కార్టూనిస్టులతో తుంటర్వ్యూలు - ..

 

1 తొక్క :  వడ్డెపల్లి వెంకటేశ్ గారూ...ఇవి నమస్కారాలేనా?

తిక్క : నాకూ మాచెడ్డ డౌటింగ్ గా ఉందండీ....! ఇవి నమస్కారాలా, లేదా? అని( త్రేతా యుగం నుండీ బుర్ర బద్దలయ్యేట్టు ఆలోచిస్తున్నా...బుర్ర బద్దలయ్యింది...ఈ తిక్క ప్రశ్నకు తొక్క సమాధానమ దొరకలేదు...మీరేమైనా చెప్పగలరా..?

2 తొక్క : ఏదైనా గుడికెళ్ళినప్పుడు మీరు కార్టూనిస్టని అక్కడెవరికైనా అనుమానం వస్తే ఎలా?

తిక్క : గుర్తుపట్టే ప్రమాదముందనే కదా...! గుళ్ళోకి వెళ్ళంది. ఒకవేళ వెళ్ళాననుకోండి, పొర్లుడు దండాలు పెడుతూ నా మొహం కనబడకుండా జాగ్రత్త పడ్తానన్నమాట. ఓసారి ఏమైందో తెల్సా....శివాలయానికి వెళ్ళి " గోవిందా...గోవిందా..." అంటూ పొర్లుడు దండాలు పెడితే భక్తులందరూ శక్తితీరా తమ చేతులకు పని కల్పిస్తే అదే ఊపుతో ఇంట్లోకి పొర్లుకుంటూ వచ్చా. ఈ విషయం మరెవరితోనూ చెప్పకండి......గప్..చుప్......

3 తొక్క : సమ సమాజ నిర్మాణానికై కృత నిశ్చయంతో కార్టూన్లు గీస్తున్నారా?

తిక్క : ముందు నా ఇంటి నిర్మాణం పూర్తి కానివ్వండి......ఆ తర్వాత సమసమాజ నిర్మాణం గురించి ఆలోచిస్తా.....అయినా నిర్మాణాలు ఇటుక, సిమెంటులతో నిర్మిస్తారని విన్నానే...? ఈమధ్య కార్టూన్లు కూడా వాడుతున్నారా? కలికాలం........

4 తొక్క : మీరు క్లాసు తీసుకుంటూండగా హెడ్ మాస్టారు గారొచ్చి కార్టూన్లు గీయమంటే ఎలా?

తిక్క : నేను క్లాసు తీసుకుంటూండగా హెడ్మాస్టార్ గారొచ్చి కార్టూన్లు గీయమనడం కాదుగానీ, నేను క్లాసులో కూర్చొని పిల్లలకు పాఠాలు చెప్పకుండా కార్టూన్లు పుంఖానుపుంఖాలుగా గీస్తూ ఉంటే, మా హెడ్మాస్టారు గారొచ్చి దిక్కులు పిక్కటిల్లేలా గగ్గోలు పెట్టారు. సార్....ఇకనైనా పాఠాలు చెప్పమని....చీ...ఈ పెద్దోళ్ళున్నారే......

5 తొక్క : మీ స్టూడెంట్లలో ఎక్కువమంది కార్టూనిస్టులేనా?

తిక్క : మీకెందుకొచ్చిందా డౌటు...? 100% కార్టూనిస్టులే. నాకు కార్టూన్లు గీసిపెట్టేది కూడా వారే తెల్సా....!

6 తొక్క : ఈ జగత్తును మీ కార్టూన్లతో వజ్ర మణి మయ నవరత్న ఖచిత శోభితం చెయ్యొచ్చు కదా?

తిక్క : యమలీల సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పిన డైలాగులు చెప్తారేంటండీ..? అసలే దొంగలు బాగా ఎక్కువయ్యారు. బాగా తెలివిమీరిపోయారు కూడానూ. కార్టూన్లతో వజ్రమణిమయ ఖచితం చేస్తే దొంగలెత్తుకుపోరూ..హమ్మో....!

7 తొక్క : శుక్రవారం తప్ప మిగతా రోజులలో కార్టూన్లు వెయ్యరా మీరు?

తిక్క : అర్రే...మీకా విష్యం ఎలా తెల్సూ...? కొంపదీసి మా ఇంట్లో సీసీ కెమెరాలు గట్రా పెట్టించి స్టింగాపరేషన్ చేయట్లేదు కదా....అయితే మీతో జాగ్రత్తగా ఉండాలి సుమీ....

8 తొక్క : మిగతా మేస్టార్ల లాగా పిల్లల చేత గోడక్కుర్చీ కాక గోడ క్కార్టూన్లు వేయిస్తారటగా?

తిక్క : బ్లాకండ్ వైట్ రోజుల్లో లాగా గోడ కుర్చీలు వేయించే రోజులు పోయాయండోయ్..ఇప్పుడు గోడ కుర్చీలు వేయిస్తే నాలుగ్గోడల మధ్య నిలబెట్టి శ్రీకృష్న జన్మస్థానల్లో వేసి సుబ్బరంగా ఏరియల్ తో ఉతుకుతున్నారండీ బాబు...అందుకే సేఫ్టీగా గోడ కార్టూన్లు వేస్తూ ఉన్నా. పిల్లలు కూడా ఝడుసుకొని బడికి రావటం లేదంటే నమ్మండి..అందుకే ఈమధ్య " బెస్ట్ టీచర్ " అవార్డ్ కూడా ఇచ్చి డీ ఈ ఓ గారు సత్కరించారు.

9 తొక్క : మీ కార్టూన్లు అచ్చయినప్పుడల్లా ఎవరి ఓదార్పును కోరుకుంటారు?

తిక్క : వేరే వాళ్ళెవరో ఓదారిస్తే నా మనసు అంగీకరించదు. అందుకే తలుపులు గట్టిగా బిగించుకొని పెడబొబ్బలు పెడుతూ అరణ్యరోదన చేస్తా...నన్ను నేనే భీభత్సంగా ఓదార్చుకుంటా......

10 తొక్క : మీరు మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు పార్కులో బెంచిమీద ఒంటరిగా ఒబామా కూర్చుని మీ కార్టూన్లు చూస్తూ ఏడుస్తూంటే ఏం

చేస్తారు?

తిక్క :పన్లోపని మిషెల్లె ఒబామా ను కూడా పిలిపించి వారిద్దరిలో కన్నీళ్ళు పెట్టించి పండగ చేస్కుంటా...ఈ సారి ఈవినింగ్ వాక్ లో మీకూ నా కార్టూన్లు చూపిస్తాలెండి.

11 తొక్క : మీ కార్టూన్లలోని పక్షులన్నీ పారిపోయి, అసెంబ్లీకి చేరుకుంటే ఏమవుతుంది?

తిక్క : ఏమౌతుందండీ...! సింపుల్ గా చచ్చూరుకుంటాయ్.....లేకపోతే ఏంటి..? అసెంబ్లీలో భీభత్సమైన కొట్లాటలలో నలిగి నరకానికి పోతాయ్....విసిరేసుకున్న మైకులు తగిలి రెక్కలూడిపోతాయ్...నా కార్టూన్ల మీద మీకెందుకండీ అంత ఇష్టం.....చీ..చీ...మీ పద్ధతి నాకు బాగా నచ్చింది.....

12 తొక్క : ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి పేరు అనౌన్స్ చెయ్యగానే అందరికీ మీ కార్టూన్లే గుర్తొచ్చాయట, ఇదెవరికి గర్వకారణం?

తిక్క : నాకు గర్వ కారణం కాదనే విషయాన్ని చెప్పడానికి గర్విస్తున్నానండీ. అయినా, అమరావతికి, నా కార్టూన్లకి విడదీయలేని అనుబంధం ఉంది. నేను కార్టూన్ల సేకరణ చేస్తున్నానని తెల్సే అమరావతి కోసం భూసేకరణ చేస్తున్నారు.

13 తొక్క : అనన్య సామాన్యంగా, అజరామరంగా నిలిచిపోయే కార్టూన్లు గీస్తున్నారని మిమ్మల్నెవరూ అభినందించలేదని సంతోషిస్తున్నారా?

తిక్క : ' సంతోషిస్తున్నా ' అని సింపుల్ గా ఓ మాటలో చెప్పేయలేనండీ.....మనసు పులకించి, వికసించి, వర్ణశోభితమై, అంబరాన్నంటి, అట్నుంచి అటే అంతరిక్షానికేగి, నక్షత్రాల వినువీధుల్లో ఒళ్ళు మైమరచి డాన్సింగులు గట్రా చేసేస్తున్నానంటే నమ్మండి....

14 తొక్క : మీరు తుంటర్వ్యూకి ఆన్సర్లు ఎక్కడ మర్చిపోయారు?

తిక్క : నేనెవని....? ఇపుడు నేనెక్కడున్నాను? అసలు నా పేరేంటబ్బా....?

15 తొక్క : మీ కార్టూన్లు పొడి చేసి గ్లాసుడు నీళ్ళల్లో కలిపి పేపర్ మీద ఒలికించి చూసారా?

తిక్క : ఆ...ఒకసారలా చేసానండోయ్...! ఆ సంఘటనను జీవితాంతం మర్చిపోలేను. ప్రజలను, మీడియా వాళ్ళను పిలిచి, ' గొప్ప బహిరంగ ప్రదర్శన ' అంటూ ప్రకటించి పై విధంగా చేస్టె జస్ట్ పేపర్ తడిసిందంతే..ఇంటికెళ్ళాక మా ఆవిడ కొట్టిందండీ. అబ్బో...తలుచుకుంటేనే వెన్నుపాములో వణుకొస్తుందండీ.

16 తొక్క : స్టూడెంట్లను మీ కార్టూన్లతో కొడతారా?

తిక్క : కొట్టను, జస్ట్ చూపిస్తా, అంతే, దెబ్బకు మరమనుషుల్లా మారిపోయి చెప్పినట్టు వింటారు. ఈ ప్రయోగం ఇంట్లో మాత్రం కుదరదండీ.

17 తొక్క : ఒక మంచి కార్టూన్ గీయాలంటే ఎన్ని కిలోల డీజిల్ అవసరం పడుతుందో ఖచ్చితంగా చెప్పగలరా?

తిక్క : ఖచ్చితంగా 100 కిలోల డీజిల్ అవసరం. ఎందుకంటే కార్టూన్లు గీయడానికి 100 కిలోల డీజిల్ పోసుకుని బండిపై ఇంటికి దూరంగా వెళ్ళా..బండి ఆగిన చోట కుప్పలుతెప్పలుగా కార్టూన్లు గీసా. త్వరలో వాటిని తాళపత్ర గ్రంధాల్లో అచ్చేయిస్తా..మీకు ఓ కాపీ కావాలంటే చెప్పండి. వంద రూపాయలే...!

18 తొక్క : ఒక కార్టూనిస్టుగా ఏదైనా దేశానికి అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసారా?

తిక్క : నిక్షేపంగా చేసానండీ...అమెరికాలో ' రొనాల్డ్ రీగన్  ' తో అధ్యక్ష స్థానానికి పోటీపడ్డా. అధికారికంగా నేనే 50లక్షల పైచిలుకు ఓట్లతో గెలిచా. అయినా తెల్లోళ్ళు నన్ను మోసం చేసి చివరికి ఒబామాను అధ్యక్షుడిగా ప్రకటించారు.

19 తొక్క : పత్రికలకు కార్టూన్లు పంపేప్పుడు ఏవి అచ్చవుతాయో ఏవి తిరిగొస్తాయో తెలుసుకునేందుకు బొమ్మా-బొరుసు వేసి చూస్తారా?

తిక్క : ఎందుకేయను? భేషుగ్గా వేస్తాను. కాకపోతే ఎప్పుడూ బొమ్మా పడలేదు, బొరుసూ పడలేదూ..! దీని భావమేమి వెంకటేశా?!

20 తొక్క : తుంటర్వ్యూకి ఎందుకింత సమయం కేటాయించారు?

తిక్క : తొక్కలో సమాధానాలు చెప్పమన్నారు కదా అని మా ఇంటి కప్పు మీద బ్రహ్మాండమైన అరటితోట వేసా...! అరటికాయలు కాసేసినాక కాయలు అవతల పడేసి, తొక్కలు తెగ తిన్నా. ఆ తిన్న తొక్కల వల్లే ఇంత బాగా తొక్క సమాధానాలు చెప్తున్నా. అందుకె కాస్త లేటయ్యింది. లేటయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా.

21 తొక్క : కృతజ్ఞతలు కావాలా?

తిక్క : కావాలా అని అంత చిన్నగా అడుగుతారేంటి సార్...?! కనీసం 250 గ్రాముల కృతజ్ఞతలైనా కావాలి...అంతకుమించి ఒక్కగ్రాము పెరిగినా నేనొప్పుకోను. ఎందుకంటే ఒబేసిటీతో డాక్టర్ దగ్గరకు వెళ్తే ఓ పావుకిలో బరువు పెరిగితే సమస్యలన్నీ సాల్వ్ అవుతాయన్నాడు మరి...!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు