యువ - రవీంద్ర

 

  తొలిచూపు ప్రేమా...!

 ప్రేమ ఒక అర్ణవం. ప్రేమ ఒక అరణ్యం. ప్రేమ ఒక సముద్రం. ప్రేమ ఒక సరాగం. ప్రేమ ఒక తోడు. ప్రేమ ఒక చీడ. ప్రేమ ఒక బంధం. ప్రేమ ఒక బంధిఖాన. ప్రేమ ఒక కల. ప్రేమ కల్ల. ప్రేమ ఒక మైకం. ప్రేమ ఒక నిజం. ప్రేమ ఒక నరకం. ప్రేమ ఒక స్వర్గం. ఇలా ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రేమ గురించి పాజిటివ్ గా, నెగటివ్ గా చెప్పారు. ఇదంతా వారివారి జీవిత అనుభవాల తాలూకు, ఊహల తాలూకు కల్పించుకున్న అభిప్రాయాలు మాత్రమే. అందరి జీవితాలు ఒకలా ఉండవు. అందరి అనుభవాలు ఒకలా ఉండవు. అందుకే ప్రేమకు ఎంత మంది ఎన్ని నిర్వచనాలు చెప్పినా... ఎవరి స్వీయ అనుభవం వారిదే. ప్రేమ నేర్పిన పాఠాలు, గుణపాఠాలు వారివారి సొంతం...

తొలి చూపు... తొలి వలపు 

చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు తొలి చూపులోనే పడిపోయా... అంటుంటారు. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడ్డా... అంటుంటారు. తొలి చూపులోనే ప్రేమించడం సాధ్యమా... అంటే సాధ్యమే అంటున్నారు ప్రేమికులు. మానసిక శాస్త్రవేత్తలు. ఒక అమ్మాయిని అబ్బాయి కానీ, ఒక అబ్బాయిని అమ్మాయి కాని చూడగానే ప్రేమ పుట్టడం కల్ల కాదు. వాస్తవమేనట. అయితే ఇలా జరిగేది చాలా తక్కవమందిలోనే... అయితే తొలి చూపు ప్రేమలో అమ్మాయిలో అబ్బాయికి, అబ్బాయిలో అమ్మాయికి నచ్చేవి ఏమిటి. ఏమి చూసి లవ్ లో పడతారు అని ఆలోచిస్తే మాత్రం- అందం అని కచ్చితంగా చెప్పొచ్చు. అలానే ఒకళ్లకు ఒకరు కనిపించినప్పుడు ఎదురైన సంఘటనలు, సన్నివేశాలు, మాటలు, చేతలు కూడా తొలి పరిచయంలోనే ప్రేమలో పడడానికి కారణాలు కావచ్చు. అయితే తొలి చూపు ప్రేమ నిజమైనదా... లేక అబద్దమా... అని నిగ్గు తేల్చడం మాత్రం చాలా కష్టం. అది వారి వారి నిబద్దతను బట్టి చెప్పొచ్చు. ఒక సినిమాలో హీరోయిన్ అన్నట్లు- తొలి వలపు తలుపు తడితే, తొలి చూపు చురకలేస్తే, ఎద పొంగి రసగంగకాదా... అయితే తొలి చూపులు, తొలి ప్రేమలు చాలా కొద్దిమందిలో మాత్రమే సక్సెస్ అయ్యాయని గణాంకాలు చెప్తున్నాయి.

తొలిచూపు శాశ్వతమా... 

తొలి చూపులోనే ప్రేమించేస్తే... అది ఎంత వరకు కొనసాగుతుంది. జీవితకాలం ఉంటుందా... అసలు పెళ్లిరి దారి తీస్తుందా...అని ఆలోచించే మందు. తొలి చూపు ప్రేమ ఇద్దరి మనుషుల్ని ఎంత దగ్గర చేస్తుంది. అసలు ప్రేమను వ్యక్తం చేయగలరా.. అని కూడా ఆలోచించాలి. ఓ పరిశోధకుడు ఈ పాయింట్ తోనే అయిదు వందల జంటలకు ఈ ప్రశ్నవేస్తే- వారిలో కేవలం పదకొండు శాతం మాత్రమే మాది తొలిచూపు ప్రేమ అని చెప్పారు. అసలు ఎలాంటి ప్రేమ అయినా శాశ్వతమా ... అశాశ్వతమా అన్నది ఆ ప్రేమికులను బట్టి ఉంటుంది. వారివారి మానసిక స్థాయిలను బట్టి ఉంటుంది. అంటే... ప్రేమికులు గట్టి వాళ్లైతే తొలి చూపు ప్రేమను కూడా శాశ్వతం చేసుకోవచ్చు. ప్రేమికుడి మనసులో లేదా ప్రియురాలి మనసులో ప్రేమబలంగా ఉంటే... దాన్ని ఎదుటి వారిలో అంతే బలంగా కలిగేలా చేయగలిగితే తొలి చూపు ప్రేమ కూడా శాశ్వతం అవుతుంది.

ప్రేమలో అందం ముఖ్యమా... 

ప్రేమలో అందం ముఖ్యమా... అంటే ముఖ్యమని పూర్తిగా చెప్పలేం. కానీ తొలి చూపులోని ప్రేమలో అందం ముఖ్యపాత్ర వహిస్తుంది. యూత్ ప్రేమల్లో అందం గురించిన చర్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచంలో బ్యూటి అనేది వ్యాపారం అయింది. స్త్రీలకే కాదు, పురుషులకు కూడా ఎన్నో సౌందర్య సాధనాలు, ఔషదాలు మార్కెట్ లోకి వచ్చేశాయి. విచ్చలవిడిగా అందం, సౌందర్యం, అలంకరణల గురించి యూత్ మనసుల్లో కల్లోలాలు సృష్టిస్తున్నాయి. ఎన్నో యాడ్స్... సౌందర్య ఉత్పత్తులను అమ్మేందకు టీవీల్లో, పత్రికల్లో కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రపంచంలో జీవిస్తున్న యూత్ కళ్లు అందంవైపు ఆకర్షించబడతాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే శారీరక సౌందర్యం, మానసికమైన ప్రేమకు కొంత వరకే సంబంధం ఉందని పర్సనాలిటీ అండ్ సైకాలజిస్టులు తేల్చి చెప్పారు. శారీరక అందం పూర్తిగా మానసికానందాన్ని ఇవ్వదు. తొలిచూపు ప్రేమ శాశ్వతం కావడానికి మానసిక అందం ముఖ్యం. ఇద్దరు ప్రేమికులు ఒకరి సాన్నిహిత్యంలో మరొకరు మానసిక సంతృప్తిని పొందినప్పుడే ఆ ప్రేమ శాశ్వతంగా నిలబడుతుంది.   

వ్యక్తిత్వాలే ప్రేమ చిరంజీవులు

ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అలానే ప్రేమికులకు వ్యక్తిత్వాలు ఉంటాయి. వారు ఎదుటివారిపై చూపించే ప్రేమ ఆ వ్యక్తిత్వం నుంచే ఉద్భవిస్తుంది. ఒక్కోసారి అనుకోకుండా భిన్న వ్యక్తిత్వాలున్న అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడొచ్చు. వారిద్దరి మధ్య అనేక కారణాల వల్ల ప్రేమ అంకురించవచ్చు. అనుబంధం ఏర్పడవచ్చు. అయితే ఆ భిన్న స్వభావాలు ముఖ్యమైన విషయాల్లో ఏకీభవించాలి. సారూప్యత ఉండాలి. కొన్ని విలువల్లో కలిసి నడవాలి. అప్పుడే వారి ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి అహం ఉంటుంది. అది యూత్ లో మరీ ఎక్కువగా ఉంటుందట. అయితే ప్రేమికులు దాన్ని పక్కన పెట్టాలి. ప్రేమతో పాటు ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. మీకంటే ముందు మీరు ప్రేమించే వ్యక్తి అభిప్రాయానికి విలువ ఇవ్వాలి. అప్పుడే ఆ ప్రేమ కలకాలం నిలబడుతుంది. అప్పుడే తొలిప్రేమ కాస్త చిగురించి మొగ్గతొడిగి పువ్వై పూస్తుంది. 

 తొలి చూపులోనే ప్రేమలో పడడం, భిన్న ధ్రువాలున్న అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడడం సహజమే. తొలి చూపులో అందం పాధాన్యతా ఎక్కువే. తొలి చూపుకు శారీరక సౌందర్యాలే మార్గాలన్న మాటలు నిజమే. ఇవన్నీ యూత్ ప్రేమల్లో కామనే. కానీ అవన్నీ శాశ్వతం కావాలంటే... యూత్ వ్యక్తిత్వాలు పరిపక్వత చెందాలి. ఊహలతో పాటు, వాస్తవాలను అంచనా వేయగలగాలి. శారీరక ఆకర్షణ కన్నా మానసిక బంధం ముఖ్యమన్న అవగాహన వారిలో ఉండాలి.  

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి