విలువలవైపు పయనం
నాలుగు రోజుల క్రితం ఓ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో మాట్లాడాల్సి వచ్చింది. మాటల మధ్యలో ఓ అమ్మాయి అడిగింది- సార్ విలువలు అంటే ఏమిటి... అని. నేను ఆశ్చర్యపోయాను. తర్వాత ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో అడిగిందో తెలుసుకున్నాను. అక్కడకు వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కొంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వాళ్లూ ఆసక్తిగా విన్నారు. వాళ్లు పెరుగుతున్న నేపథ్యం, వారి చుట్టు ఉన్నసామాజిక పరిస్థితులు ఆ ప్రశ్న అడిగేలా చేశాయని నాకు అర్థమయింది. విద్య అనేది మనిషి మానసిక ఆనందాన్ని ఇవ్వాలి. మనలో మూల దాగిన ఆత్మశక్తిని బైటకు తేవాలి. అంతేకాని యువతను ప్రభుత్వ బానిసలుగా, డబ్బుకు దాసోహం అయ్యే మర మనషుల్లా మార్చకూడదు. విద్య అనేది శారీరక, మానసిక వ్యాయామం. విద్య గురించి చలం చెప్తూ- విద్య అంటే ఆనందించే శక్తిని వృద్ధి చేయడం. సౌందర్యానికి కళ్లు తెరవడం. బాధల్నించీ కష్టాల్నించీ దూరం చేసే మార్లాలను అన్వేషించడం. మరి నేటి యువతకు విద్య ఇవన్నీ అందిస్తుందా... అని నన్ను నేను ప్రశ్న వేసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రశ్నల్లోంచే ఆ అమ్మాయి నన్ను అడిగిందని అర్థమైంది.
విలువకు విలువ ఉందా...
విలువ అనే పదం నేడు కేవలం ఖరీదు అనే మాటకే పరిమతమైంది. ప్రతి దాన్ని కొనడం అమ్మడం లాంటి పరిభాషలోకి మనం వెళ్లిపోతున్నాం. విలువ అంటే మనిషి నైతికత అని చెప్పాలి. వివిధ సందర్భాల్లో, వివిధ సన్నివేశాల్లో మనిషి నడవడిక నైతికతతో కూడుకొని ఉండాలి. ఇది తప్పు, ఇది రైటు. ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అని కచ్చితంగా గిరిగీసి చెప్పడం కష్టమే. కానీ మన మనసు దానికి సమాధానం చెప్తుంది. చెయ్యి, చెయ్యొద్దు అని మార్గనిర్దేశం చేస్తుంది. సంప్రదాయంగా పిల్లలకు, పిల్లలు పెరిగే కొద్ది కొన్ని పద్ధతులు, నడుచుకొనే విధానం వస్తాయి. అన్నీ రాజ్యంగం ప్రకారం, చట్టాల ప్రకారం ఉండకపోవచ్చు. కానీ అంతరాత్మ ప్రకారం, మన మనసు ప్రకారం ఉంటాయి. అందుకే మనసు అద్దం లాంటిది అంటారు. తప్పు ఒప్పులను బేరీజు వేసేది మనస్సాక్షే. ఇవి సంప్రదాయంగా వచ్చిన విలువలే. కానీ యువత వాటిని ఆచరించడం మానేస్తుంది. మనసును కాకుండా బుద్ధి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. క్షణికానందం కోసం వికృత ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఆనందం, సంతోషం అనే తాత్వికమైన పదాలకు అర్థాలు మారిపోయాయి. ఎంజాయ్ అనే సామాన్యమైన అర్థంలోకి కుదించబడ్డాయి. ఆనందం అంటే అనంతమైన స్థితి. అలాంటి ఆనందాన్ని నేటి యువత విలువలకు తిలోదకాలు ఇచ్చి ఆనందాన్ని పొందుతున్నారు. విలువలకు విలువ లేకుండా చేస్తున్నారు.
విద్యలో విలువలు అవసరమా...
ఆలోచనకు ఆచరణకు మధ్య
ప్రతి మనిషికి ఆలోచనలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తాయి. నియంత్రించడం కష్టమే. ఇక యువతకైతే చెప్పాల్సిన పనే లేదు. వేడి రక్తం. ఉరకలు వేసే వయసు. రేసుగుర్రం లాంటి కోరికలు. దేన్నైనా లెక్కచేయని తత్వం. సూర్యున్నైనా సయ్యాటకు పిలిచే ధైర్యం. తనకు తానే హీరో, తన భావనా లోకంలో తనే రాజు. తనే రాణి. పగ్గాలు తెంచుకునే కొర్కెలు. అంతం లేని ఊహలు. పక్షుల్లా విహరించే ఊసులు. కానీ- మీ చుట్టూ ఒక సమాజం ఉంది. దానికి ఓ పరిది ఉంది. కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏది మంచో ఏది చెడో మీ మనసు మీకు చెప్తుంది. న్యాయనిర్ణేతగా మారి నిర్దేశిస్తుంది. ప్రేమించు, ప్రేమను ప్రేమతో గెలవాలి. సంతోషం పొందాలి. పరిధిల్లో, పరిమితుులకు లోబడి పొందాలి. డబ్బు సంపాదించాలి సక్రమమైన మార్గంలో. రాత్రికి రాత్రే బిర్లానో, అంబానీనో అవ్వాలంటే కుదరదు. కోర్కెలకు కల్లాలు వేయాలి. సాధ్యాసాధ్యాలను బట్టి ఆచరించాలి. డబ్బు ఉంటే కొండమీద కోతి దిగొస్తుంది అనేది పాతమాట. డబ్బుకు లొంగనివి, ధనంతో పొందలేనివి కొన్ని ఉంటాయి. అవి కేవలం మంచితనంతో, నిజాయితీతో, విలువైన ప్రవర్తనతో పొందొచ్చు. ముందు మీకు వచ్చిన ఆలోచన మంచిదా, కాదా అని నిర్ణయించుకోవాలి. ఆ పని చేయడం వల్ల ఎవరికైనా నష్టం కలుగుతుందా అని ఆలోచించాలి. పరిణామాలు ఎలా ఉంటాయో అంచనా వేయగలగాలి,. ఆ పని వల్ల నిజంగా మీకు సంతోషం కలుగుతుందా లేక ఆర్థికపరమైన లాభం వస్తుందా అని మీరే స్వయంగా తెలుసుకోవాలి. నేటి యవతలో తొంబైశాతం ఒక పని చేయడాన్ని కేవలం డబ్బుతో మాత్రమే లెక్కిస్తున్నారు. కొన్ని పనులను లాభాలతో, డబ్బుతో తూచకూడదు.
విలువలవైపు నడిస్తేనే వెలుగు
ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే సంతోషం. క్లాసు ఫస్ట్ వస్తే అందరూ మెచ్చుకుంటారు. లక్ష్యాన్ని సాధిస్తే ఆనందం. సివిల్ సర్వీస్ కు సెలక్ట్ అయితే కోరిక తీరినట్లే. ఇన్ఫోసిస్ లో జాబ్ వస్తే ఇంక చాలు. ఆ అమ్మాయి నా లవ్ కు ఓకె చెప్తే ఈ జీవితానికి చాలు. బాగా సంపాదించాలి. మా స్నేహితులందరిలో, బంధువుల్లో నేనే సంపణ్ణుడిగా ఎదగాలి. ఇలాంటి కోరికల్తో యువత ముందుకు పోతున్నారు. సోసైటీని బట్టి కాదనలేం. కానీ, ఇదంతా మీ జివతానికి ఒక పార్శ్వం మాత్రమే. విలువలు అంటే బాధ్యతలు అనే భావన తీసుకుంటే- మిమ్మల్ని కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. మీ తోటివారికి సాయం చేయాలి. మీ చుట్టూ ఉన్న సమాజానికి మీ వంతు బాధ్యతగా ఏదో ఒకటి ఇవ్వగలగాలి. నిజమైన జీవితం అంటే మీరు బతుకుతూ, మీ చుట్టూ ఉన్న వాళ్లు బతకడానికి సాయపడడమే అంటారు. నీవు అనుకుంటే అహం. నీవు, నీ భార్య, నీ పిల్లలు అనుకుంటే స్వార్థం. నీవు, నీ చుట్టుపక్కల ఉండే వాళ్లు అనుకుంటే మంచితనం. ఇలా పరిధిని పెంచుకుంటూ పోవాలి. ఆ పరిధి ఎంత విస్తృతం అయితే మీ జీవితం కూడా అంత విస్తృతం అవుతుంది.
మీకంటూ చరిత్రలో కనీసం ఒక పేజీనైనా లిఖించుకోవాలి. అందరిలా పుట్టడం, చావడం అయితే- ఊరు పేరు లేకుండా మీ జీవితం మీతోనే అంతమవడానికైతే- జీవితానికి సార్థకత ఉండదు. మీ విలువలే మిమ్మల్ని తర్వాతి తరాలకు వారధిలా అందిస్తాయి. విలువ అంటే ఇతరులనూ మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లే ప్రేమించడం.