కుల చరిత్ర - నవీన శర్మ

kula charitra - naveena sharma

తెలుగు వారికి సినిమా కబుర్లన్నా, రాజకీయ చర్చలన్నా పిచ్చి ఎక్కువని పక్క రాష్ట్రాల వాళ్ళకి కూడా తెలుసు..బయటికి చెప్పుకోరు కానీ వీళ్ళకి ఇష్టమైంది మరోటి ఉంది..'కుల వాదం'...

'ఛీ ఛీ..వెధవ కుల పిచ్చి, కుల గజ్జి నాకు లేవండీ' అని అంటూనే ఏ ప్రముఖుడు ఏ కులం వాడో తెలుసుకుని వాడు తమ కులం వాడైతే లోలోపల అదో రకమైన ఆనందం పొందడం, ఎవడిది ఏ కులమో తెలుసుకుని వాడి గురించి ముందుగానే ఒక అభిప్రాయానికి రావడం మనవాళ్ళకి మామూలే...

ఒక కొత్త గాయకుడు పాట బాగా పాడుతుంటే అతని కులం తెలుసుకుని, "ఓహో..ముందే అనుకున్నాను...బ్రాహ్మలకి కాక సంగీతం ఎవరికి అబ్బుతుంది...వేరే కులం వాడు పాడాడంటే గొప్ప గానీ, బ్రాహ్మలు పాడటంలో ఆశ్చర్యమేముంది", అన్నారు ఒక చౌదరి గారు..

అదేమంటే ఘంటసాల, ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఇప్పటి తరం హేమ చంద్ర వరకు గుక్క తిప్పుకోకుండా బ్రాహ్మణ గాయకుల పేర్లు చెప్పాడు...

'మరి ఎమ్మెస్ సుబ్బలక్ష్మో'..అన్నాను నేను..

'ఆవిడా అదే..చూస్తే తెలీదు...ఆ కట్టు, బొట్టు..విష్ణు సహస్ర నామాల్లో ఆవిడ ఒత్తులు పలికిన తీరు...ఏది ఎమైనా సంగీతం, సాహిత్యం బ్రాహ్మల తర్వాతే ఎవరైనా..ఎందుకంటే వాళ్ళు మాంసం తినరు..అందుకే సరస్వతి వాళ్ళ నాలిక మీద ఉంటుంది, మెదడు పదునుగా ఉంటుంది..బ్రాహ్మలు విష్ణు మూర్తి నోట్లోంచి వచ్చారంటారు అందుకే' అంటూ చెప్పుకుపోతున్నాడు..

సుబ్బలక్ష్మిది బ్రాహ్మణ కులం కాదని అతనికి చెప్పినా నమ్మలేదు..'నీకు తెలీదు ఊరుకో' అన్నాడు..

చాలా యేళ్ళ క్రితం అరుగు మీద కూర్చుని స్వాతి కిరణం లో 'సంగీత సాహిత్య సమలంకృతే..' పాట వింటూ 'ఏరా! ఇది రాసిన నారాయాణ రెడ్డి బ్రాహ్మడే కదా' అని అడిగాడు నా స్నేహితుడు..వాడి మొహాన్ని అడోలా చూసాను..కాసేపు ఆలోచించాక లొపల దీపం వెలిగినట్టుంది.. నాలుక కరుచుకుని 'ఛా...పేరులో రెడ్డి ఉంది గా..' అని నవ్వుకున్నాడు..

మాంసం తినకపోవడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందంటే నాకెందుకో నమ్మ శక్యంగా ఉండదు...ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరికరాలన్నీ గత కొన్ని శతాబ్దాలుగా కనిపెడుతున్నది గొడ్డు మాంసం తినే పాశ్చాత్యులే...సంగీతం కూడా శాకాహారులకే అబ్బుతుందంటే ప్రపంచాన్ని ఊపేసిన గాయకుడు మైకేల్ జాక్సన్ శాకాహారా? నాకు తెలీదు...అసలు బ్రాహ్మణులు ఉల్లిపాయ తినకూడదు అని ఎక్కడో ఉంది కాని మాంసం తినకూడదు అని వేదంలొ చెప్పలేదట. అసలు వేదాల్లొ అశ్వమేధ యాగం వగైరాల్లో జంతు బలి ఇవ్వడం, ఆ మాంసాన్ని ప్రసాదంగా వండడం ఉండేదట....బ్రాహ్మల్లో శాకాహారం అనేది రాజకీయ అవసరంగా సంక్రమించిందే తప్ప అది కుల ధర్మం ఎప్పుడూ కాదని సర్వేపల్లి రాధాకృష్ణ ఒక వ్యాసంలో రాసారు...

ప్రాచీన కాలంలో బ్రాహ్మలు, క్షత్రియులు, మాదిగలు ప్రధాన కులాలు...ఎందుకంటే ఏదైనా యాగం జరిగితే చివర్లో జంతు బలి ఇచ్చినప్పుడు దానిని కోసి పాక శాలకు పంపడానికి మాదిగలే దిక్కు. మంత్రం చదివే బ్రాహ్మణుడు, ఖర్చు పెట్టే క్షత్రియుడితో పాటు, జంతు మాంసంతో వ్యవహరించే మాదిగ వేద కాలంలోని మత ధర్మంలో కీలక పాత్ర పోషించే వారు...వాళ్ళల్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా జరిగేవి..గౌతముడు అహల్యను పెళ్ళి చేసుకోవడం, వశిష్టుడు అరుంధతిని చెసుకోవడం ఈ బాపతే...అయితే తక్కిన కులాల వాళ్ళకి యజ్ఞ యాగ విధుల్లో పెద్ద పాత్ర ఉండేది కాదు...

ఏ అరమరికలు లేకుండా ఎవరి కుల వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు...ఆహార వ్యవరాల్లో కూడా అంతా మాంసాహారులే కాబట్టి తారతమ్యాలు తెలిసేవి కావు...

కొన్నాళ్ళకి బౌధ్దమతం పుట్టింది...దైవాన్ని చెరుకోవడానికి బలి పేరుతో యె జంతువుని హింసించాల్సిన పని లెదు, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే చాలు మోక్షమే..అనడం వల్ల స్వచ్చంద మత మార్పిడిలు ఎక్కువ సంఖ్యలో జరగడం చూసి అప్పటి పాలకులు కంగారు పడ్డారు..మత  సంరక్షణ కోసం బౌద్ధంతో పోటీ కి దిగారు...ప్రధానంగా బౌధ్ధం లో ఉన్నది అహింస కనుక ఇక హిందువులు కూడా ఎవ్వరూ మాంసం ముట్టకూడదన్నారు..జనం ఒప్పుకోలేదు...'అసలు యజ్ఞ యాగాల్లో మాకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు..మా పధ్ధతి మీ కోసం మార్చుకోమంటే మాకు కష్టం...అందుకే బౌద్ధం మాకు కుదరదు..మేము హిందువులుగానే ఉంటాం..మా తిండి మేము ఎప్పటిలాగే తింటాం..ఇంతగా చెబుతున్నారు కనుక మీరు మానేయండీ అన్నారు...

మాదిగలు ససేమిరా అన్నారు..'మాకు వచ్చిన విద్యే ఇది...చర్మం ఒలవడం మానేయమంటే మాకు కుదరదు...ఒలిచిన వాళ్ళం మాంసం వండుకోకుండా అసలు వీలు కాదు.. అని తేల్చేసారు..

క్షత్రియులు కూడా 'జంతువుని చంపే విషయంలోనే ఇంత ఆలొచిస్తే మాలో పౌరుషం చస్తుంది..రేపు యుధ్ధం వస్తే అహింస మంత్రం వల్లిస్తే శత్రువులు ఊరుకుంటారా? తలలు నరుక్కు పోతారు..అందుకే మాంసం మానడం మాకూ కుదరదు..." అని "ఎలాగూ మంత్రాలు వల్లించడం, విద్యా బోధ చెయ్యడమే కనుక మీరు మాత్రం మానేయండి" అన్నారు బ్రాహ్మల్ని మిగతా వాళ్ళు.

బ్రాహ్మలు సరే అన్నారు..అప్పటి దాకా అలవాటు ఉన్న దాన్ని మానేయలంటే ఎం చెయ్యాలి? ముందుగా ఆ విషయం మీద అసహ్యం తెచ్చుకోవాలి...అలా బ్రాహ్మలు అప్పటి నుంచి మాంసాన్ని అసహ్యించుకోవడం మొదలు పెట్టారు...ఒక తరం అసహ్యించుకుంటుంది సరే..తర్వాతి తరం దారి తప్పదని నమ్మకం ఎమిటి? అందుకే మడి-దడి పెట్టుకున్నారు...మాంసం తింటే మెదడు మందగిస్తుందని, సకల పాపాలు చుట్టుకుంటాయని, బ్రాహ్మణ జన్మ సర్వోతృష్టమని, మాంసం తిన్నా, పధ్ధతులు పాటించకపోయినా నిమ్న కులాల్లో పునర్జన్మ ఎత్తాల్సి వస్తుందని పిల్లలకి నూరిపోసేవారు... తమ తర్వాతి తరం పిల్లలు మళ్ళీ అన్య కులస్తులతో కలిసినా, స్నేహం చేసినా మాంసా హారులుగా మారే పరిస్థితి ఉంది కదా..అందుకే 'అస్ప్రుశ్యత పెట్టారు...మరీ ముఖ్యంగా మాదిగలను ఊరికి ఒక దిక్కున ఉండమని, బ్రాహ్మలు మరో దిక్కున అగ్రహారం కట్టుకున్నారు...ఇదంతా పరస్పర అవగాహనతో హిందూ ధర్మ రక్షణ కోసం అన్ని కులాల వాళ్ళు తీసుకున్న రాజకీయ నిర్ణయం..ఇక ఈ బ్రాహ్మలకి తోడుగా వైశ్యులు కలిసి వచ్చారు...తమకి కూడా వృత్తి, ప్రవృత్తి పరంగా మాంసా హారం అవసరం లేదని అనుకున్నారు. .స్వధర్మం కోసం ఆహార వ్యవహారాలను మార్చుకుని గొప్ప త్యాగం చేసారు గనుక బ్రాహ్మల్ని పూజనీయులన్నాడు రాజు..వారికి హోదా మరింత పెంచారు...సమాజం లొ మొదటి కులంగా తీర్మానించారు...ఈ పధ్ధతి ఎన్నో తరాలు కొనసాగింది...కారణం ఎదైనా బౌధ్ధం దేశంలో  వ్యాపించలేకపోయింది...హిందూ ధర్మానిదే పై చేయి అయ్యింది...కానీ అప్పటి రాజకీయ అవసరం శాశ్వత స్థితి పొందింది...

కానీ బెంగాల్ లోనూ, ఒరిస్సాలోను బ్రాహ్మలు చేపలు తింటారు..వాటికి జలపుష్పాలు అని పవిత్రంగా పిలుచుకుంటారు కూడా. అందుకు కారణం ఆర్ధిక పరిస్థితి. కూరగాయలకన్నా చవకగా దొరికేవి చేపలు ఆ రోజుల్లో. అధిక సంతానం, స్వల్ప ఆదాయం ఉన్న వాళ్ళుఏం చేస్తారు? చేపల వరకు మినహాయింపు విధించుకున్నారు. అలాగే కాష్మీర్ లో బ్రాహ్మలు గొర్రె మాంసం తినడం పరిపాటే..అందుకు కారణం అక్కడి వాతావరణ ప్రభావం. పెద్దగా రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో, కూరగాయలు పండని మంచుకొండల్లో మరి మాంసాహారమే శరణ్యం అయి కూర్చుంది.

ఇక చాతుర్వర్ణ సిధ్ధాంతం లొ విష్ణువు నోటి నుంచి బ్రాహ్మలు (మంత్ర పఠనం, విద్యా బోధన ప్రధానం కనుక), క్షత్రియులు భుజాల నుంచి (భుజ బలం ప్రధానం కనుక), వైశ్యులు ఊరువుల నుంచి (వ్యవస్థ బలంగా ఆర్ధిక పరిపుష్టితో నిలబడాలంటే తొడల్లొ బలం ఉండాలి కనుక), శూద్రులు పాదాల నుంచి (వ్యవస్థ ముందుకు నడవాలంటే పాదాలే ప్రధానం కనుక) ఉద్భవించారని చెబుతారు...ఇక్కడ ఒకటి గమనించాలి...హిందూ ధర్మంలో పెద్దలకి నమస్కరించేటప్పుడు పాద నమస్కారం చేస్తాం కాని నొటికో, భుజాలకో, తొడలకో నమస్కరించం..అంటే హిందూ ధర్మం శూద్ర కులాలకి ఇచ్చే గౌరవం అది..

ఇక మరో విషయం..కులం అనేది జన్మని బట్టా లేక చేసే పనిని బట్టా? ఒక బ్రాహ్మణుడు వ్యాపారంలొకి దిగితే అతను వైశ్యుడే...ఒక మాదిగ ఉపాధ్యాయుడైతే అతను బ్రాహ్మణుడే..ఒక క్షత్రియుడు చెప్పుల దుకాణం పెడితే అతను మాదిగే….పుట్టడం ఏ ఇంట్లో అయినా చేసే వృత్తిని బట్టి కులం నిర్ధారించుకోవాలి.....

వృత్తిపరంగా సంక్రమించే కులం అంటే గుర్తొచ్చింది.. పూర్వం రాజాస్థానాల్లో తాటి కమ్మల మీద పురాణ ఇతిహాసాలు, రాజు గారి శాసనాలు, మొదలైనవి వ్రాయడానికి లేఖరులని నియమించే వారు..దస్తూరి బాగుండి, భాష మీద పట్టు ఉండాలి ఆ వృత్తికి...ఆ రోజుల్లో విద్య బ్రాహ్మలకే ఎక్కువుగా ఉండేది కనుక వాళ్ళే రాజాస్థానాల్లో లేఖరులుగా చేరారు..తాటి కమ్మలపై వ్రాసేవారు కనుక వారిని కమ్మ లేఖరులు అనేవారట...కాల క్రమంలో వారినే కమ్మలు అని కూడా అనేవారు... రాజులతో నిత్యం ఉండడం వల్ల క్రమంగా వారు రాచరిక పట్లు తెలుసుకుని రాను రాను రాజుల ఆహార అలవాట్లు పొంది, రాచరిక సుఖాలు మరిగి, రాజకీయం వంటబట్టించుని ఇప్పుడు ఆ కమ్మలే రాజ్యాలేలుతున్నారని ఒకాయన చెప్పాడు...నిజానికి బ్రాహ్మలకి, కమ్మలకి చాలా ఇంటిపేర్లు కలుస్తాయి...మొక్కపాటి, ముళ్ళపూడి, గుమ్మడి, కావూరి, పాలచర్ల ఇలా చెప్పుకుపోతే చాలానే ఉన్నాయి...ఒక ఇంటిపేరు వేరు వేరు కులాల్లో ఉండడం సహజమే అయినా కమ్మలకి, బ్రాహ్మలకి ఇంటి పేరులు ఒకటే ఉండడం చాలా ఎక్కువే..ప్రస్తుతం ఆంధ్ర దేశంలో ఉన్న చాలామంది కమ్మ కులం వారు బ్రాహ్మల నుంచి వచ్చారన్న వాదానికి ఇదొక నిదర్శనం అనుకున్నా మళ్ళీ గోత్రాల దగ్గరికి వచ్చేసరికి చాలా తేడాలు ఉన్నాయి...

ఇక రెడ్లు ఎవరు, కాపులు ఎవరు అని అడిగితే ఇద్దరూ ఒకటే..వ్యవసాయం ప్రధాన వృత్తి..కొన్ని ప్రాంతాల్లో రెడ్లు గాను, ఇంకొన్ని ప్రాంతాల్లో కాపులుగాను, కాపునాయుళ్ళు గానూ చలామణీ అవుతున్నారు..ఇంతకీ ఏతావాతా చెప్పేదేమిటంటే కులాలు ఎన్ని ఉన్నా అన్నీ ప్రాంతీయంగానో, రాజకీయంగానో, సామాజికంగానో ఎర్పడినవే తప్ప ఇంకోటి కాదు. స్థూలంగా అందరిదీ  ఒక్కటే జాతి..తెలుగు జాతి.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు