యువ - రవీంద్ర

 

మంచి స్నేహితులు కావాలంటే...!

              ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు. వారిలో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. ఎవరైనా మీ స్నేహితులు ఎవరు చెప్పమంటే... వెంటనే గుర్తొచ్చే పేర్లు కొన్నే ఉంటాయి. స్నేహం ఏర్పడడం సహజం కావచ్చు. కానీ ఆ స్నేహాన్ని ఎక్కువ కాలం నిలుపుకోవడం మాత్రం మీ మీదే ఆధాపడి ఉంటుంది. కొంతమందికి స్నేహితులు ఉండరు. కేవలం అవసరాలకోసం, పనుల కోసం, ఆర్థిక లాభాలకోసం మాత్రమే వాళ్లు రిలేషన్స్ మెయింటెన్ చేస్తారు. వారికి మనుషుల కన్నా డబ్బు, అవసరాలే ప్రధానం కావచ్చు. కానీ నిజమైన స్నేహం మీరు ఇచ్చినప్పుడే ఎదుటి వాళ్లు మీకు ఆ స్నేహాన్ని పంచుతారు. ప్రేమనైనా, స్నేహాన్ని అయినా ఇవ్వడం తెలిసిన వాళ్లకే పొందే అర్హత ఉంది. స్నేహంలో తీసుకోవడం కన్నా ఇవ్వడమే ఎక్కువ ఉంటుంది అంటారు స్నేహితులు,. ఆ ఇవ్వడంలోనే ఆనందం ఉంది అంటారు. అయితే స్నేహితులు ఏర్పడడానికి, స్నేహాలు కలకాలం నిలబడటానికి ప్రాధమికంగా పాటించాల్సిన సూత్రాలు కొన్ని ఉన్నాయి. 

చెప్పడం కాదు వినాలి

              మీ స్నేహంలో ఎవ్వరు ఎక్కువ చెప్తారు... ఎవరు ఎక్కువ వింటారు... అని ఎప్పుడైనా ఆలోచించారా... ఒక వేళ మీరు వక్త అయితే ఆ అలవాటను కొంత తగ్గించుకోండి. మీ స్నేహితులు చెప్పే విషయాన్ని వినడం మంచిది. అతని అభిప్రాయాలను వ్యక్తం చేయనివ్వండి. అతనికి కూడా ప్రతి విషయంలోనూ కొంత జ్ఞానం ఉంటుంది. అవగాహన ఉంటుంది. ఎదుటి వాళ్లు చెప్పిన తర్వాతే ఇద్దరూ కలిసి ఏది మంచో, ఏది చెడో నిర్ణయించిుకోవాలి. ఎదుటి వారి మాటకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, ముందు మీరు మీ స్నేహితులు చెప్పేది వినాలి. అలా కాకుండా మీరే ఎప్పుడు చెప్పడం వల్ల అతనిలో ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. తర్వాత తన అభిప్రాయలను మీరు తెలుసుకోవడం లేదని, తనకు మీ రిలేషన్ లో విలువ తగ్గుతుందని భావిస్తారు. క్రమంగా మీకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే రిలేషన్ లో వినడం ముఖ్యం.

ఇష్టాలకు ప్రాధాన్యత

              ప్రతి మనిషికి కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఒకరికి సినిమాలు చూడడం ఇష్టమైతే, మరొకరికి సిగరెట్ తాగడం అలవాటు అయి ఉంటుంది. ఇంకొకరికి సంగీతం ఇష్టం కావచ్చు. మరికొందరు మంచి భోజన ప్రియులు అయి ఉండొచ్చు. మరొకరు అందంగా రడీ అవడాన్ని ఇష్టపడొచ్చు. చాక్ లెట్లున అభిమానంగా తినే వాళ్లూ ఉంటారు. ఇలా  ఎవరి అలవాట్లు, ఇష్టాలు వారికి ఉంటాయి. అవి ఆత్మాభిమానంతో ముడిపడి ఉంటాయి. అందుకే వారివారి ఇష్టాలకు మీరూ ప్రాధాన్యం ఇవ్వాలి. వాటిని సరదాగా అయినా విమర్శించకూడదు. వాటిపై పదేపదే జోకులు కట్ చేయకూడదు. ఎవరి సెంట్ మెంట్ వారిది. వీలైతే ఎదుటి వాళ్ళ ఇష్టాలను గౌరరవించండి లేదా వదిలేయండి. అంతేకానీ కామెంట్ చేయడం వల్ల మీ స్నేహితులకు మీ మీద ఉండే అభిమానం తగ్గుతుంది. మీకు దూరం అవడానికి ప్రయత్నిస్తారు. కావాలంటే వారి ఇష్టాలను తీర్చుకోవడంసలో మీరూ సహకరించండి. అప్పుడు మీ మీద మరింత అభిమానం పెరుగుతుంది. అతని ఇష్టాలు చెడ్డవైతే, అతను నొచ్చుకోకుండా నచ్చజెప్పండి. 

క్షమించమని అడగాలి

           స్నేహితుల మధ్యే కాదు ఏ సంబంధంలోనైనా పొరపచ్చాలు, చిన్నచిన్న తగవులు, గొడవలు, అలకలు రావడం సహజం. వాటికి కారణాలు వెతుక్కుంటూ, స్నేహితులకు దూరం అవడం మంచిది కాదు. చిన్న తప్పుకు మంచి స్నేహితులను వదులుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే స్నేహితుల మధ్య  ఏ చిన్న ఘర్షణ వచ్చినా, మాట పట్టింపు వచ్చినా వెంటనే క్షమించమని అడగడంలో మీరే ముందు ఉండాలి. దానివల్ల మీ ఆత్మాభిమానం దెబ్బతినదు. పైగా మీ స్నేహితులు తప్పుచేసి ఉంటే- నేను చేసిన తప్పుకు నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నాదే తప్పు అని ఒప్పుకుంటారు. ఒక్క క్షమించు అనే పదం చెప్పలేక పోవడం వల్లే ప్రపంచంలో అనేక రిలేషన్స్ విడిపోయాయి. స్నేహంలో ఎక్కువ, తక్కువలు ఉండవు. కేవలం ఆత్మీయతానుబంధాలే ఉంటాయి. అసలు క్షమించు అని అడగడంలోనే మీరు ఓ మెట్టు పైన ఉంటారు అని మాత్రం మర్చిపోవద్దు. కొంతమంది ఎప్పుడూ అంటూ ఉంటారు- గొడవ జరిగిన ప్రతిసారి నేనే సారీ చెప్పాలా అని. చెప్పడంలోనే మీ గొప్పతనం ఉంది. అవతలి వ్యక్తి తగ్గుదల ఉంది.    

విమర్శ మానుకోవాలి
           కొంతమందికి ఓ చెడ్డ అలవాటు ఉంటుంది. ప్రతి వారిని విమర్శిస్తుంటారు. అదికాదు, అలా చేయకూడదు. మీకు తెలియదు. మీకు ఈ విషయంలో సరైన అవగాహన లేదు... ఇలా చెప్పి అవతలి వ్యక్తిని విమర్శిస్తుంటారు. కొంతమందైతే ఎదుటి వాళ్లు ఏ మాట చెప్పినా విలువ ఇవ్వరు. నీకు తెలియదు ఊరుకో అంటారు. ఇలా అనడం వల్ల ఎదుటి వ్యక్తి నొచ్చుకుంటారు. మీరు ఆ పదాన్ని పదేపదే అనడం వల్ల, మనసులోనైనా మిమ్మల్ని విమర్శించక మానరు. విమర్శ అనేది ఏ రూపంలో ఉన్నా మానివేయాలి. ఒక్కోసారి ఎదుటి వ్యక్తి చేసిన విమర్శను మీరు కూడా స్వీకరించలేని స్థితిలో ఉండొచ్చు. అందుకే ఎదుటి వారిని ఓ మాట అనే ముందు, ఆ మాటని ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అంటే ఎలా ఫీలవుతారో... ఆలోచించుకొని మాట్లాడాలి. ఎవ్వరూ తమను విమర్శించడాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించరు. ఎందుకంటే అది, వాళ్ల అహాన్ని ప్రశ్నిస్తుంది. ఇక యువతీ యువకుల్లో అయితే మరీ ఎక్కువ. ఎందుకే రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే విమర్శించడం మానేయాలి. 
        మంచి స్నేహం కాలానికి, ధనిక పేదరికాలకు, హోదాలకు, ఉద్యోగాలకు, పదవులకు... అసలు ఈ భౌతిక ప్రపంచం సృష్టించిన అన్ని అవరోధాలకు అతీతమైంది. అందుకే స్నేహితులు అనగానే మనకు భారతం నుంచి దుర్యోధనుడు, కర్ణుడ్ని ఉదాహరణలుగా చెప్తారు. అలానే కుచేలుడు, కృష్ణుల స్నేహాన్ని వివరిస్తారు. స్నేహం అంటే ప్రాణానికి ప్రాణం అంటారు. మీరు మంచివారై ఉంటే మీకు మంచి స్నేహితులు ఉంటారు. మీ వ్యక్తిత్వమే మీరు ఏర్పరచుకునే స్నేహితులను నిర్ణయిస్తుంది. అసలైన స్నేహితుడు గెలవడు తన స్నేహితులను గెలిపిస్తాడు. వారి గెలుపులో తన ఆనందాన్ని చూసుకుంటారు అంటారు పెద్దలు. ఇదే నిజం. మనిషి తన మనిషి తత్వాన్ని మర్చిపోకుండా చేసేది స్నేహం. మనస్ఫూర్తిగా ఏడవాలన్నా, నవ్వాలన్నా, సీక్రెట్ చెప్పుకోవాలన్నా అది ఒక్క స్నేహితుల ముందు మాత్రమే... ఇదే స్నేహం విలువ. స్నేహితుల విలువ. 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు