పద్యం - భావం - సుప్రీత

 వేమన పద్యం

 

అనగననగ రాగ మతిశ యిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధర లోన
విశ్వదాభి రామ వినుర వేమ.

 

తాత్పర్యం

పాడుతూ పాడుతూ వుంటే రాగము వృద్ధి అవుతుంది. తినగ తినగా వేపాకు కూడ తియ్యగా ఉంటుంది .అలాగే సాధనము వల్ల ఇలలో పనులన్ని అవుతాయి.

 

విశ్లేషణ

పాడగా పాడగా రాగము వృద్ది చెందుతుంది . వేపాకు చేదు రుచిలో ఉంటుంది కాని మనం మళ్ళి మళ్ళి వేపాకు తినటం వల్ల దాని రుచికి అలవాటు పడి అది నిజంగా చేదు గా ఉన్నా మనకి తియ్యగా అనిపిస్తుంది.అలాగే మనము ఎదైన పని చెస్తున్నప్పుడు ఎన్ని సార్లు ఓడిపోయినా సరే మళ్ళి మళ్ళి ప్రయత్నిస్తే అన్ని పనులు లో మనకి విజయం కలుగుతుంది అని చెప్పటమే ఈ పద్యం లో నీతి.

దాశరధీ పద్యం

 

భానుడు తూర్పునందు గనుపట్టిన బావక చంద్ర తేజముల్
హీనత జెందునట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము సేయుచున్న బరదైవ మరీచు లడంగకుండునే
దానవ గర్వ నిర్దళన దాశరధీ కరుణాపయోనిధీ
.

 

తాత్పర్యం

రాక్షసుల గర్వమును హరించి, వారిని హతమార్చిన రామ నీ అనితరకాంతి ముందు , సుర్యుని ముందు చంద్రాగ్నుల కాంతి చిన్న బోయినట్లే, ఇతర దేవతల కాంతి క్షీణించును.

 

విశ్లేషణ

సూర్యుడు చాలా కాంతి వంతుడు భూమికి ఎంతో కాంతినిస్తాడు. అలాంటి సుర్యుడిముందు చంద్రుడి కాంతి చిన్నబోతుంది. అదే విధం గా రాముడు ధర్మాత్ముడు , ఎంతో మంది రాక్షసులతో యుద్దం చేసి గెలిచాడు, అలాంటి రాముడి కాంతి ముందు వెరే వాళ్ళ కాంతి చిన్నబోతుంది అని చెప్పటమే ఈ పద్యం లో నీతి.

 

 

సుమతీ శతకం

ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్‌
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!

తాత్పర్యం

లోకంలో ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము, బాధ పొందకుండా ఇచ్చువాడే దాత, ఆవేశాన్ని ఓర్చుకొనేవాడే మానవుడు, ధైర్యం కలవాడే వంశశ్రేష్ఠుడు.

విశ్లేషణ

మనిషికి బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నము అమృతము వలే రుచిగా ఉంటుంది. అదే విధంగా బాగా కడుపు నిండినప్పుడు తిన్న గారెలు చేదుగా ఉంటాయి. బాగా భాధల్లో ఉన్నప్పుడు ఎవరైతే సహాయం చెస్తాడో అతనే దాత. క్రోదం మనుషుల్ని మనకి దూరం చేస్తుంది , ఎవరైతే తమ కోపాన్ని అదుపులో పెట్టుకొని ఎప్పుడూ శాంతంగా ఉంటాడో అతనే మనవుడు, మంచి మనస్సు ఉన్న మనిషి. అలాగే ఎవరైతే ఎప్పుడు దైర్యంగా ఉంటాడో, అతనే తమ వంశ గౌరవాన్ని కాపాడే శ్రేష్టుడు అని చెప్పటమే ఈ పద్యం లోని నీతి.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు