కార్టూనిస్టులతో ఇంటర్వ్యూలు - ..


 

తిక్క : పార్నంది వేంకట రామశర్మ గారూ, నమస్కారాలపైనే ఉన్నారా?
హ హా! బాహా అడిగారు! 'ఇంకా బెడ్ మీదే ఉన్నారా' అన్నట్టు! అయినా..అలా నమస్కారాల మీదే ఉంటే ఎలాగండీ? అసలు నమస్కారం లోనే "మస్కా" , "కారం" రెండూ ఉన్నాయి. అందుకని న మస్కా!, న కారం!....

తిక్క : పోకిరి సినిమా తర్వాత మీ కార్టూన్లలో మార్పేమైనా వచ్చిందా?
నన్ను కిరికిరి పెట్టడానికి కాక పోతే.... నా Trade Secret ని అలా డైరెక్ట్ గా అడిగేస్తారా?

తిక్క : ఎక్కడికెళ్ళి కార్టూన్లు గీస్తున్నారు?
బాత్రూం లోకెళ్ళి ఐడియా లు తెచ్చుకుని, ఇంట్లో కూర్చుని గీస్తున్నా! (అసలు ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుందని యాడ్స్ లో ఊ .... ఊదర గొట్టేస్తున్నారు గానీ, అక్కడి కెళ్తేనే ఆలోచనలు వస్తాయని వాళ్లకి తెలీదా?)


తిక్క : నాలుగవ ప్రపంచ యుద్ధం వస్తే గానీ మీరు కార్టూన్లు ప్రారంభించరా?
అవునండీ! వెయిటింగ్!! అప్పుడు మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఇంచక్కా!

తిక్క : సైన్స్ ఆధారంగానే కార్టూన్లు గీస్తున్నారా?

సైన్స్ లెస్ అయితే సెన్సు లెస్ అయిపోతార్ట! అందుకనీ...ఒక్క సైన్సేం ఖర్మ! హిస్టరీ, మిస్టరీ, జాగ్రఫీ, జాగరీ...ఇలా దొరికిన వాటి ఆధారాలట్టుకు గీసేస్తున్నా!....రోజూ గెడ్డం గీసినట్టు!

తిక్క : మీ కార్టూన్లలోని గొప్పదనం మీకెవరిచ్చారు?
ఆహా! మీదెంత గొప్ప మనసండీ! కనీసం మీరైనా నా కార్టూన్లు గొప్పగా ఉంటాయని అన్నారు! ఈ మాత్రం జ్ఞానం "సం"(some)పాదకులకు లేకపోయే కదా!? వా..!

తిక్క : హిరణ్యకశిపుడు మహావిష్ణువు ఎక్కడున్నాడని అడిగినపుడు ప్రహ్లాదుడు " పార్నంది వేంకటరామశర్మ గారి కార్టూన్లలో" అని చేప్తే ఏమై ఉండేది?
అసలు ముందు అదే జరిగింది. అప్పుడు నా కార్టూన్లు చూసి నవ్వుకుంటున్న హిరణ్యకశిపుణ్ణి విష్ణువు చంపలేక, ప్రహ్లాదుడిని పిలిచి... అట్టా కాదు గానీ... ఇంకో ప్లేస్ చూపించు మీ నాన్నకి అని అడగడం తో మారిన కధ మనం చదువుకున్నాం. [అసలు ఈ సీన్ భక్త ప్రహ్లాద సినిమా లో మొదట పెట్టారు. లెంగ్త్ ఎక్కువైందనీ తీసేశారు! వా(!.....

తిక్క : ఎన్ని కార్టూన్లు సంపాదించారు?
ప్రతీ పత్రికా సంపాదకుడు తిప్పి పంపినన్ని!

తిక్క : చేతి చమురు వదలాలంటే నూనెతో కార్టూన్లు వేయాలా?
కార్టూన్ వేస్తేనే చాలు చేతి చమురు వదిలిపోతుంది. మళ్ళీ నూనె ఖర్చు ఎందుకు దండగ!

తిక్క : మీ కార్టూన్లు ఇలాగే ఉండాలని రూలేమైనా ఉందా?
రూలా!! రూల్స్, రెగ్యులేషన్స్ కి మనం కాదు ఇంచార్జ్ !! ఉండండి..నా శ్రీమతి ని పిలుస్తాను. ఏమోయ్!... నిన్నే!.... దయచేసి ఒక్కసారి రాగలవా?

తిక్క : సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి. ఇలాగైతే మీ కార్టూన్ల పరిస్థితి ఏమిటి?
ఏం ఫర్లేదు! ఏదో ఒకరోజు రాజమౌళి నా కార్టూన్లన్నీ కలిపి ఒక సినిమా తీసేస్తాడు... యుగాంతం ముందు!

తిక్క : మీ కార్టూన్లలో అభ్యుదయ భావ ప్రణీత కళింగ మార్తాండ షోడస విలువలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇదెలా సాధ్యం?
నేను కార్టూన్స్ వేసేముందు కాంప్లాన్ లో బూస్ట్, బోర్నవిటా, హార్లిక్స్, న్యూట్రామూల్, మాల్ట్ వగైరా లన్నీ కలిపి ఒకేసారి త్రాగేస్తా! దాంతో నా కార్టూన్లు అలా వచ్చేస్తాయ్ అదేంటో? (కార్టూన్ బద్ధమైన హెచ్చరిక: ఇది మిగతా కార్టూనిస్ట్ లు పాటించరాదు!)

తిక్క : శ్రీరాముడు సీతాణ్వేషణలో ఉన్నప్పుడు మీరు ఎదురుపడి మీ కార్టూన్లు చూపించి ఎందుకు సాయమందించలేదు?
చూపించా!!అప్పుడే నన్ను "రామ" శర్మ అని దీవించి, రామ అన్న పేరు తన కొదిలేసి, "శర్మ" అన్న పేరునే నా కార్టూన్ల లో కంటిన్యూ చేసుకోమన్నాడు ఆ శ్రీరాముడు !

తిక్క : పాత కార్టూన్లు మానేయాలనుకునేవారికి మీరివ్వని సందేశమేమిటి?
పాత కార్టూన్లు (చూడడం)మానేస్తే, కొత్త వెలా పుడతాయ్! అని నేను సందేశించను గాక సందేశించను.

తిక్క : తుంటర్వ్యూ అయిపోయాక ఏం చేస్తారు?
రాక రాక నన్నొకరు ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తే అది ఇలా తుంటర్వ్యూ అయి కూర్చుంది! ఏం చేస్తాను? గుండె కార్టూన్ చేసుకు భోరుమని నవ్వేస్తా!

తిక్క : శుష్క వాగ్దానాలు చేసే రాజకీయ నాయకులనుకార్టూనిస్టులంతా కలిసి తరిమేసేరోజు వస్తుందా?
వామ్మో! వాళ్ళని తరిమేస్తే కార్టూనిస్ట్ లకి మేటర్ ఎక్కడ దొరుకుతుందీ?

తిక్క : కార్టూన్లు కావాల్సినప్పుడల్లా ఎవరికి ఫోన్ చేస్తారు?
పత్రికల ఎడిటర్ల కి... మీదగ్గరున్న అందరి కార్టూన్లు నాకు పంపెయండని!

తిక్క : ఏ సైన్యం మీ వెంట లేకుండా, ఏ దేశం సాయమందించకుండా కార్టూన్లెలా గీస్తున్నారు?
గెడ్డం గీస్కోడానికి బార్బర్ సాయం అయినా కావాలేమో గానీ.. నా కార్టూన్లకి ఎందుకండీ! అయినా అడిగాను సరదాగా సాయం చేస్తారేమో ననీ! పాపం సైన్యం బోర్డర్ దగ్గరే పాక్ వాళ్ళ తో రోజువారీ గొడవల్తో కొట్టుకుంటోంది. దేశాలన్నీ వాళ్ళలో వాళ్ళే ఒకర్నొకరు సాయం కోసం అడుక్కుంటున్నారు. ఇంకా నా గొడవ ఎవరికీ పడుతుందీ!?

తిక్క : ఎలుగుబంటి ఎదురైతే ఒక్క కార్టూన్ గీసి విసిరేస్తే ఏమవుతుంది?
మామూలు గా విసరను. నిప్పంటించి మరీ విసురుతా! మీరూ ప్రక్కనుండండి. ఏమవుతుందో చూద్దురు గాని!

తిక్క : ఎవరికి ఆదర్శంగా ఉండాలని కార్టూన్లు ఆపేశారు?
నాకు నేనే ఆదర్శంగా!! .... నేను కార్టూన్లు వెయ్యడం ఆపకపోతే, పత్రికల వాళ్ళు నా కార్టూన్లు వెయ్యడం ఆపేస్తామన్నారు. అందుకని ఇప్పుడు వాళ్ళ దగ్గరున్నవి వాళ్ళు వేసే దాకా... నేను కొత్త గా వెయ్యడం ఆపేసా! (హమ్మా! నాచేతనే కార్టూన్లు ఆపేసానని చెప్పించే ద్దామనే!?)

తిక్క : మీ కార్టూన్ల నిర్వహణ బాధ్యత సోవియట్ యూనియన్ వదులుకున్నట్టేనా?
వాళ్ళు యూనియన్ గా ఉన్నన్నాళ్ళు నన్ను, నా కార్టూన్లని నెత్తి కెత్తు కున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని ఈ ప్రశ్న అడిగేరనుకోండి! వాళ్ళ బాధ్యత నా నెత్తిన పడుతుంది. ఉష్!! గప్ చుప్ !!

తిక్క : ఆన్సర్లు అనవసరంగా చెప్తున్నట్టున్నారు?
అనవసరం కాదు! అవి నవరసం గా ఉండాలనీ చెప్తున్నా! అయినా.... తెల్లారి లేస్తే... ఫేస్ బుక్, వాట్సాప్ వంటి గొప్ప అత్యంత అనవసర కాలక్షేపం కోసం మీకు ఆన్సర్లుచెప్పడం నా అనవసర బాధ్యత మరి!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు