తిరుక్కడయూర్ - కర్రా నాగలక్ష్మి

tirukkadayoor

యమధర్మరాజు మరణించిన ప్రదేశం గురించి విన్నారా? లేదా ? తిరిగి జీవితుడైన ప్రదేశం గురించి కూడా వినలేదా ? పొనీ వివాహ వార్షికొత్సవ షష్ఠి పూర్తి అదేనండీ 60వ పెళ్లిరోజు జరుపు కొనే కోవెల గురించి విన్నారా?  లేదా అయితే యీ మీరు యీ వ్యాసం చదవవలసినదే .

పైన చెప్పినవన్నీ తిరుక్కడయూర్ పట్టణం లో అమృతఘటేస్వర్ కోవెలలో యమధర్మరాజు మరణించడం , పున్ఃర్జీవితుడవడం జరిగేయి . ఈ తిరుక్కడయూర్ తమిళనాడు రాష్ట్రం లోని నాగపట్నం జిల్లా లో ఉంది. ఈ తిరుక్కడయూర్ "మైలదుత్తురై "(మాయ వరమ్) నుంచి "పోరయార్ "వెళ్ళేదారిలో మైలదుత్తురై కి 22కిమి.. దూరం , పోరయార్ నుంచి 8కిమి.. దూరం లో ఉంది.

ఇది కోవెల ముఖ్యద్వారం  

 

 

 

కోవెల ముఖ్య ద్వారం లో ప్రవేసించగానే రెండు వైపులా పెద్ద పెద్ద మంటపాలు అవి దాటిన తరవాత గర్భ గుడి ద్వారం. ద్వారం దాటగానే పెద్ద ప్రాంగణం. ఆ ప్రాంగణం లో చిన్న చిన్న మంటపాలు వేసి షష్టి పూర్తి మొదలగు పూజలు జరుగుతూ ఉంటాయి.

ఈ కోవెలలో మూలవిరాట్టు ఈశ్వరుడు "అమృత ఘటేశ్వరుడు "అనే పేరుతో పూజింప బడుతున్నాడు.

పాల సముద్రాన్ని మధించేటప్పుడు  దేవతలు వినాయకుడిని పూజింప లేదని అలిగిన వినాయకుడు పాల సముద్రంలోంచి అమృతం ఉద్భవించగానే అమృతాన్ని దొంగిలించి ఇప్పుడు మూలవిరాట్టు ఉన్న చోట దాచుతాడు ,దేవతలు తమ తప్పు తెలుసుకొని వినాయకుడికి పూజలు చేసి కుడుములు నివేదించాగా సంతుష్టుడైన వినాయకుడు అమృతాన్ని దేవతలకు తిరిగి ఇచ్చేస్తాడు. అందుకే కుడి వైపున ఉన్న చిన్న కోవెలలో ఉన్న వినాయకుడిని "దొంగ వినాయకుడు" అని పిలుస్తారు.ఆ అమృత భాండం పెట్టినచోట శివుడు స్వయంభు గా లింగాకారం లో ఉధ్భవించేడు అందుకే ఇక్కడ ఈశ్వరుడిని "అమృతఘటేస్వరుడు అని పిలుస్తారు.

అదే ప్రాంగణం లో ఎడమ వైపున మార్ఖండేయుడు శివుని పాదాలని  చుట్టుకొని ఉండగా శివుడు యముడిని సంహరిస్తున్న విగ్రహం ఉంటుంది.ఆ విగ్రహానికి ఎదురుగా బాల యముడి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాల వెనుకనున్న కధ ఇలా చెప్తారు.

"మృగాండు "అనే మహర్షి అతని భార్య "మరుదమతి" సంతతి కొరకై పరమ శివుని ప్రసన్నం చేసుకోనడానికై కఠోర తపస్సు నాచరిస్తారు.వారి తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై వారి కోరిక తెలుసుకొని దీర్ఘాయుశ్శు గల వంద మంది కుపుత్రులు కావాలా? ఆయుశ్శు లేని సుపుత్రుడు కావాలా? అని అడుగగా మృగాండు ముని ఆయుశ్శు  లేని ఒక సుపుత్రుడిని యివ్వమని కోరుతాడు.

శివుడు అలానే వరమిచ్చి అంతర్ధానమౌతాడు.కాలక్రమం లో మరుదమతి నెలతప్పి , నెలబాలుని వలె  ప్రకాశిస్తున్న కుమారుడికి జన్మనిస్తుంది . ఆ కుమారునికి "మార్ఖండేయుడు "అని నామకరణం గావించి అల్లారు ముద్దుగా పెంచు కుంటూ ఉంటారు.  ఆ బాలుడు దిన దినాభివృద్ది చెందుతూ సకల విద్యాపారంగతుడై తల్లితండ్రులకు పేరుతెస్తాడు.అందరు అంతటి సుపుత్రుడికి జన్మనిచ్చినందుకు మృగాఁడు మునిని అతని భార్య మరుదమతిని కొనియాడుతారు. పడునారేడ్ల వయసు వాడవగానే మృగాండు ముని అతనికి గల మృత్యువు గురించి చెప్తాడు. అదివిని మార్ఖండేయుడు తన మిగిలిన జీవితం శివ ధ్యానం లో గడపాలని నిర్ణయించు కొని తపస్సు చేయుటకు అనువైన ప్రదేశం కొరకు వెతుకుచూ స్వయంభూ గా వెలసిన "అమృతఘటేశ్వరుని " అనునిత్యం పూజించాలని నిర్ణయించు కొంటాడు  మార్ఖండేయుడు.

నిత్యం కావేరిలో స్నానమాచరించి అమృతఘటేశ్వరుని సేవించుకుంటూ వుంటాడు . మొదటి సారి మహా మృతుంజయ మంత్రం మార్ఖండేయుని ద్వారా ఈ ప్రదేశం లో ఉఛ్ఛరించ బడిందని అంటారు. కాలాంతరాన మారఖండేయుని ఆయుశ్శుతీరి అతనిని తీసుకోని పోవుటకు యముడు పాశాన్ని తీసుకొని మార్ఖండేయుని వద్దకు వస్తాడు. అది చూచి మార్ఖండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకొంటాడు.యముడు మార్ఖండేయునికై  వేసిన పాశం శివలింగం పైన పడుతుంది. దానికి క్రోధించిన శివుడు తన త్రిశూలంతో యముడిని వధించుతాడు.యముని మరణం తో ముల్లోకాలు అల్లకల్లోలం అవుతాయి. దేవతలు శివుని ప్రార్ధించి యముని తిరిగి పునఃర్జీవితున్ని చేయమని ప్రార్ధిస్తారు . శివుడు దేవతల కోరికని మన్నించి యముణ్ణి పునఃర్జీవితుణ్ణి గావిస్తాడు. యముడు మార్ఖండేయుని చిరాయువుగా ఆశీర్వదిస్తాడు.

అందుకు ఈ కోవేలని యముని మరణ స్థలము మరియు యముని జన్మస్థలంగా వ్యవహరిస్తారు. మార్ఖండేయుడు చిరంజీవిగా వరం పొందిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఆయుశ్శు హోమం చేయించు కుంటే అకాలమృత్యు దోషం పోతుందని భక్తుల నమ్మకం . అయితే యీ పూజాది కార్య క్రమాలు ఎలా చేయించుకోవాలి ? అంటే ముందుగా మనం ముహూర్తం నిర్ణయించుకొని ఆ రోజుకి కోవెలలో పూజకి స్థలం అద్దెకి తీసుకొవాలి , ఆ స్థలం అమృతఘటెశ్వరునికి యెదురుగానా లేక బయటి మంటపం లోనా అనేదాన్ని బట్టి కోవెల యాజమాన్యానికి అద్దె చెల్లించ వలసి వుంటుంది . నాలుగు జాతుల వారు యీ హోమం చేయించుకోవచ్చు . హోమం జరిపే వేద పండితులని మనం కుదుర్చుకోవాలి , యీ పండితులు బ్రాహ్మణులకు రెండురోజుల క్రతువును , మిగతావారికి వొక రోజు క్రతువును జరుపుతారు . కోవేలలోని స్థలం అద్దెకు తీసుకోవాలన్నా , పండితులను  బుక్ చేసుకోవాలన్నా ఆన్ లైన్ లో చెయ్యొచ్చు . తమిళనాడు కోవెళ్ళలో కనిపించే మరో ప్రత్యేకత ఏమిటంటే కోవేలకి ప్రదక్షిణం చేసేటప్పుడు ముఖ్య మందిరానికి ఆనుకొని వున్న గోడలకి నాలుగు వైపులా ముందు దక్షిణామూర్తి , లింగోద్భవం , దుర్గాదేవి విగ్రహాలు వుంటాయి . దుర్గాదేవి కి ఎదురుగా చిన్న మందిరంలో "సంధికేశ్వరుడు " వుంటాడు . భక్తులు తమ కోరికలు సంధికేశ్వరునికి విన్నవించుకుంటే అతను స్వామి వారికి చెప్పి మనకోరికలు తీర్చమని చెప్తాడట . అదే అమ్మవారి కోవెలైతే సంధికేశ్వరి కి కోరికలు విన్నవించుకొవాలిట .

గర్భగుడిలోంచి  బయటికి వచ్చేక యెడమ వైపు అమ్మవారి కోవెల ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని "అభిరామి దేవి" అని అంటారు. 
అభిరామ భట్టారకుడు అనే మహా భక్తునిచే స్తుతింప బడిందికాబట్టి ఇక్కడ పార్వతి దేవిని "అభిరామి" అని అంటారు.

ఈ కధ ఇలా చెప్తారు.

ఒక నాడు పార్వతీదేవి యొక్క పరమ భక్తుడైన అభిరామ భట్టారకుడు పార్వతీదేవి ధ్యానం లో ఉండి ఆ దేశాన్ని పాలించే మహారాజు రాకని పట్టించుకోడు . మహారాజు అభిరామ భట్టారకుని  ఆరోజు తిథి ఏమని అడుగగా అమ్మవారి ధ్యానం లో ఉన్న అభిరాముడు ఆరోజు "అమావాస్య "తిథి కాగా "పౌర్ణమి "  అని చెప్తాడు , దానికి ఆగ్రహించిన రాజు అభిరామునికి "శశరీర అగ్నిప్రవేశ " దండన విధిస్తాడు. ఆ శిక్ష లో భాగంగా చెక్కలతో బల్ల పైన కట్టిన చెక్క స్తంభానికి అభిరాముని కట్టి కింద ప్రజ్వలిస్తున్న మంటలో మెల్ల మెల్లగా చెక్క బల్ల కిందకి దింపుతూ పూర్తిగా మనిషి కాలిపోయేవరకు ఆ బల్ల పైనే వుంచుతారు . మంటల వేడికి యీ లోకంలోకి వచ్చిన అభిరామ భట్టారకుడు అమ్మవారిని ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటూ అమ్మవారి పై అష్టోత్తరం చదవడం మెదలు పెడతాడు. ఈ అష్టోత్తరం లో ప్రత్యేకత ఏమిటంటే  మొదటి నామం యొక్క అంత్యఅక్షరంతో తరవాత నామం మొదలవుతుంది . అలా ఆశువుగా గానం చేస్తూ ఉంటాడు అభిరామ భట్టారకుడు 70వ నామం చదువుతూ ఉండగా అమ్మవారు తన కర్ణాభరణాన్ని ఆకాశంలోకి విసురుతుంది. ఆ కర్ణాభరణం అమావాస్య ఆకాసంలో పూర్ణచంద్రునిలా కాంతిని యిస్తుంది.అది చూసి మహారాజు అభిరామ భట్టారకుని క్షమించమని వేడుకొని అతనిని బంధ విముక్తుడిని చేస్తాడు . తన స్తోత్రం తో అమ్మవారిని మెప్పించేన భక్తుని పేరు చిరస్థాయిగా వుండాలనే తలంపుతో ఆ రోజు నుంచి అమ్మవారిని అభిరామి అని వ్యవహిచాలి అని శాశనం చేస్తాడు . పిమ్మట అమ్మవారి సేవ చేసుకొని కాలాంతరాన శివ సాన్నిధ్యం చేరుతాడు . అభిరామ భట్టారకుడు కుడా అమ్మవారి ధ్యానం చేసుకుంటూ కాలాంతరాన అమ్మవారిలో ఐఖ్యం చెందుతాడు.

ఇవి తిరుక్కడయూర్ లోని అమృతఘటేస్వర్  కోవెల విశేషాలు.ఇక్కడకి రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే ఇక్కడకి దగ్గరగా వున్న రైల్వే స్టేషన్ 22కిమి. . దూరంలో వున్న "మైలదుత్తురై"  కుంభకోణం నుంచి , చిదంబరం నుంచి బస్సుల సౌలభ్యం ఉంది. చిదంబరానికి సుమారు నలభై కిలొమీటర్ల దూరం వుంటుంది .

తిరుక్కడయూర్ లో భోజన, వసతి సౌకర్యాలు ఉన్నాయి.                

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి