ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నారా...!
ఈ మధ్య కాలంలో ఓ ప్రైవేటు సంస్థ వాళ్లు యువతలో ధైర్యం గురించి సర్వే చేశారు. ఆ సర్వేలో "మీకెప్పుడైనా ఆత్మహత్య చేసుకోవాలని అనిపిించిందా?" అని అడిగారు. ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లలో నూటికి తొంబై శాతం అవుననే సమాధానం చెప్పారు. అయితే వాళ్లు చెప్పిన కారణాలు కొన్ని సిల్లీగా, సింపులుగా ఉన్నాయి. కొన్ని మాత్రం సీరియస్ గా ఉన్నాయి. అమ్మానాన్న మీద కోపం వచ్చినప్పుడు, మరింత దగ్గరైన స్నేహితులతో గొడవ పడినప్పుడు, చిన్నచిన్న కోరికలు తీర్చుకోడానికి డబ్బు లేనప్పుడు, ఇంట్లో, ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న అవమానాలు పొందినప్పుడు, పరీక్ష ఫెయిలైనప్పుడు, అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయినప్పుడు, తప్పని సరిగా వస్తుంది అని అనుకున్న ఉద్యోగం రానప్పుడు, కొత్తగా పెళ్లైన భార్యా భర్తల మధ్య, లవర్స్ మధ్య తగాదాలు వచ్చినప్పుడు... ... ఇలా చాలా చాలా చెప్పారు.
ఆలోచనల తీవ్రత
యూత్ లో కోపం, ఆవేశం పాళ్లు ఎక్కువగానే ఉంటాయి. తాము అనుకున్నది కచ్చితంగా జరగాలి అనే పట్టుదల కూడా ఉంటుంది. అంతా తమకు అనుకూలంగా జరగాలి అనుకుంటారు. కోరికలు తీర్చుకోవాలని, ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అయితే ఆర్థిక స్థితి, తల్లిదండ్రుల సంపాదన, చుట్టు ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ను బట్టి ఇవి ఉంటాయి. వీటిని పట్టించుకోకుండా తామ అనుకున్నది జరగనప్పుడు మనసు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతుంది. వాస్తవాన్ని మరిచి ఊహల్లో ఏవేవో ఆలోచనలు చేస్తుంది. చిన్నచిన్న చినుకుల్లాంటి భావాలను కూడా తుఫానుగా మార్చేస్తుంది. ఆ తీవ్రతలో జీవితం మీద, తన చుట్టు ఉన్న వాళ్ల మీద, తీరని కోరికలమీద విరక్తి కులుగుతుంది. ఆ విరక్తే మనసును కకావికలం చేస్తుంది. ముఖ్యంగా యువతలో కంట్రోలింగ్ పవర్ తక్కువ ఉంటుంది. తమ మీద, తమకు పూర్తి అధికారం ఉండదు. మనసు చంచలంగా ప్రవర్తిస్తుంది. బాల్యం నుంచి కౌమార్యం లోకి అడుగుపెట్టిన మనసు, శరీరం ఊహల రెక్కల కట్టుకొని, సీతాకోక చిలుకల్లా ఎగురుతుంది. వాస్తవాన్ని కాదంటుంది. ఆలోచనల గాడితప్పించి, తీవ్రంగా స్పందింపజేస్తుంది. బలాన్ని కూడా బలహీనత చేస్తుంది. ఆ బలహీన క్షణాల్లోంచే, ఆ అనాలోచిత ఆలోచనల్లోంచే నేను బతకడం వేస్ట్ అనుకుంటారు.
ఆవేశంపై అదుపు
పరీక్షల్లో ఫెయిల్ కాగానే ఇక జీవితమే వేస్ట్ అనిపిస్తుంది. తనను ప్రేమించిన అబ్బాయి కాదనగానే ఈ బతుకెందుకు అనిపిస్తుంది. టీవీలో ఇష్టమైన ప్రోగ్రాం చూడని ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. మనసు మాట వినదు. ఆ వినని క్షణాల్లోనే ఆత్మహత్య గురించిన ఆలోచనలు తలెత్తుతాయి. అలాంటప్పుడు ఆలోచనలను అదుపు చేయాలి. మీ మనసు మాట వినడం లేదని మీరు గుర్తించాలి. పక్కదారి పడతున్న మీ మనసును కంట్రోల్ చేసుకోవాలి. మీరు దేని గురించి ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారో, దాని వెనకున్న కారణాలేంటో తెలుసుకోవాలి. జీవితంలో ఏ విషయాన్నైనా సీరియస్ గా తీసుకొని, అదే జీవితం అనేంతగా బతకకూడదు. కోపం, ఆవేశం, బాధ ఇలాంటి వాటిపై అదుపు అవసరం. అందుకే ఓ ప్రఖ్యాత మానసిక శాస్త్ర వేత్త చెప్తాడు- ఏ పనినైనా ప్రారంభించేటప్పుడు ఇఫ్, ఇఫ్ నాట్ అని ఆలోచించి, రెండిటికీ సిద్ధపడేలా ఉండాలట. ప్రేమైనా, ఉద్యోగమైనా, పరీక్షల్లో ర్యాంక్ కోసం అయినా తీవ్రస్థాయిలో కష్టపడాలి. అదే సమయంలో మీ కృషికి మీరు అనుకున్నంత ఫలితం రాకపోయినా మీ మీద మీరు అదుపు కోల్పోకూడదు. మీలో కలిగే స్పందనల మీద, ఆలోచనల మీద ఎప్పటి కప్పుడు కంట్రోలింగ్ కీ మీ చేతుల్లోనే ఉండాలి. ఇది నేటి యుత్ కు చాలా అవసరం. ఎప్పుడు, ఎంతవరకు, ఎలా ఆలోచించాలి అనే పరిధి తెలిసిఉండాలి.
బలహీన క్షణాల్లోంచి బయటకు
ఏకాంతంగా కూర్చొని జరిగిన దాన్ని గురించి అదే పనిగా ఆలోచించ కూడదు. తనను వదిలేసిన లవర్ గురించి, జరిగిన అవమమానం గురించి, రాని ర్యాంక్ గురించి, పరీక్షలో ఫెయిల్ గురించి... ఒంటరిగా కూర్చొని దిగాలుగా ఉండకూడదు. వాటిలో మునిగి, చావు తప్ప వేరే మార్గం లేదు అనే నిర్ణయానికి రాకూడదు. ఒకవేళ వస్తే, మీ ఆలోచనలు మీ మాట వినడం లేదు అంటే. ఆత్మహత్యే మీకు శరణ్యం అని భావిస్తే... వెంటనే ప్రయత్నించకండి... ఒక వారం రోజులు వాయిదా వెయ్యండి. మీ ఆత్మీయుల దగ్గర మీ బాధను చెప్పుకోండి. తనివితీరా బాధను వెళ్ళగక్కండి. మనసు ఊరట చెందుతుంది. తేలిక పడుతుంది. వారిచ్చే సలహాలు, సూచనలు తీసుకోండి. అమలు పరచండి. కాదు మీరు మీ సమస్యను చెప్పుకోవడానికి సరైన ఆత్మీయులు లేరు అని భావిస్తే, కౌన్సిలింగ్ సెంటర్ కు వెళ్లండి.ఆత్మహత్య చేసుకుని బతికిన వాళ్లలో 99 పర్సెంట్ చెప్పేది- మేము తప్పు చేశాం. అలా ప్రవర్తించ కూడదు. ఒకవేళ మేము చనిపోయి ఉంటే, ఇంత గొప్ప జీవితాన్ని మిస్ అయ్యేవాళ్లం. కాబట్టి ఆ ఆలోచనే తప్పు. ఆ బలహీన క్షణాల్లోకి వెళ్లడం తప్పు. వాటి నుంచి రాకపోవడం తప్పు. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. మీ కన్నా, ఈ ప్రపంచంలో మీకు ఏదీ ఇంపార్టెంట్ కాదు... ప్రేమైనా, మనీ అయినా, ఉద్యోగమైనా... మరేదైనా మీ తర్వాతే, మీ ప్రాణాల తర్వాతే..
ప్రేరేపితాలు - పరిష్కారాలు
నేటి యువతకు తల్లిదండ్రుల ప్రేమ కరువవుతోంది. చదువల పేరుతో చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలకు దూరంగా ఉంటున్నారు. చదువుల గోల తప్ప ఆలోచనలు పంచుకునే దగ్గరి స్నేహితులూ ఉండడం లేదు. తల్లిదండ్రులు కూడా చదువుకు ఇస్తున్న ప్రాధాన్యత, వారితో సన్నిహితంగా మెలగడానికి, వారి మనసు తెలుసుకోడానికి ఇవ్వడం లేదు. వీటివల్ల ఎక్కువ ఒంటరితనాన్ని ఫీలవుతున్నారు. పైగా ర్యాంకులని, ఫస్ట్ మార్కులని వారిపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది నేటి విద్యావిధానం. అవి సాధించలేకపోతే జీవితం ఎందుకు అన్న భావన వారిలో కలిగిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమవుతున్న యూత్ కొత్తగా దగ్గరైన అమ్మాయిల నుంచో, అబ్బాయిల నుంచో ఆ అనురాగాన్ని పొందాలనుకొంటారు. అది దొరకనప్పుడు తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తారు. వీటికి తోడు నిరంతరం టీవీలు, సినిమాలు, మార్కెట్ కల్చర్, ఫ్యాషన్... ఇవన్నీ తోడై.. యూత్ ను కోరికల రేవుల్లోకి లాక్కుపోతున్నాయి. అవి తీరనప్పుడు, తీర్చుకోలేనప్పుడు తీవ్ర సంచలనానికి గురవుతున్నారు. మానసిక బలహీనులై ఆత్మహత్యల దారిపడుతున్నారు.
ముఖ్యంగా నేటి యువతకు కావాల్సింది- తల్లిదండ్రుల ప్రేమ, మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని బోధించే పుస్తకాలు, నైతిక విలువలు చెప్పే అధ్యాపకులు. పసి వయసునుంచే చిన్నచిన్న సమస్యలను అధిగమించడం. ఇష్టం లేనివి కూడా జీవితంలో ఎదురవుతాయి అని తెలుసుకోవడం. అందరితో కలివిడితనంగా అభిప్రాయాలను పంచుకునే మానసిక స్థాయి. కష్టాలను, నష్టాలను, సంతోషాలను, లాభాలను ఒకేలా తీసుకోగల మానసిక పరిపక్వత. ముఖ్యంగా యూత్ ను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న మూలాలను అంతం చేయాలి.