సాహితీవనం - వనం వెంకట వర ప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద   

అపూర్వమైన, విచిత్రమైన ఊహలకు కల్పనలకు శ్రీకృష్ణదేవరాయల కవిత్వం పెట్టింది పేరు. ఆయనలాగాస్వతంత్రించి కొత్త కొత్త పద ప్రయోగాలను, ఉపమానాలను చెప్పినవాళ్ళు లేరు అని పండితలోకం కొనియాడడానికికారణం ఏమిటో గోదాదేవి అందచందాల వర్ణనలలో సులువుగా తెలుసుకోవచ్చు.

లేఁగౌఁదీఁగె నితంబము

వ్రేఁగునఁ ద్రెవ్వుటయుఁ గని విరించి బిగింపన్

లోఁ గి ముడియిడియె వదలుగ

నాఁ గోకస్తని గభీర నాభి చెలంగున్

ఆమె నడుము నాజూకుగా తీగలాగా ఉన్నది. వక్షోజముల భారమే కాక పిరుదుల భారం కూడా మోయలేక ఆ సన్నని నడుము ఎక్కడ విరిగిపోతుందో  అన్న భయముతో ‘బ్రహ్మదేవుడు’ ఆమె నడుమును బిగించి కడదాముఅనుకున్నాడు. మరీ తెగిందాకా లాగకూడదు, ఎక్కడ కట్టు తెగి, మొత్తం ప్రయత్నం  వృధా అయిపోతుందో అని, నడుమును బిగించి కట్టి, ముడిని కొద్దిగా వదులుగా వదిలాడేమో.... అన్నట్లు పెద్దగా, సుడులుగా ఉన్నది ఆమె  నాభి!

వెలఁది కటిపేర నిల నొక

పులినము దిగఁబడియె సింధు పులినపుఁబఙ్క్తిన్

నలువ యది పడఁగఁగాదే

తెలియుట కం దంచపదము దిరముగా నిలిపెన్

లోకవ్యవహారాల్లో, ఇచ్చిపుచ్చుకోటాల్లో చేసే రాత కోతల్లో చేతి వ్రాతలో ఎక్కడన్నా ఒకటీ అరా అక్షరాలుతప్పిపోతే( దిగబడితే) ఇక్కడ ఫలానా అక్షరం  తప్పిపోయింది అని గుర్తుగా అక్కడ ‘హంసపాదు’ అనే ఒక చిహ్నాన్ని  ఉంచడం తెలిసిందే.  దీన్ని ఒక నాయిక పిరుదులకు పోల్చి చెప్పగలరా ఎవరైనా, ఇంత పూర్తి వినూత్నమైన పోలిక కేవలం శ్రీకృష్ణదేవరాయలకే స్ఫురించే అవకాశం ఉన్నది. అందుకు ఉదాహరణం పైన ఇచ్చిన చిన్ని పద్యం.

ఇసుకతిన్నెలలో, ఇసుకతిన్నెలతో కలిసిపోయే గోదాదేవి పిరుదులభాగం ప్రపంచంలో ఒక ఇసుకతిన్నెను తప్పిపోయేట్టు చేసింది, అంటే ఇసుకతిన్నె ఒకటి  సముద్ర తీరంలో తప్పిపోయింది, లేకుండా పోయింది, వచ్చిగోదాదేవి పిరుదుల భాగంగా చేరిపోయింది. తప్పిపోయిన ఇసుక తిన్నెకు గుర్తుగా ఉంచిన హంసపాదంగాఇసుక తిన్నెల మధ్యన హంసల పాదాల గుర్తులు మిగిలిపోయాయి సరస్సుల, నదుల తీరాలలో. నదుల తీరాలలో, కొలనుల తీరాలలో ఇసుకలలో హంసలు సంచరిస్తున్నప్పుడు వాటి అడుగుల గుర్తులు ఇసుక తిన్నెలమధ్య కనబడడం జరిగేదే. ఇదీ అద్భుతమైన రాయల ఊహాచాతుర్యం!  

కదళి తివియించె నాగ్రాంఘ్రికంబు తొడల

పెనుపు నె ట్లన్నఁ బొరల శోధన నడంచు

కొన్న యాఁదోఁకపాటును గొప్పు విప్ప

మెరయు గోర్మ్రుచ్చులును గెంపు గురులు గావె

అరటి బోదెలు గోదాదేవి ఊరువుల లావణ్యాన్ని దొంగిలించాయి, సందేహం లేదు. ఎందుకంటే నునుపు, ఆకృతి, అందంలో అరటి బోదెలు అచ్చు గోదాదేవి  ఊరువుల్లానే ఉంటాయి. గోదాదేవి ఊరువులు అరటి బోదేలలా ఉండడం కాదన్నమాట! ఇంకొక సాక్ష్యం ఏమిటంటే, ఆ అరటి బోదెల పై తొనలు, బెరడు విడదీస్తే లోపలి బోదెల ఎర్రనెర్రని బెరాదులు కనబడతాయి, గోదాదేవి ఎఱ్ఱని ఊరువులలాగా. కనుక, ఎవరూ సందేహించనక్కర్లేదు, లోకంలో అరటి బోదెలు  అన్నీ గోదాదేవి ఊరువుల అందాన్ని దోచుకున్న కారణంగానే అలా అందంగా, నునుపుగా, నాజూగ్గా, లేత ఎఱ్ఱని రంగులో మిసమిసలాడిపోతుంటాయి!   

వసుధలో నెట్టి శ్రీ గలవారివేని

కరభములు దాస్యములు చేయు సరసిజాక్షి

యూరువుల కెట్ల టన్నఁ బైఁ దారు మోచు

గొడుగులును నల్ల కలశముల్ గురులు గావె 

లోకంలో ఎంతటి సంపన్నులైన స్త్రీల చేతులైనా, గోదాదేవికి, ఆమె ఊరువులకు దాస్యం చేయడానికి నోచుకున్నవే. అంటే ఆమెకు దాస్యం చేయడానికి నోచుకున్న చేతులున్నవారందరూ శ్రీమంతులే! ఎందుకంటే, హస్త సాముద్రికా శాస్త్రం ప్రకారం చేతులలో చత్ర, కలశ, అంకుశ మొదలైన చిహ్నాలు ఉండడం వలన సిరి గలవారు అవుతారనిహస్త సాముద్రికా శాస్త్రం చెప్తుంది కదా, ఆ గొడుగుల గుర్తులు ఉండడం గోదమ్మవారికి గొడుగు పట్టడం కోసమే, ఆ కలశాల గుర్తులు ఉండడం ఆమెకు అభిషేకం కోసం, స్నానంకోసం, పాద ప్రక్షాలనకోసం నీటిని నింపిన పూర్ణ కలశాలను పట్టుకొనడంకోసమే. కనుక ఆ చిహ్నాలు ఉన్నవారు ఆ సేవలను చేయడానికి నోచుకున్న శ్రీమంతులే, అవును, ఇందులో ఏ సందేహమూ లేదు!

(కొనసాగింపు వచ్చేవారం)

వనం వేంకట వరప్రసాదరావు          

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి