దివ్య దేశం రఘునాధ్ మందిరం - కర్రా నాగలక్ష్మి

ragunadhamandir

 హిందువులకు అతి భక్తి  శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో  శ్రీరామనవమి ఒకటి . చైత్ర శుద్ధ నవమిని శ్రీరాముడు  జన్మించిన తిథిగా , శ్రీరామనవమిగా జరుపుకోవడం హిందువులకు అనాదిగా వస్తున్న ఆచారం .

ఆంధ్రప్రదేశ్ ఆంద్ర , తెలంగాణ గా విభజన జరిగిన తరువాత ఆంధ్ర లో శ్రీరామనవమి ఉత్సవాలు ఎక్కడ జరపాలి ఒంటిమిట్ట లోనా? లేక రామతీర్ఠాలు లోనా ? అనే విషయం మీద యెన్నో తర్జన భర్జనలు జరిగిన తరువాత 'ఒంటిమిట్ట'లో జరపాలని రాజకీయనాయకులు నిర్ణయించేరు . శ్రీరామనవమిని కుడా రాజకీయం చేసేరు ఇలాంటి నేపధ్యం లో మనం ఉత్తరాఖండ్ లో వుండి తెలుగు పుజారులచే పూజలందుకుంటున్న రఘునాధ్ దేవాలయం గురించి తెలుసుకుందాం .

వైష్ణవులు పరమ పవిత్రంగా భావించే 108 దివ్య దేశాలలో 106 వ దివ్య దేశంగా చెప్పబడే రఘునాధ్ మందిరం యిదే . ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని తెహ్రి ఘరేవాల్ జిల్లాలో  దేవప్రయాగ లో ఈ దివ్యదేశం వుంది.  హరిద్వార్ కి సుమారు 100 కిమి. . దూరంలో శివాలిక్ పర్వత శ్రేణులలో వున్న పుణ్యక్షేత్రం ఇది .

హరిద్వార్ నుంచి 'చార ధామ్ ' యాత్రగా పిలువబడే యమునోత్రి , గంగోత్రి , కేదార్నాథ్ , బదరి నాథ్ యాత్రలు మొదలవుతాయి . హరిద్వార్ కి సుమారు 25కిమీ దూరం లో వున్న ఋషికేష్ నుంచి శివాలిక్ పర్వత శ్రేణులు మొదలౌతాయి . హరిద్వార్ నుంచి బదరీనాథ్ వరకు వున్న ముఖ్యమైన  పంచ ప్రయాగలలో ముఖ్య మైనది ఈ దేవప్రయాగ . రెండు ముఖ్యనదులు కలిసేచోటుని సంగమం లేదా ప్రయాగ అనిఅంటారు .

మన దేశానికి టిబెట్ వైపున వున్న సరిహద్దులో గల సతోపంత్ మరియు భాగీరథి కారక్ అనే హిమనీనదములలో పుట్టి  అలకనంద గా బదరీనాధ్ మీదుగా  ప్రవహించి విష్ణు ప్రయాగలో దౌళి గంగని కలుపుకొని అలకనందగా ప్రవహించి , నంద ప్రయాగలో నందాకిని నదితో కలిసి అలకనంద గా ప్రవహించి కర్ణ ప్రయాగలో పిండారీ గంగతో కలిసి అలకనందగానే ప్రవహించి రుద్ర ప్రయాగలో మందాకినీ నదిని కలుపుకొని అలకనంద గ ప్రవహించింది . గోముఖ్ దగ్గరనున్న గంగోత్రి మరియు ఖట్లింగ్ అనే హిమనీనదముల నుండి పుట్టిన భాగీరథి నది హిందూ పురాణాల ప్రకారం భాగీరథుడు తన పూర్వజుల సద్గతులకోసం ఘొరతపస్సు నాచరించి గంగను భూలోకంలోకి తెప్పించేననే కధ ప్రచారంలో వుంది .భాగీరధుని ద్వారా రప్పించ బడింది కాబట్టి ఈ నదికి భాగీరధి అనే పేరు వచ్చింది . దేవప్రయాగలో అలకనంద మరియు భగీరథి సంగమించి గంగ గా పిలవబడుతూ హృషికేష్ , హరిద్వార్ మొదలైన పుణ్యక్షేత్రాలలో ప్రవహిస్తూ భక్తులను పునీతులని చేస్తోంది . ఈ సంగమాన్ని అత్తా కోడళ్ళ సంగమంగా కుడా స్థానికులు వ్యవహరిస్తూ వుంటారు . రెండు నదులు రెండు వైపులనుంచి వచ్చి వేరువేరు రంగులనీళ్ళు కలుస్తూ చూపరులను ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతుంది .

అలకనంద భగీరథి నదుల సంగమం ఇదే  ఈ సంగమ ప్రదేశం లో వున్న పట్టణాన్ని  " దేవనగరి " అని పేరు . ఇక్కడ చేసే పూజలు , ముక్కోటి దేవతలు అందుకుంటారని స్థానికుల నమ్మకం. పురాణకాలం లో దేవశర్మ అనే రుషి ఇక్కడ తపస్సు చేసెనని ఈ ప్రదేశాన్ని దేవనగరి అని పిలువబడుతోంది .ఈ సంగమానికి యెదురుగా వున్న శివలింగాన్ని తొండేశ్వర్ మహదేవ్ అని ధనేశ్వర్ మహాదేవ అని పిలుస్తారు . సంగమం నుంచి నీటిని తెచ్చి ఈ శివలింగాన్ని అభిషేకించుకుంటూ వుంటారు . దేవనగరి గిద్దాంచల్ , నృశింగాంచల్  , దశరథాంచల్ అనే మూడు పర్వతాల మధ్యన వుంది. రఘునాధ్ మందిరం వెనుక వైపున గిద్దాంచల్ పర్వతం వుంది , ఎదురుగా నృశింగాంచల్ , సంగంకి యెదురుగా దశరథాంచల్ వున్నాయి . హృషికేష్ నుంచి బదరీనాథ్ వెళ్ళే జాతీయ రహదారిని ఆనుకొని వున్న బజారు లోంచి సుమారు 700కిమి. . దూరంలో రఘునాథ్ మందిరం వుంది .

శ్రీరాముడు లవకుశులను పట్టాభిషిక్తులని చేసిన అనంతరము శ్రీరాముడు రావణుని సంహరించుట వలన కలిగిన బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టుకొనుటకు తపస్సు చేసుకోనుటకై  భాగీరథి ,అలకనంద నదుల సంగమ ప్రదేశాన్ని యెంచుకొని యిక్కడ  తపస్సు చేసుకొని యాగం నిర్వహించేడని దానికి ప్రమాణంగా తన పాదగుర్తులను విడిచి అవతారం చాలించేడని యిక్కడి పూజారులు చెప్పేరు. కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం హిమాచల్ లో వున్న  " కుల్లు "ని పరిపాలించిన రాజు తాను  చేసిన  పాపాలను ప్రక్షాళన చేసుకొనే వుద్దేశ్యం తో రామజన్మస్థానమైన అయోధ్య నుంచి దొంగిలించి రాముని విగ్రహం తెచ్చి యిక్కడ ప్రతిష్తించెనని ఇక్కడి స్థలపురాణం చెప్తోంది . ఇప్పుడున్న కోవేలని  1835 సం|| లో అప్పటి జమ్మ - కాశ్మీర్ రాజైన గులాబ్ సింగ్ కట్టించడం మొదలుపెట్టగా అతని కుమారుడైన మహారాజా రణబీర్ సింగ్ ద్వారా 1860 లో పూర్తి చెయ్యబడింది . ఈ కోవెలలో బౌద్ధ , దక్షిణ భారత శిల్పకళల మిశ్రమం గా కనిపిస్తుంది . కోవెలలో రాముని విగ్రహంతోపాటు సీతా , లక్ష్మణ విగ్రహాలు కుడా కొలువై వున్నాయి . రామ , కృష్ణ లీలలు బంగారు వెండి రేకులపైచెక్కి కోవేలలోపలి గోడలకు తాపించబడ్డాయి . శ్రీమహావిష్ణు ప్రతిరూపాలుగా చెప్పబడే శాలిగ్రామాలు ఈ కోవెలలోపలి గోడలకు  వందల సంఖ్యలో తాపించబడి వున్నాయి .

ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఈ కోవెల పూజారులు తెలుగువారు . ఇంత దూరం వారు యెలా వచ్చేరు అని అడుగాగా శంకరాచార్యులవారు జోషిమఠ్  వచ్చినపుడు అక్కడి రాజులు తమ రాజ్యంలో  వేదవిధులు నిర్వర్తించేందుకు బ్రాహ్మణులు కావాలని శంకరులని అర్ధించగా , శంకరులవారు తనతోకుడా వచ్చిన కొందరు బ్రాహ్మణులను యిక్కడ వుంచెనట , ఇప్పుడున్న వారు వారి సంతతేనట . వీరిని స్థానికులు " పండా " లుగా వ్యవహరిస్తారు .

ఇక్కడకి సుమారు ఒకటి లేక రెండు కిమీ.. దూరంలో వున్న " పుండా "గ్రామంలో దుర్గాదేవి భువనేశ్వరి మాతగా పూజలందుకుంటోంది . ఈ కోవెల చిన్నగానే వుంటుంది కాని అమ్మవారిపై స్థానికుల విశ్వాసం అచంచలం .

ఆచార్య పండిట్ చక్రధర్ జోషి జ్యోతిష్ శాస్త్ర , నక్షత్ర గ్రహశాస్త్ర అధ్యయన కర్త 1946 లో నక్షత్ర వేదశాల ధశరథాంచల్ పర్వతంపైన నిర్మించేరు . ఇందులో పురాతన అధ్యయన పద్ధతులైన సూర్యగతి , జలగతి , ద్రువగతి లతో పాటు రెండు టెలిస్కోపులు కాక నక్షత్ర , జ్యోతిష అధ్యయనానికి కావలసిన అనేక గ్రంధాలను కుడా ఇక్కడ ఉంచేరు . ఇందులో 3000 లకు మించిన వ్రాత గ్రంధాలు కుడా వున్నాయి . ఇవి 1470సం .. నుంచి గ్రందస్థం చెయ్యబడినవి సేకరించి జాగర్త చెయ్యబడినవి  , దేశం నలుమూలల నుంచి  సంగ్రహింపబడినవి యిక్కడ నిక్షిప్తం చెయ్యబడినవి .

ఇక్కడి ప్రకృతి సౌందర్యం చెప్పడానికి మాటలు లేవు . అనుభవించ వలసిందే . ఏడాదిలో ఆరు నెలలు చల్లగా , మిగతా ఆరు నెలలు అతి చల్లగా వుంటుంది . బద్రినాథ్ యాత్రకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఒకరోజు వుండి రఘునాథ్ మందిరాన్ని చూసుకొని దేవప్రయాగలో పూజలు చేసుకొని ప్రకృతిని కళ్ళారా అనుభవించమని మనవి .

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి