అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

 సాధారణంగా చూస్తూంటాము, కొంతమందిని, వారంతటవారు ఏదీ తెలిసికోడానికి ప్రయత్నించరు. ఎవరో ఒకరి సహాయం తీసికుంటేనే కానీ నిద్రపట్టదు. పోనీ వారేమైనా తెలివితక్కువవారా అంటే అదీ కాదూ,  అమోఘమైన తెలివితేటలు. అయినా సరే, స్వంతంగా చేసికోడానికి బధ్ధకం. ఊరికే మనం శ్రమపడ్డమెందుకూ అనుకోవడం. పైగా ఏమైనా అంటే, “ ఆయనకి ఇలాటి విషయాలలో అనుభవం ఉందని కానీ, నాకు ఆమాత్రం తెలియక్కాదు..” అని ఓ సమర్ధనోటి..


 ఈరోజుల్లో  టెక్నాలజీ ధర్మమా అని, ప్రతీదీ క్షణాల్లో తెలిసికోవచ్చు. అయినా సరే, ఏదో అవతలివారి మీద ఏదో పెద్ద అభిప్రాయమున్నట్టు అవతలివారినే అడగడం. పైగా ఈ అడగడమనేది, ఒక్కరితో సరిపెట్టుకుంటారా అంటే అదీ లేదు. అదేదో ఓ  పనికి ప్రభుత్వం వారు టెండర్లు పిలిచినట్టు, ఓ అరడజను మందిని అడగడం, అంతే కాదు, ఒకరిని అడిగినట్టు ఇంకోరికి చెప్పకపోవడం. అలా అడగబడ్డవాళ్ళు కూడా, “ ఏదో పాపం, అవసరం వచ్చే అడిగుంటాడు..” అనుకొని, ఆ పెద్దమనిషి అడిగిన సమాచారం తనకు తెలిసిన మార్గాల్లో సేకరించడం. తీరా చెప్పిన తరువాత, అదేదో ఘనకార్యం చేసినట్టు, “ ఓహో ఆ విషయమా… దాని గురించి ఇంకోరిద్వారా అప్పుడే తెలిసిందండి..” అంటాడు. పోనీ అలా తెలిసికున్న విషయం వెంటనే చెప్పొచ్చుగా, అబ్బే అలాటి సద్గుణాలుంటే ఎప్పుడో బాగుపడేవాడు.  పోనిద్దురూ, ఏదో , అడిగారు కదా అని కావాల్సిన సమాచారం అందిందే అనుకోండి, ఆ సమాచారం ఉపయోగించిందో లేదో కూడా చెప్పాలనే సంస్కారం కూడా ఉండదు కొంత మందిలో. జీవితాంతం  ఋణపడిపోమని కాదు కానీ, కనీసం ఆ సమాచారం ఏదైనా ఉపయోగపడితే, ఇంకో నలుగురికైనా చెప్పొచ్చు కదా అని ఈ చెప్పినాయన అభిప్రాయం.

 ఇంకొంతమందుంటారు, పెళ్ళి సంబంధాలు ఏమైనా తెలిస్తే చెప్పమని. అలాటివాటిల్లో వేలెట్టడమంత మహాపాపం ఇంకోటుండదని నా అభిప్రాయం. సందుకో  వివాహవేదికలున్న ఈరోజుల్లో, ఇంకోరినెవరినో ఇరుకులో పెట్టడం ఎందుకో అర్ధం అవదు. పోనీ, అడిగేరుకదా అని చెప్పామా, అయిపోయిందే మన పని. ఆ సంబంధం నిశ్చయించుకుని, మన అదృష్టం బాగుంటే మనకి చెప్తారు. ఒక్కోప్పుడైతే పెళ్ళికికూడా పిలవకపోవచ్చు.లేకపోయినా నష్టపోయేదేమీలేదులెండి. కానీ, ఏ కారణాలచేతైనా ఆ కొత్తగా పెళ్ళైన దంపతుల మధ్య ఏదైనా గొడవొచ్చినప్పుడు మాత్రం, గుర్తొస్తాము. పైగా దెప్పిపొడుపులోటీ “   అప్పుడు మీరు చెప్పారని ఆ సంబంధం నిశ్చయించుకున్నామూ.. ఇప్పుడు చూడండి ఎన్నెన్ని గొడవలొచ్చాయో..” అంటారు. అక్కడికేదో ఆ సంబంధానికి మనమేదో గ్యారెంటీ, వారెంటీ ఇచ్చినట్టుగా. ఏదో రెండువైపులవారినీ కలపడం వరకే కానీ, మిగిలినవాటిక్కూడా బాధ్యత వహించమంటే ఎలాగా? అదేదో “ అప్పు” తీసికున్నవాడికి ష్యూరిటీ సంతకం పెట్టడమంత రిస్కు ఉంటుంది. అయినా ఈరోజుల్లో వివాహవేదికల విషయం తీసికోండి, వాళ్ళేమైనా పోలీసు వెరిఫికేషనూ వగైరాలేమైనా చేస్తారా ఏమిటీ, వాళ్ళ దగ్గర ఉన్న ఫొటో, ప్రొఫైలూ, ఉంటే గింటే మిగిలినవివరాలూ చూపించి, మీగొడవేదో మీరు పడండంటారు. నోరుమూసుక్కూర్చోడంలేదూ,  చివరకి అందులో పెట్టే ఫొటోకూడా అసలైనదా కాదా అని కూడా తెలియకపోవచ్చు.

అవన్నీ భరిస్తున్నప్పుడు, ఎవరో పెద్దమనిషి పెద్దమనసు చేసికుని, ఓ సంబంధం గురించి చెప్తే, జీవితాంతం ఏ గొడవొచ్చినా, ఆ పెద్దమనిషిని ఆడిపోసుకోడం ఎంతవరకూ భావ్యం అంటారు? అయినా అడిగేవాళ్ళు అడుగుతూనే ఉంటారు, చివాట్లు తినేవాళ్ళు తింటూనే ఉంటారు. వాళ్ళ కర్మ అని వదిలేయడమే.

 కొంతమంది ఫలానా వస్తువో, ఇంకోటేదో తమ ఊరులో దొరకడంలేదని పొరుగూరిలో ఉండే ఇంకోరెవరికో ఫోన్లు చేసి మరీ అడుగుతారు. పోనీ పెద్దమనిషి అడిగారు కదా అని, ఈ రెండో పెద్దమనిషి ఆ వస్తువేదో , వెదికి కొని, తనకు పరిచయం ఉన్న ఇంకో పెద్దమనిషిద్వారా పంపుతాడు. థాంక్స్ మాట దేవుడెరుగు, కనీసం ఆ వస్తువేదో  అందిందని చెప్పడానిక్కూడా తీరికుండదు కొంతమందికి. ఏమైనా అంటే “ మీకేమిటండీ పనా, పాటా, చేతినిండా కావాల్సినంత తీరికా, మాకలా కాదుకదా, ఇరవైనాలుగ్గంటలూ పనే.. పని.. ఏదో సద్దుకుపోవాలి మరి..”. అడగడానికున్న తీరిక పని అయినతరువాత లేదంటే నమ్మేటట్టుగా ఉందా? జస్ట్  taking for granted.. ఇలాటప్పుడే అనిపిస్తూంటుంది, జీవితంలో మళ్ళీ ఎప్పుడూ ఎవరికీ సహాయం చేయకూడదని. కానీ ఇది అయే పనంటారా? పుట్టుకతో వచ్చిన బుధ్ధి పుడకలతోనే పోతుందంటారు. సహాయాలు చేయడం కొందరికి ఓ హాబీ. కొంతమందికి అలా పొందినవాటిని , పనైపోగానే మర్చిపోవడం  ఇంకో హాబీ…

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు