వేమన పద్యం
వేఱు పురుగు చేరి వృక్షంబు జెఱచును
చీడ పురుగు చేరి చెట్టు జెఱచు
కుత్సితుండు చేరి గుణవంతు జెఱచురా
విశ్వదాభి రామ వినుర వేమ.
తాత్పర్యం
వేఱుపురుగు గొప్ప చెట్టుని పాడుచేయును, చీడపురుగు చిన్న చేట్టును నశింపజేయును. చెడ్డవాడు గుణవంతుని నాశనము చేయును.
విశ్లేషణ
ఎంత పెద్ద చెట్టు అయిన వేఱు పురుగు పడితే పాడయిపొతుంది. అలాగే చిన్న చెట్టుని చీడ పురుగు నాశనం చేస్తుంది అలాగే చెడ్డవాడు తన చెడ్డ గుణాలతో మంచి వాడిని పాడుచేస్తాడు. మంచివాడు ఎంత మంచి మర్గం లో ఉన్నా సరే వాడి చెడ్డ మాటలతో చెడగొడతాడు.
దాశరధీ పద్యం
జీవన మింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్
దావున నిల్చి జీవనమొ తద్దయు గోరు విధంబు చొప్పండం
దావలమైన దాని గుఱితప్పనివాడు తరించువాడయా
తావకభక్తి యోగమున దాశరధీ కరుణాపయోనిధీ.
తాత్పర్యం
చెరువు ఎండిపోయి బురద బయట పడినాకూడా అందులోనే నీటిని కోరుకొను చేప లాగా ఎన్ని కష్టనష్టములు వచ్చిననూ , నిన్ను విడువలేక కొలుచు వానిని నీవును వదిలి పెట్టవు.
విశ్లేషణ
మొత్తం చెరువు ఎండిపోయినా కూడ చేపలు ఆశగా ఎదురు చూస్తుంటాయి నీళ్ళ కోసం అక్కడే. అలాగే మనిషి ఎప్పుడైతే ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడిని వదలకుండా నమ్ముకోని పూజ చేస్తాడో అలంటివాళ్ళని దేవుడు ఎప్పుడూ కరుణిస్తాడు.
సుమతీ శతకం
సిరిదా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలలితము భంగిన్
సిరిదా బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
తాత్పర్యం
సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది.
విశ్లేషణ
కొంతమంది డబ్బు ఉందని గర్వంగా ఉంటారు , ఎదుటివాళ్ళని లెక్క చేయరు. సిరి సంపదలు ఉన్నప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా తీయగా ఉంటుంది. అందరు చుట్టూ చేరతారు. అలాగే డబ్బు పోయినప్పుడు ఎలా పోయిందో కూడ తెలియకుండా జారిపోతుంది, ఏ విధంగా ఎనుగు తిన్న వెలగపండులో గుజ్జు మాయం అవుతుందో.