,ప్రపంచంలో అతి కష్టమైన పని, ఏదీ అని అడిగితే, ఎవరికి వారు వివిధ రకాలుగా చెప్తూంటారు. వారు జీవితంలో, ఎన్నో కలలు కని, సాధించలేని విషయాలను ఈ " కష్టతరమైన " పనుల జాబితాలోకి వేసేస్తూంటారు. ప్రతీవారికీ అసలు సిసలైన కష్టం ఏమిటంటే, ఈరోజుల్లో ప్రొద్దుటే, నిద్రలేపి, పిల్లలని స్కూళ్ళకి పంపడం అని నా ఉద్దేశ్యం. దీనితో పోలిస్తే, మిగిలినవన్నీ అసలు కష్టాలలాగే కనిపించవు.
ఈ తతంగం పిల్లకో, పిల్లాడికో రెండో ఏడో, మూడో ఏడో వచ్చినప్పటినుండీ ప్రారంభం అవుతుంది.కనీసం, ఓ పదేళ్ళపాటు జరగడం ఖాయం. ఈలోపులో, ప్రతీరోజూ "దిన దిన గండం " గానే గడుస్తుంది. ప్రతీరోజూ, స్కూలు బస్సు ఎక్కేదాకా, ఏదో ఒక రాధ్ధాంతం. పైగా ఆ పిల్లల సృజనాత్మక శక్తి కూడా మెచ్చుకోవాలి. రోజుకొ కొత్త సమస్య సృష్టించగల నైపుణ్యం, వారికి ఆ భగవంతుడే కలిగిస్తాడు.
ఇదివరకటి రోజుల్లో, ఇలాటి వేషాలు వేసే అవకాశం ఉండేది కాదు. తెల్లవారుఝామున లేవాలీ, అంటే లేవడమే. చదువుకోవాలీ, అంటే చదువుకోడమే. " అమ్మా... బుజ్జీ... కన్నా.. లే నాయనా.." అని అమ్మ మాత్రమే బుజ్జగించేది, నాన్నకి ఎక్కడ కోపం వస్తుందో అని భయపడి. నిశ్శబ్దంగా, ఎవరి పని వారు చేసికోవడమే. ఏడుపులూ, రాగాలూ పెడితే, ఓ రెండు దెబ్బలు పడేవి.
కానీ, ఈరోజుల్లో పిల్లలని నిద్రలేపడానికి, తల్లితండ్రులు పడని పాట్లు లేవు. వెంకటేశ్వరస్వామి కి సుప్రభాతం పాడినట్టుగా, పాటలతో ప్రారంభం అవుతుంది. ఒక్కరే అయితే, గొడవలేదు. ఇద్దరైతే అవేవో మెడ్లీల లాగ,రకరకాల పాటలు, ఐపాడ్ లోనో, Laptop లోనో పెట్టాలి. ఎవరికిష్టమైన పాట వినిపించినప్పుడు, వారిలో కదలిక ఏర్పడినప్పుడు, "అమ్మయ్యా.." అనుకోడం. ఇది ఆ రోజు ప్రస్థానంలో మొదటి మెట్టు మాత్రమే. ఆ పిల్లల " మూడ్ " ని బట్టీ, తల్లితండ్రుల అదృష్టాన్ని బట్టీ, స్నానానికి బయలుదేరతారు. మళ్ళీ ఇందులో ఓ పోటీ-- ఫలానా baathroom లొనే స్నానం చేస్తానని . స్నానపానాదులు పూర్తిచేసికుని, యూనిఫారం వేసికుని, మొత్తానికి రెండో మెట్టుకి చేరతారు. ఇంక breakfast వ్యవహారానికి వస్తే, ఇదివరకటి రొజుల్లొలాగ, చద్దన్నాలు, తరవాణీ అన్నాలూ కాదుగా, రోజుకో వెరైటీ, పైగా వాటికీ ఓ టైంటేబులూ. సడెన్ గా అప్పుడు గుర్తొస్తుంది పిల్లకో, పిల్లాడికో ఆరోజు స్కూల్లో, ఏదో తీసికుని రమ్మన్నారని, ఎంత కోపం వచ్చినా, బయట పడకుండా, పక్కనే ఉందె ఏ దుకాణానికో వెళ్ళి తీసుకుని రావడం. ఈ వ్యవహారాలన్నీ పూర్తయేసరికి, స్కూలు బస్సు, రావడం, వెళ్ళడంకూడా పూర్తవుతుంది. ఉంటే, ఏ కారులోనో, ఆటోలోనో తీసికెళ్ళడం. అక్కడితో ఓ రోజు పూర్తయినట్టు. ఇంకా ఎన్ని సంవత్సరాలు లాగించాలో...
పైగా ఈకాలపు స్కూళ్ళలొ ఒక్కోరోజు ఒక్కో రకం డ్రెస్సులోటీ, ఒక్కోరకం పాదరక్షలోటీ. ఏరోజు డ్రెస్సు, షూసూ, ముందరిరోజు రాత్రికల్లా రెడీ అయిపోవాలి. అన్నీ అయేసరికి, ఏ స్కూలు ఐడీ కార్డో కనిపించదు. దానికోసం వెదకడం. ఇదివరకే హాయిగా ఉండేది. మహా అయితే, ఏ స్కౌటులొనో ఉంటే గింటే, ఓ ప్రత్యేక యూనిఫారంతో పనైపోయేది.
వీటన్నిటిదీ ఓ ఎత్తూ, వర్షాకాలం వచ్చిందంటే ఇంకో గొడవ—Raincoat , ఇంటినుండీ వేసుకోవడానికి నామోషీ. తీరా తీసికెళ్ళిన తరువాత, ఇంటికి తీసికొస్తారా అంటే, అదీ సందేహమే, స్కూల్లోనో, బస్సులొనో మర్చిపోడానికే ఎక్కువ ఆస్కారం ఉంది. స్కూళ్ళలో ఫీజులేమైనా తక్కువుంటాయా అంటే అదీలేదూ, కేజీ క్లాసుకే 50, 000 రూపాయలు. ఇదివరకటి రోజుల్లో ఆ డబ్బుతో, డిగ్రీదాకా చదువు పూర్తయేది. ఇవి కాకుండా, ఆపేరూ, ఈపేరూ చెప్పి ఫీజులూ.
“పైక్లాసులకొచ్చేసరికి ట్యూషన్లూ, ఆ ట్యూషన్లకి వెళ్ళడానికి, ఆడపిల్లలకి స్కూటీలూ, మగపిల్లలకి మోటారు బైక్కులూ. వాళ్ళు క్షేమంగా ఇంటికొచ్చేదాకా ఎదురు చూడ్డాలూ. మొత్తానికి ఏ ఇంజనీరింగులోనో, మెడిసిన్ లోనో చేర్పించడం, మళ్ళీ వాటికి బ్యాంకులూ, అప్పులూ... ఆఖరేడాదొచ్చేటప్పటికి, విదేశాల్లో చదవాలనే పురుగు ప్రవేశిస్తుంది... పోనీ ఏదో తలతాకట్టు పెట్టి పంపారే అనుకోండి, తిరిగొస్తారా అంటే అదీ లేదూ. అక్కడే ఓ పిల్లనీ, ఓ ఉద్యోగాన్నీ చూసుకోవడం”--- అని పాతతరం వారు అనుకోని రోజుండదు. చిత్రం ఏమిటంటే,ప్రతీరోజూ సంవత్సరాలపాటు “ గరుడసేవ” చేయించుకున్న ఈ పిల్లలూ, ఏదొ ఉధ్ధరిస్తారని అనుకోవడం బుధ్ధితక్కువ.పైగా ఏమైనా అంటే, “కన్నారు కాబట్టి పెంచడం మీబాధ్యత” అనే రోజులు కూడా వస్తాయి. అదృష్టంకొద్దీ, ఈతరం తల్లితండ్రులు, వారి తల్లితండ్రులని మరీ అంతలా అనలేదు. ఈరోజుల్లో కూడా అదే పరిస్థితి. రేపు, ఈనాటి తల్లితండ్రులు కూడా అదే పరిస్థితిని action replay లో చూడాల్సొస్తుంది. జీవితచక్రం తిరుగుతూనే ఉంటుంది...
సర్వేజనా సుఖినీభవంతూ...