ఈ రోజుల్లో ఓ కొత్త ఒరవడి ప్రారంభం అయింది. మన ప్రభుత్వాలేమో గణాంకాల ప్రకారం, ఆడపిల్లలు దేశంలో తక్కువైపోతున్నారో అని ఘోష పెడుతున్నారు. అసలు ఆడా, మగా జన్మలెత్తినదెందుకూ, ఏదో ఒకరినొకరు వివాహం చేసికుని, సంసారాలు చేస్తారనే కదా. పెళ్ళి చేసికోడమూ, పిల్లల్ని కనడమూ తప్ప ఇంకోటేమీలేదా అనొచ్చు. కానీ, వివాహమనేది కూడా మానవ జన్మలోని భాగమే కదా.
ఒకానొకప్పుడు ఆడపిల్ల కి యుక్తవయసు వచ్చేలోపలే పెళ్ళి చేసేవారు. అందులో, చాలా కష్టనష్టాలుండేవి. సంఘసంస్కర్తలు రంగంలోకి దిగి, ఆ పధ్ధతిని ఆపి, చట్టాలుకూడా మార్పించారు. అయినా కొంతమంది ఛాందసులు బాల్యవివాహాలు , దగ్గరుండి చేయించేదాకా నిద్రపోయేవారు కారు.. అయినా, పెళ్ళంటే అవగాహనైనా లేని, ఇద్దరు చిన్నపిల్లలకి పెళ్ళి చేయడం ఈ రోజుల్లో ఆలోచిస్తే హాస్యాస్పదంగానే ఉంటుంది. అతావేతా ప్రభుత్వాలు కూడా, వివాహానికి కనీసం ఫలానా వయసుండాలని చట్టాలు సవరించారు. అయినా, చట్టాల దారి చట్టాలదే, ఇప్పటికీ కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి, వాటిమీద టీవీల్లో సీరియళ్ళు కూడా చూపిస్తున్నారు. సరే, వదిలేయండి ఆ గొడవ.
ఏ వయసుకా ముచ్చట అన్నట్టు, ఏవయసులో ఏది చేయాలో అదిచేస్తేనే కదా బాగుండేది. ఇదివరకటి రోజుల్లోలాగ, ఆడపిల్లలకి చదువెందుకూ, ఏదో వంటా వార్పూ, నాలుగు కీర్తనలూ, కుట్టుపనులూ వస్తే చాలనేరోజులు కావుగా. కాలక్రమేణా, ఆడపిల్లలు కూడా చదువులో పైకి వస్తున్నారు, ఈరోజుల్లో ఏ పరీక్షాఫలితాలు చూసినా, ఆడపిల్లల ఉత్తీర్ణతా శాతమే ఎక్కువగా కనిపిస్తోంది. కారణం, వారికి చదువుమీద శ్రధ్ధ ఎక్కువ, నిలకడగా చదువుతారు. దేశంలోని చాలామంది ఆడపిల్లలు , అక్కడా ఇక్కడా తప్పించి, ఇంకా తల్లితండ్రుల చెప్పుచేతల్లోనే ఉంటున్నారు. అలా ఉన్నవారిలో నూటికి తొంభై మంది, మంచి సంబంధం వచ్చిందంటే, చదువు పూర్తవగానో, లేదా ఆఖరి సంవత్సరంలోనో పెళ్ళి చేసిపంపించేస్తున్నారు. వాళ్ళ సంసారాలేవో వాళ్ళే చూసుకుంటారు. పైగా, ఆడపిల్లకి పాతికేళ్ళలోపులో పెళ్ళిళ్ళు చేయడంలో తల్లితండ్రుల “ స్వార్ధం “ కూడా ఒకటుంది. తాము( తల్లితండ్రులు) ఉద్యోగాలనుంది రిటైరయే లోపులో, పురుళ్ళూ, పుణ్యాలూ పూర్తవుతాయన్నది ముఖ్య కారణం. ఎన్ని కబుర్లు చెప్పినా, పురిటి సమయంలోనూ, బిడ్డ కి కొద్దిగా నడుము నిలిచేంతవరకూనూ, అమ్మైనా ఉండాలి లేదా ఆ అమ్మ ఏదైనా ఉద్యోగం చేస్తూంటే అత్తగారైనా ఉండాలి, ఎంత నచ్చకపోయినా.
కానీ , ఈరోజుల్లో చూస్తూంటే, ఓ వైపున ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోందో అని మొత్తుకుంటూంటే, మగపిల్లలు , 40 ఏళ్ళొచ్చినా , పెళ్ళికి ఒప్పుకోవడంలేదు…ఏదో మొత్తానికి ఒప్పించి, సంబంధాలు చూసినా, ఈ “ బాలాకుమారుడి” కి, ఏ 30-35 ఏళ్ళ వయసున్న “ బాలా కుమారి” తప్ప దిక్కులేదు. వీళ్ళు సంసారాలు ఎప్పుడు మొదలెడతారూ, పిల్లల్ని ఎప్పుడు కంటారూ, ఆ పిల్లలని చూడ్డానికి ఇరువైపుల తల్లితండ్రులకి ఓపికెక్కడుంటుందీ… ఇలా అన్నీ ప్రశ్నార్ధకాలే. ఏమైనా అంటే Career ముఖ్యం అంటారు. అంటే, వారు పనిచేస్తూన్న కంపెనీకి CEO అయేదాకానా? ఈలోపులో పుణ్యకాలం కాస్తా వెళ్ళిపోతుంది. ఇంక అప్పుడు చూసుకోడానికి ఏమీ ఉండదు.. బ్యాంకు బాలెన్సులు తప్ప.
మళ్ళీ ఇందులోనూ కొన్నిసమస్యలున్నాయి. ఇదివరకటిరోజుల్లోలాగ, చెయ్యాల్సిన వయసులో పెళ్ళిళ్ళు చేసేస్తే, ఏదో ఇద్దరికీ వయసులో తేడా ఉండడం వలన, కనీసం కొంతకాలమైనా భార్య భర్త మాట వినేది. కానీ, ఈరోజుల్లో తేడా మాట దేవుడెరుగు, ఒక్కోచోట, భార్య వయసు భర్తకంటే, ఎక్కువైనా చల్తా హై ! ఎవరి ego వారిది. ఎవరికివారు ఉద్యోగాలు చేసేవారే. మొదట్లో ఉండే అత్యోత్సాహం, క్రమక్రమంగా తగ్గి, నువ్వెంతంటే నువ్వెంత అని కొట్టుకోవడం, కొన్ని సందర్భాలలో విడాకుల దాకా కూడా వెళ్ళడమూ చూస్తున్నాము. అసలు ఈ గొడవెందుకూ అనుకుని, అదేదో కొత్తగా “సహజీవనం “ ( live in ) అని ఒకటి మొదలెట్టారు.. కొంతకాలం కాపరం చేసికుంటారుట, నచ్చితే పెళ్ళి రిజిస్టరు చేసికోవడమూ, లేకపోతే ఎవరి దారి వారిదే ట. ఒకానొకప్పుడు భారతీయ వివాహ వ్యవస్థ కి ప్రపంచంలో ఎంతో గొప్ప పేరుండేది. కానీ, ఈ కొత్త పరిణామాలు చూస్తూంటే , ఏదో “ పాతవైభవం” గురించి, పుస్తకాలకే పరిమితమయేటట్టుంది.
ఇంకో కొత్త పరిణామం, ఒకే జాతి పక్షులు సహజీవనం చేసికోడం.. పైగా వీటన్నిటికీ చట్టాలు అనుమతించడం.
ఒకానొకప్పుడు పిల్లాడికైనా,పిల్లకైనా వివాహం చేయడం ఓ ముచ్చట లా ఉండేది. సంబంధాలు చూడడం, తాంబూలాలు తీసికోవడం, ముహూర్తాలు పెట్టుకుని, పెళ్ళిళ్ళు చేయడం. ఈరోజుల్లో ఎక్కడ చూసినా వివాహ వేదికలూ, మ్యారేజ్ బ్యూరోలూనూ. పోనీ, అక్కడైనా సవ్యంగా సమాచారం తెలుస్తుందా అంటే, అనుమానమే. ఎక్కడో విదేశాల్లో ఉంటాడు, ఇక్కడ వారి తల్లితండ్రులు , ఏ బ్యూరోలోనో రిజిస్టరు చేసికోవడం, ఆ కుర్రాడేమో ఓ పదిహేను రోజులు శలవుపెట్టి రావడం, పెళ్ళి చేసికుని ఆ అమ్మాయిని తీసికుని వెళ్ళడం. అదృష్టం బాగుంటే అన్నీ సవ్యంగానే ఉంటాయి. లేనప్పుడే గొడవంతానూ. ఎన్నేసి సంఘటనలు చదవడం లేదూ పేపర్లలో. అయినా సరే, మన దేశంలో విదేశ పెళ్ళికొడుకులకే గిరాకీ.
ఆ మధ్యన ఒక joke చదివాను… “ Get your son married.. otherwise you would get ASHISH and not ASHA… after 10 years..” అర్ధమయిందనుకుంటా… ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంటే…. అడక్కండి.. ఆ జోక్కే నిజమవుతుంది.
సర్వేజనా సుఖినోభవంతూ…