ఆముక్తమాల్యద
యవ్వనవతి ఐన గోదాదేవి సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు రాయలు. శ్రీకృష్ణ దేవరాయల వినూత్నమైన ఊహలకు,కొద్దిగా సంక్లిష్టమైన ఆయన వర్ణనాశైలికి మరొక మంచి ఉదాహరణ ఈ పద్యం.
సైరంధ్రు ల్పయికెత్తి కజ్జలముఁ బక్ష్మశ్రేణికం దీర్ప వా
లారుంగన్నులమీఁదఁ జూచుతఱి ఫాలాంచచ్చతుర్థీనిశా
స్ఫారేందుం గనె వక్త్ర మక్కనుటఁ పర్వేందుఁ డాత్మప్రభా
చోరుం డుండఁగఁ దన్నుఁ దద్గత విభా చోరంబనున్ లోకముల్
గోదాదేవికి అలంకారం చేయడం కోసం నియమించుకున్న స్త్రీలు(సైరంధ్రులు) అలంకరించేప్పుడు కనురెప్పలకు కాటుక పెట్టడం కోసం గడ్డం కింద చేయిపెట్టి ముఖాన్ని కొద్దిగా పైకిఎత్తి కాటుక పెడుతుంటారు. అలా ముఖాన్ని పైకెత్తినప్పుడు విశాలమైన కనులతో పైకి చూస్తున్నప్పుడు గోదాదేవికి తన నుదురు కన్పించింది. ఆ నుదురు చవితినాటి చంద్రునిలా ఉంది. చవితినాటి చంద్రుడిని చూడడంవలన నీలాపనిందలు వస్తాయి కదా, ఆ కారణంగా, పున్నమి చంద్రుని కాంతిని ఈమె ముఖం దొంగిలించింది కనుక ఆమె ముఖం పున్నమినాటి చంద్రునిలా ఉంది అని నీలాపనిందలు వచ్చాయి ఆమెకు. నిజానికి ఆమె ముఖకాంతులనే పున్నమి చంద్రుడు దొంగిలించిఅంతగా కళకళలాడుతూ వెలిగిపోతున్నాడు. ఆమె ముఖానికి పున్నమి చంద్రునికి ఏమాత్రమూ తేడా లేదు అని చమత్కారం. కనురెప్పలకు కాటుక పెట్టేప్పుడు ముఖం పైకెత్తి కనుగుడ్లు పూర్తిగా పైకి లేపి చూడడం లోక సహజం, ఆ వర్ణన స్త్రీల అలంకరణను కూడా ఎంత నిశితంగా సన్నిహితంగా పరిశీలించగలడు కవిరాయలు అనే దానికి దృష్టాంతం. నుదురు చవితినాటి చంద్రునిలా ఉండడం వలన చవితి చంద్రుని చూసిన కారణంగా గోదాదేవి చంద్రప్రభలను దొంగిలించింది అని నీలాపనిందలు వచ్చాయి అనే ఆధ్యాత్మికసంబంధమైన చమత్కారం. ఇక కన్నుల వర్ణన.
నవ వయస్సీధుమదముచే శ్రవణకూప
ములఁ బడెడు శంక నలువ చాపలము లుడుగ
నిడిన శృంఖల లనఁ గాటుకిడిన దీర్ఘ
పక్ష్మరేఖలఁ గనుదోయి పడఁతి కలరు
మదపుటేనుగులు తమ చెక్కిళ్ళపై ధారలుగా కారుతున్న మదజలంచేత కనులు కానరాక బావులలో గోతులలో పడడం సహజమే. ఏనుగుల కాళ్ళకు సంకెళ్ళు వేయడమూ లోక సహజమే. గోదాదేవికి యవ్వనం వచ్చింది. ఆ నూత్న యవ్వనపారవశ్యంలో చెమ్మలు కమ్ముతున్న తడికన్నులు మదించిన ఏనుగులలాగా ఉన్నాయి ఆ ఆర్ద్రత మదజలంలా ఉంది. ఆ కన్నులు విశాలంగా చెవులదాకా ఉన్నాయి. ఎక్కడ అలా వెళ్లి, ఆ యవ్వనమదంతో, మదించిన ఏనుగుల్లాంటి కనులు చెవులు అనే కూపాలలో పడతాయో అనే భయంతో బ్రహ్మదేవుడు బిగించిన సంకెళ్ళలాగా నల్లటి కాటుక రేఖలు కనురెప్పలకు తీర్చి ఉన్నాయి.
కడిఁది విలు చేఁది గుఱి కీలకఱచి నిలుపు
మరుని కువలయశరము కంపములఁబోలుఁ
దార కడకంటికై సారె చేరిచేరి
వేగా మగుడ సలజ్జదృగ్విభ్రమములు
యవ్వనంలో అప్పుడప్పుడే అడుగిడిన ఆ సుందరి కన్నులు ఆదరిపడుతున్నాయి. సిగ్గుతెరలు కమ్ముకుంటున్నాయి. కనుగుడ్లు కనుల చివరలకు చేరి కడకంటి చూపులు మాటిమాటికీ ప్రసరిస్తున్నాయి. కనులు సిగ్గుతో కూడిన చూపులను ప్రసరించి వెంటనే చూపులు తిప్పుకుంటున్నాయి. ఆ చూపులను చూస్తున్న కన్నులు మన్మథుడు బలమైన వింటిని ఎత్తి, పళ్ళు కరిచిపట్టుకుని, నారినిచెవిదాకా లాగి గురిచూసి కొట్టడానికి ఉపయోగిస్తున్న 'కలువపూబాణం'లాగా ఉన్నాయి, ఆ కలువబాణంలా సంచలిస్తున్నాయి. మరలా మన్మథుని నల్లకలువ పూబాణమును ప్రస్తావిస్తున్నాడు రాయలవారు! ఈ నల్లకలువల నాలి కథలు ఇంతకు ముందు మనం విన్నవే.
అనయము రాగమొప్ప సహజానన చంద్ర కటాక్ష పంక్తి ప
ర్విన నఘశంకఁ గర్ణమను శ్రీ మరువెట్టుఁ జెలంగి చెండుఁగొ
ట్ట నవనిఁబడ్డకమ్మ మగుడం గొనునంతకు నంసపాళి నం
గన యిది దాచుఁపేరఁ బెరకర్ణముకమ్మ పయిం దళుక్కనన్
గోదాదేవి ముఖము చంద్రునిలా ఉంది. ఆమె చెవులు శ్రీ చుట్టినట్లుగా 'శ్రీకారం' ఆకారం దాల్చినట్లున్నాయి. గోదాదేవి చెండు ఆడుతున్నప్పుడు (పూ)బంతులాడుతున్నప్పుడు చెవికి (పూ)బంతి తగిలింది. చెవికమ్మ ఆ ఉదుటుకు కిందపడింది. ఆడపిల్లలు, కన్యలు చెంపల మీదకు ముసురుకుంటున్న ముంగురులను, మోచేతి పైభాగంతో, భుజాలతో రుద్దుకుంటూ వెనక్కు తోసుకోవడం లోకసహజమైన విషయం. అలా చెంపలమీదకు వాలుతున్న జుత్తును భుజంతో వెనక్కు తోసుకుంటూ గోదాదేవి క్రిందపడ్డ తన చెవికమ్మనుతీసుకోడానికి ముందుకు వంగింది. ముఖాన్ని ఒకప్రక్కకు త్రిప్పడంవలన రెండోప్రక్కనున్న చెవికి ఉన్న కమ్మ తళుక్కున మెరిసింది. యిదీ శ్రీకృష్ణదేవరాయలు కల్పించుకున్న ఈ సన్నివేశం. ఈ రమ్యమైన కల్పనకు తన అనన్యసామాన్యమైన ప్రతిభను, చమత్కారాన్ని, వర్ణనావైదుష్యాన్ని జోడించి అత్యద్భుతమైన ఈ పద్యాన్ని చెప్పాడు. అందులో ఒక లోకోక్తిని, ఒక ధార్మిక మర్మాన్ని కూడా సరసంగా జోడించాడు. సుమంగళులైన తోబుట్టువుల చెవులు శూన్యంగా ఉండడాన్ని సోదరులు చూడకూడదు. బోసి చెవులున్న తోబుట్టువులను చూడడం పాపం, తప్పు, సిగ్గుచేటు, అందుకని వారికి చెవులకు అందంగా కమ్మలను, కర్ణాభరణములను ఉండేట్లుగా సోదరులు చూడాలి. యిది లోకమర్యాద. గోదాదేవిముఖం చంద్రుడిలా ఉందికదా, చెవులు 'శ్రీ' ఆకారంలో ఉన్నాయి కదా, 'శ్రీ' అంటే లక్ష్మి కదా, చంద్రుడు, లక్ష్మీ అక్క తమ్ముళ్ళు కదా, (పూ)బంతులాడుతున్నపుడు చెవి కమ్మ క్రింద పడిపోయింది కదా, అందుకని ఆభరణములు లేని లక్ష్మీదేవిలాంటి ఆ చెవిని తమ్ముడైన చంద్రుని లాంటి ముఖానికి కనపడకుండా ఒక చెవిని ముఖం ప్రక్కకు తిప్పి దాచుకున్నట్లుగా, రెండవప్రక్కన ఉన్న చెవి కమ్మ మెరిసింది అని 'నభూతో నభవిష్యతి' అనే కల్పన,
ఏమనగలము ' కవిరాయా! వందనములు' అనడం తప్ప!
(కొనసాగింపు తరువాయి సంచికలో)
**వనం వేంకట వరప్రసాదరావు