ఆర్దిక మాంద్యం. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే మాట. ఆర్ధిక మాంద్యం ఒక్ " బజ్ వర్డ్ " అయిపోయింది. మా చిన్నతనం లోకానీ, ఉద్యోగం లో ఉన్నప్పుడు కానీ ఈ మాట ఎప్పుడూ వినలేదు. ఈ మధ్యన చదువుతున్నాము, కానీ దీని అసలు అర్ధం ఏమిటో నాకూ తెలియదు.
మా చిన్నప్పుడు మధ్య తరగతి కుటుంబం లోనుండి వచ్చిన వాళ్ళు, ఏదో ఓ డిగ్రీ తీసికోవడం, ఆ తరువాత బి.ఈ.డీ ట్రైనింగ్ అయి ఎక్కడో టిచర్ గా చేరిపోవడమూ, డిగ్రీ లేనివాళ్ళు, సెకండరీ గ్రేడ్ ట్రైనింగో, లేక పీ.టీ ట్రైనింగో అవడమూ. ఎవరికీ ఏమీ సమస్య ఉండేదికాదు. పెళ్ళి సంబంధం వచ్చినా ఏదో కట్నం, దానితో పాటు రాలీ సైకిలో, హంబర్ సైకిలో ఇచ్చేవారు. కొంచెం డబ్బున్నవాళ్ళైతే ఆ సైకిలుకి ఓ డైనమో లైటు కూడా ఉండేది !! ఈ స్కూళ్ళలో కాకుండా కొంతమంది, కొచెం దూరం వెళ్ళడానికి సిధ్ధం అయితే, హైదరాబాద్ లో సెక్రటేరియట్ లోనో, లేకపోతే ఏ.జీ ఆఫీసులోనో సెటిల్ అయిపోయేవారు. వాళ్ళ తల్లితండ్రులు కూడా ఎంతో గర్వంగా చెప్పుకొనేవారు-- మా వాడు హైదరాబాదు లో పనిచేస్తున్నాడూ అని.పెళ్ళి సంబంధాలు కూడా పుష్కలంగా వచ్చేవి.
మా రోజులు అంటే 1962 తరువాత సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు దొరకడం ప్రారంభం అయ్యాయి. ఆ రోజుల్లో అంటే చైనా యుధ్ధం తరువాత ఇక్కడా పూనా లో డిఫెన్స్ అకౌంట్ లోనూ, మా ఆర్డినెన్స్ ఫాక్టరీలలోనూ ఎక్కడ చూసినా మన ( దక్షిణ భారతీయులే) వాళ్ళే కనిపించేవారు. మరీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు- ఏదో క్లెర్కులుగానూ, సూపర్వైజర్లు గానూ. ఎంత చెప్పినా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకంటే, మా వాటికి గ్లామర్ ఎక్కువగా ఉండేది, కారణం--జీతాలూ, టైముకి డి.ఏ లూ -- పెళ్ళి 1974 లో అయేటప్పడికి నా జీతం 500 రూపాయలు, కట్లు పోగా చేతికి వచ్చేది 350. హాయిగా ఇద్దరికీ సరిపోయేది. ఇప్పుడున్నటువంటి మాల్సూ , అవీ ఉండేవికాదు. చేతిలో డబ్బుంటే ఏదైనా కొనుక్కోవడం, లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టడం. ఓ పిల్లో పిల్లాడో వచ్చిన తరువాత, మన సో కాల్డ్ లక్షరీలు ( అంటే సినిమాలూ, హొటళ్ళూ ) బంద్.ఆ పిల్లల చదువులూ, వాళ్ళ బాలారిష్టాలూ వాటితో సరిపోయింది. కొద్దిగా రిస్క్ తీసికొనేవాళ్ళు, ఇన్స్టాల్మెంట్లమీద కొద్దిగా సరుకులు జమా చేసికొనేవాళ్ళు. నాకు ఇంట్లో ఫ్రిజ్ తీసికోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. దానిమీద డబ్బు పెట్టే ధైర్యమూ ఉండేదికాదు. స్కూటర్లూ, మోటార్ సైకిళ్ళ సంగతి నాకు తెలియదు.
90 ల దశకం వచ్చేటప్పడికి ఎకనామిక్ రెఫార్మ్స్ ధర్మమా అని మొత్తం పిక్చరే మారిపోయింది.ఐ.టీ ధర్మమా అని ఎక్కడచూసినా లక్షల్లో జీతాలూ, గ్లోబలైజేషనో అదేదో పేరుచెప్పి ఎక్కడ చూసినా హరితమే హరితం.ఎవరిని అడిగినా సత్యం లో ఉన్నాననో, విప్రో లో ఉన్నాననో, వీటికి అంతులేదు. మమ్మల్ని చూసి " సర్కారీ నౌక్రీ మే హై క్యా ? " అని అదేదో క్రైమ్ లా చూసేవారు. సంబంధాలు చూసే వాళ్ళు కూడా సాఫ్ట్ వేర్ వాళ్ళనే ఆకర్షించేవారు. గవర్నమెంట్ ఉద్యోగస్థులకి పెళ్ళి అవడమే గగనంగా మారిపోయింది. ఏవరూ లేకపోతే అక్క మొగుడే దిక్కన్నట్లు ఆఖరి ప్రిఫరెన్స్ గా మా వాళ్ళు( గవర్నమెంట్ పక్షులు) ఉండేవాళ్ళు !!
ఇల్లుకట్టుకోవాలని ఆలోచన రావడానికి పాతికేళ్ళు పట్టేది.ఏదో నానా తిప్పలూ పడి, కన్నపిల్లలని వారి కాళ్ళమీద నిలబెట్టగలిగితే , అదే చాలనుకునేవారు. అదృష్టంకొద్దీ ఓ ఇల్లు కూడా ఏర్పరుచుకుంటే అదో బొనసు. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా " మీకెవరికీ ఈ రోజుల్లోవాళ్ళలాగ ఓ యాంబిషన్ లేదు, డ్రైవ్ లెదు, రిస్క్ తీసికొనే ధైర్యం లేదూ" అనేవాళ్ళే. నేను చెప్పేదేమిటంటే జీతాలూ, ఖర్చులూ ఇప్పుడూ ఉన్నాయి, అప్పుడూ ఉన్నాయి, తేడా యేమిటంటే మనుష్యులలో వేసిన వెర్రి తలలు.ఈ రోజుల్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందంటే , జీతం అయిదంకెల్లో ఉంటుంది, వాడనుకుంటాడూ, అర్రే మానాన్న ఈ జీతం సంపాదించడానికి అన్నేళ్ళు పట్టిందీ, మనం ఓ ఏడాదిలో ఓ కారూ, ఓ ఫ్లాట్టూ కొనేసి మన సత్తా ఏమిటో చూపిద్దాం అందరికీను. అనే ఓ ప్రలోభం లో పడతాడు. ప్రతీదానినీ showcasing చేసికునే సందర్భంలో, చేతిలో ప్లాస్టిక్ కార్డులున్నాయి కదా అని ప్రతీదానికీ అప్పే. ఏదో వచ్చేనెల కట్టేయొచ్చులే అనుకోడమూ, ఇంకో ఖర్చేదో వచ్చి కట్టలేకపోవడమూ, అన్ని నెలల వాయిదాలూ కట్టకట్టుకుని, గంపెడంత అయిపోవడమూనూ. అకస్మాత్తుగా ఉద్యోగాలు ఊడిపోయేసరికి మన వాడికి వళ్ళంతా చెమట్లు పట్టేస్తుంది. ఈ కొన్న వస్తువులకి వాయిదాలెవడు కడతాడూ , క్రెడిట్ కార్డుల అప్పు ఎవరు తీరుస్తాడూ. వాళ్ళ నాన్నని అడిగే ధైర్యం లేదు. అప్పులు చేసే ముందర ఆయనతో చెప్పాడా లేదు , అందరినీ ఆశ్చర్యంలో ముంచేద్దామని ఈ అప్పులన్నీ చేసి తనే మునిగిపోయాడు. మన ఖర్చులమీద నియంత్రణ ఉంటే ఈ గొడవలన్నీ ఉండేవి కాదుగా . ఈ ఆర్దిక మాంద్యం కొత్తగా వచ్చినదేమీ కాదు. ఎప్పుడూ ఉండేదే. మనుష్యులూ, వాళ్ళ జీవిత పంథాలూ మారుతున్నాయి. ఇదివరకటి తరానికి దానిని ఎదుర్కునే ధైర్యం ఉండేది. ఇప్పటి వాళ్ళకి అది లోపించింది , అందుకే ఎక్కడ చూసినా ఆత్మహత్యలే.. దేశమంతా రైతులు చేస్తూన్న ఆత్మహత్యలకీ, వీటికీ చాలా తేడా ఉంది. రైతన్న మనకి అన్నంపెట్టే కార్యక్రమంలో అప్పుల్లో కూరుకుపోయాడు. ఇక్కడేమో మన Neo rich ఉద్యోగులు, ఉన్నదానితో సంతృప్తి చెందలేక, ఆకాశానికి నిచ్చెనలు వేసి అప్పుల్లో కూరుకుపోయారు. అంటే స్వాతంత్రసంగ్రామంలో దేశం కోసం జైళ్ళకెళ్ళినవారికీ, ఫ్రాడ్లు చేసి జైలుకెళ్ళినవారికీ ఉన్నంత తేడా అన్న మాట.
తేలిందేమిటంటే " యాంబిషనూ, డ్రైవూ " కాదు కావల్సినవి, జీవితాన్ని తీర్చి దిద్దుకొనే నేర్పు. అదుంటే చాలు " ఆర్ధిక మాంద్యం" గో టూ హెల్ కొసమెరుపేమిటంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగస్థులు పే కమిషన్ల ధర్మమా అని, తిరిగి పెళ్ళి సంబంధాల మార్కెట్ లో డిమాండ్ లో ఉండడం " దునియా గోల్ హై " .
సర్వేజనా సుఖినోభవంతూ…