సాధారణంగా, మనిషన్న తరువాత తిండి యావ ఉంటుందే. అందులో తప్పేమీ లేదు. పురాణకాలంలో, బహుశా కందమూలాలమీదే బతికుండేవారేమో. కానీ , ఈరోజుల్లో మార్కెట్ లో, వివిధ రకాల తినుబండారాలూ నోరు ఊరిస్తూ కనిపిస్తూంటాయి. పోనీ, బజారుకి వెళ్తే, అనవసరంగా, అద్దాల్లో పెట్టేవీ, రోడ్డుపక్కన ఉండేవీ చూసి, మనసు పారేసికుంటారని, అసలు బయటకే వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుందామనుకున్నా, ఇంకో గొడవ-- పోటీ పడ్డట్టు, వివిధ టీవీ చానెళ్ళ వారూ,దేశంలో మాట్టాడే అన్ని భాషల్లోనూ, అవేవో “ మా ఊరి వంట”, ఇంకోడింట్లో వంట”, “మా ఆయన చేసిన వంట”, “బామ్మగారి వంట “, “ అత్తగారు చేసిన వంట “ అంటూ, సరీగ్గా మనం భోజనానికి కూర్చునే ముందర, మొదలెడతారు.. మరి , తప్పించుకోడానికి ఆస్కారం ఎక్కడుంటుందీ?
సంసారసాగరం ఈదే టైములో, అంటే, పిల్లలని కని, పెంచి పెద్దచేసే టైములో, ఏదో వాళ్ళకి ఇష్టమైనవేవో చేద్దామని, పాపం తల్లితండ్రులు, తమ నోళ్ళు కట్టేసికుని, చేసిందంతా, ఉన్నదంతా తమ పిల్లలకే ధారపోస్తూంటారు. అందులో తల్లులైతే మరీనూ, తన బిడ్డ కడుపు నిండితేచాలు, తన కడుపునిండినట్టే అని భావించే, సెంటిమెంటోటీ. ఇది మంచిదే, లేకపోతే, పెళ్ళామూ, భార్యా కలిసికట్టుకుని తినడం మొదలెడితే, ఇల్లు గుల్లైపోదూ?. బయటనుండి ఏది తెచ్చినా సరే, “పోనిద్దూ.. పిల్లలు తింటారులే.. “ అని వదిలేయడమే. కానీ, ఈ సెంటిమెంటే కాలగమనంలో , ఈ తల్లితండ్రుల ప్రాణం మీదకు తెస్తుంది. పెద్దయిన తరువాత, తన పిల్లలతో, కొడుకో, కూతురో , ఇంటికి ఏదైనా తెచ్చినా, ఈ తల్లితండ్రులు (ఒరిజినల్), కళ్ళప్పగించి చూడ్డం తప్ప ఇంకో అగత్యం లేదు. కారణం—ఆ కొడుకూ, కూతురూ తమ చిన్నప్పుడు, తమ తల్లితండ్రులు ఇలాటివి తినడం చూడలేదు. ఎప్పుడడిగినా “ నాకిష్టం లేదురా..” అనే సమాధానం. కానీ, అప్పుడు తమ పిల్లలే priority అనుకున్నారని మాత్రం తట్టదు. అయినా అదంతా స్వయంకృతమేగా, ఇప్పుడు, పిల్లలని తప్పుపట్టడం ఎందుకూ?
చేసికున్నవాడికి చేసికున్నంతా…
ప్రతీరోజూ సాత్వికంగా తినడం ఎవరికైనా కష్టమే. అప్పుడప్పుడు, something different గా ఉండేవీ , తినాలనిపిస్తుంది. కానీ, ఈరోజుల్లో, బయట నానా చెత్తా తినడానికి ఫరవాలేదు కానీ, ఇంట్లో అన్నీ so called hygienic వంటలే. ఏమైనా అంటే, అదేదో కొలెస్ట్రాల్ అంటారు, కాఫీ, చాయ్ లలో పంచదార ఉండదు, అన్నంలో నెయ్యుండదు. ఎప్పుడో అమావాశ్యకీ, పున్నానికీ , ఏ చుట్టాలో, స్నేహితులో వస్తే, వాళ్ళకి , ఏ బండకాయో, బంగాళా దుంపలో, దొండకాయలో , అధవా వేయించినా, పొడిపొడిగానే ఉంటాయి, నూనుండదు. అలాగని ఈ నిషిధ్ధ పదార్ధాలన్నీ ప్రతీ రోజూ తింటే, ఆరోగ్యం పాడైపోతుందనేది నిజమే. కానీ, రుచీ, పచీ లేకుండా తిని, బతకడం కూడా కష్టమే కదా. అందుకే ఈరోజుల్లో చూస్తూంటాము, బయట ఒక వయసు పైబడిన ఓ పెద్దాయనో, లేదా ఓ పెద్ద జంటనో… హాయిగా నవ్వుకుంటూ, ఎడా పెడా, ఏ పానీ పూరీయో, ఏ పిడతకింద పప్పో, తింటూ టైం పాస్ చేయడం. ఇంట్లో తింటే, ఏ కొడుకో, కోడలో కోప్పడతారేమో అని, ఈవెనింగు వాక్ పేరుచెప్పో, గుడికి వెళ్తున్నామనో చెప్పి, వారి వారి బుల్లిబుల్లి కోరికలు తీర్చుకుంటున్నారు.. అదేమీ పెద్ద తప్పుగా భావించక్కరలేదు. ఎంత తినాలో వారికి తెలియదంటారా?
అలాగే, ఏ పెళ్ళి రిసెప్షన్ కో వెళ్ళినప్పుడోటీ, అక్కడ పెట్టిన వివిధరకాల side dishes రుచి చూడకుండా ఉండరు. అందుకే కాబోలు, కాళ్ళూ చేతులూ సరీగ్గా ఉన్నంతకాలమూ, ఏ తండ్రీ, తన కొడుకో, కోడలో “ ఇక్కడే కూర్చోండి, ప్లేటు తెస్తానూ..” అన్నా కానీ, ఛస్తే కూర్చోరు. వాళ్ళైతే, ఓ పప్పూ, కూరా, మహా అయితే, పళ్ళూ, పచ్చికూరలూ తెస్తారు.. స్వంతంగా అయితే, కావాల్సినవేవో హాయిగా, ఒక్క పూటైనా తినొచ్చు…
కారణాంతరాలవలన, ఏ తల్లో తండ్రో, ఒంటరిగానో, జంటగానో ఉండాల్సొచ్చినప్పుడు, ఇంకోరకమైన సమస్య చూస్తూంటాము… పిల్లలు అప్పుడప్పుడు, ఏ చిరుతిళ్ళైనా తెచ్చినప్పుడు, ఈ తల్లితండ్రులే చేసికున్న image building ధర్మమా అని, అసలు ఆఫరే చేయరూ, అధవా వారికి వారే , ఏ రాత్రిపూటో తిందామని , ఏవైనా తెచ్చిపెట్తుకున్నా, ఉభయతారకంగా , అందరికీ కనిపించేటట్టు పేట్టుకోవాలాయె, తీరా మర్నాడు ప్రొద్దుటే చూస్తే, ఖాళీ డబ్బా యే కనిపిస్తుంది.. అలాక్కాదని, మరీ తాళాలు పెట్టుక్కూర్చోలేరుగా? ఇంక మరి ఈ పెద్దాళ్ళ కోరికలు తీరేదెప్పుడంటారు? ఇవేమీ “ వేవిళ్ళ కోరికల “ లాటివేమీ కాదు. ఏదో ప్రాణహాని లేని, బుల్లిబుల్లి కోరికలని గుర్తించాలి.
చివరగా చెప్పొచ్చేదేమిటంటే, ఈనాటి న్యూక్లియర్ కుటుంబాలకి--- అప్పుడప్పుడు, మీ ఇళ్ళల్లో ఉండే పెద్దవారికి ఉండే బుల్లిబుల్లి కోరికలమీదా దృష్టి పెడుతూండండి. అలాగని, మీరేమీ చేయడంలేదని కాదు. చేస్తున్నారు.. కానీ, గదిలో ఏసీ, విడిగా టీవీ పెట్టేస్తేనే కాదు, ఇంకా కొన్నుంటాయి, వారికి సమకూర్చినా సరే, లేదా వారి దారిన వారిని వదిలేసినా సరే.
సర్వేజనా సుఖినోభవంతూ…