సాహితీవనం - వనం వెంకట వర ప్రసాదరావు

sahitivanam

....ఆముక్తమాల్యద 

గోదాదేవి పరమాత్ముడిని నిష్ఠురోక్తులతో నిందిస్తున్నది, తనకు అందడంలేదు, తనను పొందడంలేదు అన్న  ఉక్రోషముతో. ఆయన ఎన్నడు లను సుఖపెట్టాడు కనుక, సంతోషపెట్టాడు కనుక? ఎప్పుడూ స్త్రీలను  వేదనకు గురిచేయడమే ఆయన చేసిన ఘనకార్యము అంటున్నది.

తను నంటన్ సతు లౌట గోరు మునిబృందంబుం దదాపాదిప 
ద్వనజక్షోదము గల్గియున్బెరజనిం దా వల్లవ స్త్రీలగా 
జననం బందగ జేసి కూడియును నాసక్తాత్మలం గాందినీ 
తనయప్రేరణ బాసె భోజపుర యాత్రాదంభసంరంభియై

తనను స్పృశించడానికి ఉవ్విళ్ళూరి తనకు భార్యలు కావాలని కోరుకున్న మునుల(తను నంటన్ సతు లౌట  గోరు మునిబృందంబుం) కోరికను ఆయన మన్నించలేదు. వారు కోరుకున్నట్టు స్త్రీలుగా మార్చగలిగిన పదములు  కలిగినవాడే, అయినా ఆ పద ధూళిని ఆ మునులపై సోకనీయలేదు. యిది శ్రీరామావతార ప్రశస్తి, ప్రసక్తి.  యిదివరకు రాయిగా పడిఉన్న అహల్యను నాతిగా చేసిన పాదాలు ఆ రామునివి. శ్రీ రాముని సౌందర్యానికి అన్నింటినీ  వదిలి ముక్కులు మూసుకుని మౌనంగా తపస్సు చేసుకునే మునులు కూడా మోహితులు అయినారు. 'రామః సర్వాంగ సుందరః', ' రూపౌదార్య గుణైః పుంసాం దృష్టి చిత్తాపహారిణం ' 'పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం' అని పొగడబడిన లోకైక సౌందర్యమూర్తి శ్రీరామచంద్రుడు. ఆయన సర్వాంగ సుందరుడు. రూపంతో, ఉదార గుణాలతో పురుషులకు కూడా మోహాన్ని కలిగించినవాడు.

ఆయన పురుషుల దృష్టిని మనస్సును కూడా దొంగిలించిన సుందరుడు.యితర పు షులను మెప్పించగలిగిన పురుషుడు గొప్ప పురుషుడు. యితర స్త్రీలను మెప్పించగలిగిన స్త్రీ గొప్ప స్త్రీ.శ్రీరామావతారంలో ఉన్నప్పుడు మునులు ఆయనను స్పృశించి, ఆయనతో కలిసి తిరగాలని కోరుకున్నారు. 'మీ కోరిక నా తదుపరి అవతారంలో తీరుతుంది' అని వరమిచ్చాడు శ్రీరామచంద్రుడు. యిది ఉపనిషత్తు రహస్యం! అధర్వణ వేదాంతర్గతమైన 'కృష్ణోపనిషత్' అన్న ఉపనిషత్తులో యిది ఉన్నది. వేద వేదాంగాలను క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు  శ్రీకృష్ణదేవరాయలు అనడానికి యిది మరొక ఋజువు. ఆ వరప్రభావం వలన ఆ మునులు బృందావనంలో గోపికలుగా జన్మించారు. మునులేంటి, బ్రహ్మదేవుడు గోవులను కట్టు కొయ్యగా జన్మించాడు. సంగీతనాద దేహుడు ఐన శివుడు వెదురుగా జన్మించి వేణువు అయినాడు. వేదవాఙ్మయం వసుదేవునిగా జన్మించింది. బ్రహ్మానందం నందునిగా  జన్మించింది. ముక్తికాంత యశోదగా జన్మించింది. పదహారువేల నూట ఎనిమిది వేద ఋక్కులు స్త్రీలుగా జన్మించాయి.

పాలసముద్రం పాలకుండలు ఐపోయింది. 'సత్యము' అక్రూరునిగా జన్మించింది. యిలా సమస్త దేవీ దేవతలు, శక్తులు, తత్త్వములు అన్నీ ఎవరికీ ఏ రూపంలో అవకాశం దొరికితే ఆ రూపాన్ని పొంది శ్రీకృష్ణుడి దర్శన, స్పర్శన భాగ్యాన్ని పొందాయి. ఆ రహస్యాన్ని సూచిస్తున్నాడు సమస్తశాస్త్ర రహస్యవేది ఐన శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి.సరే, ఇంతా చేసి, అలా స్త్రీలుగా జన్మించినవారిని యేలుకున్నాడా అంటే అదీ లేదు. వారిని మధ్యలోనే వదిలిపెట్టి 'కాందినీ తనయ ప్రేరణ' వలన (అక్రూరుని తల్లిపేరు 'కాందిని') అట్టహాసంగా మధురానగారానికి వెళ్ళిపోయాడు.
అదీ ఆయనగారి నిర్వాకం అంటున్నది గోదాదేవి.  

హతల నొనర్చె మోహితల నల్ల యయోముఖి నా పులస్త్యభూ 
సుతను విరూప లౌట ననుచో ముసలిన్బెద నిట్ట తాడువం 
టతివ రమించె దా ముసలి యయ్యు రహిన్మరుగుజ్జుప్రేష్యకై 
ధృతిసెడి యుగ్రసేనునకు బ్రేష్యత నొందియు దిద్ది యేలడే?

ఆ పులస్త్యవంశానికి చెందిన శూర్పణఖను, ఆ అయోముఖి అన్న దానిని, తనను మోహించినవారు ఐనప్పటికీ  దెబ్బ తీశాడు. వాళ్ళు కురూపులు కావడం వలన అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేయకండి. ముసలిది, పెద్ద నిలువు తాడిచెట్టంత ఉన్న రేవతీ దేవితో తానూ ముసలివాడు అయివుండీ , బలరాముడిగా రతిక్రీడలు చేయలేదా? మరుగుజ్జు, దాసీ ఐన కుబ్జను అందంగా తీర్చి దిద్ది తానూ ఉగ్రసేనుడి దాసుడు అన్నట్టు, యిద్దరికీ అన్నీ సరిగ్గా సరిపోయినట్లు యేలుకోలేదా? తనకు నచ్చాలి అంతే. నచ్చితే మురిపిస్తాడు, నచ్చకుంటే విసిరేస్తాడు ఆతని తత్త్వమే అంత అంటున్నది గోదాదేవి.

అయోముఖి కూడా శూర్పణఖ లాంటిదే, రాక్షస స్త్రీ. దండకారణ్యములో ఉండగా శ్రీరాముడిని కోరి అఘాయిత్యం  చేయబోతే లక్ష్మణుడు తగిన శాస్తి చేసి తరిమేశాడు. ముసలిది, పెద్ద తాడిచెట్టువంటి రేవతీదేవి అంటున్నాడు రాయలు. యిందులో అద్భుతమైన పౌరాణిక రహస్యాల చమత్కారం ఉంది.

కృతయుగంలో ఋతవాక్కు అనే ఋషి ఉండేవాడు. ఆయనకు రేవతీ నక్షత్రంలో ఒక కొడుకు పుట్టాడు. వాడు దుర్మార్గుడు అయినాడు. ఋషికి ఆ నక్షత్రం మీద కోపం వచ్చింది, నీ ఫలితంగానే యిలా ఐనాడు కనుక నువ్వు నేలమీద పడిపో అని శపించాడు. రేవతీ నక్షత్రం ఒక కొండమీది కొలనులో పడింది. ఆమె పేరుమీద ఆ కొండ 'రైవతక పర్వతం' అయ్యింది. కొలనులో బాలికగా జన్మించిన ఆమెను ప్రముచుడు అనే ముని పెంచుకున్నాడు.ఆమెను దుర్గముడు అనే వాడికిచ్చి వివాహం చేశాడు. వారికి కలిగిన కుమారుడు 'రైవతుడు' ఐదవ మనువుగా 
పరిపాలించాడు. ఆ మనువుకు పుట్టిన కుమార్తె 'రేవతి' అయ్యింది. ఆమె ఆజానుబాహువు, తనతో సాటి వచ్చేవారు లేరు ఎందులోనూ. ఆమెను తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు రైవత మనువు. ఈమెకు తగిన వరుడిని సూచించండి అని ప్రార్థించాడు. ఈ నాలుగుమాటల్లోనే భూలోకంలో యుగాలు గడిచిపొయినాయి నాయనా,యిప్పుడు ఆదిశేషుడు బలరామునిగా అవతరించి ఉన్నాడు భూలోకంలో. ఆయనే ఈమెకు తగిన వరుడు అని బ్రహ్మదేవుడు శెలవిచ్చాడు. అలానే ఆమెను బలరామునికి ఇచ్చి వివాహం చేశాడు రైవత మనువు. అలా యుగాల పర్యంతమూ ఉన్నది కనుక రేవతీదేవి వృద్ధురాలు అయ్యింది. అంతకన్నా ముందే ఎప్పుడు పుట్టాడో 
ఎవరికీ తెలియని ఆదిశేషుడు కనుక బలరాముడు వృద్ధుడు అయినాడు. ముసలము అంటే నాగలి అని కూడా అర్థం కనుక, ముసలమును ధరించినవాడు 'ముసలి' అని కూడా చమత్కారం చేశాడు రాయలు, చక్రమును ధరించినవాడు చక్రి అన్నట్లు. అదీ శ్రీకృష్ణదేవరాయల సమస్తశాస్త్రరహస్య గ్రహణాపారీణత.

(కొనసాగింపు వచ్చేవారం)**వనం వేంకట వరప్రసాద రావు.  

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు