ఆముక్తమాల్యద
గోదాదేవి సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు.
విరహతతిమీఁది కోపాన మరుఁడు దివియ
వేగమై పైఁడియొరతోన విసరఁ గుట్లు
దునిసి బైటికి నసిధార దోఁచె ననఁగఁ
గనకరుచి మధ్యలత నారు కాంత కలరు
బొడ్డుపైనుండి వక్షస్థలంమీదకు, వక్షోజముల మధ్యవరకు ఉండే చిన్ని రోమములవరుసను నూగారు, నూగారులత అని వర్ణించడం కవిలోక సంప్రదాయం. శ్రీకృష్ణదేవరాయలు గోదాదేవి నూగారు లతను వర్ణిస్తున్నాడు
ఈ పద్యంలో.
మన్మథునికి జంటలు జంటలుగా రతికేళిలో క్రీడించేవారంటే ఇష్టం. వారిమీదికి తన పూల బాణాలను విసురుతాడు. పరస్పరం దూరంగా చెరొక చోట చేరి వృథాగా విరహగీతాలను పాడుకునే వాళ్ళంటే కోపం. అలా విరహగీతాలు పాడుకునే వాళ్ళమీదకు కోపంతో తన బంగారు బాకును విసురుదామనుకుని, ఒరలోనుండి బాకును తీసి విసిరే నిదానం కూడా లేనంత కోపం వచ్చి, ఒరతో సహా బాకును విసిరినప్పుడు ఆ ఉదుటుకు ఆ ఒరకు ఉన్న కుట్లు
తెగిపోయి, పిగిలిపోయి, ఆ సందులోనుండి లోపలి బంగారపు బాకు యొక్క పదునైన అంచులు మెరుస్తూ కనిపిస్తున్నాయేమో అన్నట్లు గోదాదేవి నూగారులతలోని రోమాలు మెరుస్తున్నాయి.
అండజగామిని యూరుపుఁ
బిండువలపు లాన నాభిబిలము వెడలి చ
న్గొండల నడుమను బ్రాఁకెడు
కుండలియో యనఁగ నారు కొమరొప్పారున్
కుండలిని అంటే పాము అనే అర్థముతో చమత్కారమైన వర్ణన చేస్తున్నాడు ఈ పద్యంలో. ఆమె హంసనడకల అందగత్తె. ఆమె ఉఛ్చ్వాస నిశ్వాసములు చేస్తున్నప్పుడు దివ్యమైన పరిమళపు వాయువులు వెడలుతున్నాయి ఆమె నోటినుండి, ఆమె పలువరుస మొల్లల వరుసలా ఉన్నదికదా మరి. పాములు గాలిని తిని బ్రతుకుతాయి. ఈమె నోటినుండి వచ్చే గాలిని తినడానికి, ఆస్వాదించడానికి, ఆమె వక్షోజములు అనే కొండల మధ్యన పైకి పాకుతున్న పాములా ఉన్నది ఆమె నూగారు లతా, అంటే గోధుమవన్నె త్రాచు అన్నమాట, బంగరు రంగులో మెరిసిపోతున్నాయి అని అంతకుముందు అన్నాడు కనుక.
అంగన నిలిచిన బాహువు
లుం గౌనును నేరుపరుచు లోకమునకు ర
త్నాంగద కాంచీభేదము
లుం గెళవుల నడిమి యునుకులు న్నూగారున్
గోదాదేవి బాహువులు సన్నగా నాజూగ్గా తామర తూడుల్లా ఉన్నాయి. నడుము కూడా సన్నగా కృశించి ఉన్నది. ఆమె బాహువులు, నడుము ఒక్కరకంగా ఉన్నాయి, తేడా తెలియకుండా. ఆమె భుజములకు ఉన్న రత్నాంగదములు, భుజకీర్తులు, నడుముకున్న వడ్డాణము, ముచ్చటైన నూగారు లత, యివి మాత్రమే యివి బాహువులు, యిది నడుము అని తేట తెల్లం చేస్తున్నాయి తప్ప ఆమె బాహువులు, నడుము ఒక్కతీరుగా ఉన్నాయి!
తనుమధ్యవళీభంగము
లను గూర్పఁగ నవియుఁ దత్కులములయగుటఁ గం
తుని యిడిన పత్తిరేకనఁ
జను నొడ్డాణమున నడుము చామకు నమరున్
క్రుశించిపోయిన ఆమె నడుము విస్తారమైన విపులమైన వక్షోజముల బరువుకు విరిగిపోయిందేమో బహుశా అన్నట్లు, సన్నని పగుళ్ళు అన్నట్లుగా ఆమె నడుము మీది ముడుతలు ఉన్నాయి. మన్మథుడు ఆ పగుళ్ళను కలిపి బంగారురేకుతో బలంగా దగ్గరకు లాగి, బిగించి కట్టినట్లుగా ఉన్నది ఆమె నడుముకున్న వడ్డాణము. బంగారపు వన్నెతో మెరిసిపోతున్న ఆమె నడుముకు ఉన్న ముడుతలు బంగారపు రంగులోనే ఉన్నాయి. బంగారాన్ని బంగారంతోనే అతకడం సాధ్యము, శ్రేష్ఠము కనుక మన్మథుడు బంగారపు రేకుతో ఆమె నడుమును బిగించి కట్టాడు అన్నట్లు ఉన్నది ఆమె వడ్డాణము. ఆ సౌందర్యవతి ( ఆ మాటకొస్తే ఏ సౌందర్యవతి అయినా సరే) మన్మథుని ఆయుధం, సుందరమైన అవయవ భాగాలు కూడా మన్మథుని సొత్తే, పరికరాలే, వాటితోనే పురుషోత్తముడిని గెలువ వలసి ఉన్నది మరి, కనుక ఆమె నడుముయొక్క బాధ్యత మన్మథునిది, కనుక మన్మథుడు బిగించి కట్టిన బంగారు కట్టులా ఉన్నది ఆమె నడుముమీది బంగారు వడ్డాణము అంటున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. జగద్గురు ఆదిశంకరుల ‘సౌందర్యలహరీ’ శ్లోకాన్ని గుర్తుకు తెస్తుంది ఈ శ్లోకం. ఆ శ్లోకమే స్ఫూర్తి అన్నా ఆశ్చర్య పడవలసిన అవసరము లేదు, రాయలవారు పఠించనిది సాహిత్యంలో లేదు కనుక.
‘కుచస్సద్య స్విద్య త్తటఘటిత కూర్పాసభిదురౌ కషంతౌ దోర్మూలే కనక కలశాభౌ కలయతాం తవ త్రాతుం
భంగాదలమితి వలగ్నం తనుభువా త్రిథా నద్దం దేవి త్రివళి లవలీ వల్లిభిరివ’
అన్నాడు జగద్గురువు ఆదిశంకరాచార్యులు ‘సౌందర్యలహరి’ స్తోత్రంలో. బాహుమూలాల వద్ద రవిక కుట్లు పిగిలిపోయేట్లు, విశాలంగా, బంగారు కలశాలలా ఉన్న అమ్మవారి వక్షోజముల బరువుకు ఆమె సన్నని నడుము విరిగిపోతుందేమో అన్న భయంతో, ఆమె కడుపులో ముల్లోకాలు ఉన్నాయి కనుక ముల్లోకాలకు ఆపద వాటిల్లుతుందేమో అన్న భయంతో, ముల్లోకాలను రక్షించడానికి, యాలకుల తీగలు మొదలైన వాటితో ముప్పేటలుగా ఆమె నడుమును మన్మథుడు బిగించి కట్టాడేమో అన్నట్లు, అమ్మవారి నడుము మీది మూడు ముడుతలు శోభిస్తున్నాయి, అని.
వర్ణనలలో రాయలవారి స్థాయి ఆదిశంకరులను తలపించే స్థాయి అని చెప్పడం కోసం ఈ ఉదాహరణ!
(కొనసాగింపు వచ్చేవారం)