అలా మొదలైంది - ...

అరవై కాదు కాదు యాభైలో యిరవై వచ్చింది   - కర్రా నాగలక్ష్మి 
 
         హోండా యెకార్ద్ కారు వెనుక సీట్లో కూచుని డిల్లీ ట్రాఫిక్ ని గమనిస్తూ దీర్ఘాలొచనలో మునిగి వున్న నేను " మేడం కారేక్కడ ఆపాలి " అన్న డ్రైవరు మాటతో యీలోకం  లోకి వచ్చేను . ఆలోచనలలో వుండి గమనించలేదు గాని " ఓఖలా యిండష్ట్రి యల్ ఏరియా " చేరెను . ప్లాట్ నంబరు చూసుకుంటూ ముందుకి వెళుతుంటే కనిపించింది నాకు కావలసిన బోర్డ్ . " నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అండ్ జేమ్మోలోజి " నాకు దీని గురించి ఏం తెలుసునని ఇక్కడకి వచ్చేను , ఏం తెలుసుకోవాలని వచ్చేను . అంతా అయోమయం . 
         చేతిలో యిటాలియన్ కంపనీ తయారు చేసిన పదివేలకి తక్కువకాని హ్యాండ్ బాగ్ , మెళ్లొని , చేతులకి వస్తువలు , సీకొ వాచ్ , కళ్ళకి బ్రాండెడ్ గాగుల్స్ యిదీ నా వేషం . నా వేషం చుస్తే జెమ్స్ కొనే వాళ్ళలా వుంది గాని ఆరు నెలల కోర్స్ చెయ్యడానికొచ్చిన విద్యార్ధి లాలేను . ఆ విషయం నాకు తెలుసుగాని , నా ఆయనకీ తెలీదుగా , అందుకే నాకు చెప్పకండా 45000/ ట్యూషన్ ఫీ చెల్లించిన చీటి  నామీదకి విసిరి , చెయ్యదలచు కుంటే రేపు కారు పంపిస్తా , లేకపోతే  యీ రిసీటు చింపి పారెయ్యి అని వెళ్ళిపోయిన మొగుడు గారి మీద పీకలదాకా కోపమొచ్చినా తమాయించుకొని యిలా రావలసి వచ్చింది . లోపలి అడుగు పెట్టాలంటే ఏదో బెరుకు , ఏవయసు వాళ్లతో కూచొని చదువు కోవాలో , పాఠాలు చెప్పే ఆయన వయసెంతో ? అన్నీ భయాలే . ఇలాంటి పరిస్థితిని నాకు 30 యేళ్ళు వున్నప్పుడు అనుభవించా , N.I.I.T లోకోర్సు చేసినపుడు  కాని యిప్పుడు మరీ 50 యేళ్ళాయెను , అందుకనే యింకా జంకు నాలో . డిల్లీ డిస్సెంబరు ఆఖరి వారం చలి గాలి వొక్కసారి కొట్టడం తో యీలోకం లోకి వచ్చేను . అప్పటికే చేతులు చలికి కొంకరలు తిరుగు తున్నాయి . గబగబా లోపలి నడిచేను .
          కొత్తగా కడుతున్న భవనం పనులు యింకా సాగుతున్నాయి . ఎదురుకుండా వున్న గదిలోకి అడుగుపెట్టి నా దగ్గర వున్న రసీదు అక్కడ వున్న వొకతనికి చూపా , అతనే మాకు చదువు చెప్పే  గురువు గారు ఆ విషయం తరువాత తెలిసింది . 
            ఆతను ఆ కాయితం మరొకరికి యిచ్చేరు , అతను మేడం మీ సర్టిఫికేట్స్ తెచ్చారా ? అని అడిగేడు . నా Mcom సర్టిఫికేట్స్ చూపించేను . వాటిని కిందా మీదా చూసి " యీ  సర్టిఫికేట్స్ మీవేనా ? " 
       పెళ్లయి పిల్లలు పుట్టాక చదువుకొని సంపాదించుకున్న సర్టిఫికేట్స్ అవి నా కళ్ళల్లో కోపం గొంతుకలోకి రానివ్వకుండా " ఆ నావే " అన్నాను . అడిగినతను కొంచెం కంగారు పడ్డం తో నా గొంతు లో కోపం ధ్వనించిందని తెలుసుకున్నాను .
       " యీ రసీదులొ పేరు సర్టిఫికేట్స్ లో వున్న పేరు వేరుగా ఉంటేను ...... " నీళ్లు నములు తున్నాడు అతను .
       చచ్చింది గొర్రె హడావిడిలో రసీదు మీద యే పేరుందో చూసుకోలేదు . మా ఆయన ఎవరిచేతో డబ్బు పంపి రసీదు తెప్పించి వుంటారు . మరి  అతను యే పేరురాయించేరో , తీరా చూస్తే నాపేరే వుంది . మరేవిటి యితని అనుమానం అని అనుమానం గా అతనిని చూస్తూ" పేరు సరిగ్గానే వుందిగా " అన్నాను .
      లేదు .... లేదు రసీదులో కారా (కర్రా) కి హిందీ వాళ్ళు పట్టించిన గతి . సర్టిఫికేట్ లో అయల...... పూర్తిగా చదవలేక ఆపేసేడు . లేకపోతే  ఆయలసోమాయుల అనే మా పుట్టింటి వారి యింటి పేరుని యెంత ఖూనీ చేసేవాడో . " పెళ్లైనతరువాత యింటిపేరు మారుతుందిగదా " అని తడుము కోకుండా చెప్పేను . 
       " మేడ పైన మూడో నంబరు గదిలోకి వెళ్ళండి . కొద్ది సేపట్లో క్లాసు మొదలౌతుంది , యింతకీ మీ  పేరు ?" 
     "  కర్రా పక్కనుంది కదా  అదే " అని మెట్ల వైపు నడిచేను .
       మూడో నంబరు గదిలోకి అడుగు పెట్టేను , లోపల యిరవై యేళ్ళ పిల్లలు వో నలుగురు మాత్రమే వున్నారు . నేనోక్కర్తినే ఆడదాన్ని . యీ లోపున తలుపు తోసుకొని నేను ఆఫీసులో చూసినతను వచ్చి తానే అక్కడ విషయ బోధన చేసేదని , తనపేరు జైన్ అని చెప్పేరు  . తరవాత వోక్కోక్కరుగా క్లాసులోకి చేరేరు . మొత్తం వో యిరవై మందిదాకా అయేం . 
          ముచ్చటగా నేనుకాక మరో ముగ్గురమ్మాయిలు , అంతా ముప్పైకి లోపున వున్న వయసే , జైన్ గారికి మాత్రం అరవైయ్యేడు . అది కొంత నయం .
        కోర్సు గురించి చెప్తూ ప్రతి వారం పరీక్షలుంటాయి అన్నారు ఆ మాట వినగానే నా
లో గాభరా మొదలయ్యింది . నాగురించి పరిచయం చేసుకోమన్నారు . నేను తడబడుతూ నా చదువు గురించి మా వారి వుద్యోగం గురించి పెళ్లిళ్లయిపోయిన నా పిల్లల గురించి చెప్పేను .
         మీ కెందుకు యీ కోర్సు చెయ్యాలని పించింది అన్న ప్రశ్నకి నా జవాబు " జెమ్స్ లో జె గురించి కూడా నాకు తెలీదు , అందుకని జెమ్స్ గురించి తెలుసుకుందామని " 
వో చిన్న అబద్దం ఆడేను .
         అబద్దం తో మొదలు పెట్టిన చదువు అదీ యాభైలలో చదవ బోయే చదువు , హే సరస్వతీ దేవు క్షమించు అని మనసులోనే దండం పెట్టుకున్నా . 
      " మేడం  మీకు తెలిసిన కొన్ని నవరత్నాల పేర్లు చెప్పగలరా ? " అన్న జైన్ గారి మాటతో యీ లోకంలోకి వచ్చేను .
       అదేంటో వోక్కటంటే వొక్కటి గుర్తురాలే పోనీ అన్నమాచార్యుల కీర్తనలు నీర్చుకున్నానా ? అంటే అదీలేదు , " ముద్దుగారే యశోద " నవరత్నాల వర్ణన ఉందికదా ? 
      వో రెండు నిముషాలు అలోచించా , యెంత చించినా ఉహూ .... వొఖ్ఖటి  అంటే వొఖ్ఖటి గుర్తురాలే వెంటనే సద్దుకొని "సర్ నవరత్నాల గురించి యిదీ  నా జ్ఞానం , ఇలాంటి నన్ను సాన పెట్టగలరా ? " అన్నాను .
        " మీ ముక్కు పుడకలో వున్నది వజ్రమే కదా ? పొనీ అది చెప్పినా సరిపోతుంది గా "
      " కాని అది నిజందో ఫేక్ దో నాకు డౌట్ సర్ , నాకే  ఖచ్చితంగా తెలీనప్పుడు యెలా చెప్పగలను సర్  , గుర్తురాలేదు అనకుండా సభాషణని యిలా తిప్పేను . 
        " లేదు మేడం అది నిజం వజ్రమే "
      " అంతదూరం నుంచి యెలా చెప్పగాలిగేరు సర్ " నాకు ఆశ్చర్యం .
       " మిమ్మల్ని కుడా నాలాగే ట్రైన్ చేస్తా , క్లాసులు మిస్ అవకుండా నేను చెప్పేది ఫాలో అవ్వండి చాలు "
     " సరే సర్ "
       అంతే  మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు . క్లాసులో అందరికి ఆంటీని అయిపోయేను .
       మొదటి వీక్లి పరీక్షలో బొటాబొటి మార్కులతో పాసయిన నేను ఫైనల్స్ లో ఫస్ట్ వచ్చేను .
       నవరత్నాలని పోల్చుకోడం , వాటి క్లారిటీ గుర్తించడం బాగా వచ్చింది .
       ఆ ఆరునెలలు నేను యాభై లో యిరవై లని అనుభవించేను.
       ఏమైనా , నేర్చుకోడానికి వయసుతో పనేముంది చెప్పండి .

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు