే మనసుతో అభినందించండి. కుల్లు, అసూయ, పగ, ద్వేషం లాంటి వాటిని దరి చేరనీయకండి. మీకు చేతనైనంత వరకు సాయం చేయండి. పరోపకార్థమే శరీరం. నగరాల్లో వారికంటే గ్రామాల్లోని వాళ్లు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే.., వాళ్లు సామాజికంగా కలుపుగోలుతనంతో జీవిస్తారు. ప్రకృతితో కలిస్తే, ప్రకృితినిలోని అందాల్ని అనుభూతి చెందగలిగితే... మనసు మురిసిపోతుంది. కొత్త విషయాలు నేర్చుకోండి. సృనాత్మకతవైపు మనలసను మల్లించండి. చాలా చిన్నచిన్న విషయాల్లో దాగిన సంతోషాన్ని కూడా ఎంజాయ్ చేయండి.
సంతోషం సగం బలం
సంతోషంగా జీవించే వారికి ఆయుష్షు కూడా ఎక్కువే. ఒక్కసారి నవ్వితే ముఖంలో కదిలే కండరాలు మీ ముఖానికి తేజస్సును ఇస్తాయి. 'నీ నవ్వుకు పడిపోయా' అని చాలామంది అమ్మాయిలకు అబ్బాయలు ప్రపోజ్ చేస్తుంటారు. నవ్వులోని సంతోషం కళ్లలో, హృదయంలో కనిపిస్తుంది. చిన్నిపాప బోసినవ్వుల్లోని స్వచ్ఛతలో కనిపిస్తుంది. మీరు చేసే చిన్నచిన్న పనుల్లో కనిపిస్తుంది. హద్దులు దాటని అల్లరిలో కనిపిస్తుంది. ఓ అరవై ఏళ్లు వచ్చాక, నేను చదువుకునే రోజుల్లో అలా చేశాను, ఇలా చేశాను అని చెప్పుకునేటప్పుడు కలిగే సంతోషం కోసమైనా... చిన్నచిన్నవి మంచి మంచి సాహసాలు చెయ్యాలి. అవి మీతోపాటు మీ కన్నతల్లిదండ్రులకు ఆనందాన్ని పంచేలా ఉండాలి. సంతోషం అనేది ఓ ఉఛిత నెట్ వర్క్... మీరు వాడుకున్నంత వాడుకోవచ్చు. అది మీ చేతుల్లో, చేతల్లోనే ఉంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రలా, 'బొమ్మరిల్లు' చిత్రంలో హాసిని క్యారెక్టర్ లా...