వేమన పద్యం
అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచమయిన నదియు గొదవగాదు
కొండ యుద్దమందు గొంచమై యుండదా
విశ్వదాభి రామ వినుర వేమ.
తాత్పర్యం
తగని చోట గొప్పవారని చెప్పుకోరాదు. తగ్గియుండత మంచిది. అద్దములో కొండచిన్నదిగా కనిపించినంత మాత్రాన
చిన్నదైపోతుందా?
విశ్లేషణ
కొన్ని చోట్ల మనిషి బలవంతుడు , కొన్ని సమయాల్లో బలహీనుడు. తన శక్తి సామర్ద్యల బట్టి మనిషి ప్రవర్తిస్తాడు. కొంత
మంది ఎప్పుడు తామే అన్ని సందర్బాలలో గొప్ప వాళ్లమని అనుకుంటూ అదే విధంగా ప్రవర్తిస్తారు.కాని అన్ని
సమయాల్లో వాళ్ళే బలవంతులు కాదు ఆ విషయం తెలుసుకోలేరు. తప్పు జరిగాక తెలుసుకుంటారు అందుకే
మనము ఎప్పుడు మనకి అనువు కాని సందర్బాలలో అధికులమనుకో రాదు , తగ్గి ఉండాలి అద్దం లో కొండ చిన్నగా
కనిపిస్తుంది అంత మాత్రాన కొండ చిన్నది కాదు కదా అని చెప్పటమే ఈ పద్యం లో నీతి.
దాశరధీ పద్యం
చక్కెఱమాని వేముదిన జాలినకైవడి మానవాధముల్
పెక్కరు బక్కదైవముల వేమఱుగొల్చెద రట్లుకాదయా
మ్రొక్కిన నీకె మోక్షమోసింగిన నీవ యీవలెం
దక్కిన మాటలేమిటికి దాశరధీ కరుణాపయోనిధీ.
తాత్పర్యం
ఓ రామా ! నిశ్చలమైన భక్తి తో నిన్నే కొలిచెడి వారిని నీవు విడువవు. కాని ఇది తెలియక కొందరు హీనులు
పంచదారని విడిచి వేపచేదును రుచి చూసినట్లు, నిన్ను విడిచి అల్పదైవములని పూజించుచున్నారు.
విశ్లేషణ
దేవుడిని మనము ఎప్పుడు నిర్మలమైన మనస్సుతో కొలవాలి. ఎంత సేపు దేవుడిని కొలిచాము అన్న దానికన్న ఎంత
భక్తి తో కొలిచాము అన్నదే ముఖ్యం. అలా నిర్మల మైన భక్తి తో కొలిచిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు.
అలాంటి ఓ రామ నిన్ను వదిలి కొందరు వేరే దైవములని పూజిస్తున్నారు అని చెప్పటమే ఈ పద్యం లో నీతి.
సుమతీ శతకం
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!
తాత్పర్యం
నేను చాలా బలవంతుడ్ని. నాకేమీ భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి విరోధం తెచ్చుకోవడం మంచిది కాదు. అది
ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావడం లేదా?
విశ్లేషణ
కొంతమంది తామే బలవంతులము అన్ని తమకే తెలుసు అనుకుంటుంటారు. అందర్ని నిర్లక్షం చేస్తూ అహకారం తో
ఎవర్నీ లెక్క చేయకుండా విర్ర వీగుతుంటారు. అలాంటివాళ్ళకి అందరితో విరోధం వస్తుంది. అది ఎవ్వరికీ మంచిది కదు
ఎంతో బలం ఉన్న పాము కూడ చీమల చేతిలో మరణిస్తుంది అని చెప్పటమే ఈ పద్యం లో నీతి.